పిల్లలు, యువత, గృహస్థులు లేదా సన్యాసులు, అందరూ కూడా శివుని అభిమానులే. మరి శివుడిని ఇంత ఆకర్షణీయంగా చేస్తున్నది ఏమిటి? దానికి గల 5 కారణాలు ఇక్కడ చూడండి.
సద్గురు: శివుడిని ఆరాధించేది కేవలం దేవుళ్ళు మాత్రమే కాదు. రాక్షసులు, పిశాచాలూ ఇంకా అన్ని రకాల జీవులూ ఆయన్ని ఆరాధిస్తాయి. భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, దెయ్యాలు, రాక్షసులు - అందరిచే తిరస్కరించబడిన ఆ జీవులన్నింటినీ - శివుడు అంగీకరించాడు.
అతని వివాహం జరిగినప్పుడు, ఇతిహాస గ్రంథాలు వర్ణించిన దాన్నిబట్టి, గొప్పవారు, సామాన్యులు, అనామకులు, వారూ, వీరూ - అందరూ ఈ వివాహానికి హాజరైనట్లు తెలుస్తుంది. సకల దేవుళ్ళూ, దేవతలు, సమస్త రాక్షస గణాలు, ప్రమథ గణాలు, భూత- ప్రేతాలూ - అందరూ వచ్చారు. సాధారణంగా, వీరిలో వీరికి, ఒకరంటే ఒకరికి పడదు. కానీ శివుడి వివాహంలో అందరూ అక్కడ ఉన్నారు. అతను జంతు ప్రవృత్తిని జయించిన “పశుపతి” కాబట్టి, జంతువులన్నీ వచ్చాయి. ఇక సర్ప రాజములు(snakes) రాక మానవు, కాబట్టి అవన్నీ వచ్చాయి. పక్షులు ఇంకా కీటకాలు ఈ వివాహాన్ని చూడకుండా ఉండలేకపోయాయి, కాబట్టి అతిథులలో అవి కూడా ఉన్నాయి. ప్రతి జీవీ ఈ పెళ్లికి వచ్చింది.
మనకి, ఈ కథ ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నదంటే, మనం ఈ జీవి గురించి మాట్లాడుతున్నప్పుడు, మనం మాట్లాడుతున్నది ఒక గౌరవనీయుడైన, మర్యాదస్థుడైన మనిషి గురించి కాదు. మనం మాట్లాడుతున్నది జీవంతో సంపూర్ణ ఏకత్వ స్థితిలో ఉన్న, ఆది రూపం గురించి. అతను, ఎటువంటి ఆడంబరం లేని, ఎన్నడూ పునరావృత్తం కాని, నిరంతరం స్వత:సిద్ధమైన, నిరంతరం ఆవిష్కృతమైన, నిరంతర సృజనాత్మకమైన, స్వచ్ఛమైన చైతన్యం. సరళంగా చెప్పాలంటే, అచ్చంగా జీవమే ఆయన.
సద్గురు: సాధారణంగా, శివుడు పరమోత్తమ పురుషత్వానికి ప్రతీక. కానీ, శివుని అర్ధనారీశ్వర రూపంలో, అతనిలో సగ భాగం పూర్తిగా అభివృద్ధి చెందిన స్త్రీ అయి ఉండడాన్ని మీరు చూస్తారు. జరిగిన కథను మీకు చెప్తాను. శివుడు పారవశ్య స్థితిలో ఉన్నాడు, ఆ కారణంగా పార్వతి అతని వైపు ఆకర్షింపబడుతుంది. అతనిని ఆకర్షించడానికి పార్వతి చాలా పనులు చేసి, అన్ని రకాల సహాయాలూ తీసుకున్న తరువాత, వారు వివాహం చేసుకున్నారు. వారు వివాహం చేసుకున్న తర్వాత, సహజంగానే, శివుడు తన అనుభవాన్ని పంచుకోవాలనుకున్నాడు. పార్వతి, “మీలోపల మీరు ఉన్న ఈ స్థితిని, నేను కూడా అనుభూతిచెందాలనుకుంటున్నాను. నేనేం చేయాలి? చెప్పండి’’ ఎంతటి కఠినమైనవి చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను” అంది. శివుడు చిరునవ్వు నవ్వి, “నువ్వు ఎంతో కఠినమైనదేదీ చేయవలసిన అవసరం లేదు. వచ్చి నా ఒడిలో కూర్చో” అన్నాడు. అతని పట్ల ఏమాత్రం ప్రతిఘటన లేకుండా, పార్వతి అతని ఎడమ ఒడిలో(వామ భాగాన) కూర్చుంది. ఆమె అంతగా సుముఖంగా ఉంది కాబట్టి, ఆమె తనని తాను పూర్తిగా అతని చేతులలో అర్పించుకుంది కాబట్టి, అతను ఆమెను తనలోకి లాక్కున్నాడు, ఆమె అతనిలో సగ భాగం అయ్యింది.
మీరిది అర్థం చేసుకోవాలి, అతను ఆమెను తన శరీరంలో సగ భాగంగా చేసుకున్నాడంటే, అలా చేయడానికి అతను, తన సగ భాగాన్ని వదిలేయాలి. కాబట్టి అతను తనలో సగ భాగాన్ని వదిలేసి, ఆమెను చేర్చుకున్నాడు. ఇదీ అర్ధనారీశ్వరుని కథ. ఈ కథ, ప్రాథమికంగా మీలో పురుషత్వం ఇంకా స్త్రీత్వం సమానంగా విభాజితమై ఉన్నాయని తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను తనలో కలుపుకున్నప్పుడు, అతను పారవశ్య స్థితిలోకి వెళ్ళాడు. తద్వారా చెప్పబడుతున్నది ఏమిటంటే, లోపలి పురుషత్వం ఇంకా స్త్రీత్వం కలిసినట్లయితే, మీరు శాశ్వత పారవశ్య స్థితిలో ఉంటారు. మీరు దాన్నే బాహ్యంగా చేయడానికి ప్రయత్నిస్తే, అది ఎప్పటికీ కూడా నిలిచి ఉండదు, అలా దానితో పాటూ వచ్చే ఇబ్బందులు, నిరంతరం కొనసాగే నాటకం వంటివి.
సద్గురు: నాట్య దేవునిగా, నటేశ లేదా నటరాజ రూపం అనేది, శివుని అత్యంత విశేషమైన రూపాలలో ఒకటి. ఈ గ్రహం మీద అణువులను పగులగొట్టడం వంటి ప్రక్రియలు చేసే, భౌతిక ప్రయోగశాల అయిన, స్విట్జర్లాండ్‌లోని CERN ని నేను సందర్శించినప్పుడు, ప్రవేశద్వారం ముందు నటరాజ విగ్రహం ఉండడాన్ని చూశాను, ఎందుకంటే ప్రస్తుతం వారు చేస్తున్నదానికి, మానవ సంస్కృతిలో ఇంతకన్నా దగ్గరగా మరేదీ లేదని వారు గమనించారు. నటరాజ రూపం, శాశ్వతమైన నిశ్చలత నుండి తనను తాను సృష్టించుకున్న సృష్టి విలాసాన్ని ఇంకా నృత్యాన్నీ సూచిస్తుంది.
సద్గురు: శివుడిని ఎప్పుడూ కూడా మత్తులో మునిగి ఉన్నావాడిగానూ అదే సమయంలో ఒక తపస్విగానూ వర్ణిస్తారు. అతను ఒక యోగి - ధ్యానంలో కూర్చున్నాడంటే, అతను కదలడు. అదే సమయంలో, అతను ఎల్లప్పుడూ మత్తులో ఇంకా మైకంలో ఉంటాడు. అంటే, అతను స్థానిక మద్యం దుకాణానికి వెళుతున్నాడని కాదు దీనర్థం! యోగ శాస్త్రం మీకు, ప్రశాంతంగా ఉంటూకూడా, ఎల్లప్పుడూ పరమానందాన్ని కలిగి ఉండగలిగే అవకాశాన్ని ఇస్తుంది. యోగులు ఆనందానికి వ్యతిరేకులు కాదు. కాబోతే, వారు చిన్న చిన్న ఆనందాలతో సరిపెట్టుకోవడానికి ఇష్టపడరంతే. వారు అత్యాశాపరులు. వారికి తెలుసు, ఒక గ్లాసు వైన్ తాగితే, మీకు కొంచెం సేపు సందడిగా ఉంటుంది, ఆ తరవాత రేపు ఉదయం మీకు తలనొప్పీ ఇంకా అన్నీ వస్తాయి. మీరు పూర్తిగా మత్తులో ఉన్నప్పటికీ, నూరు శాతం స్థిరంగా ఇంకా అప్రమత్తంగా ఉండగలిగినప్పుడే మీరు ఆ మత్తును ఆస్వాదించగలుగుతారు. అలాగే ప్రకృతి మీకు ఈ అవకాశాన్ని ఇచ్చింది కూడా.
ఒక ఇజ్రాయెల్ శాస్త్రవేత్త మానవ మెదడులోని కొన్ని అంశాలపై పరిశోధన చేస్తూ చాలా సంవత్సరాలు గడిపి, మెదడులో కొన్ని మిలియన్ల కానబీస్(మత్తు పదార్ధం/గంజాయి) గ్రాహకాలు ఉన్నాయని కనుగొన్నాడు! ఆ తరువాత, ఈ గ్రాహకాలను సంతృప్తి పరచడానికి, శరీరం ఒక రసాయనాన్ని - దాని సొంత కానబీస్ ని - అభివృద్ధి చేయగలదని న్యూరాలజిస్టులు కనుగొన్నారు. ఈ గ్రాహకాల వైపు వెళ్ళే ఆ రసాయనాన్ని వారు కనుగొన్నప్పుడు, దానికి అతికే విధంగా, ఒక పేరు పెట్టాలని ఆ శాస్త్రవేత్త అనుకున్నాడు. అతను వివిధ గ్రంథాలను పరిశోధించినప్పుడు, అతని ఆశ్చర్యానికి, భారతీయ గ్రంథాలు మాత్రమే ఆనందం గురించి మాట్లాడాయని అతను కనుగొన్నాడు. కాబట్టి అతను ఈ రసాయనాన్ని “ఆనందమైడ్” అని పిలిచాడు.
కాబట్టి మీరు చేయాల్సిందల్లా, కొంత ఆనందమైడ్ ని ఉత్పత్తి చేయడమే, ఎందుకంటే లోపల ఒక పూర్తి గంజాయి తోటే ఉంది! మీరు దానిని సరిగ్గా పండించి, దానిని నిలబెట్టుకుంటే, మీరు ఎల్లప్పుడూ మత్తులో ఉండవచ్చు.
సద్గురు: మీరు “శివ” అన్నప్పుడు, అది మతం గురించి కాదు. ఈ రోజు ప్రపంచం, మీరు ఏ మతానికి చెందినవారన్న ప్రాతిపదికన విభజించబడింది. ఈ కారణంగా, మీరు ఏదైనా మాట్లాడితే, మీరు ఏదో ఒక మతానికి చెందినవారిలా అనిపిస్తుంది. ఇది మతం కాదు, ఇది ఆంతరంగిక పరిణామ శాస్త్రం. ఇది అతీతంగా వెళ్ళడం ఇంకా ముక్తిని గురించినది: మీ జన్యువులు ఏమిటి, మీ తండ్రి ఎవరు, లేదా మీరు ఏ పరిమితులతో జన్మించారు లేదా ఏ పరిమితులను ఆపాదించుకున్నారు’ అనే దానితో సంబంధం లేకుండా, మీరు కృషి చేయడానికి సిద్ధంగా ఉంటే మీరు వాటన్నిటినీ దాటి వెళ్ళవచ్చు.
ప్రకృతి మానవులకు కొన్ని నియమాలను నియమించింది - వారు వాటికి లోబడి ఉండాలి. ఉనికిలోని భౌతిక నియమాలను ఉల్లంఘించడమే ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ కోణంలో చూస్తే, మనం అందరం ఉల్లంఘనా దారులమే, శివుడు పరమోత్తమ ఉల్లంఘనా పరుడు. కాబట్టి మీరు శివుడిని ఆరాధించలేరు, కానీ మీరు ఆ బృందంలో చేరవచ్చు.
ఈ మహాశివరాత్రి మీకు జాగరణ రాత్రిగా మాత్రమే కాక, మీకు తీక్షణమైన చైతన్య రాత్రిగా ఇంకా తీక్షణమైన ఎరుకతో ఉన్న రాత్రిగా కావాలి. ఈ రోజున ప్రకృతి మనకు అందించే ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలన్నదే నా కోరికా ఇంకా ఆశీర్వాదం. మీరందరూ కూడా ఉప్పొంగే ఈ శక్తిని వినియోగించుకుని, "శివ" అని మనం పలికినప్పుడు, దానిలోని అందాన్ని ఇంకా పారవశ్యాన్నీ తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను.