మంత్రం అంటే ఏమిటి?

సద్గురు:యోగాలో, మొత్తం ఉనికిని ధ్వని యొక్క సంక్లిష్ట సమ్మేళనంగా చూస్తాము. విభిన్న పరిమాణాలను తెరిచే సామర్థ్యం ఉన్న కొన్ని శబ్దాలను మనం ఇందులో గుర్తించాము. కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం కొన్ని శబ్దాలను ఉపయోగిస్తాం - సాధారణంగా ఈ కీలక శబ్దాలనే మనం మంత్రాలు అంటాము. చాలా రకాల మంత్రాలు ఉన్నాయి. ఆధిపత్యం కోసం, విషయాలను సమకూర్చుకోవడం కోసం మంత్రాలున్నాయి. ఆనందాన్ని, ప్రేమను కలిగించడానికి మంత్రాలు ఉన్నాయి. ఇతర పార్శ్వాలను అనుభవంలోకి తీసుకురాగల మంత్రాలు కూడా ఉన్నాయి.

యోగ సంప్రదాయంలో, మౌలికమైన మంత్రం, మహా మంత్రంగా చూసేది ‘ఆమ్ నమః శివాయ’.

‘ఆమ్’ పలికే సరైన పద్ధతి

‘ఆమ్’ శబ్దాన్ని ‘ఓం’ అని పలుకకూడదు. దీన్ని ఎలా పలకాలంటే, నోరు తెరిచి - “ఆఁ” పలుకుతూ, ఆ తర్వాత మీరు నెమ్మదిగా నోరు మూస్తుంటే, అదే “ఊఁ” గా మారుతుంది, ఆ తర్వాత “మా” అవుతుంది. ఇది సహజంగా జరుగుతుంది, ఇది మీరు కావాలని చేసేది కాదు. మీరు నోరు తెరిచి (నోటిద్వారా) శ్వాస విడిస్తే, అది “ఆఁ” అవుతుంది. మీరు నోరు మూస్తుంటే, నెమ్మదిగా అది “ఊఁ” గా మారుతుంది, తర్వాత నోరు మూస్తే “మ్” గా మారుతుంది. “ఆ”, “ఊ”, “మ్” అనేవి ఉనికిలోని ప్రాథమిక శబ్దాలు. ఈ మూడు శబ్దాలను కలిపి పలికితే “ఆఁమ్” వస్తుంది. “ఆఁమ్” అనేది చాలా ప్రాథమికమైన మంత్రం. కాబట్టి, మహా మంత్రాన్ని “ఓం నమః శివాయ” అని కాకుండా “ఆమ్ నమః శివాయ”గా ఉచ్ఛరించాలి.

ఇది, లయకారి అయిన శివుడి మంత్రం. ఆయన మిమ్మల్ని నాశనం చేయడు. మీకు, మీ జీవితం మీకు అందించే గొప్ప అవకాశాలకు, మధ్య ఉన్న అడ్డును ఆయన నాశనం చేస్తాడు. కర్మ బంధాలను తొలగించి తద్వారా మీ గ్రహణశీలతను పెంపొందించి, ఉనికిలోని ఉన్నత కోణాలకు మీరు అందుబాటులో ఉండేట్టుగా ఈ మంత్రం రూపొందించబడింది.

అపారమైన శక్తి కలిగిన పంచాక్షరాలు

sadhguru-wisdom-article-aum-namah-shivaya-five-elements-illustration

“న -మః-శి - వా - య” అనేది పంచాక్షరి మంత్రం - అంటే ఐదు అక్షరాలు కలిగినది. కేవలం ఐదు అక్షరాల మహత్తర కలయిక అయిన ఈ మంత్రం అసాధారణమైన ఫలితాలను ఇస్తుంది. చూసుకుంటే, చరిత్రలో అతి ఎక్కువ మంది బహుశా ఈ పంచాక్షర మంత్రంతోనే తమ పరమోన్నతమైన స్థాయికి చేరుకున్నారేమో.

ఈ పంచాక్షరాలు ప్రకృతిలోని పంచభూతాలను కూడా సూచిస్తాయి. ‘న’ అంటే భూమి, ‘మ’ అంటే నీరు, ‘శి’ అంటే అగ్ని, ‘వ’ అంటే వాయువు, ‘య’ అంటే ఆకాశం. ఒకవేళ మీరు ఈ పంచాక్షరాలపై పట్టు సాధిస్తే, అప్పుడు అవి పంచభూతాలతో తయారైన అన్నింటిని మీ చైతన్యంలో లయం చేయగలవు.

పంచభూతాలకు అధిపతి, జీవానికే అధిపతి

శివునిలోని అతి ముఖ్యమైన అంశం -భూతేశ్వరుడు - అంటే పంచ భూతాలపై ఆధిపత్యం కలిగినవాడు అని అర్థం. మొత్తం సృష్టి కేవలం ఈ పంచ భూతాల కలయిక మాత్రమే. కేవలం ఐదు పదార్థాలతో ఎంతటి అద్భుతమైన సృష్టి! ఒకవేళ మీకు పంచభూతాల మీద కొంత ఆధిపత్యం ఉన్నా కూడా, జీవన్మరణాలపై, మీ చుట్టూ ఉన్న వాటిపై మీరు ఆధిపత్యం పొందినట్టే - ఎందుకంటే ప్రతి ఒక్కటి ఈ పంచభూతాల నుంచి తయారైందే. యోగాలో అతి ప్రధానమైన సాధన - భూతశుద్ధి, అంటే శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేయడం ఇంకా వాటిని ఆధీనంలోకి తెచ్చుకోవడం.

Editor's Note:  Aum Namah Shivaya chanted by Isha Brahmacharis is available as part of the Vairagya album and can be downloaded for free. It is also available as part of the Isha Chants app.