ప్రశ్న: సద్గురు, మీరు శివుడికి గొప్ప ప్రాముఖ్యతనిస్తారు. అయితే, మీరెందుకని ఇతర గురువుల గురించి పెద్దగా మాట్లాడరు, ఉదాహరణకు జెన్ గురువుల్లాంటి వారి గురించి?
సద్గురు: ఎందుకంటే నేను అనుకునేంత వెర్రి వాళ్ళలో లేదు. మనం శివుడిని మరొకరితో పోల్చి మాట్లాడటం లేదు. మీరు దేన్నైతే శివునిగా భావిస్తారో, అందులో ప్రతీదీ ఇమిడి ఉంటుంది. మానవాళికి గొప్ప సేవ చేసిన అద్భుతమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ గ్రహణశక్తి పరంగా చూస్తే , శివుడిలా మరొకరు లేరు.
మీరు జెన్ గురించి మాట్లాడుతున్నారు కదా! శివుడి కంటే గొప్ప జెన్ గురువు ఎవరున్నారు? జెన్ గురువు గుటే గురించి మీరు విన్నారా? గుటే జెన్ గురించి మాట్లాడినప్పుడల్లా, ఎప్పుడూ తన వేలు పైకెత్తి, "అంతా ఒకటే" అని చూపించేవాడు. ఈ జెన్ ఆశ్రమాల్లో, నాలుగైదు ఏళ్ల వయసు ఉన్న చిన్న పిల్లలు కూడా సన్యాసులుగా ఉంటారు. ఆశ్రమంలో పెరుగుతున్న ఇలాంటి చిన్న పిల్లవాడు గుటేని చూసి, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడల్లా తన చూపుడు వేలును పైకత్తడం మొదలుపెట్టాడు. గుటే దీన్ని చూశాడు కానీ బాలుడికి పదహారేళ్ల వయస్సు వచ్చే వరకు వేచి ఉన్నాడు. తర్వాత ఒకరోజు, గుటే బాలుడిని పిలిచి తన వేలును పైకెత్తాడు. బాలుడు కూడా సహజంగానే అదే పని చేశాడు. గుటే ఒక కత్తిని తీసుకొని, బాలుడి వేలును నరికివేశాడు, వెంటనే ఆ బాలుడు సిద్ధి పొందాడని అంటారు. ఒకటి అనేది కాదు, శూన్యం అనేది అసలు విషయం అని అతనికి అర్థమైంది.
శివుడు దీని కంటే ఎన్నో ఏళ్ల క్రితమే మరింత ముందుకెళ్లాడు. ఒకసారి, చాలా కాలం తర్వాత, శివుడు తన ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తన కొడుకును అంతవరకు చూడలేదు, అతని కొడుకుకి అప్పుడు పది, పదకొండు సంవత్సరాలు. శివుడు వచ్చినప్పుడు, ఒక చిన్న త్రిశూలం పట్టుకున్న ఈ బాలుడు, అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. శివుడు ఆ బాలుడి త్రిశూలాన్ని కాదు, తలనే తీసేసాడు. పార్వతి దాని పట్ల చాలా చింతించింది. కాబట్టి దాన్ని సరిచేయడానికి, శివుడు ఆ బాలుడి శరీరంపై తన గణాలలో ఒకరి తలను ఆ బాలుడుకి పెట్టాడు. దాంతో అప్పుడు ఆ బాలుడు చాలా తెలివైనవాడయ్యాడు. నేటికీ భారతదేశంలో, ప్రజలు విద్య లేదా మరేదైనా ప్రారంభించే ముందు, మొదట ఈ బాలుడిని పూజిస్తారు. ఇప్పుడు ప్రజలు దానిని కొంతవరకు మార్చేసారు. గణ తల గజ తలగా మారింది, కానీ అతను మేధస్సుకి, తెలివితేటలకి ప్రతీకగా మారాడు. అతనికి తెలియనిది ఏదీ లేదని అంటారు.
ఈ ప్రపంచంలో ఏదీ శివుని జీవితానికి అతీతం కాదు. అతను అంత సంక్లిష్టమైనవాడు, అంత పరిపూర్ణుడు.
అదే మొదటి జెన్ కార్యం.ఈ ప్రపంచంలో ఏదీ శివుని జీవితానికి అతీతం కాదు. అతను అంత సంక్లిష్టమైనవాడు, అంత పరిపూర్ణుడు. అతని దగ్గర బోధనలు లేవు, పద్ధతులు మాత్రమే ఉన్నాయి, అవి పూర్తిగా శాస్త్రీయమైనవి. మానవ వ్యవస్థలో 114 చక్రాలు ఉంటాయి, కానీ వాటిలో రెండు భౌతిక శరీరానికి బయట ఉంటాయి కాబట్టి, "అవి రెండూ భౌతికత్వాన్ని అధిగమించిన వారికి మాత్రమే. మనుషులకు 112 మార్గాలు మాత్రమే ఉన్నాయి" అని చెప్పి, మనిషి ముక్తి పొందడానికి 112 మార్గాలను సూచించారు. ఈ జీవితం ఎలా నిర్మించబడిందనే విషయాన్ని తెలుసుకోవడానికి, ఈ 112 పార్శ్వాలను ఎలా ఉపయోగించుకోవాలో స్పష్టమైన పద్ధతుల్ని చూపించారు. వీటిలో ప్రతి ఒక్కదాని ద్వారా, మీరు ముక్తి పొందగలరు.
శివుడు మాట్లాడేది జీవితపు విధివిధానాల గురించి, అందులో ఫిలాసఫీ లేదు, బోధన లేదు, సామాజిక ఔచిత్యం ఉండదు- కేవలం సైన్సు మాత్రమే ఉంటుంది. ఈ సైన్సు నుంచి, గురువులు టెక్నాలజీని రూపొందిస్తారు. అతను సైన్సుని అందించాడు. మీరు నేడు వాడుతున్న టెక్నాలజీ, అది స్మార్ట్‌ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు లేదా మరేదైనా గ్యాడ్జెట్ కావచ్చు, వాటి వెనుక సైన్సు ఉంది. ఆ సైన్సు మీకు అవసరం లేదు. మీరు ఆ టెక్నాలజీని మాత్రం వాడుకుంటున్నారు. కానీ ఎవరూ ఆ సైన్సుని గ్రహించకుండా ఉండుంటే, మీకు ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ఉండేది కాదు.
కాబట్టి శివుడు చెప్పినది కేవలం పరిపూర్ణమైన సైన్సు మాత్రమే. తమ ముందు కూర్చునేవారికి సరిపోయే విధంగా టెక్నాలజీని తీర్చిదిద్దుకునే బాధ్యతను శివుడు సప్తరుషులకే వదిలేశాడు. టెక్నాలజీని తయారుచేసుకోవచ్చు. మనకు అవసరమైన దాన్ని బట్టి, మనం ఒక గ్యాడ్జెట్‍ని తయారుచేసుకుంటాం, కానీ ప్రాథమిక విజ్ఞానం అనేది ఒకటే ఉంటుంది. ఈరోజు ఉపయోగపడే గ్యాడ్జెట్‍లు, రేపు పనికిరాకపోవచ్చు. మనం ఒకప్పుడు చాలా విలువైనవిగా భావించిన చాలా గ్యాడ్జెట్‍లు ఇప్పుడు విలువైనవి కావు, ఎందుకంటే కొత్త గ్యాడ్జెట్‍లు వచ్చాయి - కానీ సైన్సు మాత్రం అదే.
కాబట్టి ఆదియోగి విషయంలో, మనం ప్రాథమిక విజ్ఞానాన్ని పరిశీలిస్తున్నాము. వివిధ కారణాల వల్ల మానవాళి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ప్రాథమిక విజ్ఞానాన్ని బలోపేతం చేయడం చాలా ముఖ్యం.