రెండు భాగాల సిరీస్‍లో రెండవ భాగంలో, సద్గురు కలల స్వభావం గురించి మరియు అవి కర్మ పునరావృతంతో ఎలా ముడిపడి ఉంటాయో వివరిస్తారు.

సద్గురు: కర్మకి చాలా కోణాలు ఉంటాయి. మన ప్రస్తుత అవగాహన స్థాయిని బట్టి, ఒకే కర్మని వేర్వేరు స్థాయిలలో చర్చించుకుంటూ ఉంటాం. కర్మ అంటే చర్య. ఎవరి చర్య? "నా చర్య." మొదటగా మనం గ్రహించవలసింది ఏమిటంటే, "నేను గతంలో చేసిన దానికి ప్రతిఫలంగానే ఈ పునరావృతం జరుగుతోంది." ఈ పునరావృతం చాలా ఆటోమేటిక్‌‍గా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. "నా ప్రమేయం కూడా అవసరం లేకుండా, దానంతట అదే జరిగిపోతోంది. కోపం రావడం, ఆలోచనలు రావడం, భావోద్వేగాలు కలగడం ఊరికే జరిగిపోతున్నాయి" అని అనుకుంటున్నారా? వీటికి ఉద్దేశం అవసరం లేదు, చొరవ అవసరం లేదు. అవి ఊరికే జరిగిపోతాయి. ఇవన్నీ దాదాపు మరొక జీవి చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మీరు గనుక కొంతకాలం మౌనంగా ఉండి, మనసు ఎలా పని చేస్తుందో గమనిస్తే, ఏదో మిమ్మల్ని ఆవహించినట్లుగా అనిపిస్తుంది. అది దాని పని అది చేసుకుంటున్నట్లు ఉంటుంది. కానీ అది నిజానికి మీరు గతంలో చేసిన దానిని కరిగిస్తోంది అంతే.

అయితే, జీవితం కేవలం కర్మలు చేయడం గురించేనా, కలలు వాటిని కరిగించడం గురించేనా? అంటే, కాదు. జీవితం కర్మలు చేయడం, వాటిని కరిగించడం రెండింటి కలయిక. మీరు ఎంత ఎక్కువ ఎరుకతో లేకుండా ఉంటే, అంత ఎక్కువ కరిగించడం జరుగుతూ ఉంటుంది. మీరు కాస్త ఎరుకతో ఉంటే, మీరు ఎన్నిటినో చేయడం జరుగుతుంది. మీరు పూర్తిగా ఎరుకలో ఉన్నట్లైయితే, కరిగించడం చాలా వేగంగా జరుగుతుంది, కర్మలు చేయడం పూర్తిగా ఆగిపోతుంది. పాక్షిక చైతన్యం ఎప్పుడూ కరిగించడం కన్నా ఎక్కువగా కొత్త కర్మలకు దారి తీస్తుంది. ఉదాహరణకు, ఒక సామాన్య రైతు, తన కర్మను కరిగించేసుకుంటూ ఉంటాడు. అతను కొత్తగా ఏమీ పోగు చేసుకోవడం లేదు. ఉదయం లేచి, పొలం దున్ని, పశువులను చూసుకొని, చిన్న చిన్న రోజువారీ పనులు చేసుకుంటాడు, అంతే. ప్రపంచాన్ని ఎలా జయించాలని ఆలోచించడు. అందుకే అతని జీవితం ఎక్కువగా కరిగించుకోవడమే. అతను కొత్త కర్మలు ఏమీ చేయడు అని కాదు, అతని జీవన విధానం కొత్త కర్మలు పోగు చేసుకునేంత స్థాయిలో లేదు కాబట్టి, చేసేవి తక్కువ, కరిగించుకోవడం ఎక్కువ. కానీ చదువుకున్న వాళ్ళ విషయానికి వస్తే, కొత్త కర్మలు పోగు చేసుకోవడం, కరిగించుకోవడం రెండూ కలగలిసి ఉంటాయి, వాళ్ళు ఒకేసారి రెండూ చేయగలరు.

విద్య యొక్క పాత్ర

ఒకవైపు మీ ఆలోచనలు, భావోద్వేగాలు వాటంతట అవే అచేతనంగా పనిచేస్తుంటాయి. మరోవైపు, మీరు నెరవేర్చుకోవాలనుకునే సంకల్పాలు ఉంటాయి. మనందరికీ ఇది జరుగుతూనే ఉంటుంది. దీనికి విద్యని ఒక్కటే నిందించడం సరికాదు కానీ, సాధారణంగా మీరు పొందే విద్య దీనికి కారణమవుతోంది- అది మీలో బలమైన సంకల్పాలను నెలకొల్పుతుంది. నేటి విద్యా విధానం తెలుసుకునే ప్రక్రియను పెంపొందించేలా లేదు, గ్రహణశక్తిని పెంపొందించేలా లేదు, మీ మనశ్శరీరాలను, వాటి పూర్తి సామర్థ్యం మేరకు పనిచేసేలా చేయడం లేదు. అది మీలో బలమైన కోరికలను, ఆకాంక్షలను పెంపొందించే మార్గంగా మారింది.

సంకల్పం అనేది కర్మను సృష్టించే శక్తివంతమైన సాధనం. కర్మకు కారణం చర్య కాదు, సంకల్పమే.

విద్యావంతులు అపరిమిత కోరికలతో బాధపడుతుంటారు. కడుపునిండా తిని, సంతోషంగా కూర్చోలేరు, నిద్రపోలేరు. కదూ! భోజనం చేస్తున్నప్పుడు, వ్యాపార చర్చలు చేస్తుంటారు. అదేదో ప్రపంచం కోసం ఏదైనా చేయాలనో, ఏదైనా సృష్టించాలనో, నిర్మించాలనో, తమ జీవితాలను లేదా మిగతా అందరి జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దాలనో కాదు. అదేం కాదు. వాళ్ళు చేస్తున్న అర్థంలేని పనులనే ఇంకొంచెం ఎక్కువ చేయాలనుకుంటూ ఉంటారు, అంతే. ఎందుకంటే ఎటువంటి ప్రయోజనం లేని బలమైన సంకల్పాలు ఏర్పడ్డాయి కాబట్టి. సంకల్పం అనేది కర్మను సృష్టించే శక్తివంతమైన సాధనం. కర్మకు కారణం చర్య కాదు, సంకల్పమే.

Iకర్మ ప్రక్రియలో, చర్యల వల్ల కర్మ పునరావృతం జరుగుతుంది. బలమైన సంకల్పాల వల్ల కర్మను పోగుచేసుకోవడం జరుగుతుంది. మీ గురించి మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే, అంత బలంగా మీ సంకల్పాలు మారతాయి. సంకల్పాలు అంటే నేను గొప్ప సంకల్పాల గురించి మాట్లాడటం లేదు- బలమైన సంకల్పాల గురించి మాట్లాడుతున్నాను. కోపంలో ఉన్నప్పుడు, మీరు కర్మను కరిగించేసుకుంటూ ఉండొచ్చు లేదా కర్మను పోగు చేసుకోవడం కూడా చేస్తుండచ్చు. మీరు ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి, తర్వాత శాంతించవచ్చు. లేదా కోపంతో ఊగిపోయి, వెంటనే, "నేను ఆమెను ఏమి చేయాలనుకుంటున్నానో తెలుసా?" అనే ఒక సంకల్పం చేసుకోవచ్చు. అప్పుడు మీరు పెద్ద ఎత్తున కర్మను పోగు చేసుకుంటారు. కోపం అంటే ఒక విస్ఫోటనం మాత్రమే. కోపం అంటే మీలో ఉన్నది బయటకు వచ్చేయడం. కోపం ద్వేషానికి దారితీయవచ్చు. ద్వేషం అనేది ఒక ఉద్దేశం. ద్వేషం అనేది కోపమనే సంకల్పం నుంచి వచ్చినది. అసూయ కూడా అంతే - అది కర్మ పునరావృతం అవ్వడం వల్ల వచ్చి ఉండొచ్చు. కానీ ఈర్ష్య అనేది ఒక ఉద్దేశం - అది అసూయ అనే సంకల్పం నుంచి వచ్చినది. కానీ, కొంత ప్రశాంతతతో, మీరు కోపంగా ఉన్నప్పటికీ, ద్వేషంతో ఉన్నప్పటికీ, మీరు మీ కోపాన్ని లేదా ద్వేషాన్ని బయటకు చూపించరు. మీరు శాంతంగా కనిపిస్తూనే, కఠినమైన పనులు చేస్తారు, అవునా? కామం అనేది కర్మ పునరావృతానికి ఒక ఉదాహరణ. కోరిక అనేది కొత్త కర్మ ఎందుకంటే అది ఒక ఉద్దేశం.

ఆధునికులుగా చెప్పుకునేవారు

మీలో కలిగే ప్రతి ఆలోచనా, భావోద్వేగం వాస్తవ రూపం దాలిస్తే, మీరు దాదాపు ఒక జంతువులాగా మారిపోతారు. అలా ప్రవర్తించకుండా ఉండేందుకు, మీరు ఒక ఉద్దేశాన్ని సృష్టించుకుంటారు- అదే కొత్త కర్మకు దారి తీస్తుంది. నాగరికత అని చెప్పుకునే ఈ సంస్కారం, ఆత్మహత్య లాంటిది, ఎందుకంటే కర్మను కరిగించే వేగం కంటే ఎక్కువ వేగంగా కొత్త కర్మలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనసు ద్వంద్వ స్వభావాన్ని సంతరించుకోవడం వల్ల. ఒక వైపు కర్మ కరిగిపోతూ ఉంటే, మరోవైపు దాని స్వంత సంకల్పాలు, ఉద్దేశాలు ఉంటాయి. నాగరికులు అని చెప్పుకునే వాళ్ళంతా- నాగరికులు అన్నప్పుడు, సామాజికపరమైన నాగరికులుగా పరిగణించబడేవారు అని, నిజమైన నాగరికులు కాదు. వారిని గమనిస్తే, వారు సాధారణ ప్రజానీకం కంటే చాలా ఎక్కువ బాధపడుతుంటారు. సాధారణ ప్రజల కోపం, ద్వేషం ఇంకా పక్షపాత ధోరణి బహిరంగంగానే వ్యక్తమవుతాయి. వారు కొంచెం మొరటుగా కనిపించవచ్చు, కానీ కుటిలత్వం విషయానికొస్తే, నాగరికుల కంటే వీరిలో ఇది చాలా తక్కువగా ఉంటుంది. నాగరికత ఎక్కువ ఉన్నవాళ్లు, మొదట్లో ఇతరులను మోసం చేయడం నేర్చుకుంటారు. కొంతకాలానికి, వారు నిపుణులై, తమను తాము కూడా మోసం చేసుకోగలుగుతారు. వారి ఉద్దేశాలు వారికి కూడా తెలియకుండా వారిలో దాగి ఉంటాయి.

విద్య ఆ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎందుకంటే మనసు ఎలా పనిచేస్తుంది, అది ఎలా పరిణామం చెందుతుంది, ఏం చేస్తే అది వికసిస్తుంది, దేని వల్ల అది కలుషితం అవుతుంది అనే వాటి పట్ల సరైన అవగాహన లేకుండానే విద్య మీకు ఎన్నో అనుభవాల్ని ఇస్తుంది. వీటిని లోతుగా అర్థం చేసుకోకుండానే, సమాచారం అన్ని రూపాల్లో అందరికీ అందుబాటులో ఉంటోంది. అందుకే దురదృష్టవశాత్తు, ప్రజలు విద్యను తమను తాము కొత్త కర్మలలో బంధించుకోవడానికి వాడుకుంటున్నారు. ప్రపంచం గురించి, సమాచారం గురించి వాళ్ళకి ఎక్కువగా తెలిసి ఉండవచ్చు, కానీ జీవితం విషయానికొస్తే, చదువుకున్నవారు సాధారణంగా నిరక్షరాస్యుల కంటే ఎక్కువ అజ్ఞానంలో ఉంటారు. భారతదేశంలో ఒక సాధారణ నిరక్షరాస్యుడైన రైతు ఇంటికి వెళ్ళి చూడండి, అతనికి జీవితం పట్ల ఉన్న అవగాహన, తన శరీరం పట్ల ఉన్న అవగాహన, తన భౌతిక సౌకర్యాల పట్ల ఉన్న అవగాహన, ఇతరులతో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే అవగాహన - ప్రపంచంలోని చదువుకున్న వర్గాల కంటే చాలా స్పష్టంగా, చాలా అర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే అతని మనసులో అంత గందరగోళపు ఆలోచనలు ఉండవు. చదువుకున్న వర్గాల్లో చాలామందిలో జరిగినట్లుగా, అతను మానసికంగా అంతగా ఒత్తిడికి గురికాడు. విద్య ఒక్కటే ఇందుకు కారణం అని చెప్పట్లేదు, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకుంటే మనకి మేలు జరుగుతుంది అనే మార్గదర్శకత్వం లేకపోవడమే సమస్య. అందుకే దురదృష్టవశాత్తు, సాధికారతను ఇవ్వాల్సిన విద్య, స్పష్టతను ఇవ్వవలసిన విద్య, జీవితం పట్ల మరింత గందరగోళాన్ని తెచ్చిపెడుతోంది.

కాబట్టి మేల్కొని ఉండటం, కల - ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించకపోవడమే మంచిది. మీరు ఈ రెండు స్థితులనూ కలలుగా చూడండి, లేదా రెండింటినీ వేర్వేరు స్థాయులలో మేల్కొని ఉండటంగా చూడండి. ఇది ఒక రకమైన కల, అది కాస్త లోతైన కల. లేదా ఇది ఒక రకమైన వాస్తవం, అది మరొక రకమైన వాస్తవం. మీరు ఈ విధంగా చూస్తే, రెండింటినీ కొత్త కర్మలు చేసుకోవడానికి కాకుండా కర్మను కరిగించేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు.

సంపాదకుని గమనిక:ఈశా బ్లాగ్ నుండి తాజా అప్డేట్లను పొందండి. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఆర్‌ఎస్‌ఎస్ లేదా బ్రౌజర్ ఎక్స్టెన్షన్లు, వీటిలో మీకు నచ్చిన వాటిని ఎంచుకోండి.