రెండు భాగాల వ్యాసంలో మొదటి భాగంగా, సద్గురు కలల స్వభావం గురించి, అవి కర్మ విముక్తితో ఎలా అనుసంధానమై ఉంటాయో వివరిస్తున్నారు.

సద్గురు: ఒక వ్యక్తి కలగన్నప్పుడు, దాన్ని కల్పన అంటారు. అదే ఒక సమూహం కలగన్నప్పుడు, అది సమాజంగా మారుతుంది. అదే విశ్వమే కలగన్నప్పుడు, సాధారణంగా దాన్ని మనం వాస్తవంగా భావిస్తాం. కానీ నిజానికి కల కూడా ఒక రకమైన వాస్తవమే, అలాగే వాస్తవం కూడా ఒక రకమైన కలలాంటిదే. కల విషయంలో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, మీరు మేల్కొనగానే అది అంతం అవుతుంది. అలాగే మనం వాస్తవం అనుకునేది కూడా - మనం మేల్కొన్నప్పుడు అది కూడా అంతమైపోతుంది. వైద్యపరంగా చూస్తే, నిద్రలో శరీర పరిస్థితులు కొద్దిగా తగ్గిన స్థితిలో ఉంటాయి - అంటే దాదాపు ధ్యానంలో ఉన్నట్లుగానే ఉంటుంది. అంటే నిద్ర అనేది మేల్కొని ఉన్న స్థితికన్నా మరింత విశ్రాంత స్థితి అని చెప్పవచ్చు. లేదా మేల్కొని ఉండటం అనేది నిద్రావస్థ కన్నా మరింత కలవరపాటు స్థితి అని కూడా చెప్పవచ్చు.

ఇది ఏమైనా మాటల గారడీ లేదా ఒక రకమైన వినోదం అనుకుంటున్నారా, "కల ఇంకా మేలుకొని ఉండటం ఒకటే, వాస్తవం ఇంకా కల ఒకటే" అని భావిస్తున్నారా. లేదు, ఇది అలా కాదు. మీ ఇంద్రియాలు వాస్తవాన్ని ఎలా గ్రహిస్తాయో, అలా మాత్రమే మీరు దాన్ని తెలుసుకుంటారు. కానీ అది ఉన్నది ఉన్నట్లుగా చూడటం మీకు తెలియదు. కాబట్టి మీరు "వాస్తవం" అనుకునేది, మీ మనసు చేసుకునే అన్వయం మాత్రమే. అలాగే మీరు "కల" అనుకునేది కూడా మీ అన్వయమే. మీ మనసులో జరిగేదంతా కూడా, ఒక రకమైన వాస్తవమే. దీన్ని మనం "మానసిక వాస్తవం" అని పిలవవచ్చు. చాలామందికి వారి ఆలోచనా ప్రక్రియ కన్నా వారి కల చాలా శక్తివంతమైనది. కానీ దురదృష్టవశాత్తు, వారికి ఆ కలలోని చాలా భాగం గుర్తుండదు.

కర్మ పునరావృతం

జీవిత ప్రక్రియ అనేది ఇంతకు ముందు జరిగిపోయిన దాని నుండి పునరావృతమవుతున్న దానిగా మనం అర్థం చేసుకోవచ్చు. "మీ జీవితం ప్రస్తుతం ఇలా ఉంది అంటే, అది మీ కర్మ వల్లనే" అని అన్నప్పుడు, దానర్థం - మీ జీవితం ఇంతకు ముందు జరిగిపోయిన దాని తాలూకు పునరావృతమే అని అర్థం. కానీ కొన్నిసార్లు జీవిత పరిస్థితులు మీ కర్మ పదార్థంతో సరిగ్గా సహకరించకపోవచ్చు. ఉదాహరణకు మీరు కళ్ళు తెరిచి కల కంటూ, ఆ కలను నెరవేర్చడానికి ప్రపంచ సహకారాన్ని కోరుకుంటున్నట్లైతే, అలా జీవించడం ఎంతో నిరాశాజనకమైన విధానం, ఎందుకంటే ప్రపంచం మీ కలతో సహకరించదు. ప్రపంచానికి తన పోకడలు తనకుంటాయి. కానీ కలలో మాత్రం, మీకున్న కర్మ నిర్మాణానికి అనుకూలమైన వాతావరణాన్ని మీరు సృష్టించుకోగలరు. జీవితం అచేతన కర్మ పునరావృతాన్ని దాటి, చైతన్యవంతమైన ప్రక్రియగా మారినప్పుడు మాత్రమే మీరు మేల్కొని ఉండటం అర్థవంతమవుతుంది. జీవితం కేవలం ఇంతకు ముందు జరిగిపోయిన దాని పునరావృతానికే పరిమితమైతే, నిస్సందేహంగా దానిని చేయడానికి కలే సరైన చోటు అని చెప్పవచ్చు.

కలలో కూడా మీరు కర్మను పోగు చేసుకోగలరా? నిజానికి, కర్మను పోగు చేసుకోవడం అనేది మీరు చేసే పనిలో ఉండదు. అది ఒకరి చర్య యొక్క సంకల్పం లేదా ఉద్దేశంలో ఉంటుంది.

యోగ సంప్రదాయంలో, మహాదేవుడు అయిన శివున్ని పూర్తి నిద్రావస్థలో లేదా సంపూర్ణ జాగ్రదావస్థలో ఉన్నట్టు వర్ణిస్తారు. పూర్తిగా ఎరుకతో ఉన్న వ్యక్తి స్థితి ఇది: అతడు ఉన్నాడు లేక అతడు లేడు. అతనికి మధ్యస్థ వాస్తవం లేదు, ఎందుకంటే పునరావృతం కావటానికి ఏమీ లేనప్పుడు, కేవలం నిశ్చలత్వం, జాగురూకత మాత్రమే ఉంటాయి. కల స్థితి ఉండదు. "కల" అని అన్నప్పుడు, నిద్రలో కనిపించే దృశ్యాల గురించి మాత్రమే కాదు, కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా మీరు కల స్థితిలోనే ఉంటారు. ప్రస్తుతం, మీరు సృష్టిని అనుభూతి చెందుతున్న తీరు చూస్తే, అది పూర్తిగా కలలా ఉంటోంది. అది మీరనుకున్నట్లుగా లేదు.

కలలకున్న శక్తి మరియు వాటి బలహీనత రెండూ కూడా ఏకకాలంలో ఉంటాయి. కలలో మునిగిపోయి ఉన్నవారికి, అది ఎంతో శక్తివంతమైనది. కొంచెం దూరం నుంచి చూసే వారికి, అది చాలా బలహీనమైన విషయం. అసలు మీరు మీ కలతో ఎలాంటి సంబంధాన్ని ఏర్పరచుకున్నారనే దాని మీద ఆ విషయం ఆధారపడి ఉంటుంది.

కలలో కూడా మీరు కర్మను పోగు చేసుకోగలరా? నిజానికి, కర్మను పోగు చేసుకోవడం అనేది మీరు చేసే పనిలో ఉండదు. అది ఒకరి చర్య యొక్క సంకల్పం లేదా ఉద్దేశంలో ఉంటుంది. కలలో ఉద్దేశాన్ని ఏర్పరచుకునే సామర్థ్యం మీకుందా? "నేను ఈ రోజు ఇలాంటి కల కనాలి" అని మీరు నిర్ణయించుకోగలరా? లేదు. కలలో సంకల్పం అనేది ఉండదు. కాబట్టి కల కాబట్టి కల అనేది కేవలం పునరావృత ప్రక్రియ మాత్రమే. పగటి సమయంలో కూడా, చాలా సమయం మీరు ఇంతకు ముందు జరిగిపోయిన దాన్నే పునరావృతం చేస్తుంటారు. మీ కోపం, మీ ఆకాంక్ష, మీ విసుగు, మీ ప్రేమ, మీ అభిరుచి, మీ ద్వేషం, ఇవన్నీ కూడా చాలా వరకు కేవలం కర్మ పునరావృతం మాత్రమే- మీ నిజమైన చర్య కాదు. మీరు వాటిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే మీకిది అర్థమవుతుంది. ఉదాహరణకు, నిన్న ఎవరిపైనైనా మీకు చాలా కోపం వచ్చిందనుకోండి, ఈరోజు మీరు "ఈ వ్యక్తిపై నేను కోపం తెచ్చుకోకూడదు" అని నిశ్చయించుకున్నారు అనుకుందాం. కానీ మీరు అతన్ని కలిసినప్పుడు, మళ్ళీ మీకు కోపం వస్తుంది. కచ్చితంగా ఇది మీ చర్య కాదు. చాలాసార్లు, ఇంతకు ముందు జరిగిపోయిన దానికి విరుద్ధమైన పనే, మీరు మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే, మీకిది అర్థమవుతుంది. ఈ కర్మ పునరావృత ప్రక్రియ చాలా వాస్తవంగా అనిపిస్తుంది, మీరే దీనినంతా చేస్తున్నట్లు అనిపిస్తుంది. "కర్మ" అన్నప్పుడు, అది మీ చర్య అని చెబుతున్నాం. ఒక వ్యక్తి తాను చేసే ప్రతిదీ, తన ఉద్దేశాలతోనే చేస్తున్నానని నమ్మడం అనేది చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్న అజ్ఞానానికి గుర్తు.

స్వార్థాన్ని విడనాడడం

ఒక మంత్రంలో ఇలా ఉంటుంది, "అంతా నువ్వే మహాదేవా, అంతా నువ్వే. నా చెడు నా మనసు చేసింది, నా చర్యలు నా శరీరం చేసింది - మరి నేనెక్కడ ఉన్నాను? నిజానికి నేను కూడా లేను. అంతా నీదే" అని. నిజమైన భక్తుడు ఇలా అంటే, అది ఎంతో గొప్ప కనువిప్పు కలిగిన స్థితి. కానీ మనసు ఇలా అంటే, అది చాలా ఘోరమైన వంచన. చాలామంది మనుషులు తమకు నచ్చని విషయాలు జరిగినప్పుడల్లా, ఎవరో ఒకరిని లేదా ఏదోక దాన్ని నిందించటం నేర్చుకున్నారు. మీ ఇష్టాయిష్టాలు, జయాపజయాలు రెండింటినీ మీరు మరొకరికి ఆపాదించడానికి సుముఖంగా ఉన్నట్లయితే, అది పర్వాలేదు. అలాగే మీ సుఖదుఃఖాలు రెండింటినీ మరొకరికి ఆపాదిస్తే, అది కూడా పర్వాలేదు. కానీ మీ దుఃఖాన్ని మాత్రమే మరొకరికి ఆపాదించి, సుఖాన్ని ఆపాదించకుంటే- అది మీరు ఇతరులతో చేసే ఒక చెడ్డ ఒప్పందం అవుతుంది. ఎందుకంటే అతను వట్టి మూర్ఖుడు అయితే తప్ప, ఎవరూ ఈ ఒప్పందానికి ఒప్పుకోరు.

అతి మందబుద్ధి కలవారు కూడా తమ స్వప్రయోజనాల విషయంలో చాలా తెలివైన వారిగా ఉంటారు. మనుషులు మరింత తెలివైన వారిగా మారినప్పుడే, వారు తమ స్వప్రయోజనాల గురించి తక్కువగా పట్టించుకుంటారు. కానీ వారు ఎంత మందకొడిగా ఉంటే, వారి స్వార్థంవిషయంలో అంత జాగ్రత్తగా ఉంటారు. మీరు దీన్ని గమనించారా? పరిమితమైన ఈ స్వప్రయోజనాల పట్ల ఆసక్తి కలిగి ఉండటం అనేది మూర్ఖత్వం. ఇది వ్యక్తులకు అలాగే మానవాళి మొత్తానికి జరుగుతున్న భయంకరమైన నష్టం. ఎంతో వైభవోపేతమైన ఈ విశ్వం పట్ల ఆసక్తి కలిగి, దానిలో నిమగ్నమయ్యే అవకాశం ఉన్నప్పుడు, అతడు ఎలాంటి విలువ లేని ‘నేను’ అనే ఒక చిన్న వ్యక్తిపై ఆసక్తి చూపుతున్నాడు. మేధస్సు విస్తృతమై, అది వివిధ విషయాలపై ఆసక్తి చూపటం ప్రారంభించినప్పుడు, మనిషి తన స్వార్థం గురించి అంతగా పట్టించుకోడు. ఒకరి బుద్ధి నిజంగా వికసించినప్పుడు, అతడికి స్వార్థం అనేది ఉండదు.

సంపాదకుని గమనిక:: ఈశా బ్లాగ్ నుండి తాజా సమాచారాన్ని పొందండి. ట్విట్టర్, ఫేస్‍బుక్, ఆర్ఎస్ఎస్ లేదా బ్రౌజర్ ఎక్స్టెన్షన్లు, మీకు నచ్చిన దాన్ని ఎంచుకోండి.