యోగా ప్రజాదరణ పొందడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో ఒకటి మీ గురించిన ప్రాథమిక వాస్తవాలను మీరు గ్రహించేటట్లు చేయడం. ఒకసారి కిండర్ గార్టెన్ స్కూల్లో టీచర్ పిల్లల్ని ఇలా అడిగింది, “నేను తలకిందులుగా నిలబడితే నాముఖం ఎర్రబడడం మీరు చూస్తారు, ఎందుకంటే రక్తం నా తలలోకి ప్రవహిస్తుంది. కాని నేను నా కాళ్లమీద నిలబడినప్పుడు అలా జరగదు. ఎందుకు?” దానికి ఒక పిల్లవాడు ఇలా సమాధానం  చెప్పాడు, “ఎందుకంటే మీ కాళ్లు ఖాళీగా లేవు” అని.

మీ శరీరం ఒక బారోమీటరు లాంటిది. మీకు దాన్ని చూడడం తెలిస్తే అది మీ గురించి సర్వం చెప్తుంది. మీరు మీ గురించి ఊహించుకొనే వింత విషయాలు కాదు, మీ గురించిన వాస్తవ విషయాలు. మీ మనస్సు చాలా మోసగత్తె. ప్రతిరోజూ మీ గురించి భిన్నంగా చెప్తుంది. మీ శరీరాన్ని చదవడం మీకు తెలిస్తే అది ఉన్నదున్నట్లుగా మీ గురించి – మీ గతం, వర్తమానం, భవిష్యత్తు – ఒక పద్ధతిలో చెప్తుంది. అందుకే ప్రాథమిక యోగా శరీరంతో ప్రారంభమవుతుంది.

బలవంతంగా అమలుపరచడంగాని, ప్రచారం చేయడంకాని లేకుండానే 15,000 సంవత్సరాలకు పైగా నిలిచిన వ్యవస్థ యోగా.

మారే ఫాషన్లతో పాటు ఎన్నో విషయాలు వస్తాయి, పోతాయి కాని, యోగా వేలాది సంవత్సరాలు నిలబడింది, ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. దాన్ని చాలా ప్రాథమికరీతుల్లో, సరిగ్గాలేని పద్ధతుల్లో ప్రసారం చేస్తున్నప్పటికీ అది నిలిచి ఉండగలిగింది. బలవంతంగా అమలుపరచడంగాని, ప్రచారం చేయడంకాని లేకుండానే 15,000 సంవత్సరాలకు పైగా నిలిచిన వ్యవస్థ యోగా. ప్రపంచ చరిత్రలో ఎవరూ ఎవరి గొంతుమీదో కత్తి పెట్టి “యోగా చేసి తీరాలి” అనలేదు. ఒక సంక్షేమ ప్రక్రియగా అది పనిచేసింది కాబట్టి అది ఇప్పటి వరకూ జీవించింది, కొనసాగింది. దీనికి మరో ఉదాహరణ లేదు.

మరొక విషయమేమంటే సాధారణంగా ప్రపంచంలోని ప్రజలు– యువత కాని, వృద్ధులు కాని – ఎప్పటికంటే కూడా ప్రస్తుత కాలంలో ఒత్తిడిని అనుభూతి చెందుతున్నారు. వాళ్లు చాలా ఆందోళనతో, ఆత్రుతతో ఉండి అంతర్గత కల్లోలాన్ని తొలగించుకోవడానికి దొరికిన పద్ధతినల్లా వినియోగిస్తున్నారు – డిస్కోకు వెళతారు లేదా కారులో తిరుగుతారు లేదా కొండలెక్కడానికి వెళతారు – అది కొంతవరకు పనిచేస్తుంది, కాని అది వాళ్లకు పరిష్కారమివ్వదు. అందువల్ల యోగా వైపు చూడడం చాలా సహజం.

యోగా ప్రజాదరణ పెరగడానికి కారణం విద్య విస్తృతం కావడం. ఇవ్వాళ ఎప్పటికంటే కూడా ఈ ప్రపంచంలో అందరూ ఎక్కువ బుద్ధిని కలిగి ఉన్నారు. అందువల్ల సహజంగానే బుద్ధి బలపడితే ప్రజలు ప్రతిదానికీ తర్కబద్ధమైన పరిష్కారాల కోసం చూస్తారు. వాళ్లు ఎక్కువ తార్కికులయ్యే కొద్దీ వాళ్లు శాస్త్రవిజ్ఞానం మీద ఆధారపడతారు. శాస్త్రవిజ్ఞానం నుండి టెక్నాలజీ వస్తుంది. ప్రపంచంలో తార్కిక కార్యకలాపం దృఢతరమయ్యేకొద్దీ ఎక్కువమంది కాలక్రమంలో యోగా వైపు వస్తారు. క్రమంగా సంక్షేమం కోరుకొనేవారికి యోగా చాలా ముఖ్యం అవుతుంది.

యోగా, ఒక వ్యాయామం కాదు

ప్రపంచంలో చాలాచోట్ల యోగా చేస్తున్న పద్ధతి మృతశిశువులా ఉన్నది. మృత శిశువును కనడం కంటే గర్భం ధరించకపోవడమే మేలు కదా. మీకు సిక్స్ ప్యాక్ కావాలంటే వెళ్లి టెన్నిస్ అడండి లేదా కొండలెక్కండి. యోగా ఎక్సర్ సైజ్ కాదు, దానికి మరిన్ని కోణాలున్నాయి. ఫిట్‌నెస్ కంటే భిన్నమైన కోణాలు, అవును – మీరు దానివల్ల ఆరోగ్యం పొందవచ్చు కాని మీకు సిక్స్ ప్యాక్ రాదు.

యోగా పశ్చిమ దేశాల్లోకి ప్రవేశించిన 20 ఏళ్ల తర్వాత, జనాదరణ పొందిన తర్వాత వైద్యశాస్త్రవేత్తలు ముందుకు వచ్చి, అధ్యయనాలు చేసి, “యోగావల్ల లాభాలున్నాయి” అని చెప్తున్నారు. దాన్నిక్కడ తుచ్ఛమైన పద్ధతుల్లో బోధిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దాని ఆరోగ్యపరమైన ప్రయోజనాలను కాదనడానికి వీల్లేదు. కాని అనుచితమైన వికార పద్ధతుల్లో యోగా వ్యాపించినట్లయితే పది పదిహేనేళ్ల కాలంలో మనుషులకు అది ఏ విధంగా హానికారకమో స్పష్టంగా చెప్పే అధ్యయనాలు వస్తాయి. పతనం ప్రారంభమవుతుంది.

యోగా వ్యాయామం కాదు కాబట్టి దాన్ని చాలా సూక్ష్మంగా, సున్నితంగా అభ్యాసం చేయాలి. బలవంతంగా కండరాలు పెంచడానికి చేయకూడదు. భౌతిక శరీరానికి సంపూర్ణమైన స్మృతి నిర్మాణం ఉంది. మీరీ భౌతిక శరీరాన్ని చదవదలచుకుంటే, ప్రతిదీ – శూన్యం నుండి ఈ దశ వరకు విశ్వంలో ఏర్పడిన రీతి – ఈ శరీరంలో రాయబడి ఉంటుంది.  ఈ స్మృతిని వెలికి తీసుకువచ్చే మార్గం యోగా. అది ఈ జీవితాన్ని దాని పరమ సంభావ్యత వైపు పునర్నిర్మించే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా ఉదాత్తమైన, శాస్త్రీయ ప్రక్రియ.

ప్రేమాశీస్సులతో,
సద్గురు