నిర్బంధతల గురించి చింతిస్తున్నారా?
@మీకున్న నిర్బంధతల గురించి చింతిస్తున్నారా? కర్మ భారాన్ని మోస్తున్నప్పుడు, దానిని అణచివేసే ప్రయత్నం చేస్తే అది మరింత పెరుగుతుందని, అలా చేయడం వల్ల ఉపయోగం లేదని సద్గురు వివరిస్తున్నారు.
ప్రశ్న: సద్గురూ!, నేను సాధన చేస్తున్నప్పుడు నాలోని నిర్బంధతలు బయటపడుతున్నాయి. ఇది నన్ను విచారానికి గురి చేస్తోంది.
సద్గురు: మీలో నిర్బంధతలు ఉన్నప్పటికీ, మీరు సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. ఎలాగూ నిర్బంధతలు ఉన్నాయి. వాటి వల్ల విచారానికి గురైతే, అప్పుడిక సమస్యలు రెండు అవుతాయి- నిర్బంధతలు ఇంకా విచారం. ఇప్పటికే ఒక సమస్య ఉంది, మరొక దాన్ని సృష్టించకండి. కనీసం మీకు ఒక్కటే సమస్య ఉన్నప్పుడు, దాంతో వ్యవహరించటం సులువుగా ఉంటుంది.విచారించడం అనేది ఆహ్లాదకరమైన స్థితి కాదు. మేము ఎప్పుడూ ఆనందం గురించి, ప్రేమ గురించి మాట్లాడేది ఎందుకంటే, మీ ఆలోచనల్ని, మనోభావాలను ఆహ్లాదకరంగా ఉంచుకోవడం కోసమే. ఇవి ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు, మీరు ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు, అప్పుడు మీతో చాలా పనులు చేయించగలం. కానీ మీ ఆలోచనలు, భావోద్వేగాలు ఆహ్లాదంగా లేనప్పుడు, మీరు కఠినంగా మారతారు; అప్పుడు మిమ్మల్ని ఏమీ చేయలేం. మీరు ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు, మీరు మారడానికి సుముఖంగా ఉంటారు. మీరు ఆహ్లాదకరంగా లేనప్పుడు, మీరు ఎవరినీ దగ్గరకు రానివ్వరు.
మీ నిర్బంధతలను ఆనందంతో చూడండి
మీకున్న నిర్బంధతల కంటే, వాటి పట్ల విచారం మరింత పెద్ద సమస్య. ఇది మరింత పెద్ద సమస్య, ఎందుకంటే అప్పుడిక మీరు ఎవరినీ దగ్గరకు రానివ్వరు, మిమ్మల్ని మార్చలేం, మీకు సహాయం చేయలేం. మీలో ఎంత చెత్త ఉన్నా, ముందు ఆనందంగా, ప్రేమగా ఉండటం నేర్చుకోవాలి. మీలో చాలా నిర్బంధతలు ఉన్నాయి- వాటిని ఆనందంగా చూడటం నేర్చుకోండి. అప్పుడు మీతో పని చేయడం, మీకు సహాయపడటం, మీ దగ్గరికి చేరుకోవడం-మీ ఇష్టాయిష్టాలకు అతీతంగా పనులు చేయడం సులభమవుతుంది. మీ ఇష్టాయిష్టాలే అత్యంత మౌలికమైన నిర్బంధతలు. వీటి నుండి మిమ్మల్ని బయట పడేయాలంటే, మీరు ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకు భిన్నమైన స్థితిలో మీరు ఉంటే, మీ చేత మీకు ఇష్టం లేని పనులు చేయించలేం. మీకు నచ్చిన పనులు మాత్రమే చేస్తారు. ప్రజలు ఎంత విచారంగా ఉంటే, అంత ఎక్కువగా "నేను ఇలాగే ఉంటాను, ఇదే నా స్వభావం!" అని పట్టుబడతారు. సంతోషంగా ఉన్న వ్యక్తులు ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. వారితో డాన్స్ చేయించవచ్చు, వారు ఏడ్చేలా చేయొచ్చు, వారిచేత గంతులు వేయించవచ్చు, తమాషా పనులు చేయించవచ్చు, వారితో ప్రాకులాడించ వచ్చు; సంతోషంగా ఉన్నప్పుడు వారు అన్నీ చేస్తారు. వాళ్ళు మృదువుగా ఉంటారు.
మీ మృదుత్వాన్ని కోల్పోకండి. అది అత్యంత ముఖ్యమైనది. ఆలోచనల్లో గాని, భావోద్వేగాల్లో గాని ఆహ్లాదం కరువైతే మృదువుగా ఉండడం అనేది సాధ్యం కాదు. ఈ కారణంగానే ఆనందంగా, ప్రేమగా, ప్రశాంతంగా ఉండటం ముఖ్యం- ఎందుకంటే మీలో చాలా నిర్బంధతలు ఉన్నాయి.
కర్మ దుంపలు
కర్మ అనేది బంగాళాదుంపల మూట లాంటిది. ఈ నిర్బంధతలను ఎంత లోతుగా పాతిపెడితే, అవి అంత బాగా పెరుగుతాయి. సాధన అంటే వాటిని పీకి, మళ్ళీ మొలకెత్తకుండా ఎండబెట్టడం. మీరు కొంతకాలం పాటు తీక్షణమైన సాధన చేస్తే, మీరు ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు, మీకున్న చిన్న చిన్న నిర్బంధతలు ఎన్నో పోవడాన్ని మీరు గమనిస్తారు. అయితే మీరు పీకాల్సిన బంగాళాదుంపలు ఇంకా చాలా ఉంటాయి. ప్రతిరోజూ వాటిని పీకి, ఎండబెట్టాలి, ఎంతగా అంటే అవి మళ్ళీ మొలకెత్తకూడదు.
ఒకే బంగాళాదుంప లక్ష దుంపలుగా మారితే, అది మామూలు బంగాళాదుంప కాదు అనే కదా. మీరు ఒక ఐదు నిమిషాల పాటు దేన్నైనా తీవ్రంగా అనుభూతి చెందారనుకుందాం - అది నొప్పి కానివ్వండి, భయం కానివ్వండి, బాధాకరమైన ఘటన లేదా అసహ్యకరమైన విషయం కావచ్చు. ఈ ఐదు నిమిషాల బంగాళదుంపలు, పెరిగి పెరిగి మీ జీవితాన్నంతటినీ శాసించే స్థాయికి చేరుతాయి. మీరెక్కడికి వెళ్ళినా, దాని గురించే మాట్లాడతారు, ఆలోచిస్తారు. మీరు వాటిని పాతిపెట్టారు కాబట్టి అవి పెరుగుతాయి. అవి లక్షలకొద్దీ ఒకే అసహ్యకరమైన బంగాళాదుంపలుగా మారతాయి. అలాకాక మీరు ఈ బంగాళాదుంపను ఎండబెట్టితే, అది మంచి అనుభవం అవుతుంది. మీరు ఎంత చెడ్డ అనుభవం పొందినా, అది మంచి అనుభవమే అవుతుంది. ఎందుకంటే జీవితంలో చెడ్డకాలం ద్వారా మీరు నేర్చుకున్నది అమూల్యమైనది. కేవలం మూర్ఖులే వాటిని మరచిపోవాలనుకుంటారు. మీరు తెలివైన వారైతే, ఏ చెడ్డ అనుభవాన్నైనా - ద్వేషం లేదా కోపం లేకుండా - గుర్తుంచుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు మళ్ళీ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళరు.
మనం బంగాళాదుంపల్ని వదిలించుకోవాలనుకోవట్లేదు; మనం వాటిని పీకి మళ్ళీ మొలకెత్తకుండా ఎండబెట్టాలని మాత్రమే అనుకుంటున్నాం. బంగాళాదుంపలను భద్రపరచుకోవాలి; లేకపోతే మనం మళ్ళీ మూర్ఖులుగా మారి, అవే పనులు మళ్ళీ మళ్ళీ చేస్తాం. జీవిత అనుభవాల నుంచి నేర్చుకున్న అమూల్యమైన వాటిని పక్కన పడేయకూడదు. కానీ దాన్ని మీలో పెరగనిస్తే, అది మీ జీవితాన్ని విషతుల్యం చేస్తుంది. మీకు జ్ఞానాన్ని ప్రసాదించేది కర్మ లేదా అనుభవాల జ్ఞాపకం ఒక్కటే! కానీ మిమ్మల్ని బంధించగలిగేది కూడా అది ఒక్కటే. అది మీ జీవితాన్ని ఎంత తీవ్రంగా విషపూరితం చేయగలదంటే, అది మిమ్మల్ని నాశనం చేయగలదు. కాబట్టి, కర్మ సమస్య కాదు; మీరు దాన్ని ఎలా నిర్వహిస్తున్నారు అనేదే సమస్య.