భారీ స్థాయిలో మీరు పోగు చేసుకున్న కర్మతో వ్యవహరించడం
@మనం మన చుట్టూ భారీ స్థాయిలో కర్మని ఎలా పోగు చేసుకుంటామో, దాన్ని కూలగొట్టడానికి ఏం చేయాలో సద్గురు వివరిస్తున్నారు
శంకరన్ పిళ్ళై ముందు రెండే మార్గాలు ఉన్నాయి- లేచి నిలబడి తన సీటు ఆవిడకి ఇవ్వడం, లేదా కూర్చొనే ఉండడం. కానీ చాలామంది వివిధ రకాల పరిస్థితులను తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, ఈ తప్పించుకోవడమే చాలా పెద్ద కర్మ అని వాళ్ళు గ్రహించరు. ఏదైనా విషయంలో పాల్గొనకుండా తప్పించుకోవాలని ప్రయత్నించినప్పుడు, కర్మ రెట్టింపు అవుతుంది. "నేను సీటు ఇవ్వాలా? వద్దా?" అని మనసులో ఆలోచనలు చేయడం అనేది మరింత పెద్ద కర్మ.
మరి ఈ ‘చిక్కుకుపోవడం - దూరంగా ఉండడం’ అనే పరిస్థితి నుండి బయటపడేది ఎలా? ఈ ప్రశ్న చాలామందిని గందరగోళానికి గురి చేస్తుంది. గందరగోళంలో ఉన్నప్పుడు, మీ చుట్టూ ఉన్నవన్నీ మీకు అంటుకుంటాయి! మీ శరీరం అంతా బలమైన జిగురుతో పూత పూసి ఉన్నప్పుడు, దుమ్మంతా మీకు అంటుకున్నట్టు. కర్మ పోగవడం అనేదానికి, మంచి-చెడు పనులు చేయడంతో సంబంధం లేదు. మీరు మీ గందరగోళమైన ఆలోచనలు, పరిమితమైన కోరికలతో కర్మను పెంచుకుంటారు. కొంతకాలానికి, మీ చుట్టూ ఎంత భారీగా కర్మ పోగవుతుందంటే, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది.
ఈ భారీ కర్మ రాశిని ఎలా తొలగించుకోవాలి? దానికి సమాధానం చాలా తేలిక: దాన్ని తొలగించే ప్రయత్నం చేయకండి. కేవలం జిగురుని కడిగివేయండి. ఆ రాశి అంతా క్షణంలో కూలిపోతుంది. మరి ఈ జిగురు ఎలా తొలగిపోతుంది? తప్పించుకోవడం ద్వారా కాదు, ఎరుకతో నిమగ్నమవడం ద్వారా. ఇలా ఎరుకతో నిమగ్నమైనప్పుడు, మళ్ళీ ఇక చిక్కుకుపోయే అవకాశమే ఉండదు.
మానవ కోరిక పరిమితమైనది కావచ్చు లేదా అపరిమితమైనది కావచ్చు. మీరు అపరిమిత కోరికను ఎంచుకుంటే, అదే కర్మకి ముగింపు. లేదా, మీరు మీ ఇష్టాయిష్టాలకు, “ఇది నాది” “ఇది నాది కాదు” అనే సంకుచిత భావనలకు అతీతంగా ఎదిగితే, అదే కర్మకి ముగింపు. మీ కోరికను విశ్వవ్యాప్తం చేసుకోండి, అన్నింటినీ మీవిగా చేసుకోండి, ప్రపంచానికి తల్లిలా మారండి, అప్పుడు చిక్కుకుపోయే అవకాశం ఇక ఉండనే ఉండదు.
ఆధ్యాత్మిక మార్గం యొక్క అంతిమ లక్ష్యం అన్నిటిపట్లా అదే నిమగ్నత ఇంకా అచంచలమైన ధ్యాస. మీరు దేనిలో నిమగ్నం అవుతారు లేదా దేనిపై ధ్యాస పెడతారు అన్నది ముఖ్యం కాదు: అది దేవుడు కావచ్చు, రాయి కావచ్చు, స్త్రీ లేదా పురుషుడు కావచ్చు. ధ్యాస పెట్టే వస్తువు ముఖ్యం కాదు. యోగ సంప్రదాయంలోని ఆకాశ ముద్ర సాధన, ఏమీ లేని శూన్యంపై ధ్యాస పెట్టమంటుంది; అది కేవలం శూన్యంపై అచంచలమైన ధ్యాస సారించటం. ముక్తి అనేది మీరు ధ్యాస పెట్టే వస్తువుపై కాకుండా, ఆ ధ్యాస పైనే ఆధారపడి ఉంటుందన్నది దీని ప్రాతిపదిక.
ఏ ప్రత్యేక ఉద్దేశం లేదా లక్ష్యం లేకుండా పూర్తి నిమగ్నతతో ఉండడమే యోగ సాంప్రదాయం యొక్క సారాంశం. కానీ కాలక్రమేణా, దీన్ని ఒంటరిగా ఉండటం అని అపార్థం చేసుకోవడం ప్రారంభించారు. నిమగ్నతను చిక్కుకుపోవడం గానూ, వైరాగ్యాన్ని పట్టించుకుపోవడం గానూ ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. శంకరన్ పిళ్ళై ఆ బస్సులో తెలుసుకున్నట్లుగా, ఎవరి నుంచైనా తప్పించుకోవడానికి కూడా చాలా నిమగ్నత అవసరం అని వాళ్ళు మరచిపోయారు.
జీవితం అనేదే ఏ ఉద్దేశమూ లేని ప్రక్రియ కాబట్టి, ఆ ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమవడం ద్వారానే జీవితపు సారాన్ని అనుభూతి చెందగలం. ప్రక్రియే అసలు ఉద్దేశం; లక్ష్యం కేవలం ఒక పర్యవసానం. విషయాలను సులభతరం చేయడానికే ఎన్నో ప్రాచీన సంప్రదాయాలు "భక్తి" గురించి మాట్లాడాయి.
‘భక్తి’ అంటే అది భావగర్భితం అవ్వడం కాదు. నిజమైన భక్తి అనే అగ్ని మీలో ప్రజ్వలిస్తే, అది అన్నింటినీ దహించివేస్తుంది. లక్ష్యం ఏమిటనే చింత లేకుండా, మీరు ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమయ్యేలా చేస్తుంది. మీకు ముక్తిని అందించేది, అన్నిటినీ అక్కున చేర్చుకొనే ఆ ప్రయాణమే గాని, చేరుకునే గమ్యస్థానం కాదు. వేరుగా చూడడం ద్వారా, మీరు బందీలవుతారు. అక్కున చేర్చుకోవడంలో, మీరు విముక్తులవుతారు.
సంపాదకుని గమనిక: : కర్మ అనేది చాలామందికి మాయ లాంటిదని, ఇంకా క్రియలు, ప్రాణాయామాలు సూక్ష్మ శరీరాన్ని బలపరచి, కర్మ నుండి దూరం చేసే ప్రక్రియలని సద్గురు వివరిస్తున్నారు. వ్యాసాన్ని చదవండి..
ఈ వ్యాసం మొదట స్పీకింగ్ ట్రీలో ప్రచురించబడింది.