ప్రశ్న: ప్రణామాలు సద్గురు. జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన సంఘటన కర్మ ఆధారంగా జరుగుతుందా, లేదా ఇతర పరిస్థితుల ప్రభావం వల్లనా?

సద్గురు: ఇక్కడ రెండు కర్మలున్నాయి. వ్యక్తిగత కర్మ, అదే విధంగా సమిష్టి కర్మ. ఓ కుటుంబ పరంగా, ఓ సమాజంలో భాగంగా, ఒక దేశంగా... అన్నింటికీ మించి మానవాళిగా, మనమంతా కర్మ స్మృతుల్ని పంచుకుంటూ ఉంటాం. బహుశా మనం, ఏమీ చేసి ఉండకపోవచ్చు. కానీ మన సమాజం కొన్ని పనులను నిర్వహించి ఉండవచ్చు. వీటి పరిణామాలు ఉంటాయి. కర్మను ఒక బహుమానంగానో, లేదా శిక్షగానో అర్థం చేసుకోకూడదు. ఇది జీవితానికి మూలం. స్మృతి లేకుండా జీవితం లేదు. ఈ స్మృతి అన్నది లేకుండా అమీబా నుంచి మనిషి వరకూ దేనినీ సృష్టించడానికి ఆస్కారమే లేదు. జీవితం తయారుకావడానికి స్మృతి అవసరం. కర్మ జీవిత స్మృతి. ఏక కణ జీవుల నుంచి ప్రతి జీవి యొక్క భౌతిక నిర్మాణము స్మృతి వల్లే సాధ్యమైంది. సామాజిక అంశాలు లేదా ప్రపంచలో నెలకొన్న వివిధ వాస్తవిక అంశాల ద్వారా పరిస్థితులు సంభవిస్తాయి. తాముచేయని ఎన్నో సంఘటనల కారణంగా మనుషులు మరణిస్తున్న లక్షలాది  సందర్భాలు ఉన్నాయి. తమ చుట్టూ జరుగుతున్నదానిలో వారికి ఏ ప్రమేయం లేకపోయినా, ఎంతో మంది ప్రజలు వివిధ స్థాయిల్లో కష్టాలు, బాధలను ఎదుర్కొంటూనే ఉన్నారు. కాని వారు ఆ పరిస్థితుల్లో చిక్కుకుని ఉన్నారు కదా. ఇదే వారి కర్మ.

మీరు ఓ రాజ భవనంలో పుట్టినప్పటికీ, కష్టాలు కలిగించేదిగా మీ కర్మ ఉండి ఉండొచ్చు.
ఇది ‘నా తప్పా...? నేను దీన్ని చేయలేదే... ఇది నాకెందుకు జరుగుతోంది’ అని మీరు  అనుకుంటున్నారు. కర్మ అలాంటిది కాదు. కర్మ అనేది ఒక జ్ఞాపకశక్తి వ్యవస్థ లాంటిది. ఈ స్మృతి లేకుండా, ఏ విధమైన నిర్మాణమూ ఉండదు. అన్ని నిర్మాణాలు, ప్రత్యేకించి జీవితం యొక్క నిర్మాణాలు పునరావృతం అయ్యేది కేవలం ప్రతి జీవిలో భద్రమైన జ్ఞాపకాల భండాగారం ఉండడంవల్లే. ఉదాహరణకు మీకు  స్మృతిలో లేనిదేదో జరిగింది అనుకుందాము. కాని మీ చుట్టూ ఉన్న సమాజానికి స్మృతులు ఉన్నాయి, వాటి మూలంగా మీ జీవితంలో ఏవో జరుగుతూ ఉంటాయి. ఈ ప్రపంచానికి ఓ స్మతి ఉంది, వాటి మూలంగా మీ జీవితంలో ఏవో జరుగుతూ ఉంటాయి. అంతే కాకుండా మీ చుట్టూ జరుగుతున్నవి మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ నగరంలో కాలుష్యం ఉంది. అందుకు నేను చేసిందేమీ లేదు, కానీ నేను అక్కడ ఉంటే ఆ విషవాయువును పీలుస్తూ ఉండాలి. నేను, కార్బన్ డై ఆక్సైడ్ పీలుస్తున్నాను. బహుశా కార్బన్ మొనాక్సైడ్ ఏమో కూడా. నేను ఏ చెడ్డ కర్మా చేయలేదు. నిజానికి నేను చాలా చెట్లను నాటాను. కాని ఏం చేయాలి ? మీరు ఒకసారి ఈ నగరానికి వచ్చారంటే, మీరు ఖచ్చితంగా ఇలాంటి గాలే పీల్చాలి. మరి దీనికి ఏమైనా మూల్యం ఉంటుందా? ఉంటుంది. నేను చాలా కాలంగా ఇక్కడే ఉండిపోతే, కచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు.

కర్మ ఎలా ఉన్నా మీ అనుభూతి మీ చేతుల్లోనే ఉంది

మీ వ్యక్తిగత కర్మ ఏదైనప్పటికీ, సమిష్టి కర్మ కూడా ఉంటుంది. ప్రపంచంలో మీ అనుభవం ఎలా ఉందనేది, మీ కర్మ ద్వారా నిర్ణయమౌతుంది. అంతేకాని మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు, మీరు ఏమి చేస్తున్నారు అనేది, మీ కర్మ నిర్ణయించదు. మీరు ఓ రాజ భవనంలో పుట్టినప్పటికీ, కష్టాలు కలిగించేదిగా మీ కర్మ ఉండి ఉండొచ్చు. మీరు మురికివాడల్లో జన్మించిన వారై ఉండొచ్చు, కానీ మీ కర్మ సంతోషకరమైనది కావడం వల్ల మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే వ్యక్తి అయ్యి ఉండవచ్చు. గత కర్మ మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన, మీరు పూర్తిగా ఇప్పటికిప్పుడే మార్చలేని పర్యవసానాలను ఏర్పరచింది. వాటిని మార్చాలంటే, దానికై కృషి చేయాలి. ఒక పరిస్థితికి, మీరు మాత్రమే కాదు, అనేక అంశాలు ఉంటాయి. కాని మీ కర్మను తక్షణం మార్పు చేయవచ్చు. తక్షణం మార్చుకోగలరు అంటే, దానర్థం మీరు జీవితాన్ని అనుభూతి చెందే తీరును తక్షణం మార్చుకోవడమే. దీనిలో మీ ఒక్కరి ప్రమేయమే ఉంది, మీ సుముఖత ఉంటే, ఖచ్చితంగా దీన్ని మీరు మార్చవచ్చు. కానీ మీరు, నేను సిద్ధంగా ఉన్నంత మాత్రాన, ప్రపంచం ఇప్పటికిప్పుడు  మారడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. సమిష్టి కర్మ కొన్ని బాహ్య పరిణామాలను కలిగించవచ్చు, కానీ మీ జీవితాన్ని ఎలా అనుభూతి చెందుతారనేది మాత్రం ఇప్పటికీ మీ చేతుల్లోనే ఉంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు