ఒత్తిడి అనేది పని వలన కాదని మన వ్యవస్థను ఎలా నిర్వహించుకోవాలో మనకు తెలియకపోవడం వలన అని సద్గురు అంటున్నారు. ఎంత ఆహారం తినాలి, ఎంత సేపు నిద్రపోవాలి అనే ప్రశ్నలకు సద్గురు సమాధానం ఇస్తున్నారు.

Sadhguruమీరు నిద్రలేచినపుడు తాజాగా ఉంటే అది మంచి ప్రారంభం. కానీ పగలు గడుస్తున్న కొద్దీ, మీ విశ్రాంతి స్థాయి తగ్గుతున్న కొద్దీ, మీరు క్రమంగా ఒత్తిడిని అనుభూతి చెందుతుంటారు. ఈ ఒత్తిడి పనివల్ల కాదన్నది గుర్తుంచుకోవడం ముఖ్యం. ప్రతి ఒక్కరూ తమ ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నది అని అనుకుంటారు. ఏపనీ ఒత్తిడితో కూడుకున్నది కాదు. కొన్ని ఉద్యోగాలు సవాలు చేసే సందర్భాలని సృష్టిస్తాయి: అక్కడ చిరాకు పెట్టే అధికారి ఉండవచ్చు, అభద్రత కలిగించే సహోద్యోగులుండవచ్చు, అత్యవసర సేవలు చెయ్యవలసిన గదులుండవచ్చు, అందుకోలేని కాల నియమాలుండవచ్చు, లేదా మీరు యుద్ధ వాతావరణంలో చిక్కుకోవచ్చు. కానీ, ఇవన్నీ అంతర్గతంగా ఒత్తిడి కలిగించేవి కావు. అటువంటి పరిస్థితికి మనం ప్రతిస్పందించే నిర్బంధతే మనకి ఒత్తిడి కలిగిస్తుంది. ఒత్తిడి అన్నది మన లోపల కలిగే ఒక మాదిరి రాపిడి. దానికి కొంత స్పృహతో పనిచేస్తూ లోపలి యంత్ర రచనలో కలిగే రాపిడిని నివారించవచ్చు. కనుక మన వ్యవస్థను ఎలా నిర్వహించుకోవాలో మనకు తెలియని విధానమే ఈ ఒత్తిడి కలిగిస్తోందని తెలుసుకోవడం ముఖ్యం. ఎదో ఒక స్థాయిలో, మన శరీరాన్నీ, మనసునీ, భావాలనీ నియంత్రించుకోవడం మనకి తెలియటం లేదు. అదే అసలు సమస్య.

అటువంటపుడు, అది పగలైనా సాయంత్రమైనా, ఉత్సాహమూ, విశ్రాంతీ, ఆనందమూ ఒకే స్థాయిలో ఉండగలిగేలా మన వ్యవస్థని ఒత్తిడిలేకుండా ఉంచుకోవడం ఎలా? ఒక సాధారణ వ్యక్తి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తన నాడి నిముషానికి 70 నుండి 80 మధ్య కొట్టుకుంటుంది. సరియైన క్రమంలో ధ్యాన సాధన చేసే వ్యక్తికి నాడి 30 నుండి 40 మధ్య కొట్టుకుంటుంది. మధ్యాహ్నం బాగా సుష్టుగా భోజనం చేసిన తర్వాత కూడా అది 50 లలోనే అదుపులో ఉంటుంది. ఇది మీ శరీరం ఏ మేరకి క్షణక్షణమూ ఒత్తిడి అనుభవిస్తోందో తెలుసుకోవడానికి ఒక ప్రమాణము.

మీ పనీ, నడక, వ్యాయామం కూడా మీకు విశ్రాంతి కలిగించగలిగితే, మీ నిద్ర సమయం ఎంతో గణనీయంగా తగ్గుతుంది.

మీ పనిని తగ్గించుకోవడం ద్వారా మీ వ్యవస్థ వేగాన్ని తగ్గించడానికి ప్రయత్నించకూడదు. మీరు చెయ్యవలసింది, మీ పని భారం ప్రభావం వ్యవస్థ మీద పడకుండా చూసుకోవడం. మీరు భౌతికంగా అలసిపోయి ఉండవచ్చు, కానీ, అది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయకూడదు. మీరు చురుకుగా పనిచెయ్యగలుగుతూనే, ఏ రకమైన ఒత్తిడీ లేకుండా ప్రశాంతంగా ఉండగలిగితే, అది ఎంతో లాభదాయకం. మీరు కొన్ని అతిసామాన్యమైన యోగాభ్యాసాలు సాధన చేస్తే, మూడు నాలుగు నెలలో మీ నాడి కొట్టుకోవడంలో 8 నుండి 20 వరకూ తేలికగా తగ్గుతుంది. అంటే మీ శరీరం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తూ, దానితో పాటే ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతోందని అర్థం.

శరీరానికి కావలసింది నిద్రకాదు, విశ్రాంతి. మీరు శరీరాన్ని పగలల్లా విశ్రాంతిగా ఉంచగలిగితే, సహజంగా మీరు నిద్రపోయే సమయం తగ్గు ముఖం పడుతుంది. మీ పనీ, నడక, వ్యాయామం కూడా మీకు విశ్రాంతి కలిగించగలిగితే, మీ నిద్ర సమయం ఎంతో గణనీయంగా తగ్గుతుంది. ఇప్పుడు ప్రతివారూ ఎలాగైనా ప్రతిపనీ కష్టపడి చేయాలనుకుంటున్నారు. పార్కుల్లో నడిచేవాళ్ళు ఎంతో ఒత్తిడితో ఉండడం గమనిస్తున్నాను. మీరు నడిచినా, గెంతినా, అది సులభంగానూ, సంతోషంగానూ ఉండేలా ఎందుకు చేయకూడదు? ఈ ఒత్తిడిలో చేసే వ్యాయామం మీకు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తోంది, ఎందుకంటే మీరు ఆ పని యుద్ధానికి వెళుతున్నట్టు చేస్తున్నారు.

ఈ రోజు ఎంత తినాలో, ఎంత సేపు నిద్రపోవాలో అన్నది మనం కాకుండా మన శరీరం నిర్ణయించాలి.

జీవితంతో యుద్ధం చేయవద్దు. మీరు జీవితానికి వ్యతిరేకి కాదు. మీరే జీవితం. జీవితంతో శ్రుతిలో ఉండడానికి ప్రయత్నించండి, అపుడు జీవితం సాఫీగా గడిచిపోతుంది. మిమ్మల్ని మీరు దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం ఒక యుద్ధం కాదు. మీరు ఏ పని చేస్తే ఆనందం కలుగుతుందో అది చేయడానికి ప్రయత్నించండి - ఆట ఆడడమో, ఈత కొట్టడమో, నడవడమో, పరిగెత్తడమో ఏదయినా ఫర్వాలేదు. మీకు ఏ పనీ చేయకుండా రోజల్లా జున్ను తినడం ఇష్టమైతే తప్ప. అప్పుడు సమస్య వస్తుంది. లేనపుడు ఏకకాలంలో చురుకుగా ఉండడానికీ అదే సమయంలో హాయిగా విశ్రాంతిని అనుభూతి చెందడానికి మధ్య ఎటువంటి వైరుధ్యం లేదు.

మీ శరీరానికి ఎంత నిద్ర కావాలి? అది మీరు చేసే శారీరక శ్రమను బట్టి ఉంటుంది. నిద్రకీ, భోజనానికి పరిమితులు నిర్దేశించవలసిన పనిలేదు. మీరు ఎన్ని కేలరీలు తినాలో, ఎన్ని గంటలు నిద్రపోవాలో, నిర్ణయించుకుని అలా నడుచుకోవడం జీవితాన్ని నిర్వహించవలసిన పద్ధతి కాదు. ఈ రోజు ఎంత తినాలో, ఎంత సేపు నిద్రపోవాలో అన్నది మనం కాకుండా మన శరీరం నిర్ణయించాలి. ఈ రోజు మీరు చురుకుగా పని చేసిన సమయం తక్కువ కాబట్టి తక్కువ తింటారు. రేఫు మీరు ఎక్కువ పని చేస్తారు, కనుక ఎక్కువ తింటారు. నిద్ర విషయంలోనూ అంతే, శరీరానికి తగినంత విశ్రాంతి దొరికితే దానంతట అదే నిద్ర లేస్తుంది, అది ఉదయం మూడు గంటలయినా, నాలుగు గంటలయినా, ఎనిమిది గంటలయినా. ఆహారం, నిద్ర విషయాలలో ఏది ఎంత కావాలో మీ కంటే, మీ శరీరం మెరుగైన తీర్పు చెప్పగలదు.

శరీరం ఒకస్థాయి చురుకుదనంలో, స్పృహతో పనిచేయడం మొదలుపెట్టినపుడు, ఒకసారి దానికి విశ్రాంతి ఇవ్వగానే అది తిరిగి అదే స్థాయిలో పని చేయడానికి మేల్కుంటుంది. దానికి బదులు  అది శయ్యని సమాధిలా ఉపయోగించదలుచుకుంటేనే వస్తుంది సమస్య. మీరు మీ శరీరాన్ని ఎలా తీర్చిదిద్దాలంటే, అది జీవితాన్ని వదిలించుకోవడానికో, జీవితం నుండి పారిపోడానికో ప్రయత్నించకూడదు. అది తిరిగి చైతన్యంలోకి రావడానికి ఉత్సాహంగా ఉండాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు