విషయ సూచిక
1. ఇంట్లో తాగు నీటిని నిల్వ చేయడం ఎలా?
2. నీటిని సరైన పద్ధతిలో సేవించడం ఎలా?
   2.1. నీటిని గౌరవించండి
   2.2. నీటిని చేతులతో త్రాగండి
   2.3. సరైన ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని త్రాగండి
   2.4. ఎంత నీరు త్రాగాలి?
   2.5. నీటిని తినండి.
3. రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని త్రాగడం వల్ల కలిగే లాభాలు

1. ఇంట్లో తాగు నీటిని నిల్వ చేయడం ఎలా?

సద్గురు:: తాగునీటి విషయంలో మీరు తగు జాగ్రతలు తీసుకోవాలి. కేవలం స్వచ్ఛత, సూక్ష్మక్రిమి నివారణ మాత్రం చూసుకుంటే సరిపోదు. నీటిని ఎలా ఉంచుతారు, ఎలా అందుకుంటారు అన్నది కూడా చాలా ముఖ్యం. ఎటువంటి రసాయనిక మార్పు లేకుండా నీటి అణునిర్మాణాన్ని ఒక ఆలోచన, భావన, స్పర్శ ద్వారా మార్చగలమని, తద్వారా నీరు మన శరీరంలో ప్రవర్తించే తీరును మార్చవచ్చని రుజువు చేయడానికి ఈరోజు గణనీయమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. నీరు అమృతమౌతుందా లేదా విషమౌతుందా అన్నది దాని ధారణ మీద ఆధారపడి ఉంటుంది.  

ఈ పదార్థం మీద మీ జీవితం ఆధారపడి ఉంది కనుక నీటిని తాగే ముందు ఒక్క క్షణం భక్తి భావాన్ని, కృతజ్ఞతనీ వ్యక్తపరచండి.

కొన్ని సక్రమంగా జరగకపోవడం వల్ల జీవితం అస్తవ్యస్తమౌతుంది. అందుకే నీటి విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.

దైనందిన జీవితంలో నీటిని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడానికి యోగ సంస్కృతిలో ఎన్నో విధి విధానాలు ఉన్నాయి. సంప్రదాయకంగా కొన్ని విధానాలు ఎరుకతో పాటించేవారు, పూర్వాచారపరాయణులు కొందరు వాటి ప్రాముఖ్యత తెలియకుండానే ఈనాటికీ సరైన పద్ధతులు పాటిస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా మీరు ఒక సంప్రదాయ బద్ధమైన దక్షిణ భారత గృహానికి వెళ్లినట్లైతే, నీటిని ఒక నిర్ణీత పద్ధతిలో నిల్వచేయడం మీరు గమనించవచ్చు. నీటిని రాగి లేదా ఇత్తడి లేదా మరేదైనా రాగి మిశ్రమ లోహంతో తయారు చేయబడిన పాత్రలో ఉంచుతారు. ఈరోజుల్లో చాలా మంది ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ తో తయారు చేయబడిన శుద్ధిచేయు యంత్రాలను వినియోగిస్తున్నారు కానీ, ఆ రోజుల్లో అందరూ రాగి పాత్రను రాత్రి కాస్త చింతపండు, పసుపుతో శుభ్రం చేసి, దానికి విభూతి రాసి, అందులో నీటిని నింపి, పైన ఒక పువ్వు పెట్టి, పక్కన ఒక ప్రమిదను వెలిగించి నిద్రకు ఉపక్రమించేవారు. ఉదయం లేవగానే ఆ నీటిని సేవించేవారు. ఆ నీరు శరీరానికి అత్యంత శ్రేష్టమైనది.

 

1. నీటిపట్ల పూజ్యభావంతో ఉండడం

పూర్వకాలంలో భారత దేశంలో నీటికి నమస్కరించకుండా ఎవ్వరూ త్రాగేవారు కాదు. ఎందుకంటే నీరు మీలో ఎలా ప్రవర్తిస్తుంది అనేది మీరు నీటిని ఎలా ఆదరిస్తారు అనేదాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి నీటి బొట్టులో ఉండే ధారణాశక్తి, విజ్ఞానమూ ప్రత్యేకంగా దానికే సంబంధించినవి. నీరు ఒక్కొక్కరినీ ప్రభావితం చేసే తీరు వేరుగా ఉంటుంది. ఒకటే పదార్ధం అయినప్పటికీ అందరిలోనూ ఒకే విధంగా ప్రవర్తించదు.

నీటిని తాగే ముందు ఒక్క క్షణం భక్తిభావంతో కృతజ్ఞత తెలపండి. ఈ పదార్థం వల్లనే మీరు జీవించి ఉండగలుగుతున్నారు. నీరు లేకపోతే మీరు బ్రతకలేరు. అందువల్ల మీ జీవనాధారమైన నీటికి నమస్కరించండి. పంచభూతాలను సరిగా గౌరవించినట్లైతే, ఏదో అంటువ్యాధి సోకితే తప్ప వైద్యుణ్ణి కలవాల్సిన అవసరం చాలా వరకు ఏర్పడదు.

2. నీటిని మీ చేతులతో త్రాగండి

నీటిని చేతులతో తాగడం అత్యుత్తమమైన పద్ధతి. ఒకవేళ అది వీలుపడకపోతే, మీకు ఎవరైనా నీటిని లోహపు చెంబులో ఇస్తే దాన్ని ఎప్పుడూ మీ రెండు చేతులతో పట్టుకొని తాగండి. మీరు ఎప్పుడైనా చూసారా? భారతదేశంలో గ్రామస్థులు ఇప్పటికీ అలాగే చేస్తారు. నీటిని తాగే ముందు దాన్ని తాకడం చాలా ముఖ్యం. కాసేపు పట్టుకుని తర్వాత త్రాగాలి. అప్పుడది మన శరీరాన్ని వేరేలా ప్రభావితం చేస్తుంది.

3. సరైన ఉష్ణోగ్రతలో నీటిని త్రాగండి

ఈ రోజుల్లో చాలా మంది నీటి సీసాలో మూడోవంతు ఐసు ముక్కలు కలుపుకుని తాగుతున్నారు. యోగ సంప్రదాయంలో మీరు ముక్తి మార్గంలో ప్రవేశించడానికి, మరియు మీ శరీర వ్యవస్థను ఇహానికి అతీతంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ శరీర ఉష్ణోగ్రతకు నాలుగు డిగ్రీలు అటు ఇటుగా ఉన్న నీటిని మాత్రమే తాగాలి. సహజంగా మీ శరీర ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీలు ఉంటుంది. అంటే మీరు ముప్పై మూడు నుంచి నలభై ఒక్క డిగ్రీల మధ్యలో ఉన్న నీటిని మాత్రమే తాగాలి. మీరు విద్యార్థులైతే, విద్యనభ్యసించడమే మీ పనైతే, ఆధ్యాత్మికత మీ మార్గం కానట్లయితే, మీరు తాగే నీరు ఎనిమిది డిగ్రీలు అటు ఇటుగా ఉండవచ్చు. కానీ మీరు గృహస్థులైతే, అంటే ఆధ్యాత్మికాసక్తి లేకుండా, మీ జీవిత భాగస్వామినీ, పిల్లల్నీ చూసుకోవడమే మీ బాధ్యత అయినప్పుడు, మీరు తాగే నీటి ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీలు అటు ఇటుగా ఉండవచ్చు. అంతకు మించి ఎక్కువ లేదా తక్కువ ఉష్ణోగ్రత ఎవరికీ అనుకూలం కాదు.

నీరు ఒక పదార్థం కాదు, అది జీవితాన్ని నిలబెట్టే ద్రవ్యము

ఇది మీకు నచ్చకపోవచ్చు, కానీ చాలా ముఖ్యం. మనం తీసుకునే పదార్థం ఏదైనా మన శరీర ఉష్ణోగ్రత పరిధిలోనే ఉండాలి. లేదంటే శరీరంలో నీటి పనితీరుని అది అస్తవ్యస్తం చేస్తుంది. ఐస్ క్రీం ప్రేమికులు నన్ను ఎద్దేవా చేయవచ్చు గాక, కానీ నేను చెబుతున్నది అక్షరాలా నిజం.

4. ఎంత నీరు తాగాలి?

మీకు దాహం వేయకపోతే మీరు నీరు తాగకపోయినా పర్వాలేదు. ఈ రోజుల్లో చాలా మంది ఒక నీళ్ల సీసా పక్కన పెట్టుకొని ఎప్పుడూ కొంచెం కొంచెం నీటిని తాగుతూనే ఉంటారు. ఇది వ్యాపార సంస్థలు చేసిన మాయ. మీరు కొద్ది కొద్ది మొత్తాలలో ఎక్కువ సార్లు నీటిని తీసుకున్నప్పుడు శరీరం దాన్ని గ్రహిస్తుంది. కానీ మీరు ఎక్కువ మొత్తంలో నీరు ఒకేసారి తీసుకున్నప్పుడు, ఎంత గ్రహించాలి, ఎంత విసర్జించాలి అన్నది శరీరం నిర్ణయిస్తుంది. కానీ చిన్న మొత్తాలలో ఎక్కువ సార్లు నీటిని తాగినప్పుడు శరీరం మోసపోతుంది. అవసరానికన్నా ఎక్కువ నీటిని గ్రహించే అవకాశం ఉంది. అప్పుడు శరీరంలో సోడియం నిల్వలు పడిపోతాయి. దీనివల్ల మెదడు వాస్తుంది. మిగతా శరీరం కూడా ప్రభావితం అవుతుంది కానీ అది మనం గ్రహించేంతగా ఉండకపోవచ్చు. మెదడు వాపు అంటే మెదడు పెరుగుతోందని కాదు. ఇది ఒక రకమైన వ్యాధి. తగినంత సోడియం లేకపోవడం వల్ల మెదడుకి అవసరమైన సోడియంను అందించడానికి నీరు మెదడులో చేరుతుంది. దీనివల్ల మైకం కమ్మినట్లు ఉంటుంది, లేదా మానసిక అసమతుల్యతలు సంభవించే అవకాశం ఉంటుంది.

దాహం వేసినప్పుడే నీరు తాగాలి. మీకు అవసరమైన పరిమాణం కన్నా ఒక పది శాతం ఎక్కువే తాగండి. మీకు నీళ్ల సీసా మోసుకెళ్లే అలవాటు లేకపోతే కాస్త ఎక్కువ నీటిని తీసుకోవడం మంచిదే. మీకు దాహం వేసినప్పుడు ఒకవేళ కాస్త ఆలస్యమైనా అత్యవసర పరిస్థితి రాదు. కానీ దాహం వేసినప్పుడు నీరు తాగకపోవడం మీ శరీరానికి మంచిది కాదు. దాహం వేసినప్పుడు కనీసం అరగంట లోపు నీటిని తప్పకుండా తాగాలి. అప్పుడు శరీరం ఎంత తీసుకోవాలో ఎంత విసర్జించాలో నిర్ణయించుకుంటుంది.

5. నీటిని తినండి!

నీళ్ళు తాగడం మాత్రమే కాదు, నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లలో తొంబై శాతం నీరు ఉంటుంది. కూరగాయల్లో డెబ్భై శాతం పైనే నీరు ఉంటుంది. మీరు తినే ఆహారంలో కనీసం డెబ్భై శాతం నీరు ఉండాలి. నీటి శాతం తక్కువ ఉన్న ఆహారం తీసుకుంటే అది మీ పొట్టలో కాంక్రీటు లాగా అతుక్కుపోతుంది. పొడిగా ఉన్న ఆహారాన్ని తిని, తర్వాత నీరు తాగితే లాభం లేదు. ఆహారంలో కనీసం మన శరీరంలో ఉన్నంత నీటి శాతం ఉండాలి. అందుకే ఆహారంలో పళ్ళు, కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి. పళ్లలో అత్యధికంగా ఎనభై నుండి తొంభై శాతం నీరు ఉంటుంది. అందుకే పళ్ళు తినడం అత్యుత్తమం.

రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల కలిగే లాభాలు

నేనెప్పుడూ రాగి పాత్రలు వాడమని అందరికీ చెబుతూ ఉంటాను. రాగి మంచి శక్తి వాహకం. అది నీటిని శక్తివంతం చేస్తుంది. రసాయనిక మార్పులు ఏమీ లేకుండా నీటి అణునిర్మాణాన్ని మారుస్తుంది.

నీటిని రాత్రంతా లేదా కనీసం ఆరు గంటలు రాగి పాత్రలో ఉంచి, ఆ తర్వాత తాగితే ఆ నీరు చాలా భిన్నంగా రుచిస్తుంది. అంతే కాకుండా చిన్న చిన్న అస్వస్థతలు ఏవైనా ఉంటే నీటిని సరిగ్గా వినియోగించడం ద్వారా సరిచేసుకోవచ్చు. సరిగ్గా వినియోగించడం అంటే గాలి తగిలే చోట నిల్వ చేయడం, నీటి పట్ల పూజ్యభావన కలిగి ఉండటం, మరియు నీరు మనలో ఒక ముఖ్యమైన భాగం అని స్పృహతో ఉండటం. నీరు కేవలం ఒక పదార్థం మాత్రమే కాదు అది మన జీవనాధారం. కేవలం నీటిని ఉపయోగించే విధానాన్ని సరి చేసుకోవడం వల్ల అనేక మంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందడం నేను చూసాను.

సంపాదకుడి గమనిక:  

జీవరసం

జీవరసం అనేది అండాకారంలోని లోహపు కాప్స్యూలు. దీని చుట్టూ ఒక రాగి సర్పం చుట్టబడి ఉంటుంది. ఇందులో ఈశా యోగ కేంద్రంలోని ధ్యానలింగం వద్ద ప్రతిష్టీకరింపబడిన శక్తివంతమైన విభూతి నింపబడి ఉంటుంది. త్రాగునీటిలో దీన్ని ముంచితే ఆ నీటిని ఈ జీవరసం శక్తివంతం చేస్తుంది. తద్వారా ఎన్నో ఆరోగ్య సంబంధమైన శుభ ఫలితాలు పొందగలరు. జీవరసం Isha Life లో ఆన్లైన్ లో అందుబాటులో ఉంది.

నీటిని నిల్వ చేసుకునే రాగి పాత్రలు

మీ కుటుంబానికి సరిపడా నీటిని నిల్వ చేసుకునే రాగి పాత్రలు, ఐదు, ఎనిమిది, మరియు పది లీటర్ల పరిమాణంలో ఉన్నాయి. ఈశా లైఫ్ ఆన్లైన్ లో కొనుగోలు చేయగలరు.

రాగి వాటర్ బాటిల్స్

మీ తాగునీటి అవసరాలు తీర్చే అందమైన రాగి వాటర్ బాటిల్స్, చేతితో తయారు చేయబడినవి, నయన మనోహరంగా వివిధ ఆకృతులలో అందుబాటులో ఉన్నవి. Isha Life ఆన్లైన్ లో కొనుగోలు చేయగలరు.