‘వీరశైవం’ అన్నమాటకు వీరుడు, ధైర్యశాలి అయిన శివభక్తుడని అర్థం. వీరశైవులు తమ తత్త్వదర్శనంలో ఎల్లప్పుడూ నదులూ, సముద్ర సామ్యాన్ని వాడుతుంటారు.  శివుణ్ణి సముద్రంగాను, వ్యక్తులను నదులుగాను పోలుస్తారు. వాళ్లు చెప్పాలని ప్రయత్నిస్తున్నదేమిటంటే ప్రతినదీ సహజంగానే సముద్రంలోకి ప్రవహిస్తుంది. అది ఎంత మెలికలు తిరుగుతూ ప్రవహిస్తుందనేదే ప్రశ్న.

కానీ మనం, ఈతరం మనుషులం నదులు సముద్రంలోకి పోవలసిన అవసరం లేదని నిరురూపిస్తున్నాం. వాటిని మార్గ మధ్యంలోనే ఎండిపోయేలా చేసాం. మనది అటువంటి తరం. మన నదులు ఎండిపోతున్నాయంటే దానికి మన జీవనవిధానమే కారణం. దానికి కారణం మన జనాభాలో ఎక్కువమంది తమ అస్తిత్వ స్వభావాన్ని మరచిపోవడమే.

గంగా సింధు నదులు ఇప్పుడు భూమిపై అత్యంత ప్రమాదంలో పడిన నదుల జాబితాలో చేరాయి.

దేశం మొత్తం మీద, రాజస్థాన్ లో లవణావతి అన్న ఒక నది మాత్రమే సముద్రాన్ని చేరెది కాదు. ఎడారిలో మధ్యలోనే ఎండిపోతుంది. కాని ఇవ్వాళ మన నదులలో చాలావరకు నదులు సంవత్సరం పొడుగునా సముద్రంలోకి పారడం లేదు. గంగా సింధు నదులు ఇప్పుడు భూమిపై అత్యంత ప్రమాదంలో పడిన నదుల జాబితాలో చేరాయి. కావేరి ఇప్పుడు యాభైఏళ్ల కిందటితో పోలిస్తే 40% మాత్రమే ఉంది. ఉజ్జయినిలో గత కుంభమేళా సమయంలో నర్మద నుండి నీళ్లు తోడి ఒక కృత్రిమ నదిని కల్పించ వలసి వచ్చింది. ఎందుకంటే క్షిప్రలో నీళ్లు లేవు. చిన్న నదులు కనీసం తమ ప్రధాన నదులను కలవడం లేదు. తోవలోనే అవి ఆగిపోతున్నాయి. అమరావతి వంటి నదులు జీవనదులు, శాశ్వత నదులనుకుంటాం. కాని నీళ్లు లేక రాళ్లు మిగిలుతున్నాయి.  ఇప్పుడవి శాశ్వత శిలలు అవుతున్నాయి.

ఇది కేవలం నదుల గురించే కాదు. ఇది మనం జీవిస్తున్న పద్ధతి గురించి. మనం సహజంగానే మన అత్యంత ప్రధానమైన వనరును సంపాదించుకుంటామా, తోవలోనే దాన్ని కోల్పోతామా? ఎంతకాలం ఇలా కోల్పోయే మార్గంలో ఉంటాం? మనం ప్రకృతి నుంచి ఎంత దూరం జరిగితే, అనేక విధాలుగా మనం మన సహజ స్వభావం నుంచి మరింత దూరంగా జరుగుతాం. మరో విషయం కూడా వాస్తవం. మనం మన స్వభావం నుంచి ఎంత దూరం జరిగితే మనం మన చుట్టూ ఉన్న జీవితం మీద అంత నిర్లక్ష్యంగా మారతాం.

నదుల నుండి ఇంకా, ఇంకా ప్రయోజనాలు సాధించాలని కాక, వాటిని ఎలా పునరుజ్జీవింపజేయాలని మనం ఆలోచించాలి.

నీళ్లు కేవలం వినియోగ వస్తువు మాత్రమే కాదు. అది ప్రాణాధార పదార్థం. మానవ శరీరంలో 72% నీరే. మీ శరీరమే నీరు. ఈ భూమి మీద మనకు అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన జలాశయాలు నదులు. వేలాది సంవత్సరాలుగా నదులు మనల్ని అక్కున చేర్చుకొని, సంరక్షిస్తున్నాయి. ఇప్పుడు  మనం మన నదులను అక్కున చేర్చుకొని, సంరక్షించవలసిన సమయం వచ్చింది. మన నదులను రక్షించుకోవలసిన అత్యవసర పరిస్థితి ఏర్పడిందని మనం దేశంలోని ప్రతివ్యక్తీ అర్థం చేసుకొనేలా చేయాలి. నదుల నుండి ఇంకా, ఇంకా ప్రయోజనాలు సాధించాలని కాక, వాటిని ఎలా పునరుజ్జీవింపజేయాలని మనం ఆలోచించాలి.

దీనికి అత్యంత సరళమైన పరిష్కారం నదులకు రెండు వైపులా కనీసం కిలోమీటరు పరిధిలో అడవులు పెంచడం, ఉపనదులకు ఇరువైపులా అర కిలోమీటరు పరిధిలో అడవులు పెంచడం. ప్రజలు నీళ్లున్నాయి కాబట్టి చెట్లున్నాయనుకొంటున్నారు, కాదు, చెట్లున్నాయి కాబట్టే నీళ్లున్నాయి. చెట్లే లేకపోతే కొద్ది సమయం తర్వాత నదులు ఉండవు. ప్రభుత్వ భూమి ఉన్నచోట అడవులు పెంచాలి. ప్రైవేటు భూములున్నచోట నేల శిథిలమయ్యే పంటలు వదిలి, వృక్షాధారిత ఉద్యానవనాలు పెంచాలి. ఇది రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుంది. వాళ్ల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపవుతుంది. దీన్ని తప్పనిసరిగా అమలు పరిచే విధానంగా చేస్తే పది పదిహేనేళ్లలో 15 నుండి 20 శాతం ప్రవాహం పెరుగుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

సంపాదకుని సూచన: సద్గురు ఏ ఏ నగరాలలో ఎప్పుడు ఆగుతారో ఆ కార్యక్రమాన్ని తెలుసుకొనేందుకు, పాల్గొనేందుకు, దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు Rally for Rivers.org దర్శించండి.