స్వార్ధంతో ఉండడంలో తప్పులేదు
సద్గురు మనకు స్వార్ధంగా ఉండడం తప్పుకాదని చెబుతున్నారు. అలా ఎందుకంటున్నారో ఈ వ్యాసం చదివి తెలుసుకోండి.

ప్రశ్న: నేను స్వార్థం లేకుండా ఉండడం ఎలా?
సద్గురు: మీరు స్వార్థం లేకుండా ఉండలేరు. “నేను స్వార్ధంగా ఉండకూడదు, నేను స్వార్ధంగా ఉండకూడదు”- ఇలా అనుకోవడం కూడా స్వార్థమే కదా. నిజాయితీగా మిమ్మల్ని మీరు గమనించుకొని చెప్పండి - మీరు స్వార్ధం లేకుండా ఉండగలరా? ఏవిధంగా చూసినా సరే, మీరు మీ ద్వారా మాత్రమే దేనినైనా అవగాహన చేసుకోగలరు. అందుకని నిస్వార్ధం అన్నది అసలు ఏదీ లేదు. ఏవో నీతి సూత్రాలతో మీరు తప్పుదోవ పట్టకండి. మీరు నిస్వార్ధంగా ఉండాలని ప్రయత్నిస్తే, మిమ్మల్ని మీరు మోసగించుకుంటారంతే. నిస్వార్థం అనేది ఒక అబద్ధం, ఇటువంటి నీతులతో ఈ ప్రపంచంలో ఎంతోమంది మోసపోతున్నారు.
“నేను ఏదో నిస్వార్ధంగా చేస్తున్నాను” అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ వారు ఏదైనా ఒక పని, అది వారిని సంతోషపెడుతోంది కాబట్టే చేస్తారు. అందుకని అసలు నిస్వార్థం అన్న ప్రశ్నే లేదు. స్వార్థంగా ఉండండి, కానీ పూర్తి స్వార్ధంగా ఉండండి. ఇప్పుడు ఉన్న సమస్య ఏమిటంటే, మీరు మీ స్వార్థంలో కూడా పిసినారితనం చూపిస్తున్నారు.
ప్రస్తుతం, మీ స్వార్థం “నేను సంతోషంగా ఉండాలి” అన్న దానికి మాత్రమే పరిమితమై ఉంది. పూర్తి స్వార్ధంగా ఉండండి: “ ఈ విశ్వం అంతా సంతోషంగా ఉండాలి. ఉనికిలో ఉన్న ప్రతి అణువు సంతోషంగా ఉండాలి.” ఇలా పూర్తిగా స్వార్థపరులైపోండి. అప్పుడు ఇంక సమస్య లేదు. కానీ మీరు మీ స్వార్థంలో కూడా పిసినారితనం చూపిస్తున్నారు. అసలు సమస్యంతా అదే..!
మనము స్వార్థంగానే ఉందాం, అందులో తప్పేంటి? కానీ మనం అపరిమితంగా స్వార్ధంతో ఉందాం. కనీసం మన స్వార్ధంలో అయినా, మనం సంపూర్ణంగా ఉందాం. జీవితంలోని ఎన్నో అంశాలలో, మనం సంపూర్ణంగా ఉండడానికి సుముఖంగా లేము. కనీసం స్వార్థంలోనైనా సంపూర్ణంగా ఉందాం.
శూన్యం లేదా అనంతం
మీరు పరమోన్నతమైన దానిని చేరుకోవాలంటే, దానికి రెండు మార్గాలున్నాయి: మీరు శూన్యంగా మారిపోవాలి లేదా అనంతమైపోవాలి. ఈ రెండూ భిన్నమైనవి కాదు. నిస్వార్ధంగా ఉండే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని; అంటే ఓ పది నుంచి ఐదుకు తగ్గించుకోవచ్చేమో కానీ మిమ్మల్ని మీరు లయం చేసుకోలేరు. ఒక విధానంలో మీరు పూర్తిగా శూన్యం అయిపోవాలి. మరో విధానంలో మీరు అనంతమై పోవాలి.
అయితే మీరు పూర్తిగా శూన్యం అయిపోవాలి. లేదా మీరు అనంతమై పోవాలి. భక్తి మార్గంలో లయమవుతారు మీరు పూర్తిగా అంకితమై, శూన్యమవుతారు - ఇలాంటప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. లేదా, అన్నిటినీ మీలో ఇముడ్చుకొని, అన్నిటితో మమేకం అవ్వవచ్చు. అప్పుడు కూడా ఎటువంటి సమస్య లేదు. కానీ మీరు “నేను” అని మాట్లాడుతున్నప్పుడు, ఒక అస్తిత్వం ఉంది - అందుకని లయమవడం అన్న ప్రశ్నే లేదు. కాబట్టి, మీరు అపరిమితంగా, అనంతంగా మారిపోండి. మీకు ఇదే తేలికైన విధానం.