జిడ్డు కృష్ణమూర్తి గురించి సద్గురు చెప్పిన విషయాలు
సద్గురు జిడ్డు కృష్ణమూర్తి జీవితం గురించి చెబుతూ సద్గురు యుక్త వయసులో ఉన్నప్పుడు జె. కృష్ణమూర్తి స్టడీ సెషన్లకు హాజరయిన కొన్ని సంఘటనలు మనతో పంచుకున్నారు.
ప్రశ్న: సద్గురు, మీరు జిడ్డు కృష్ణమూర్తి గురించి ఇంకా బ్రహ్మ జ్ఞానం పొందడంలో గురువుల పాత్రను ఆయన చిన్న చూపు చూడడం గురించి ఏమైనా చెప్పగలరా?
సద్గురు: జిడ్డు కృష్ణమూర్తి మదనపల్లె అనే గ్రామంలో జన్మించారు. ఆయన పుట్టి పెరిగిన ఒక శతాబ్దం క్రితం నాటి ఆ ఇంటికి నేను వెళ్లాను. అది ఒక అందమైన చిన్న ఇల్లు ఇంకా అది చాలా అందమైన ప్రదేశం.
ఇప్పుడు ఆ ఇంటిని ఆయన స్మారక చిహ్నంగా ఉంచారు. మదనపల్లె ఒక చిన్న గ్రామం. కానీ జిడ్డు కృష్ణమూర్తి ఈ గ్రామ సమీపంలో ఒక పాఠశాలను నిర్మించినందున, చాలా మంది అక్కడికి వెళుతున్నారు.
మేడమ్ బ్లావాట్స్కీ ఇంకా థియోసాఫికల్ సొసైటి
ఒకప్పుడు, 20వ శతాబ్దం ప్రారంభంలో లేదా 19వ శతాబ్దం చివరిలో, థియోసఫి (బ్రహ్మ జ్ఞానం) ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దీన్ని మేడమ్ బ్లావాట్స్కీ ప్రారంభించారు. ఆవిడ మార్మికత ఇంకా నిగూఢ విద్యలపై గొప్ప ఆసక్తి ఉన్నవారు. ఆ సమయంలో చాలా మంది బ్రిటిష్ ఇంకా ఇతర యూరోపియన్ ఆధ్యాత్మిక వాదులు - మాక్స్ ముల్లర్, పాల్ బ్రంటన్ ఇంకా అనేక ఇతర వ్యక్తులు భారతదేశానికి వచ్చి ఇక్కడ అనేక పుస్తకాలు రాశారు. బ్లావాట్స్కీ వీరందరి కంటే కూడా ముందు తరం వారు.
ఆ రోజుల్లో, ఎక్కడో ఒక చోటకి వెళ్లి ఏదో నేర్చుకోవడం కాదు. మీరు నిజంగా ఒక గుర్రం ఎక్కి బయలుదేరి ఒక వింత దేశానికి వెళ్లాలి, అక్కడ అన్ని రకాల పరిస్థితులని ఎదురుకోవాలి ఇంకా సరైన గురువులను కలవడానికి ప్రయత్నించాలి. ఇదంతా సాహసంతో కూడిన పని. ఈ రకమైన సాహసాన్ని చేయడానికి మీకు బలమైన కోరిక ఉండాలి, లేకుంటే మీ జీవితాన్ని పణంగా పెట్టి ఇలాంటి ప్రయాణాన్ని మీరు చేయలేరు.
మేడమ్ బ్లావట్స్కీ అన్ని రకాల దేశాలకు వెళ్లారు, ఆవిడ టిబెట్‌కు వెళ్లారు, భారతదేశానికి వచ్చారు, ఆపై ఆవిడ తమిళనాడుకు వచ్చి అక్కడ థియోసాఫికల్ సొసైటీని స్థాపించారు - ఇది నేటికీ ఉంది. వారి కల ఒక "పరిపూర్ణ జీవిని" ఉత్పత్తి చేయడమే.
మైత్రేయ - జగద్గురువు
వారు ఏ మేరకు సాధించారో నాకు తెలియదు. కానీ వాస్తవానికి యోగ పురాణంలో, సునీరా అనే ఒక యోగి ఉండేవారు. ఆయన సుమారు 40,000 సంవత్సరాల క్రితం వారు.
ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా ఒక పరిపూర్ణ గురువుని తయారు చేస్తే, మానవ చైతన్యం అభివృద్ధి చెందుతుందని సునీరా గ్రహించారు. ఒక విధంగా చెప్పాలంటే, ఆయన శివుడి సంప్రదాయం నుండి వచ్చారు, కాబట్టి ఆయన కల అలాంటి మరొక జీవిని తయారుచేయడమే. ఆయన కేవలం ఒక రకమైన బోధనకే పరిమితం కాకుండా, పూర్తిగా బహుమితీయమైన ఒక పరిపూర్ణ గురువును, ప్రపంచంలోని అందరి కోసం
మరోసారి సృష్టించాలని కోరుకున్నాడు. శివుడు మానవ చైతన్యాన్ని ఇంకా మానవ శరీరాన్ని అన్ని విధాలుగా అన్వేషించాడు, కాబట్టి సునీరా మళ్ళీ అలాంటి ఒక జీవి ఉండాలని కోరుకున్నాడు.
సునీరా అలాంటి ఒక జీవి కోసం శక్తి శరీరాన్ని నిర్మించడం ప్రారంభించారు. ఆయన ఆ శక్తి శరీరానికి తగ్గ భౌతిక శరీరాన్ని నిర్మించగలనని ఇంకా కొన్ని వందల లేదా వేల సంవత్సరాల ఆయుర్దాయంతో అతన్ని ప్రపంచంలో విడిచిపెడితే, అతను ప్రపంచం అంతటిని మార్చేయగలడని ఆయన విశ్వసించారు.
సునీరా ఈ ప్రాజెక్ట్ పనిని ప్రారంభించారు. దీనికి మైత్రేయ అనే పేరును సూచించి, ఇది మానవాళికి అత్యుత్తమమైన స్నేహితుడని పేర్కొన్నారు. కానీ అది పూర్తవకుండానే ఆయన కాలం చేశారు. కాబట్టి ఈ 40,000 సంవత్సరాలలో, అక్కడా ఇక్కడా, అనేక ప్రతిష్టాత్మక యోగులు సునీరా వదిలివేసిన అదే ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నారు, మానవ చైతన్యాన్ని మార్చగల పరిపూర్ణ గురువు యొక్క ఈ శక్తి శరీరాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నించారు. ఇది అలా కొనసాగుతూ వచ్చింది. వివిధ యోగులు ఎన్నోసార్లు దీనినే ఎంచుకుని, మళ్ళీ మళ్ళీ దీనిని పునఃనిర్మించడానికి ప్రయత్నించారు.
ఆత్మ జ్ఞానం(థియోసఫీ)
మేడమ్ బ్లావాట్స్కీ, లీడ్‌బీటర్ ఇంకా అన్నీబీసెంట్ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఈ థియోసఫీ (బ్రహ్మ జ్ఞానం) ఉద్యమాన్ని నడిపారు. వారు చాలా వరకు విజయవంతంగానే నడిపించారు. వారు ప్రపంచంలోనే అత్యంత అసాధారణమైన నిగూఢ విద్యల గ్రంథాలయాన్ని నిర్మించారు, ఇది ఇప్పటికీ థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఉంది. వారు నిగూఢ విద్యలపై అన్ని రకాల పుస్తకాలను సేకరించి, ఒక పరిపూర్ణ అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఇప్పుడు కూడా జిడ్డు కృష్ణమూర్తి సమూహాలను స్టడీ సర్కిల్స్ లేదా స్టడీ గ్రూప్స్ అని పిలుస్తారు, ఎందుకంటే ఈ స్టడీ గ్రూపులు అన్నీబెసెంట్ ఇంకా లీడ్‌బీటర్ ఏర్పాటు చేశారు. అన్నీబెసెంట్ ఇంకా లీడ్‌బీటర్ అద్భుతమైన తెలివితేటలు కలవారు, దాని గురించి ఎటువంటి సందేహమూ లేదు, కానీ వారికి అంతర్ముఖ అనుభవము లేదు.
శిక్షణ
వారు బ్రహ్మజ్ఞానం గురించి అసాధారణమైన సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారంతో ఇంకా వారి తెలివితేటలతో, ఒక పరిపూర్ణ గురువుని తిరిగి సృష్టించగలమని వారు విశ్వసించారు.
అద్భుతమైన ఈ పరిపూర్ణ గురువు శరీరానికి అనువైన శరీరాలు లేదా వ్యక్తుల కోసం వారు వెతకడం ప్రారంభించారు. వారు జిడ్డు కృష్ణమూర్తిని ఎంచుకుని, అతడిని శారీరకంగా, మానసికంగా సిద్ధం చేయడానికి ఎంతో తీవ్రమైన శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.
లీడ్ బీటర్ జిడ్డు కృష్ణమూర్తితో పాటు భారతదేశాన్ని వదిలి బ్రిటన్ కి వచ్చాడు, అక్కడ జిడ్డు కృష్ణమూర్తి చాలా పాశ్చాత్య అభిరుచులను పెంపొందించుకున్నాడు. అతను అత్యుత్తమ సూట్లను ధరించాడు, పిక్కాడిల్లీకి వెళ్లి అత్యుత్తమ టైలను ధరించాడు. అతను ఒక టైని ఎంచుకోవడానికి గంటలు పట్టేది. ప్రతిదీ చాలా శ్రద్ధగా పరిశీలించే వ్యక్తి. అతను స్వయంగా బి.ఎస్.ఏ మోటార్‌సైకిల్ కొని, బైక్ నడపడాన్ని ఆనందించేవాడు.
అతనికి ధ్యానం చెయ్యడంలో శిక్షణ కొనసాగింది, అతను అద్భుతమైన వ్యక్తిగా మారాడు. అతను బ్రిటన్‌లో ఉన్నప్పుడు అతను ఏంటో మనకు తెలియదు, కానీ ఆ తర్వాత కాలంలో
కూడా అతను ఎవరకీ అర్థం కాని ఒక వ్యక్తిగా మిగిలిపోయాడు. కానీ అతను పరిమళించే ఒక పువ్వులా ఉండేవాడు - ఆయన పరిమళాన్ని ఎవరూ విస్మరించలేరు.
జిడ్డు కృష్ణమూర్తి ప్రపంచ గురువు అవడానికి నిరాకరించుట
జిడ్డు కృష్ణమూర్తికి దాదాపు 32-33 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, థియోసాఫికల్ సొసైటి వారు, ఇతను ప్రపంచ గురువు అని ప్రపంచానికి ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. వారు నెదర్లాండ్స్‌లో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు, వేలాది మంది ప్రజలు హాజరయ్యారని చెప్తారు.
జిడ్డు కృష్ణమూర్తి స్టేజి మీదకు వచ్చి, "నేను ప్రపంచ గురువును కాను, నేను అసలు ఎవరినీ కాను" అన్నారు. థియోసాఫికల్ సొసైటి ఇంకా వారి ప్రాజెక్ట్ అంతా నిష్ఫలమయ్యింది. వారు అతని జీవితకాలమంతా అతనిని సిద్ధం చేసారు, కానీ అతను అక్కడికి వచ్చి, "నేను ప్రపంచ గురువును కాను, నేను అసలు ఎవరినీ కాను" అన్నారు. చాలామంది మూర్ఖులు, "అవును, నేను ప్రపంచ గురువుని. నేను బుద్ధుడు ఇంకా జీసస్ యొక్క పునర్జన్మ" అని చెప్తారు. "వారు అర్ధంలేకుండా నన్ను ఎవరిలాగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారో ఆ వ్యక్తిని నేను కాదు" అని చెప్పడానికి అవసరమైన జ్ఞానం, తెలివితేటలు ఇంకా దృష్టి అతనికి ఉన్నాయి.
అతను థియోసఫీ నుండి బయటకు వచ్చి బహిరంగ సభలలో మాట్లాడటం ప్రారంభించారు. అతను ఒక అద్భుతమైన వక్త. ప్రజలు అతని చుట్టూ గుమిగూడేవారు ఇంకా అతను ఎప్పుడూ గురువుపై ఆధారపడకూడదు అని చెప్పేవారు, ఎందుకంటే ఆయన స్వంత గురువుల విషయంలో జరిగిన అనుభవం చాలా భయంకరమైనది.
అతని అపారమైన జ్ఞానం ఇంకా తెలివితేటల కారణంగా, అతను మాట్లాడినప్పుడు ప్రజలు ఉత్సాహంగా కూర్చునేవారు. అతను మాట్లాడే విధానం చాలా అద్భుతంగా ఉండేది.
మీకు అతనిలో ప్రస్పుటంగా కనిపించే ఒక విషయం ఏమిటంటే అతను అప్రమత్తంగా ఇంకా స్పష్టంగా ఉండేవాడు. అతనితో ఉన్నపుడు ఆ స్వభావికమైన శారీరిక ప్రభావం అలా ఉండేది. మీరు అక్కడ కూర్చుని అతని మాటలు వింటూ ఉన్నప్పుడు, మీ చేతిని గనక కదిలిస్తే, అతను లేచి వెళ్లిపోతారు!
సద్గురు జిడ్డు కృష్ణమూర్తి సెషన్ హాజరైనప్పుడు
నేను కేవలం 17-18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, కృష్ణమూర్తి స్టడీ సర్కిల్స్ ఫ్యాషన్‌గా ఉండేవి. భారతీయ మేధావి వర్గంలో, మీరు జే కృష్ణమూర్తి, కీర్కెగార్డ్ ఇంకా దోస్తోవ్స్కీలను చదవకపోతే, వాస్తవానికి మీకు మెదడు లేదని అర్థం!
వారు ప్రతి శనివారం మధ్యాహ్నం స్టడీ సర్కిల్‌ని ఏర్పాటు చేసి, అక్కడ కొన్ని ఆడియో టేపులను ప్లే చేసి, అతని పుస్తకాలను చదివేవారు. నా స్నేహితులు కొందరు నన్ను ఆహ్వానించారు. నేను అక్కడికి వెళ్ళాను. వారు ఒక చిన్న వీడియోను ప్లే చేస్తున్నారు. ఆ సమయంలో అతను ఇంకా సజీవంగానే ఉన్నాడు. వీడియోలో అతను మాట్లాడుతున్నారు . ప్రేక్షకులలో ఎవరో కూర్చుని అతని వైపు చూస్తున్నారు. ఆయన, "నన్ను అలా చూడవద్దు." అన్నారు. ఆ వ్యక్తి, "నేను ఏమి చేయగలను? నా కళ్ళు అలాంటివి" అని చెప్పాడు. "లేదు సార్! దయచేసి నన్ను అలా చూడకండి." అన్నారు. ఆ వ్యక్తి, "నేను ఏమి చేయగలను? నేను కళ్ళు మూసుకోవాలా? నేను మీ మాట వింటున్నాను. నేను మిమ్మల్ని చూస్తున్నాను, అంతే" అన్నాడు. "లేదు, మీరు నన్ను అలా చూడకండి. ఈ వ్యక్తిని బయటకు తీసుకెళ్లండి" అన్నారు.
నేను వెళ్ళిన మొదటి రోజున ప్లే చేసిన విడియోలో అతను ఇది చేశాడు, నాకు ఇది బాగా నచ్చింది. ఈ మనిషి సూటిగా ఉన్నాడు. చాలా సూటిగా. కేవలం ఈ వ్యక్తి యొక్క చిత్తశుద్ధి ఇక్కడ బాగా కనపడుతోంది. ఈయన చిత్తశుద్ధిని మనము కాదనలేము. నేను పెద్దగా ఈయన పుస్తకాలు చదవలేదు కానీ నేను కొన్ని ఆడియోలు విన్నాను ఇంకా కొన్ని వీడియోలను చూశాను. నేను అవన్నీ ఆస్వాదించాను, కానీ నేను ఎవరి మాట వినలేనంత తీవ్ర స్వభావంతో ఉండేవాడిని. జీవితం నన్ను ఎప్పుడూ పిలుస్తూ ఉండేది. నా తల్లిదండ్రులు లేదా నా ఉపాధ్యాయులు లేదా కృష్ణమూర్తి మాటలు వినడానికి నాకు సమయం లేదు. నాకు దేనికీ సమయం లేదు. కాబట్టి నేను స్టడీ సర్కిల్‌ని వదిలి వెళ్లిపోయాను.
జ్ఞాన మార్గం
ఐదు వారాంతాలు(వీకెండ్స్), నేను ప్రతి శనివారం మధ్యాహ్నం దాదాపు గంటన్నర పాటు అక్కడికి వెళ్ళేవాడిని. వారు ఒక అరగంట వీడియో లేదా ఆడియోను ప్లే చేసి, ఆపై చర్చలో పాల్గొనేవారు. అది ఒక పెద్ద గందరగోళంగా ఉండేది ఎందుకంటే అతను ఏమి మాట్లాడుతున్నాడో అతని చుట్టూ ఉన్న ఎవరికీ అర్థం అయ్యేది కాదు. అతను దీని గురించి, దీని గురించి ఇంకా దీని గురించి మాట్లాడేవాడు. "అది ఏమిటి?" అంటే అతను "అదే అదే" అని చెప్పేవాడు. ఎందుకంటే అతను ఏదైనా ఒక పద్దతిని, ఒక ఉదాహరణని, ఒక ఉపమానాన్ని, ఒక కథని లేదా ఒక జోక్ ని ఉపయోగించడానికి నిరాకరించాడు. ఇది కేవలం మేధో విచ్ఛేదనం. ఇది స్వచ్ఛమైన జ్ఞాన మార్గం. జ్ఞానం అంటే బుద్ధి మార్గం.
మీరు నన్ను అడిగితే, ప్రపంచంలోని ఈ ఏడు వందల కోట్లకు పైగా ఉన్న ప్రజలలో, ఈ రకమైన జ్ఞాన మార్గ ప్రక్రియకు సరిపోయే 10,000 మంది వ్యక్తులను కూడా మీరు కనుగొనలేరు. ఈ రకమైన పదునైన తెలివి ఉన్నవారు, ఏ విధమైన సందర్భం లేకుండా విషయాలను చక్కగా విడమరిచి అర్ధం చేసుకునేవారు, బహుశా మీకు ఒక వెయ్యి మంది కనపడచ్చు. ఇక ఆ వెయ్యి మంది వ్యక్తులూ ఆధ్యాత్మిక ప్రక్రియపై ఆసక్తి చూపకపోవచ్చు, వారు స్టాక్ మార్కెట్ లేదా మరేదైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు.
జిడ్డు కృష్ణమూర్తి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తిని ప్రత్యేకమైన వ్యక్తిగా భావించారు, కానీ అతను ఒక గురువు అవడానికి నిరాకరించినందున అతను ఏమి మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. అతను ఎవరికైనా ఏదైనా ఉపదేశం చేయడానికి లేదా ఒక పద్ధతి లేదా ప్రక్రియ ఇవ్వడానికి నిరాకరించేవాడు.
కారును ఒక చక్రంతో నడపడం
అతను ఇలా అంటాడు, "ఇది(జ్ఞానోదయం) ఎలాగైనా జరుగుతుంది" అని. ఏదేమైనా ఇది జరుగుతుంది, కాకపోతే పది లక్షల జీవితకాలాలు పట్టచ్చు.
ఒకవేళ మీకు త్వరగా జ్ఞానోదయం పొందాలని ఉంటే, ఒకటి మీకు చాలా పదునైన తెలివితేటలు ఉండాలి లేదా మీ శరీరం, మీ శక్తి మరియు మీ భావోద్వేగాలు, ఇతర సామర్థ్యాలను కూడా ఉపయోగించడానికి సిద్ధంగా ఉండాలి. అతను(జిడ్డు కృష్ణమూర్తి) తన కారును ఒక చక్రంతో నడిపేవాడు. అతను దానిలో ఆరితేరినవాడు కానీ మరెవ్వరూ అలా చేయలేకపోయారు.
మీలో ఎంతమంది మీ కారును రెండు చక్రాలపై నడపగలరు? ఇలా చేయగల వ్యక్తులూ ఉన్నారు, కానీ కారు నడపడానికి ఇది ఉత్తమమైన మార్గమా? ఆ వ్యక్తి సిఫారసు చేస్తూ ఉండవచ్చు, "మీరు మీ కారును రెండు చక్రాలపై నడిపితే తక్కువ చక్రాలు వాడవచ్చు, దానికి చాలా తక్కువ స్థలం పడుతుంది, మీరు హైవే దారులను చాలా సన్నగా చేయవచ్చు, ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి," కానీ ఎంత మంది చేయగలరు? చెప్పాలంటే జిడ్డు కృష్ణమూర్తి కారును ఒక చక్రంతో నడుపుతున్నాడు, అది ఇంకా అధ్వాన్నం.
అతను ఒక అద్భుతమైన వ్యక్తి, కానీ అతను ఒక పువ్వులా జీవించాడు ఇంకా అతను ఒక పువ్వులా రాలిపోయాడు. అతను ఉన్నప్పుడు, ఒక సువాసన వచ్చేది. అతను పోయిన తర్వాత, ఎలాంటి సాధన ప్రక్రియ లేనందున పుస్తకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
కహ్లీల్ జిబ్రాన్ ఇంకా జిడ్డు కృష్ణమూర్తి
నేను లెబనన్ లోని కహ్లీల్ జిబ్రాన్ ఇంటికి వెళ్ళాను. ఇది సందర్శించదగిన ఇల్లు. ఇది పర్వతాల మధ్యలో ఉన్న ఒక అందమైన ప్రదేశం. ఈ ఇంటి ముందుగది లోపల ఒక చిన్న వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు కహ్లీల్ జిబ్రాన్ అతడిని కలవడానికి వెళ్లాడు.
జిబ్రాన్ తరువాత ఇలా అన్నాడు, "నేను గదిలోకి వెళ్లినప్పుడు, ఆ గది ప్రేమతో నిండిన ఒక గది". మీరు జిడ్డు కృష్ణమూర్తిని ప్రేమతో ముడిపెట్టలేరు. అతను ఖచ్చితంగా ప్రేమ ఉన్నట్టుగా కనిపించడు, కానీ అతను చాలా ప్రేమగలవాడు. అతని శక్తులు కరుణతో కూడుకున్నవి, కానీ అతని మాటలు కత్తిపోటులాంటివి.
అతని చుట్టూ ఉన్న ప్రజలు ఏదో ఒక అనుభూతిని పొందేవారు, కానీ వారు దానిని పట్టుకోలేకపోయేవారు, ఎందుకంటే అతను ఎవ్వరికీ పట్టు ఇవ్వడు. అతను, "మీరు దీనిని పట్టుకుంటే, దీనిలో ఇరుక్కుపోవచ్చు, కాబట్టి పట్టుకోకండి" అని చెప్పేవాడు. ఇది ఒక నిర్దిష్ట విధానం. ఇది తప్పు అని నేను అనడం లేదు. ఇది ఒక అందమైన మార్గం. ప్రపంచంలో చాలా పదునైన తెలివితేటలు ఉంటే, ఈ మార్గం పని చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉండేది. కానీ మనుషులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రజల మనసులు లక్షల విషయాలలో చిక్కుకొని ఉన్న పరిస్థితుల్లో, ఈ పద్ధతిని ఎక్కడా కూడా ఎవరూ పాటించలేరు. ఇది ఒక అందమైన ప్రక్రియ కానీ దానిని చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తులు కూడా ఉండాలి.
జిడ్డు కృష్ణమూర్తి బతికున్నప్పుడు సువాసన వెదజల్లే పువ్వులాంటివాడు. అతని మాటలు బాగుండేవి. మీరు కొన్ని విషయాలను విడిచిపెట్టాలి అనుకుంటే, అతని మాటల్ని మీ మేధస్సుకు ఒక సాధనంగా ఉపయోగించాలనుకుంటే, అవి ఉపయోగకరంగా ఉండవచ్చు. అతని జీవితంలోని ప్రతి క్షణంలో అతని మేధో తేజస్సు బయటకు వచ్చేది.
జిడ్డు కృష్ణమూర్తి సద్గురుని ఎలా ప్రభావితం చేశారు
నేను ఈ ఐదు శనివారం మధ్యాహ్నాలు ఒక గంటన్నర పాటు వెళ్ళినప్పుడు, ఒకరోజు అతను విద్య గురించి మాట్లాడాడు. ప్రజలకు విద్యను అందించే ప్రత్యామ్నాయ మార్గం గురించి నేను ఎన్నడూ ఆలోచించనందున ఇది నిజంగా నన్ను ఆకట్టుకుంది. నా మనస్సులో నేను, అన్ని విద్యా వ్యవస్థలను ఎలా కూల్చివేయాలి అని మాత్రమే ఆలోచించేవాడిని. ఈ విద్యా వ్యవస్థలు అత్యంత భయంకరమైనవి, కీడు చేసేవని నేను భావించాను. నేను కాలాన్ని బట్టి ఒక మామిడి చెట్టు కిందో లేదా మామిడి చెట్టు మీదో, పాఠశాలలో కంటే బాగా ఎదగగలను అని అనుకునేవాడ్ని.
కాబట్టి ఆ ఐదు శనివారాల మధ్యాహ్నం ఒకటిన్నర గంటలు నాపై చాలా ప్రభావం చూపించాయి, నేను ఒక విధంగా నా కుమార్తెను అతని సంరక్షణలో ఉంచాను.
అతను విద్య గురించి మాట్లాడినప్పుడు, అకస్మాత్తుగా విద్యను అందించడానికి మరొక మార్గం ఉందని నాకు అనిపించింది. నాకు 17 లేదా 18 సంవత్సరాలు ఉండవచ్చు, నేను తీవ్రమైన రీతిలో జీవించాను, ఎక్కడికో పారిపోవాలని కలలు కనేవాడిని. అతను చెప్పిన రీతిలో విద్యను అందించే పాఠశాలలో పిల్లలను చేర్చాలి అని నేను అనుకున్నాను.
నా కూతుర్ని స్కూల్లో చేర్చవలసి వచ్చినప్పుడు, తను ఊటీలోని కొన్ని ఉత్తమ పాఠశాలల్లో ప్రవేశం పొందింది. అలాంటి పాఠశాలలకే అందరూ వెళ్లాలనుకుంటారు. కానీ అప్పుడు నా మనస్సులో మెదిలింది, "సరే, జిడ్డు కృష్ణమూర్తి పాఠశాల ఉంది కదా. తనను అక్కడికి ఎందుకు పంపకూడదు?" అని. తనను ఆ పాఠశాలలో చేర్చాము, ఆమె అక్కడ ఎనిమిది సంవత్సరాలు చదువుకుంది.
కాబట్టి ఆ ఐదు శనివారాల మధ్యాహ్నం ఒకటిన్నర గంటలు నాపై చాలా ప్రభావం చూపాయి. నేను ఏదో విధంగా నా కుమార్తెను అతని సంరక్షణలో ఉంచాను. జిడ్డు కృష్ణమూర్తితో నా పరిచయం కేవలం ఏడున్నర గంటలు మాత్రమే, కానీ ఇది ఆయన నాపై చూపిన ప్రభావం.
సంపాదకుని గమనిక: ఈ వ్యాసం 2010, అమెరికాలోని ఈశా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్-సైన్సెస్‌లో సద్గురు ఇచ్చిన ప్రసంగం నుండి తీసుకొనబడింది.