సద్గురు: ప్రపంచంలో ఉన్న ప్రతి దాంతో కమ్యూనికేట్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కొంతమందితో, మీరు చెప్పాలనుకుంటున్నది, చాలా సులభంగా చెప్పొచ్చు. మరికొంతమంది ఉంటారు, వారికి గట్టిగా చెప్తే కాని అర్ధం కాదు. కొంతమందికి, వారికున్న “జబ్బు” ను బట్టి “ఇంజక్షన్” ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి ఊరికే అలా చూస్తే చాలు, అర్థమైపోతుంది. ఇంకొంతమంది ఉంటారు, వారి వైపు కూడా చూడనక్కర్లేదు- నేను కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలు, వారికి అర్ధమవుతుంది. కాబట్టి కమ్యూనికేట్ చేయడానికి, చాలా పద్ధతులున్నాయి. అయితే కమ్యూనికేట్ చేయడానికి ఏది సరైన పద్ధతి? ఇతరులకి అర్థమయ్యేలా చేయడమే ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే కమ్యూనికేషన్ అంటేనే ఎదుటివారికి అర్థమయ్యేలా చేయడం.

నా వరకు, భాష అనేది కేవలం ఒక మాధ్యమం మాత్రమే. నన్నడిగితే, దాన్ని వాడే బదులు, మౌనంగా కూర్చోవడం ఉత్తమం అంటాను. కానీ అప్పుడు, చాలా తక్కువమందికే అర్ధం అవుతుంది. అందుకనే ఎక్కువ మాట్లాడాల్సి వస్తోంది – కొన్నిసార్లు సౌమ్యంగా, కొన్నిసార్లు కఠినంగా, మరికొన్నిసార్లు కోపంగా. ఇది కేవలం మనుషులకొక్కటే కాదు – అన్నిటికీ వర్తిస్తుంది.

కొంతమందికి, ప్రతీది వారితో సహకరిస్తున్నట్లు కనిపిస్తుంది – వారు తీసుకునే ఆహారం, త్రాగే నీరు, పీల్చే గాలి, నడిచే నేల ఇంకా సమస్త ప్రాణులు, చెట్లు ఇలా అన్నీ. కొన్ని జీవితాలకి, ప్రతీది సహకరిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంకొన్ని జీవితాల్లో ఏమో, అన్నీ వారికి ప్రతికూలంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తాయి. ఇదంతా కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉంటుంది.

కమ్యూనికేషన్ అనేది ఏదో ఒక భాషకో, ఏదో ఒక సందేశానికో మాత్రమే పరిమితమై ఉండేది కాదు. కమ్యూనికేషన్ అనేది ఈ సృష్టిలోని అనేక శక్తుల మధ్య జరిగే ఒక ప్రగాఢమైన పరస్పర చర్య. మిమ్మల్ని మీరు, మిగతా వాటితో ఏ సంబంధం లేని పూర్తి ప్రత్యేక ఉనికిగా భావించినట్లయితే, మీరు ఒక వెధవలా తయారవుతారు. మీతో కమ్యూనికేట్ చేయడం చాలా కష్టతరం అవుతుంది. కానీ మీకు గనుక ఈ అవగాహన ఉంటే, అదేంటంటే - మీరు కేవలం ఒక జీవపు తునక మాత్రమే అని, అలాగే మీకు ఒక ప్రత్యేక వ్యక్తిగా అనుభూతి చెందగలిగే భాగ్యం ఇవ్వబడిందని మీరు అర్ధం చేసుకుంటే, మీతో కమ్యూనికేట్ చేయడం చాలా సులభం అవుతుంది. ఇది నాకు, ఇటీవల మా ఇంట్లో జరిగిన ఒక సంఘటనని గుర్తు చేస్తోంది.

అడగకుండానే

మహాశివరాత్రి సమయంలో, మా ఇంటికి అతిథులు వచ్చారు. చాలా ఎలుకలు, ఉడతలు కూడా తిరుగుతున్నాయి. నేను వాటిని పెద్దగా పట్టించుకోను, కానీ అవి రాత్రంతా చప్పుడు చేస్తూ, ఇంటి పైకప్పు పెంకుల మీద తిరుగుతున్నాయి. అప్పుడు నేను ఒకతనితో, “తోటలో రెండు పాములు ఉంటే చాలు. అవి వీటన్నిటినీ నియంత్రిస్తాయని” చెప్పాను. ఒకరోజు సాయంత్రం, నేను తోటలో నడుస్తుంటే, ఇంచుమించు ఆరడుగుల పొడవున్న పాము కనపడింది. అప్పుడు నేను, “అద్భుతం, కానీ ఒకటే ఎందుకు వచ్చింది, రెండు కదా రావాలి!” అనుకున్నాను.

మీరు కనుక యోగాలో ఉంటే, కేవలం యోగా చేయడం కాదు. మీరు అడగక్కర్లేదు కూడా – మీకు కావాల్సింది మీ దగ్గరికి వస్తుంది.

మరుసటి రోజు ఉదయం 10.30కి, మా ఇంట్లో వాళ్ళు భయపడుతూ, నా దగ్గరికి వచ్చి, “సద్గురు, మీ బాత్రూంలో ఒక పెద్ద పాము ఉంది!” అన్నారు. అది నా బాత్రూంలోకి ఎలా వచ్చింది? ఎప్పుడూ, మా ఇంట్లో ఏ తలుపు తెరిచి ఉంచం, ఎందుకంటే మాకు ఇలాంటి వాటితో చాలా అనుభవాలు ఎదురయ్యాయి. తలుపు తెరిచి, పని ముగించుకొని, మళ్ళి తలుపు మూసేయటమే – ఇది ఇంట్లో పాటించే నియమం. పాము బాత్రూం లోపలికి వెళ్ళాలి అంటే 3 తలుపులు దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ఎలాగోలా, అది తలుపులు తెరిచి ఉన్న సమయాలు చూసుకొని, బాత్రూం లోపలికి వచ్చేసి ఉంటుంది. నేను దాన్ని పట్టుకొని, బయట వదిలేశాను. అప్పటికీ నేను అనుకుంటూనే ఉన్నాను, ఒకటే ఎందుకు వచ్చిందని? కొంతసేపు తరువాత, ఇంకొక పాము కనపడింది – కొంచెం చిన్నది, 4 అడుగులుంది. నేను, “ ఇప్పుడు, చాలా బాగుంది. ఏం జరగాలో అది జరిగింది” అనుకున్నాను.

జీవితం ఇలానే ఉంటుంది. మీరు కనుక యోగాలో ఉంటే, కేవలం యోగా చేయడం కాదు. మీరు అడగక్కర్లేదు కూడా – మీకు కావాల్సింది మీ దగ్గరికి వస్తుంది. కేవలం పాముల విషయంలోనే కాదు – జీవితంలో ప్రతీ విషయంలో కూడా. మీరు అడగాల్సి వస్తే, మీకు తెలిసిన విషయాలే అడుగుతారు. అలా జరిగితే, జీవితమే వృథా. మీకు ముందే తెలిసిన చెత్త విషయాల కోసమే పదే పదే అడగటంలో ఉపయోగం ఏముంది? మీరు ఊహించలేని విషయాలు, మీకు ఏమాత్రం అర్థం కాని విషయాలు మీకు జరిగి తీరాలి – అప్పుడే జీవితం ముందుకు వెళుతున్నట్లు. ఒక విధంగా, ఇదంతా కూడా కమ్యూనికేషన్ మీదే ఆధారపడి ఉంటుంది.

కమ్యూనికేషన్” అని నేనన్నప్పుడు, సెల్ ఫోన్ లో సందేశాలు పంపటం లేదా మాట్లాడటం అని అందరూ అనుకుంటారు. అది కూడా కమ్యూనికేషనే, కాని ఆ రకమైన కమ్యూనికేషన్ వల్ల కేవలం సామజిక పరిస్థితులు మెరుగుపడతాయి అంతే, అంతకు మించి మరేం జరగదు. సామాజిక పరిస్థితులు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తాయి – అవి మీలో పరిపూర్ణతను తీసుకురాలేవు. సామాజిక సంబంధాలు మిమ్మల్ని పక్కదారి పట్టించి, మీకు కొంతకాలం పాటు వినోదాన్ని కలిగించచ్చు. కానీ అవి ఎప్పటికీ మీలో పరిపూర్ణతను తీసుకురాలేవు, ఎందుకంటే అది వాటి స్వభావం కాదు.

మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు, మీ చుట్టూ ఉన్న ప్రతి దాంతో గాఢమైన కమ్యూనికేషన్‍లో ఉండగలగడం ముఖ్యం. ఏమీ మాట్లాడకుండా, ఎలాంటి మెసేజ్‍లు లేకుండా, కేవలం మీకు ఈ సమస్తానికి మధ్య లోతైన పరస్పర సంభాషణ జరగాలి. యోగా అంటే ఇదే. యోగ అంటే ఏకమవ్వడం. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు, మీ వ్యక్తిత్వం ఒక చిన్న భాగం మాత్రమే – జీవం పెద్ద భాగం. జీవం కొంచెం కొంచెం జరగదు - అది ఒక అద్భుతమైన ప్రక్రియగా జరుగుతుంది.

నెమ్మదించటానికి సమయం లేదు

విశ్వంలో మనం ఒక చిన్న భాగమే అయినప్పటికీ, జీవితం మనకి వ్యక్తిగత అనుభూతిని ఇస్తోంది. ఇదెంతో గొప్ప అదృష్టం. ఈ అనంత విశ్వంలో మనమొక ధూళి కణమైనప్పటికీ, ఇక్కడ కూర్చొని ఒక వ్యక్తిగా అనుభూతి చెందగలం. ఇది సృష్టి యొక్క గొప్పతనం. ఈ సృష్టితో సంభాషించగల ఇంకా ప్రతిస్పందించగల మీ సామర్థ్యం, మిమ్మల్ని మీరు, “ఒక ప్రత్యేక వ్యక్తి” అని ఎంత తక్కువగా అనుకుంటున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి, ఎక్కడ మొదలైందో, ఎక్కడ ముగుస్తుందో తెలియని ఈ విశాల విశ్వంలో, మిమ్మల్ని మీరు అతి గొప్పగా ఊహించుకుంటున్నారు. నిజానికి ఈ అనంత విశ్వంలో మనం అసల ఏమీ కాదు. అతి చిన్న కణం కూడా కాదు. కానీ ఈ చిన్న కణం అన్ని రకాల విషయాల్ని ఊహించుకుంటోంది. మరోపక్క మీ ఆయువు తరిగిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితిలో కూడా మీరు మీ గురించి గొప్పలు చెప్పుకుంటూ సమయాన్ని వ్యర్ధం చేసుకుంటున్నారు.

కమ్యూనికేషన్ అనేది ప్రపంచంలోని అవసరాన్ని బట్టి ఉండాలి. మనం చేసే చర్య, అవసరానికి తగ్గట్లుగా ఉండాలి. కానీ మీలో మీరు ఎలా ఉన్నారు అనేది మాత్రం వేరే విషయం.

కానీ ఈ ప్రపంచంలో మీరు శూన్యంగా పని చేయలేరు - ఏదోక గుర్తింపు ఉండాలి. ఇటీవల, ఒకతను నాతో – “సద్గురు, మీరు ఈ మధ్య కఠినంగా మాట్లాడుతున్నారు” అన్నారు. నేను,“ఎప్పుడూ అలాగే ఉంటాను” అన్నాను. అతను, “వద్దు సద్గురు, అలా చేయకండి. మీరు మీ ప్రశాంతతని కోల్పోయినట్టు అనిపిస్తోంది” అన్నాడు. నేను, “మునుపెన్నడూ నాలో ప్రశాంతత లేనప్పుడు, ఇప్పుడు దాన్ని కోల్పోటం ఎలా సాధ్యం? నాలో నేనెప్పుడు విస్పోటనానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం లాగా ఉంటాను” అన్నాను.

కమ్యూనికేషన్ అనేది ప్రపంచంలోని అవసరాన్ని బట్టి ఉండాలి. మనం చేసే చర్య, అవసరానికి తగ్గట్లుగా ఉండాలి. కానీ మీలో మీరు ఎలా ఉన్నారు అనేది మాత్రం వేరే విషయం. ఆదియోగిని చూడండి – జ్వాలతో నిండి ఉంటాడు. పాత కాలానికి చెందిన గొప్ప యోగులని చూడండి – వాళ్ళందరూ లోపల జ్వాలతో నిండి ఉన్నవారే. క్యాలెండరుపైన ఉన్న యోగులు మాత్రమే దయతో ఉన్న ముఖాలతో కనిపిస్తారు.

జీవితం ఇంకా జీవితం తాలూకూ పనులు ఎల్లప్పుడూ ఒక జ్వాలతో రగులుతూ ఉండాలి. నెమ్మదించటానికి సమయం అసలు లేదు. అన్ని విషయాల్లో విచారంగా, సంకుచితంగా ఆలోచించే వారికి మాత్రమే జీవితం సుదీర్ఘంగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఎందుకంటే వారెన్నడూ మనిషికున్న ఎన్నో శక్తిసామర్ధ్యాలను వెలికి తీయలేదు. కొన్ని వస్తువులు, మనుషులు ఇంకా అనవసరమైన చెత్తంతటినీ పోగు చేసుకుంటూ వారి జీవితాల్ని నిర్మించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మనిషికున్న అపారమైన శక్తి సామర్థ్యాల్ని శోధించాలనుకుంటే, ఇదెంతో చిన్న జీవితం. జీవితం ఇంత చిన్నదైనప్పుడు, మీరు పూర్తిగా జ్వలిస్తూ ఉండటం ఎంతో ముఖ్యం. లేదంటే, ఏం జరుగుతోందో తెలుసుకొనే లోపే, చితి మీద కాలుతుంటారు. అప్పుడు జ్వలిస్తూ ఉంటారు, కాకపొతే అప్పటికే జరగాల్సినది జరిగిపోయింటుంది. జీవిస్తే, పూర్తిగా జ్వలిస్తూ జీవించాలి లేదా మెల్లగా విడతల వారీగా జీవించాలి.

ఎవరైతే అనంత విశ్వాన్ని వాయిదా పద్ధతిలో చేరుకోవాలి అనుకుంటున్నారో – వారికి ఆల్ ది బెస్ట్. ఇప్పటిదాకా ఎవరూ ఒకటి, రెండు, మూడు అని లెక్కపెట్టుకుంటూ, ఏదోక రోజు అనంతాన్ని చేరుకోలేదు. మీరు కనుక శూన్యంగా మారితే - అప్పుడు మీరు ఏమి చేయనక్కర్లేదు. కానీ అప్పుడు మీరు ప్రపంచంలో ఏ పని చేయలేరు. ఆ స్థితి చాలా అందమైనది కానీ అప్పుడు మీ చుట్టూ ఉన్నవారి నుండి మీకు సహాయ సహకారాలు అవసరం అవుతాయి. మీరు పూర్తిగా శూన్యంలో ఉంటూ కూడా, సమాజంతో నిమగ్నమై ఉండాలి అంటే మీరు పూర్తిగా జ్వలిస్తూ జీవించటం అవసరం. అంటే మీరు మీ ప్రజ్వలనాన్ని ప్రతిసారీ అందరికీ చూపించనవసరం లేదు. అది అవసరమైన వారికి రుచి చూపించాల్సి వస్తే చూపించచ్చు.

గతం తాలూకూ ముద్రణలు

ఇక్కడ ప్రశ్న కూల్‍గా ఉండాలా లేదా ‍హాట్‍గా, ప్రశాంతంగా ఉండాలా లేదా కోపంగా ఉండాలా అనేది కాదు – ముఖ్యమైన విషయం ఏంటంటే మీ లోపల ఏం జరిగుతున్నా కూడా, అది ఎరుకతో జరుగుతోందా లేదా అని. మీ మేధస్సును ఉపయోగించి, ఆ క్షణంలో మీరు ఏం చేసినా కూడా, అది ఎరుకతో చేస్తే, పర్లేదు.

మీరు నిర్భందంగా కోపంగా లేదా శాంతంగా మారడం వల్లే సమస్య తలెత్తుతుంది. ఎరుకతో ఉంటున్నామా లేదా నిర్భందంగా ప్రవర్తిస్తున్నామా అన్నదే ప్రశ్న. మీలో జరిగే కోపం ఇంకా ప్రశాంతత ఎరుకతో జరుగుతున్నాయా, లేదంటే నిర్బంధంగా జరుగుతున్నాయా? “నిర్బంధంగా” ” అంటే మళ్ళి మళ్ళి జరిగినవే జరగటం. “నిర్బంధంగా” ” అంటే గతం, వర్తమానాన్ని శాసిస్తూ, భవిష్యత్తుని కుంగదీస్తోంది. 

ఎప్పుడైతే గతకాలపు ముద్రణలు భవిష్యత్తుని శాసిస్తాయో, అది చాలా ఘోరమైన జీవితం. అందుకే మీ “హారర్ – స్కోప్” (జాతకం) రాసి, మీరెలా జీవించబోతారో ముందే చెప్పగలుగుతున్నారు. ఎవరైతే వారి గతకాలపు ముద్రణల్ని భవిష్యత్తులోకి కూడా అనుమతిస్తారో, వారికే హారోస్కోప్ (జాతక చక్రం) వర్తిస్తుంది. మీరు ఎరుకతో ఉండగలిగితే, మీ హారోస్కోప్ (జాతక చక్రం) ని కాల్చి పడేయచ్చు. మీరు ఎరుకతో ఉంటే, జరిగిపోయినది మళ్ళి జరగదు. ప్రతి ఆలోచన, ప్రతి భావోద్వేగం, ప్రతి పని ఇలా మీరు చేసే ప్రతీది ఎరుకతో చేయటం ఎంతో ముఖ్యం. ఎరుకతో ఉండగలిగే సామర్ధ్యం ఇంకా మిగతా ప్రపంచంతో కమ్యూనికేట్ చేయగలిగే సామర్ధ్యం రెండు ఒకటే. ఎలుకల్ని తినే పాములే వినగలుగుతున్నప్పుడు, మీకేమైంది?

జీవితానికి మీరు సన్నద్ధమయ్యారా?

ఒక ప్రత్యేక ఉనికిగా, మీ చుట్టూ పెద్ద పెద్ద గోడల్ని కట్టుకొని, కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తే, అది పని చేయదు. మీరు ఎరుకతో ఉంటే, అప్పుడు మీరు సహజంగానే పారదర్శకంగా మారతారు. ఎప్పుడైతే మీరు పారదర్శకంగా మారతారో, అప్పుడు ప్రతీది సుస్పష్టంగా కనిపిస్తుంది.

కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని మీరే కరిగించడమన్నా చేయండి, లేదంటే మేము దాన్ని అరగదీయాల్సి ఉంటుంది. అరగదీయడం ఎంతో బాధతో కూడుకున్న ప్రక్రియ. మీ అంతట మీరే దాన్ని కరిగించుకుంటే, అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. అరగదీయటానికి సమయం పడుతుంది. కాలక్రమంలో, జీవితం అందరినీ అరగదీస్తుంది, కాని అది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. మీకూ, మీ చుట్టూ ఉన్నవారికి ఏదైనా స్వచ్చమైన మార్పు జరగాలి అనుకుంటే ఇదే సరైన చోటు ఇంకా సమయం. మీరు స్వచ్చంగా మారటమే ఎంతో ముఖ్యమైన విషయం. లేకుంటే మీరు, జరిగే ప్రతీ సంఘటనని చూసి నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉంటారు. ఏంటిది? ఎందుకు ఇది ఇలా జరుగుతోంది? అని. మీరు నిజమైన సాధకులైతే ఎందుకు ఇది జరుగుతోంది అనే ప్రశ్నే తలెత్తదు. ఇదేమీ “నేనేం పొందాలి? జ్ఞానోదయం పొందాలా? ఇది పొందాలా? అది పొందాలా? ” అనేవాటి గురించి కాదు. ఇది కేవలం మీ ఉనికి యొక్క స్వభావాన్ని అత్యుత్తమ స్థాయిలో తెలుసుకునే దాని గురించే.

ఎందుకంటే, ఒకసారి మీరు ఈ భూమి మీదకి ఇంత పెద్ద మెదడుతో, ఇంత మేధస్సు ఇంకా ఎరుకతో వచ్చినప్పుడు, ఈ జీవితం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు చనిపోయేలోపు ఇవి తప్పక తెలుసుకోవాలి - “నా అసలు స్వభావం ఏమిటి? నాకు ఏమేం సంభావ్యతలున్నాయి?” అని. మీరు ఆ సంభావ్యతలన్నిటినీ శోదిస్తారా లేదా అన్నది వేరే విషయం, కానీ ఖచ్చితంగా అవేంటో మీరు తప్పకుండా తెలుసుకోవాలి. జీవితం మిమ్మల్ని ఏమాత్రం స్పృశించకుండా వెళ్లిపోవాలనుకుంటే, గొయ్యే ఉత్తమ ప్రదేశం. నా దగ్గరికి చాలా మంది వచ్చి, “సద్గురు దయచేసి మాకు ఏమీ కాకూడదని ఆశీర్వదించండి” అని అడుగుతారు. అది ఏరకమైన ఆశీర్వాదం? నా ఆశీర్వాదం ఏంటంటే, “దేన్నైతే జీవితంగా చెప్పుకుంటామో అదంతా మీకు జరగాలి.”

ఈ ప్రపంచాన్ని, మన విద్యని, మన వాణిజాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నామంటే, మనం ఈ ప్రాథమిక అంశాన్ని మిస్ అవుతున్నాము.

మీరు సజీవంగా ఉన్నంతకాలం, ఏదోటి జరుగుతూనే ఉంటుంది. ప్రశ్న ఏంటంటే, మీరు ఈ జీవితానికి సిద్దంగా ఉన్నారా? మీ జీవితంలో ఏం జరిగినా కూడా దాని పరిణామాలని ఎదురుకోటానికి మీరు శారీరికంగా, మానసికంగా, ఇంకా ఎరుక పరంగా సిద్ధంగా ఉన్నారా? అన్నదే ప్రశ్న. “లేదు, సద్గురు, కానీ ఒక దారుణమైన సంఘటన జరిగింది” అంటే ... లేదు, కేవలం జీవితం మాత్రమే జరుగుతోంది. ఒకరు పుట్టారు, ఒకరు చనిపోయారు, ఒకరు ఇక్కడ ఉన్నారు, ఒకరు ఇక్కడ నుండి వెళ్ళిపోయారు – జరుగుతున్నదంతా ఇదే. కొందరు అద్భుతమైన పనులు చేస్తున్నారు; మరి కొందరు దారుణమైన విషయాలు చేస్తున్నారు. ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంది. నేను మనుషులు చేసే దారుణాలను సమర్ధించట్లేదు. కానీ మీరు వాటిని అరికడదామని చూస్తుంటే కనుక, అది చట్టం ద్వారా జరగదు. మీరు ఎన్ని చట్టాలు అమలు చేసినా కూడా, మనుషులు ఇలాంటి పనులను కొత్త కొత్త విధాలుగా చేస్తూనే ఉంటారు. కేవలం వ్యక్తి స్థాయిలో మనుషులలో మార్పు వచ్చినప్పుడే, ఈ పరిస్థితి మారడం అనేది సాధ్యపడుతుంది. ప్రతి ఒక్కరికీ - జీవితాలని ప్రభావితం చేసే ఉపకరణాలను పెద్ద మొత్తంలో అందించటం ద్వారానే వ్యక్తి స్థాయిలో మార్పు వస్తుంది. లేకుంటే, మనుషుల వల్ల జరిగే ఈ దారుణాలను ఆపలేరు.

మానవుడిలా ఉండటంలోని ప్రాధమిక అంశాన్ని మనం గ్రహించడం లేదు. మానవ జీవితం యొక్క ప్రాధమిక అంశాన్ని మనం పూర్తిగా మిస్ అవుతున్నాము. ఈ ప్రపంచాన్ని, మన విద్యని, మన వాణిజాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నామంటే, మనం ఈ ప్రాథమిక అంశాన్ని మిస్ అవుతున్నాము. కనీసం సంభాషణా టెక్నాలజీ పరంగా, మనం ఏ స్థాయికి చేరుకున్నామంటే, కావాలంటే మనం కూర్చున్న చోట నుండే ఈ ప్రపంచం మొత్తంతో సంభాషించవచ్చు.

అద్భుతమైన సంభాషణా ఉపకరణాలను ఇంకా ఇంటర్నెట్ ని మనం అత్యంత హేయకరమైన పనులు చేయడానికి వాడుతున్నాము. ఇంటర్నెట్ లో ప్రతీ రోజూ, కొన్ని వేల మంది పిల్లలు అమ్మబడుతున్నారు, మాదక ద్రవ్యాల రవాణా జరుగుతోంది - అన్ని రకాల పనులూ జరుగుతున్నాయి. అన్నింటికీ మించి, మన పిల్లల్ని చెత్త పనులు చేయటానికి మనం అమ్మేస్తున్నామంటే, మనం దిగజారిపోయాము. మనం మానవత్వాన్ని పూర్తిగా కోలిపోయాము. ఇక, ఆధ్యాత్మిక సంస్థ అనగానే ప్రజలు ఊహించే విధంగా నిమ్మళంగా, నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళే సమయం ముగిసిందని నేను భావిస్తున్నాను. మనం దీన్ని, ఫైర్‌ అవుతున్న రాకెట్ లా ముందుకు తీసుకువెళ్ళాలి.

మీకొక భవిష్యవాణి కావాలా లేక ఒక ప్రణాళిక కావాలా?

ఇది చాలా వేగంతో ముందుకి వెళ్ళాలి, మేము రాబోయే నెలల్లో దీనిపై పని చేస్తాము. మీరందరూ కూడా దీన్లో భాగం కావాలి. మానవులని మతం నుండి బాధ్యత వైపుకి నడపాలి. చాలా కాలంగా, మనం చేసే నీచమైన పనులని పైవాడి మీదకి తోసేశాము. మనం చేసే గొప్ప పనులకి మాత్రం కీర్తిని మనమే తీసుకున్నాము. ఎవరికో ఎదురు దెబ్బ తగిలింది - మనం “పైవాడి ఆదేశం” అంటాము. ఇది మారాలి. ప్రస్తుతం మనం ఏ విధమైన చెత్తగా అయితే ఉన్నామో దానికి మనమే భాద్యత తీసుకోవాలి. అలాగే ప్రస్తుతం మనకున్న సంభావ్యతలకు కూడా. మనం చేసే గొప్ప పనులకి ఇంకా పనికిమలిన పనులకి కూడా మనమే భాద్యత వహించటానికి సుముఖంగా ఉండాలి. ఇంకా ప్రపంచంలో రేపు మనం ఏం సృష్టించబోతున్నామో అది కూడా మన బాధ్యతే.

చాలా మంది నన్ను ఇలా అడుగుతూ ఉంటారు, “సద్గురు రాబోయే 50 సంవత్సరాలలో ప్రపంచం ఎక్కడ ఉండబోతోంది?” నేను వాళ్ళని, “మీకు భవిష్యవాణి కావాలా లేక ప్రణాళిక కావాలా?” అని అడుగుతాను. ప్రణాళికని అమలు చేయలేని మూర్ఖులకి మాత్రమే భవిష్యవాణి అవసరం. ఈ సృష్టి మీకు ఇంత పెద్ద మెదడుని, ఆలోచించే శక్తిని ఇంకా సామర్ధ్యాన్ని ఇచ్చింది, దీంతో మనం గొప్ప విషయాలను ప్రణాలికలును సృష్టించుకోకుండా, అర్ధం లేని భవిష్యవాణి కోసం ఎదురుచూస్తున్నాము. మనం ఎటు పోతున్నాము? అన్నదే ప్రశ్న. ఇది జరగాలి అంటే, మీరు మనుషులకి - వారి శరీరం ఇంకా వారి మనస్సులకి అతీతమైన సాధికారతను అందించాలి. వీటికన్నా పెద్దదైనది వారిని తాకాలి. మేము చేసే ప్రయత్నంలో ఇదే ప్రాథమికమయిన అంశం. ప్రతీదీ పూర్తిగా క్రియాశీలంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.

Editor's Note: సంపాదకుని గమనిక: ప్రశాంతత, ప్రేమ, ఆరోగ్యం, ఇంకా విజయం సృష్టించుకోవడంలో సాయపడే చిత్ శక్తి ధ్యానాలు, మన చిరకాల కోరికలని వాస్తవంగా మార్చకోటానికి సాయ పడతాయి. వీటిని సద్గురు యాప్ లో ప్రయత్నించండి.!

A version of this article was originally published in Isha Forest Flower April 2018.