ప్రశ్న: మనము తరచుగా గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటాము. అలాంటి పరిస్థితులలో ఎలా మనము శాంతముగా వుండాలి?

సద్గురు: మన జీవితాల్లో ప్రశాంతత కావాలని అందరం కోరుకుంటాం. మీరు ప్రశాంతంగా వుండాలని కోరుకున్నా మీ మనస్సు నిత్యం ఆందోళనతో వుండడం వల్ల మీరు మానసికముగా ప్రశాంతంగా వుండలేరు. మీ ప్రశాంతాన్ని  మీరు కోల్పోయారని అనుకుంటే, మొదట మీ భార్యతో లేక భర్తతో తగాదా పెట్టుకుంటారు. అది ఇంకా పెరిగితే, మీ పొరుగు వారిపై అరుస్తారు. అది మరింత పెరిగితే, మీ బాస్ పై అరుస్తారు. ఏ రోజయితే బాస్ పై మీరు అరుస్తారో, వైద్య సహాయం అవసరమని అందరికీ అర్ధమవుతుంది. ప్రతి ఒక్కరు ఏదో సమయంలో భర్తపై, భార్యపై లేదా పొరుగు వారిపై అరవడం అనేది సాధారణమే. కానీ బాస్ పై అరవడం అనేది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ప్రస్తుతం మీరు డాక్టర్ వద్దకు వెళ్ళాల్సిన మానసిక స్థితిలో వున్నారు. డాక్టర్ మీకు టాబ్లెట్ ఇస్తారు.

టాబ్లెట్ మీ శరీరంలోకి వెళితే దాని ద్వారా కొన్ని గంటలైనా ప్రశాంతంగా వుంటారు. ఒక కెమికల్ లోనికి వెళ్లి శరీరం, మనస్సు స్థాయిలోని ఆందోళనను తగ్గించి శాంతంగా ఉంచుతుంది. కాబట్టి, శాంతి శరీరంలోని ఒక రకమైన రసాయనం వంటిది. అలాగే, మనిషిలోని ప్రతి భావం ఒక రకమైన రసాయనమే. భావం ఏదైనా కాని, అది మన శరీరములోని రసాయన వ్యవస్థతో సంబంధం కలిగి వుంటుంది. మనం ప్రశాంతంగా వుంటే, ఒక ప్రశాంతమైన రసాయనతత్వం మనలో వుంటుంది. లేదా, అలాంటి ప్రశాంతమైన రసాయనతత్వన్ని మనలో ఏర్పాటు చేసుకుంటే, అదే మనలో ప్రశాంతతను కలుగచేస్తుంది. యోగాలో ఈ రెండు మార్గాలను వాడతాము.

 ప్రశాంతంగా జీవించడం ప్రధానమైన ప్రాథమిక విషయం. ఇది ఆత్మజ్ఞానానికి లేక దైవానికి సంబంధించినది కాదు.
సరైన సాధనతో, మన వ్యవస్థలోని రసాయనికతను మార్చి ఒక స్థాయికి తీసుకురావడం ద్వారా పరిస్థితులకు లోబడకుండా, ప్రశాంతంగా ఉండగలం. ప్రస్తుతం మీలోని ప్రశాంతత బయటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. పరిస్థితులు మీకు అనుకూలంగా వుంటే మీరు శాంతంగా వుంటారు. అదే పరిస్థుతులు మీకు అనుకూలంగా లేకుంటే, అప్పుడు సమస్య ఏర్పడుతుంది. ఎప్పుడు మీలోని ప్రశాంతత బయటి పరిస్థితికి లోబదదో, ఎప్పుడు బయటి విషయాలకు తలొగ్గక మీలో మీరు స్థిరముగా వుంటారో, ఆ స్థితిని యోగ అని పిలుస్తారు. మరో మాటలో, యోగా అనేది సరైన రసాయన తత్వాన్ని (కెమిస్ట్రీ) ఏర్పర్చ గల సైన్స్ అని మీరు చెప్పవచ్చు.

మీలో సరైన కెమిస్ట్రీ ఉన్నట్లయితే మీరు శాంతంగా, ఆహ్లాదంగా మాత్రమే ఉండగలరు. మరో మార్గం లేదు. ప్రశాంతంగా, ఆహ్లాదంగా జీవించడం అనేది జీవిత చరమాంకంలో కలిగేది కాదు, అది జీవితానికి చక్కని ప్రారంభం. మీలో మీరు శాంతంగా లేనట్లయితే, లోన అర్థం లేని మానసిక ఆందోళనలను మీరు పట్టుకునే వుంటే, మీరు జీవించడాన్ని ఇంకా ప్రారంభించనట్లే. ప్రశాంతంగా, ఆహ్లాదంగా వుండటం ముఖ్యమైన ప్రాథమిక అవసరాలు. కనీసం మీరు తినే ఆహారాన్ని ఆస్వాదించాలన్న కూడా మీరు శాంతంగా ఉండాలి. మీరు ఆందోళనగా వుంటే తినే ఆహారాన్ని ఆస్వాదించగలరా? లేరు. ప్రశాంతంగా వుండటం జీవించడానికి ఒక చక్కని ప్రారంభం.

కాని ప్రస్తుతం, జీవితంలో అద్భుతమైన స్థాయి అంటే ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండటమే అని ప్రచారం చేస్తున్నారు. ప్రపంచంలో చాలా మంది ప్రశాంతంగా జీవించడాన్ని ఇంకా ప్రారంభించక పోవడం దురదృష్టకరం. అలా ప్రశాంతంగా జీవితంలో ఉండటమే పరమార్ధంగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆధ్యాత్మిక వేత్తలుగా పిలువబడే వారు కూడా ప్రశాంతంగా వుండటమే గొప్ప విషయంగా ప్రజలకు చెప్పడమనేది దురదృష్టకరం. ప్రశాంతంగా జీవించడం ప్రధానమైన ప్రాథమిక విషయం. ఇది ఆత్మజ్ఞానానికి లేక దైవానికి సంబంధించినది కాదు. ఇది ఇంగ్లీష్ భాషలోని  ‘A’  లాగా జీవితానికి ప్రారంభం కాని ‘Z’ లా ముగింపు కాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు