భీమ్ రావ్ అంబేద్కర్ గారి జీవితంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన నా మనసులో మెదులుతుంది. ఈ సంఘటన జరిగినప్పుడు ఆయన వయస్సు తొమ్మిది సంవత్సరాలు. ఆయన తండ్రి గోరేగావ్ లో పనిచేస్తూ ఉండేవారు. వేసవి సెలవులలో, గోరేగావ్ వచ్చి కొన్నాళ్లు ఉండివెళ్ళమని ఆయన కుమారుడిని కోరారు. తన అన్ననూ, మరో బంధువునూ వెంట తీసుకొని, బాల అంబేద్కర్ సతారాలో రైలు బండి ఎక్కాడు. పిల్లలు ముగ్గురూ పాశ్చాత్య పద్ధతిలో కుట్టిన చొక్కాలు వేసుకొన్నారు. పట్టు అంచు ధోవతీలు కట్టుకొన్నారు. తళ తళ మెరిసే టోపీలు పెట్టుకొన్నారు. అదే వాళ్ళు చేస్తున్న మొట్టమొదటి రైలు ప్రయాణం కావటంతో, మంచి ఉత్సాహం మీద ఉన్నారు.

ప్రజలను మనం వర్గం వారీగా, కులం వారీగా, మతం వారీగా చూడటం మాని వేయాలి. భారత దేశంలో మనకందరికీ ఒక్కొక్క వోటే గదా ఉంటుంది? అంటే, చట్టం ప్రకారం మనం అందరమూ సమానులమే.

అయితే పాపం వాళ్ళు గమ్యం చేరే సమయానికి వాళ్ళను కలిసేందుకు ఎవ్వరూ స్టేషన్ కి రాలేదు. ఫలానా రోజున వస్తున్నామని వాళ్ళు రాసిన ఉత్తరం వాళ్ళ నాన్నగారికి చేరనే లేదు. వాళ్ళ కొత్త బట్టలు చూసి అక్కడి స్టేషన్ మాస్టర్ వాళ్ళు అగ్రకులాలకు చెందిన వాళ్ళని పొరబడి, ముందు వెయిటింగ్ రూమ్ లో కూర్చోనిచ్చాడు. కానీ నిమ్న కులమని తెలియగానే వాళ్ళను బయటికి గెంటేశాడు. పోనీ, ఎద్దుల బండి మాట్లాడుకొని ఊళ్ళోకి వెళ్లిపోదామనుకొంటే, వాళ్ళను బండిలో తీసుకెళ్ళేందుకు ఎవ్వరూ ఒప్పుకోలేదు.

చివరికెలాగో ఒక బండివాడు వాళ్ళను ఊళ్ళో దింపుతానని ముందుకొచ్చాడు. కానీ, తను మాత్రం వాళ్ళతో బండిలో కూర్చోనన్నాడు. బండి పక్కనే నడుస్తూ వచ్చాడు. దళితులతో కలిసి కూర్చొని ప్రయాణం చేస్తే తను అపవిత్రమైపోతానని ఆ బండివాడి నమ్మకం. అలా చాలా దూరం ప్రయాణం చేశారు. మార్గమధ్యంలో వాళ్లకెవరూ మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు. వాళ్ళు మర్నాడు ఉదయానికి గానీ గోరేగావ్ చేరలేదు. ఈ అనుభవం అంబేద్కర్ ను కుదిపివేసింది.

ఈ సంఘటన జరిగింది 1901లో. అప్పటికీ ఇప్పటికీ మధ్య ఒక శతాబ్దం పైన గడిచినా, ఇప్పటికీ భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి వివక్ష కొనసాగుతూనే ఉంది. పూర్వమంత తీవ్రంగా లేదేమో కానీ, ఇప్పటికీ, మరో మనిషిని తాకితేనే మేము అపవిత్రమైపోతామని భావించేవారు ఉన్నారు.

మన సమాజంలో ఇలాంటి ఘోరమైన పరిస్థితులు ఇంకా ఇలా నెలకొనే ఉన్నా, రిజర్వేషన్లను ఇక ఆపివేయాలి అన్న వాదనలు మనం తరచుగా వింటూవస్తున్నాం. ఇలాంటి వాదనలు ఎందుకు వస్తున్నాయో నాకు తెలుసు. భారతదేశం లాంటి దేశంలో, మీరు ఎలాంటి చట్టాలను తెచ్చినా, ముఖ్యంగా కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే కొన్ని ప్రత్యేకమైన హక్కులో, సదుపాయాలో కలిగించేందుకు ఉద్దేశించిన చట్టాలయితే, వాటి దుర్వినియోగం జరగకుండా ఉండదు. ఇది వాస్తవం. కానీ దళితులకు రిజర్వేషన్లు కల్పించే చట్టాల విషయంలో, మనం వాటి సద్వినియోగమూ దుర్వినియోగమూ రెండూ సరిగా బేరీజు వేసుకొని చూసుకోవటం అవసరం.

సమస్య ఏమిటో సరిగా గ్రహించాలి

దళితుల పట్ల వివక్ష వేలాది సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. వాళ్ళకు మనం కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు అందించి పైకి తీసుకు వచ్చి, ఏదో ఒక నాటికి వాళ్ళు కూడా మిగతా వారితో సమానమైన స్థాయికి చేరేందుకు తోడ్పడకపోతే, అది అన్యాయం అవుతుంది. ఈ సమస్య తీవ్రతను తక్కువగా అంచనా కట్టేవాళ్లు గ్రామీణ సమాజంలోకి తొంగి చూస్తే, ఈ వివక్ష ఎంత భయంకరమైన రూపం దాల్చిందో సరిగా అర్థం అవుతుంది. దళితులు మీ ఇంట్లో ప్రధాన ద్వారం నుంచి లోపలికి రాకూడదు. వాళ్ళు గ్రామంలోని టీ దుకాణంలో టీ తాగటానికి వీల్లేదు. దళితుల పిల్లలు అగ్ర కులాల వారి పిల్లలతో కలిసి కూర్చోకూడదు. ఇలాంటి పరిస్థితిని ఏ మనిషీ సహించలేడు? కాబట్టి రిజర్వేషన్ అంటే దేశానికి తగిలిన శాపం ఏదోనని అనుకోవద్దు. అగ్ర కులాల ఆధిపత్యం పోవాల్సిందే.

ఎక్కడో ఎవరికో ఏదో రిజర్వేషన్ లభించినంత మాత్రానా, ఆ కారణంగా మరెవరికో ఒక కాలేజీ లోనో ఒక కోర్సు లోనో చేరే అవకాశం చెయ్యి జారిపోవటం న్యాయం కాదని కొందరు అనుకొన్నంత మాత్రానా, మన సమాజం ముందున్న ఈ పెను సమస్య సమసిపోదు. ఇలాంటి జటిలమైన పరిస్థితి ఏర్పడటానికి కారణం మనం ఏర్పరచుకొన్న విద్యా వ్యవస్థలూ, ఇతర మౌలిక సదుపాయాలూ, అపరిమితమైన మన జనాభా అవసరాలకు సరిపడేటంతగా లేకపోవటం అనే విషయం సరిగ్గా అవగాహన చేసుకోవాలి.

సమీక్షకు సమయం

ఇవ్వాల్టి రోజున మన దేశంలో దళితుల స్థితిగతుల దృష్ట్యా, వాళ్ళకు రిజర్వేషన్లు ఇప్పటికి కూడా చాలా అవసరం అని నా నిశ్చితమైన అభిప్రాయం. అయితే, బహుశా, ఇప్పుడు మన రిజర్వేషన్ విధానాన్ని సమీక్ష చేయవలసిన సరైన సమయం ఆసన్నమైందని అనిపిస్తుంది. ప్రజాస్వామ్యం అన్న తరవాత, ప్రతి విషయమూ ఎన్నికలలో విజయంచుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. అందుకే ఎవ్వరూ ముఖ్యమైన మార్పులనూ సంస్కరణలనూ తేవటం గురించి చర్చలు జరిపే ధైర్యం చేయరు. ఆ సంస్కరణలు జనాభాలో ఒక వర్గం అంతటి మీదా చాలా ప్రభావం చూపగలిగినవయితే, వాటిని అసలు చర్చించరు. ఆ ఊసు ఎత్తితే ఎన్నికలలో గెలుపోటముల మీద ప్రభావం చూపిస్తుందని భయం. అయినప్పటికీ ఇలాంటి సంస్కరణల విషయంలో ఇంకా ఆలస్యం చేయటం సరైనది కాదు.

ప్రత్యేక హక్కులు కల్పించిందే సమాజంలో కొన్ని అసమానతలూ అన్యాయాలూ ఉండటం వల్ల. ఇప్పుడీ ప్రత్యేక హక్కులే మరొక అన్యాయంగా మారనివ్వకూడదు.

దళితులను, గ్రామీణ ప్రాంతాల దళితులూ, పట్టణ ప్రాంతాల దళితులూ అని రెండు సముదాయాలుగా విభజించాలి. వివక్షా, అసమానతా అత్యధికంగా ఉండేది గ్రామీణ ప్రాంతాలలో. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో దళితులకు ప్రత్యేక హక్కులూ సదుపాయాలూ, ఇప్పటికే పట్టణాలలో నివసించే దళితుల కంటే ఎక్కువగా ఇవ్వవలసి ఉంటుంది.

దురదృష్టవశాత్తూ సమాజం ఏర్పరచిన అసమానతల కూపంలో దిగబడిపోయిన వారిలో మొదటి తరాల వారికి, ఆ ఊబి నుంచి బయటపడేందుకు రిజర్వేషన్ల అవసరం బహుశా ఎక్కువగా ఉంటుంది. రెండవ తరం వారికి రిజర్వేషన్ల అవసరం కొంత తగ్గుతుంది. మూడవ తరానికి వచ్చేసరికి వాళ్ళు ఆ ఊబిలోనుంచి బయటకు వచ్చివేసి ఉండాలి. మొదటి రెండు తరాల వారిలో కొంత అభివృద్ధి సాధించగలిగిన వారు, తమకు లభ్యమౌతున్న రిజర్వేషన్లను, తమకంటే వెనుకబడి ఉన్న వాళ్ళతో పంచుకొనేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. అలా పంచుకొనేందుకు బాధ్యతాయుతమైన ఆలోచన ధోరణి అవసరం. ప్రత్యేక హక్కులు కల్పించిందే సమాజంలో కొన్ని అసమానతలూ అన్యాయాలూ ఉండటం వల్ల. ఇప్పుడీ ప్రత్యేక హక్కులే మరొక అన్యాయంగా మారనివ్వకూడదు కదా! అలా మారనివ్వకుండా చూసేందుకు సమాజంలో, సామాజిక స్పృహ పెరగాలి.

సామర్థ్యం విషయంలో రాజీలు వద్దు

కాలేజీలలో చేరటానికి రిజర్వేషన్ల అవసరం ఇప్పటికీ ఉన్న మాట వాస్తవమే, అయితే పరీక్షలో ఉత్తీర్ణత నిర్ణయించేటప్పుడు మాత్రం కులంతో నిమిత్తం ఉండకూడదు. కులం ప్రాతిపదిక మీద పరీక్షలో పాస్ చేసేట్టయితే దేశలో సామర్థ్యాల స్థాయి దిగజారిపోతుంది. అవకాశాలు ఇవ్వండి. విద్యాభ్యాసంలో వాళ్ళు ఇంతకు ముందు ఎదుర్కొన్న ప్రత్యేక మైన ఇబ్బందులేవైనా ఉంటే వాటి ప్రభావాన్ని అధిగమించేందుకు కావాలంటే అదనపు బోధన తరగతులు ఏర్పరచండి. కానీ సామర్ధ్యతల విషయంలో ఎప్పుడూ రాజీ పడద్దు. అదే విధంగా, ఉద్యోగాలలో కూడా. ఉద్యోగంలో చేరేటప్పుడు రిజర్వేషన్లు ఇవ్వవచ్చు. కానీ పదోన్నతులు పొందేందుకు మాత్రం తగిన సామర్థ్యం పెంపొందించుకోవాలి.

చివరికి వచ్చేటప్పటికి, ప్రజలను మనం వర్గం వారీగా, కులం వారీగా, మతం వారీగా చూడటం మాని వేయాలి. భారత దేశంలో మనకందరికీ ఒక్కొక్క వోటే గదా ఉంటుంది? అంటే, చట్టం ప్రకారం మనం అందరమూ సమానులమే. ఈ సమానత్వం, సాంఘిక జీవనంలో కూడా స్పష్టంగా ప్రతిబింబించాలి.

సంగ్రహ రూపంలో, ఈ దేశాన్ని గురించి, ఆ మాటకొస్తే ఈ ప్రపంచాన్ని గురించి కూడా, అంబేడ్కర్ కన్న కల ఇదే. ఆయన ఉద్యమించింది కేవలం రాజకీయ పరమైన ప్రజాస్వామ్యం కోసం కాదు. సామాజిక న్యాయపరమైన ప్రజాస్వామ్యం కోసం. మీకు ఒక ఓటు ఉంది, నాకూ ఒక ఓటు ఉంది. అంటే, అంతవరకూ మనిద్దరం పూర్తిగా సర్వసమానులం. దురదృష్ట వశాత్తూ మన దేశంలో దళితులకు న్యాయపరంగా సమాన హక్కులు ఉన్నాయి కానీ, సాంఘిక సమానత మాత్రం వాళ్ళు ఇంకా పూర్తిగా సాధించలేదు. ఈ తరం పౌరులన్నా దాన్ని సాకారం చేయాలి. ఈ సమస్యను పరిష్కరించుకోలేకపోతే, ఒక గణతంత్ర ప్రజాస్వామ్యంగా రూపుదిద్దుకోవటంలో భారతదేశం విఫలమైనట్టే. వివక్షలనూ, పక్షపాతాలనూ పెంచి పోషిస్తూ, తన పౌరులను తానే అణచివేసే దేశం ఒక సఫలమైన ప్రజాస్వామ్యంగా ఎన్నటికీ ఎదగలేదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు