మన దేశంలో అన్నిటికన్నా ఆందోళన కలిగించే విషయం రోజూ కూలి పని చేసి పొట్టపోసుకుని కాలం గడిపే అత్యంత నిరుపేద ప్రజల మనుగడ గురించి. అదృష్టవశాత్తూ కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు రైతులు, కూలీలు, నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులను, ఆదుకోవడానికి ఒక విస్తృతమైన ఆర్ధిక సహాయ ప్రణాళికతో ముందుకు వచ్చింది. కానీ దీని వల్ల సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పలేం. కనీసం జనాభాలో ఒక భాగం ఆకలిచావుల బారిన పడకుండా కొంతమేరకు ఆపగలుగుతాం. కానీ, ప్రభుత్వం అందించే సహాయానికి అర్హులు కానివారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి సహాయచెయ్యడానికే సమాజం ఇప్పుడు ముందుకు రావాలి.

ఈ దేశ పౌరులుగా, మనం కళ్ళు తెరిచి మన చుట్టుపక్కల ఎవరైనా ఆకలితో బాధ పడుతున్నారా అని గమనిద్దాం. మనమే స్వయంగా పూనుకుని గానీ, లేదా చెయ్యగలవారి మరొకరి దృష్టికి తీసుకువెళ్లి గానీ, వచ్చే రెండు వారాల్లో వాళ్ళకి సరైన ఆహరం అందేలా ఏర్పాటు చేద్దాం. బాధలకూ, చావుకూ ఆకలి కారణం కాకుండా అడ్డుపడదామని మనం ప్రతిజ్ఞ చెయ్యాలి. ఇది మన బాధ్యత. కరోనా వైరస్ తో మనకు ఇప్పటికే చాలా ఇబ్బంది వచ్చింది. మనం కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు.

ఇప్పటివరకూ, గ్రామాల్లో కరోనా వైరస్ అంతగా కనిపించట్లేదు. కానీ, పల్లెల నించి పని కోసం పట్టణాలకు వచ్చిన వలస కూలీలు ఇప్పుడు తమ గ్రామాలకి ఎలాగైనా సరే తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్నారు . చాలా మటుకు ఇలా పనికోసం పట్నం వచ్చే వాళ్ళు మగవారు ఉంటారు. సాధారణంగా వీరికి పల్లెలో ఏదో కాస్త పొలం ఉంటుంది. మగవారు పనికోసం ఒక ఏడెనిమిది నెలలపాటు పట్నానికి పోయినపుడు , ఆ పొలాన్ని వారి ఆడవారు చూసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇలా వలస వచ్చినవారికి పని లేదు, ప్రాణాపాయం ఉందని తెలిసి, వారందరూ తమ కుటుంబాలకు ఏమవుతుందో తెలియక తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోవాలనుకుంటున్నారు. ప్రభుత్వం వారికోసం వసతి గృహాలూ, భోజన సదుపాయాలూ ఏర్పాటు చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తోంది కానీ వాళ్ళు కేవలం తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని మాత్రమే కోరుకుంటున్నారు. ఇప్పుడు పట్టణాలనించి జనం ప్రవాహంలా పల్లెలకు తిరిగి పోతున్నారు. వాళ్ల మానసిక స్థితిని మనం అర్థం చేసుకోగలం, కానీ దురదృష్టవశాతూ వీరు కరోనా వైరస్ ని పట్టణా లనుంచి గ్రామాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. వీరంతా గ్రామీణ ప్రాంతాల్లోకి ఈ అంటువ్యాధిని ఎక్కువగా తీసుకెళ్లడంలేదని, అక్కడంతా మంచిగానే జరుగుతుందని ఆశిస్తున్నాను.

లాక్ డౌన్ పొడిగింపు కారణంగా, నష్టపోయే, అసహాయ స్థితికి చేరే జనం అంతకంతకూ ఎక్కువైపోతారు. మన యువ ఈశా వాలంటీర్లు చాలా మంది, గ్రామాల్లోకి వెళ్లి అక్కడ ఏమి సహాయం అవసరమో తెలుసుకోడానికి బయలుదేరుతున్నారు. వాళ్ళు యోగా సెంటర్ ని వదిలి వెళ్తున్నారు అంటే, ఇక ఈ పరిస్థితి పూర్తిగా చక్కబడే వరకూ తిరిగి రాలేరన్నమాట. అంతే కాదు, వాళ్ళు తిరిగి వచ్చాక కూడా 14 నుంచి 28 రోజుల పాటు క్వారంటైన్ లో గడపాల్సి ఉంటుంది. ఇలాంటి స్వీయ బహిష్కారం అంటే, తమకు తామే విధించుకున్న వనవాసమన్న మాట. మన చుట్టూ ఉన్న గ్రామీణ సమాజానికి సేవ చేయడానికి వీళ్ళు ఇలా బయటకు వస్తున్నారు. వారి అంకితభావానికి నేను తలవంచి నమస్కరిస్తున్నాను.

ఈ ప్రాంతంలో మన వాలంటీర్లు భోజనాన్ని వండి వడ్డిస్తున్నారు. మనం దేన్నయినా వాయిదా వేయవచ్చు గానీ, రెండు పూటలా తినాల్సిన భోజనాన్ని మాత్రం వాయిదా వెయ్యలేం. ఇక్కడి జనం అలవాటుగా తినే పద్దతిలో మనం వారికి అన్నీ అందించలేకపోవచ్చు - కనీసం రెండు పూటలా తినడానికి ఏర్పాటు చెయ్యాలని మాత్రం ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలు, మనుషులు, వంట సామాగ్రి, ఆహారపు దినుసులు, కూరగాయలను యుద్ధ ప్రాతిపదిక మీద సమకూరుస్తున్నాము.

అంతేకాకుండా మన చైనీస్ వాలంటీర్లు, వైద్య సహాయనిమిత్తం, ముఖానికి వేసుకునే మాస్కులు, చేతికి వేసుకునే గ్లోవ్స్ , వైద్య సిబ్బంది వేసుకునేందుకు రక్షణ కవచాలు అంటే సేఫ్టీ సూట్స్ మొదలైన వాటిని పంపించారు. కానీ అన్నిటికంటే పెద్ద సవాలు ముందు ముందు పెద్ద ఎత్తున అవసరం కాబోయే ఔషధాల సేకరణ.

ఈ నేపథ్యంలో, మన పైన ఆర్ధికమైన ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. ఎంతో మంది దాతలు ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో మనకు మద్దతునిచ్చారు. ఈ పరిస్థితి అంత త్వరగా ముగిసిపోయేది కాదు కనుక మనం ఇలాగే అందరి సహాయం కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాం.

ప్రేమాశీస్సులతో,

సద్గురు

సంపాదకుల గమనిక : ఎవరైనా ఆకలి బాధలో ఉన్నవారిని చూసి నట్టయితే, ఒకవేళ మీరు వారికి వెంటనే సహాయం అందించగల స్థితిలో లేకపోతే, దయచేసి ఈశా హెల్ప్ లైన్ 83000 83000 కి ఫోన్ చెయ్యండి. అక్కడి ప్రాంతీయ ఈశా వాలంటీర్లు వెంటనే సహాయం చేయడానికి అప్రమత్తమవుతారు. నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాలనే మా ప్రయత్నంలో మీరూ చేతులు కలపండి

విరాళాలకు : http://ishaoutreach.org/beatthevirus