COP15 సదస్సు లో - ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ భూముల క్షీణతకు, మట్టిని రక్షించు ఉద్యమం ప్రతిపాదించిన పరిష్కారం
సద్గురు UNCCD COP15లో తన ప్రసంగంలో, మట్టిని రక్షించడానికి దృష్టిని ఒకే ఒక లక్ష్యం దిశగా కేంద్రీకరించవలసిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. అలాగే మట్టిలోని సేంద్రీయ పదార్ధాలను పునరుద్ధరించడానికి అమలు పరచగలిగే త్రిముఖ వ్యూహాన్ని ప్రతిపాదించారు. ఆయన ప్రసంగం సారాంశం ఇక్కడ చూడవచ్చు.
మట్టిని పెద్ద ఎత్తున రక్షించాలంటే ప్రజలలో లోతుగా పాతుకుపోయే ప్రజా ఉద్యమాన్ని రూపొందించాలి. మనం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్య సంక్లిష్టమైనది అయినప్పటికీ, పరిష్కార చర్యను ఒకే ఒక లక్ష్యం దిశగా రూపొందించి, దాన్ని క్లుప్తంగా ఇంకా సరళంగా వ్యక్తీకరించినప్పుడే ఒక విజయవంతమైన ప్రజా ఉద్యమాన్ని సృష్టించడం సాధ్యపాడుతుంది. పర్యావరణం విషయంలో మనం చేసిన గత ప్రయత్నాలలో, చాలా తక్కువ మాత్రమే నిస్సందేహమైన విజయాలుగా నిలిచాయి - చాలావరకూ దీనికి కారణం, మనం సంక్లిష్టమైన శాస్త్రీయ అంశాలను సులభంగా అర్థం చేసుకోగలిగే సరళమైన చర్యలుగా మార్చడంలో విఫలమయ్యాం. 1987 నాటి మాంట్రియల్ ప్రోటోకాల్ ని, ఇప్పటివరకు జరిగిన ఏకైక అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ ఒప్పందంగా తరచుగా ప్రశంసింస్తూ ఉంటారు. ఓజోన్ పొర క్షీణతను ఆపివేయడం అనే ఒకే ఒక లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడం వల్లనే అది విజయవంతం అయ్యింది.
అదే విధంగా, వివిధ రకాల నేలలు, వివిధ వ్యవసాయ-వాతావరణ ప్రాంతాలు, ఇంకా విభిన్న సాంస్కృతిక ఇంకా ఆర్థిక సంప్రదాయాలు గల నేపథ్యంలో, భూమి క్షీణత సమస్యను పరిష్కరించే విషయంలో అనేక శాస్త్రీయ సూక్ష్మ సంక్లిష్టతలు ఉన్నాయి. అయినప్పటికీ, ఒకే ఒక సమగ్ర లక్ష్యాన్ని రూపొందించడం సాధ్యమే - అదేమిటంటే వ్యవసాయ భూములలో సేంద్రీయ పదార్దం కనీసం 3-6% ఉండేలా చూడడం. ఇది మన నేల జీవంతో నిండి ఉండి, అన్ని వ్యవసాయ భూములూ సుస్థిరమైన జీవావరణకి తగినవిగా ఉండేలా చేస్తుంది.
వ్యవసాయ భూమిలో కనీసం 3-6% సేంద్రీయ పదార్ధం ఉండేలా చూడడం అనే ఈ సమగ్ర లక్ష్యాన్ని ఆచరణాత్మకమైన త్రిముఖ వ్యూహంతో సాధించవచ్చు:
- ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను అందించడం ద్వారా, మనం రైతులలో, ఈ కనీస 3-6% సేంద్రీయ పదార్దాన్ని సాధించాలనే ఆకాంక్షను కలిగించాలి. ఇటువంటి ప్రోత్సాహకాలు, రైతులు దీన్ని పోటీ పడి చేపెట్టేలా చేస్తాయి. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది కొన్ని సంవత్సరాల వ్యవధిలో దశలవారీగా అమలు చేసే కార్యక్రమంగా ఉండాలి - మొదటి దశ స్ఫూర్తిని అందించడం, రెండవ దశ ప్రోత్సాహకాలను అందించడం, ఆపై చివరి మూడవ దశ - తగిన డిస్ ఇన్సెంటివ్స్ లను కొన్నింటిని అమలు చేయడం.
- రైతులు కార్బన్ క్రెడిట్ ప్రోత్సాహకాలను అందుకునే ప్రక్రియను సులభతరం చేయాలి. రైతులు కార్బన్ క్రెడిట్ ప్రయోజనాలను పొందేందుకు ప్రస్తుతం ఉన్న విధానాలు చాలా కష్ట తరంగా ఉన్నాయి - అందువల్ల తగినంత సరళీకరణ అవసరం.
- ఏ నేలలైతే, ఈ లక్ష్యమైన 3-6% సేంద్రీయ పదార్ధాన్ని కలిగి ఉంటాయో, వాటిలో పండిన ఆహారాన్ని సూచించడం కోసం, అత్యుత్తమ నాణ్యతను సూచించే చిహ్నాన్ని మనం రూపొందించాలి. ఇలా చేయడంతో పాటు, ఇటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య, పోషక ఇంకా వ్యాధి నివారణ ప్రయోజనాలను కూడా మనం స్పష్టంగా వివరించాలి. ఈ చొరవ ఫలితంగా, ప్రజలు మరింత ఆరోగ్యంగా, మరింత ఉత్పాదకంగా, ఇంకా మరింత స్థితిస్థాపకంగా అవుతారు - తద్వారా ప్రజల సమర్థత పెరుగుతుంది, అలాగే మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ఒత్తిడి తగ్గుతుంది. అందువల్ల 'ఆర్గానిక్' ఉత్పత్తులు అని పిలువబడే వాటికీ, 'నాన్-'ఆర్గానిక్' ఉత్పత్తులకీ మధ్య తేడాను సూచించడానికి ప్రయత్నిస్తున్న ప్రస్తుత వ్యవస్థ కంటే, మెరుగైన నాణ్యత గల ఆహారాన్ని సూచించే చిహ్నం ఒకటి ఉండడం అనేది, ఎంతో అర్థవంతంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది..
సమయం మించిపోతోంది. అయితే అదృష్టవశాత్తూ ఏం చేయాలో మనకు తెలుసు. సముచితమైన ప్రభుత్వ విధానాల అభివృద్ధితో, మట్టి అంతరించిపోవడం అనే ఈ ముంచుకొస్తున్న ముప్పు విషయంలో మనం పరిస్థితులను వెనక్కి తిప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రభుత్వ విధానాలను రూపొందించడాన్ని సులభతరం చేయడానికి, మట్టిని రక్షించు ఉద్యమం 193 దేశాలలో ప్రతి దేశానికీ సిఫార్సుల హ్యాండ్‌బుక్‌ను రూపొందిస్తోంది. ఈ ఉద్యమ వెబ్‌సైట్ Savesoil.org/te లో మరిన్ని వివరాలను పొందవచ్చు.