సద్గురు:దీపావళిని వివిధ సాంస్కృతిక కారణాల వల్ల జరుపుకుంటారు కాని చారిత్రాత్మకంగా దీనిని నరక చతుర్దశి అని పిలుస్తారు, ఎందుకంటే నరకాసురుడు అనే చాలా క్రూరమైన రాజు కృష్ణుడి చేత చంపబడ్డాడు. ఆ కారణంగానే, ఈ వేడుక అంత పెద్ద ఎత్తున జరిగింది. ఈ వేడుక చాలా రకాలుగా విశేషమైనది. ఈ రోజున, ఎవరికైనా డబ్బు అవసరమైతే, లక్ష్మి వస్తుందని చెబుతారు. ఎవరైనా ఆరోగ్యాన్ని కోరుకుంటే, శక్తి వస్తుందని చెబుతారు. ఎవరైనా విద్యను కోరుకుంటే, సరస్వతి వస్తుందని చెబుతారు. అది శ్రేయస్సుని కలిగిస్తుందని చెప్పడానికి ఇవన్నీ మాండలిక పరమైన వ్యక్తీకరణలు.

అంతరంగంలో జ్యోతిని వెలిగించడం

దీపావళి, దీపాల పండుగ. దీపావళి రోజున, ప్రతి పట్టణం, నగరం ఇంకా గ్రామం కూడా, ప్రతిచోటా వేలాది దీపాలతో వెలిగించబడడాన్ని మీరు చూస్తారు. కానీ ఈ వేడుక కేవలం బయట దీపాలను వెలిగించడం గురించి మాత్రమే కాదు – ఆంతరంగికమైన వెలుగు రావాలి. కాంతి అంటే స్పష్టత. స్పష్టత లేనట్లయితే, మీరు కలిగి ఉన్న ప్రతి ఇతర గుణమూ కూడా ఒక బహుమతిగా కాకుండా, హానికరంగా మారుతుంది, ఎందుకంటే స్పష్టత లేని విశ్వాసం అనేది ఒక విపత్తు. ఇక నేటి రోజుల్లో, ప్రపంచంలో అమలవుతున్న వ్యవహారాలలో, చాలా ఎక్కువ శాతం, స్పష్టత లేకుండా జరుగుతున్నాయి.

మనం అలా కూర్చుంటే, మన జీవశక్తి, హృదయం, మనస్సు ఇంకా శరీరం, ఒక వెలుగుతున్న దివిటీ లాగా విరజిల్లుతూ ఉండాలి. మీరు నానిపోయిన మతాబు అయితే, అప్పుడు మీకు ప్రతిరోజూ బయటి నుండి ఒక టపాసు అవసరం అవుతుంది.

ఒక రోజున, ఒక రూకీ పోలీసు, తన అనుభవజ్ఞుడైన సహా ఉద్యోగితో కలిసి ఒక పట్టణంలో మొదటిసారి డ్రైవింగ్ చేస్తున్నాడు. వారికి రేడియోలో ఒక సందేశం వచ్చింది, పలానా వీధిలో కొంతమంది గుమిగూడి ఉన్నారు, వారిని చెదరగొట్టండి అని. వారు ఆ వీధిలోకి వెళ్లారు, ఒక మూలన ఒక సమూహం నిలబడి ఉండడం చూసారు. కారు వారి దగ్గరికి చేరుతూ ఉండగా, ఒక కొత్త పోలీసు ఎంతో ఉత్సాహంతో తన కిటికీని కిందకి దించి, “హే, మీరందరూ ఆ మూలను వదిలి వెళ్ళిపొండి! ” అన్నాడు. వారందరూ అయోమయంతో ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు అతను మళ్ళీ బిగ్గరగా, “మీకు నా మాటలు వినబడడం లేదా? ఆ మూలను వదిలి వెళ్ళిపొమ్మని చెప్తున్నాను!” అని అరిచాడు. వారంతా వెళ్ళిపోయారు. అప్పుడు, అతను తన మొదటి అధికారిక కార్యనిర్వహణలో, అతను ప్రజలపై చూపిన ప్రభావం గురించి సంతోషించి, తన అనుభవజ్ఞుడైన సహ ఉద్యోగితో, “నేను బాగా చేశానా?” అని అడిగాడు. అతని సహ ఉద్యోగి, "అది ఒక బస్ స్టాప్ అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే, నువ్వు అంత చెడ్డగా ఏమీ చేయలేదు అన్నాడు.”

అవసరమైన స్పష్టత లేకుండా, మీరు చేయడానికి ప్రయత్నించేది ఏదైనా, అది ఒక విపత్తుగానే పరిణమిస్తుంది. కాంతి మీ దృష్టికి స్పష్టతను తెస్తుంది - భౌతిక కోణంలో మాత్రమే కాదు. మీరు జీవితాన్నీ ఇంకా మీ చుట్టూ ఉన్న ప్రతిదాన్నీ ఎంత స్పష్టంగా చూస్తారు అనేది, మీరు మీ జీవితాన్ని ఎంత విచక్షణతో నిర్వహిస్తారు అన్నదాన్ని నిర్ణయిస్తుంది. చీకటి శక్తులను చంపి, కాంతిని విరజిమ్మిన రోజు - దీపావళి. ఇదే మానవ జీవితంలోని దుస్థితి కూడా. వాతావరణం మేఘావృతమైనప్పుడు, తాము సూర్యుడిని అడ్డుకుంటున్నామని గ్రహించకుండా, కమ్ముకునే కారుమేఘాల లాగా, ఒక మానవుడు ఎక్కడి నుంచీ ఏ కాంతినీ తీసుకురావాల్సిన అవసరం లేదు. అతను తనలో, తాను కమ్ముకోనిచ్చిన కారుమబ్బులను చెదరగొడితే, వెలుగు అనేది కనిపిస్తుంది. దీపాల పండుగ దాన్ని గుర్తు చేసే ఒక సంకేతం.

జీవితాన్ని ఒక వేడుకగా చూడడం

భారతీయ సంస్కృతిలో, సంవత్సరంలోని ప్రతిరోజూ, ఒక పండుగ ఉండేది - ప్రతి సంవత్సరానికీ 365 పండుగలు. దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, మన జీవితం మొత్తాన్నీ ఒక వేడుకగా మార్చడం. నేడు, బహుశా కేవలం ముప్పై లేదా నలభై పండుగలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మనం ఇప్పుడు కనీసం వాటిని కూడా జరుపుకోలేకపోతున్నాము, ఎందుకంటే మనం రోజూ, ఆఫీసుకు వెళ్లాలి లేదా మరేదైనా పని చేయాలి. కాబట్టి ప్రజలు సాధారణంగా సంవత్సరానికి ఎనిమిది లేదా పది పండుగలను మాత్రమే జరుపుకుంటున్నారు. మనం దీన్ని ఇలా వదిలేస్తే, తరువాతి తరం వారికి అసలు పండుగలే ఉండవు. వారికి అసలు పండుగ అంటే ఏమిటో తెలీకుండా పోతుంది. వారు కేవలం సంపాదిస్తారు, తింటారు, సంపాదిస్తారు, తింటారు - వారు దీన్నే కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది విషయంలో ఇలా జరుగుతుంది. పండుగ అంటే, మీకు సెలవు ఇస్తారు, ఇక మీరు మధ్యాహ్నానికి నిద్ర లేస్తారు. అప్పుడు మీరు అతిగా తిని, సినిమాకి వెళ్ళడమో లేదా ఇంట్లోనే టీవీ చూడడమో చేస్తారు. ఇక బయటి నుండి ఉత్ప్రేరకాలు ఏమైనా తీసుకుంటేనే, వీళ్ళు ఏదో కొద్దిగా డాన్స్ చేస్తారు. లేదంటే వారు పాడరు, డాన్స్ చేయలేరు. ఇంతకు ముందు అది ఇలా ఉండేది కాదు. ఒక పండుగ అంటే, పట్టణం మొత్తం ఒక ప్రదేశంలో గుమిగూడి, ఒక పెద్ద వేడుక చేసుకునేవారు. ఒక పండుగ అంటే, మనం ఉదయం నాలుగు గంటలకు లేచేవాళ్ళం, ఇక ఇల్లు అంతటా ఎన్నో పనులు ఎంతో చురుకుగా జరిగేవి. ప్రజలలో ఈ సంస్కృతిని తిరిగి తీసుకురావడానికి, ఈశా నాలుగు ముఖ్యమైన పండుగలను జరుపుతుంది: పొంగల్ లేదా మకర సంక్రాంతి, మహాశివరాత్రి, దసరా ఇంకా దీపావళి.

సీరియస్ గా తీసుకోకపోవడం, అదే సమయంలో పూర్తిగా నిమగ్నం అవ్వడం

మీరు ప్రతి విషయాన్నీ ఒక వేడుక దృక్పధంతో వ్యవహరించినట్లు అయితే, మీరు జీవితాన్ని సీరియస్ గా తీసుకోకుండా ఉండడాన్ని, అదే సమయంలో జీవితంతో పూర్తిగా నిమగ్నం అవ్వడాన్ని నేర్చుకుంటారు. ప్రస్తుతం చాలా మంది మనుషులతో వచ్చిన సమస్య ఏమిటంటే, వారు దేన్నైనా ముఖ్యమైనదని భావిస్తే, వారు దాన్ని చచ్చేంత సీరియస్ గా తీసుకుంటారు. ఒకవేళ వారు అది అంత ముఖ్యమైనది కాదని భావిస్తే, వారు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు - వారు అవసరమైన నిమగ్నతని చూపించరు. “అతని పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది” అని ఎవరైనా చెప్పినప్పుడు, అతని తరువాతి అడుగు ఎక్కడికో మీకు తెలుసు. చాలామంది పరిస్థితి సీరియస్ గా ఉంది. వారికి ప్రాముఖ్యత ఉన్నది ఏదైనా జరుగుతుందీ అంటే, కేవలం అదే - అదొక్కటే. మిగిలినవి వారికి జరగవు. ఎందుకంటే, ఇది సీరియస్ విషయం కాదు అని భావించే దేనితోనూ, వారు నిమగ్నతని ఇంకా అంకితభావాన్ని చూపించలేరు.

మొత్తం సమస్య ఇదే. జీవిత రహస్యం కేవలం ఈ ఒక్క మాటలో ఉంది - ప్రతిదాన్నీ కుడా గంభీరమైనదిగా చూడకపోవడం, కానీ సంపూర్ణంగా నిమగ్నమవ్వడం - ఒక ఆటలో లాగా. జీవితంలోని అత్యంత లోతైన అంశాలను, వేడుకగా చూడడానికి కారణం అదే, తద్వారా మీరు విషయాన్ని మిస్ అవ్వకుండా ఉంటారని.

దీపావళి పండుగ ఉద్దేశం, మీ జీవితంలోకి వేడుక అనే అంశాన్ని తీసుకురావడమే - అందుకే టపాసులు - మీలో కొంచం నిప్పుని రాజెయ్యడం కోసం! కాబట్టి ఇక్కడ ఉద్దేశ్యం, కేవలం ఈ ఒక్క రోజున ఆనందించి, వెళ్ళిపోవడం గురించి కాదు. ప్రతిరోజూ కూడా ఇది మనలో ఇలాగే జరుగుతూ ఉండాలి. మనం అలా కూర్చుంటే, మన జీవ శక్తి, హృదయం, మనస్సు ఇంకా శరీరం, ఒక వెలుగుతున్న దివిటీ లాగా విరజిల్లుతూ ఉండాలి. మీరు నానిపోయిన మతాబు అయితే, అప్పుడు మీకు ప్రతిరోజూ బయటి నుండి ఒక టపాసు అవసరం అవుతుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు

Editor’s Note: At the Isha Yoga Center, major festivals, including Makar Sankranti and Pongal, Navratri and Mahashivratri are celebrated with great exuberance. These festivals are a part of Isha’s efforts to rejuvenate the ethos of Indian culture.

Indian Culture