మీలోని ఉండే ఎన్నో నిర్బంధాల వల్ల, పిచ్చితనం వల్ల లేక సమస్యల వల్ల మీ చుట్టూ ఉన్నవాళ్ళు బాధపడుతుంటారు. అన్నిటినీ మీరు ఎలాగో పోగొట్టుకోలేరు కాబట్టి వాటిలో నుండి కనీసం ఒక్కటైనా మీరు వదిలేయండి. ఎందుకంటే, మార్పు జరగకుండా, ఆధ్యత్మికతని ఉరికే మాటల్లో లేక హావభావాల్లో చూపిస్తే అది పనిచేయదు. మీలో ఏదో ఒక రూపాంతరం జరగాలి. దయచేసి ఇలా జరిగే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీరు ఎలా జీవించాలంటే, జీవించి ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్నవారు మీతో కలిసి ఉండేందుకు ఇష్టపడాలి, మీరు చనిపోతే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేనంతగా గుర్తుంచుకోవాలి.

ఒకరోజు ఇలా జరిగింది. శంకరన్ పిళ్ళై భార్య తను చేసిన సూప్ లో సరిపడేంత కన్నా ఐదు చెంచాలు ఎక్కువగా కారప్పొడి కలిపింది. ఆయన అనుభూతి ఎలా ఉంటుందో చూద్దామని, తన భర్తకి ఇచ్చింది. అది చాలా వేడిగా ఉంది. పిళ్ళై వార్తాపత్రిక చదువుతూ ఉన్నాడు. ఈమె ఎన్నో విధాలుగా సూప్ చల్లారిపోతోంది, తాగమని సైగలు చేసింది. అతను పత్రిక చదువుతూ ఉన్నాడు.

మీరు బతికున్నప్పుడు మీతో ఉండడానికి ప్రజలు ఇష్టపడాలి. మీరు చనిపోతే, మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.

ఇంతలో ఈమెకి ఒక చిన్న అనుమానం వచ్చి, తను చేసిన సూప్ నిజంగా అనుకున్నట్టు తయారయ్యిందా లేదా అనుకుని కొంచెం సూప్ ని నోట్లో వేసుకుంది. అంతే! నోట్లో ఒక అగ్ని పర్వతం పేలింది. లోపలి నుండి కన్నీళ్ళు జలపాతాల్లా పొంగుకొచ్చాయి. పిళ్ళై “ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావ్” అని అడిగాడు. అందుకామె, “ఏమీ లేదు. చనిపోయిన మా అమ్మకు ఈ సూప్ అంటే ఎంతో ఇష్టం. ఈ గిన్నెలో సూప్ ని చూడగానే నాకు ఆవిడే గుర్తొచ్చింది. అందుకే” అంది. ఓదార్పుగా పిళ్ళై “అలాగా” అంటూ సూప్ ని కుర్చీ పక్కన పెట్టుకుని మళ్ళీ వార్తాపత్రిక చదవడం మొదలెట్టాడు. అలా పత్రిక చదువుతూ ఒక చెంచా నిండ సూప్ ని తీసుకొని నోట్లో వేసుకున్నాడు. అంతే! ఇతని నోట్లో బ్రహ్మాండమే తలకిందులయ్యింది. అందుకామె “ఏమైంది. చనిపోయిన మా అమ్మ గురించి ఏడుస్తున్నారా? మీకు మా అమ్మంటే ఎంత ప్రేమ” అని అమాయకంగా అడిగింది. దీనికి పిళ్ళై, “నేను ఆమె చనిపోయినందుకు కన్నీళ్ళు పెట్టట్లేదు. ఆ పుణ్యాత్మురాలు నిన్ను నా దగ్గర వదిలి పెట్టి వెళ్ళిపోయిందని ఏడుస్తున్నాను” అన్నాడు.

జీవించాల్సింది ఈ రకంగా కాదు. మీరు బతికున్నప్పుడు మీతో ఉండడానికి ప్రజలు ఇష్టపడాలి. మీరు చనిపోతే, మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మీరు జీవించాల్సింది ఇలానే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు