సద్గురు: కొన్ని సంవత్సరాల క్రితం నేను ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్ళాను. అప్పటికే ఆర్ధిక మాంద్యం ఉండటం వల్ల అందరూ బాగా కుంగిపోయి ఉన్నారు. ఆర్థిక మాంద్యం - మానసిక కుంగుబాటు అనే అంశంపై నన్ను ప్రసంగించమన్నారు. తమ మానసిక కుంగుబాటును ఎలా అధిగమించాలో తెలుసుకోవాలనే వారితో ఆ హాలు క్రిక్కిరిసి ఉంది. నేను ‘‘అసలు ఆర్ధిక మాంద్యమే చెడ్డది, దానికి తోడు మీరు కూడా కుంగిపోవలసిన పనిలేదు” అన్నాను. మనం మన ఆర్ధిక వ్యవస్థను ఎలా మలచుకున్నామంటే అది విజయవంతం కాకపోతే మనం కుంగి పోతాం, విజయవంతం అయితే బాధ పడతాం. అందువల్ల రెంటిలో ఏది మంచిదంటే, మీరు కుంగి పోవటమే మంచిది అనుకుంటాను.

ఒక సగటు అమెరికన్ కు ఉన్నన్ని సదుపాయాలను భూగోళంలోని 700 కోట్ల ప్రజలకు లభించాలంటే మనకు 4.5 గ్రహాలు అవసరపడతాయని ‘లివింగ్ ప్లానెట్’ నివేదిక తెలుపుతోంది. కానీ మనకు ఉన్నది ఒకటే భూగోళం. ఈ ప్రపంచాన్ని సరి చెయ్యటానికి మనం ఎంతో సమయాన్ని వెచ్చించాము. దేన్నైనా సరి చెయ్యటం అంటే దాన్ని మెరుగు పరచటం. కాని మనం ఈ గ్రహాన్ని నాశనం వైపు మళ్ళించాము. ఏ స్థాయిలో చేశామంటే దాన్ని అలాగే కొనసాగిస్తే రాబోయే 20, 30 సంవత్సరాల్లో గొప్ప విపత్తు వస్తుంది.

ఈ వైరస్ ఇప్పుడు ఏమి చేసిందంటే ఆ విపత్తుకు ఒక “పాజ్” మీటను నొక్కింది. ఇప్పుడిక అది ఆర్ధిక యంత్రాన్ని బాగు చేసే అవకాశం వచ్చింది. అది నడుస్తున్నప్పుడు బాగు చెయ్యటం సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఎలాగూ ఆగి ఉన్నాం కాబట్టి, మరో విధంగా ప్రపంచాన్ని నడిపించటం ఎలా అని ఆలోచించ వచ్చు.

ఎరుకతో వినియోగించటం:-

ప్రస్తుతం ఉత్పత్తి శరవేగంగా విస్తరిస్తోంది. కాని అది ఎక్కడకు విస్తరిస్తోంది? అభివృద్ధి అంటే ఏమిటి? సమృద్ధి అంటే ఏమిటి? అని మనలను మనం ప్రశ్నించు కోవలసిన సమయం వచ్చింది. ఎక్కువ, మరింత ఎక్కువ కలిగి ఉండటమే సమృద్ధి కాదు. మనకు జీవించటానికి ఉన్నది ఒకటే భూగోళం. ఇలా నిరంతరం ఎక్కువెక్కువ సంపాదించుకుంటూ ఎంతకాలమో మనలేము. మనకు ఉన్నదానిలో ప్రతి మనిషికీ సంక్షేమాన్ని ఎలా అందించాలో ఆలోచించవలసి ఉంది.

ఉదాహరణకు మన దేశంలో స్మార్ట్ ఫోనులను కొనే వారిలో 40% శాతం మంది కేవలం ఒక సంవత్సరమే దాన్ని వాడుతున్నారు. భారత దేశంలో ఇంచుమించు ఏభై కోట్ల ఫోన్లను వాడటం లేదు. అవి ఎవరి ఇళ్ళల్లోనో వూరికే పడి ఉంటున్నాయి. ఎందుకంటే వారు కొత్త మోడల్ ఫోనును కొనుక్కుంటున్నారు.

ఒక ఫోనును కొంటె కనీసం ఇంత కాలం దాన్ని ఉపయోగించాలి అనే చట్టాన్ని ఎందుకు చెయ్యకూడదు? ఒకవేళ అది పగిలిపోతేనే అది ఇచ్చి మరొకటి తీసుకోవచ్చు అని చట్టాన్ని ఎందుకు చెయ్యకూడదు? అలాగే మీరొక కారును కొంటే దాన్ని కొంత కాలం వరకో లేదా కొంత మైలేజి వరకో నడపాలి. ఇనుము, అల్యూమినియం వంటి ముడి పదార్థాలను తయారు చేయటంలో కొన్ని పరిమితుల్ని విధించాలి. ఎందుకంటే దేశాలు వచ్చే 25 సంవత్సరాల్లో వారి ఉత్పత్తి స్థాయిని పెంచుకోలేవు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొంత వెసులు బాటు ఇవ్వవచ్చు, అవి కూడా ఒక స్థాయికి చేరాక అక్కడ ఆగిపోవాలి. లేకపోతే మన వినియోగం అంతకంతకు అదుపులేకుండా పోతుంది.

ఒకప్పుడు ప్రతి వారికీ ఐదారుగురు పిల్లలు ఉండే వారు, ఇప్పుడు ప్రతి వారూ ఒకరు లేక ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. కొందరు అది కూడా వద్దనుకుంటున్నారు. మనం పిల్లల విషయంలో దీన్ని సాధించగలిగినప్పుడు, ఫోను, కారు వంటి విషయంలో సాధించలేమా? ఆపని మనం ఇప్పుడు చెయ్యకపోతే, వచ్చే పాతిక ముప్ఫై సంవత్సరాల్లో మనం ఈ వైరస్ పరిస్థితి కంటే హీనమైన పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది. వాతావరణ పరిస్థితులు మనచేయ్యి దాటిపోయాక, మనం ఎటువంటి దుస్థితిలోకి జారిపోతామంటే ఇప్పటి వైరస్ కంటే పెద్ద దుస్థితి.

మీరు ‘ సద్గురు మీరు పుండుమీద కారం రాస్తున్నారు, మాకు పరిశ్రమలను ఎలా నిర్వహించాలో తెలీదు, ఎలా ఉద్యోగ కల్పన చెయ్యాలో తెలియదు, మరి మీరేమో ఉత్పత్తి తగ్గించాలని అంటున్నారు” అని అంటారు. నేను కాదు, ప్రకృతి అణచి వేస్తోంది. మనం ఆ సందేశాన్ని వినాలి.

విద్యా విధానంలో పరిణామం :-

సంఘంలో విద్యావిధానం చాలా ఘోరమైన స్థితిలో ఉంది. అందువల్ల ఎన్నో ఇతర సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు కిండార్ గార్టెన్ నుండి పిల్లలకు మొదటి స్థానంలో ఉండాలని బోధిస్తున్నాము. ఇది చాలా వినాశకర విధానం, ఎందుకంటే మొదటి స్థానం ఒక్కటే ఉంటుంది, అది తాను అయి తీరాలి. దీని అర్థం వారు ఉన్మాదంలో పడతారు అని. దురదృష్ట వశాత్తు ఈ విధానం అన్ని చోట్లా కొనసాగుతోంది. నిజానికి అది పాఠశాలలో ప్రారంభమై ప్రపంచంలో ఇంకా విస్తారంగా బయట పడుతోంది.

“మందలు మందలుగా అందరూ విద్యను అభ్యసించటం” ఇంచుమించు రెండు వందల సంవత్సరాల క్రితం పాశ్చాత్యదేశాల్లో, అప్పుడు జరుగుతున్న పారిశ్రామికీకరణకు అనుకూలంగా ఆ విధానం ప్రారంభమైంది. వ్యక్తుల ప్రతిభను, అవసరాన్ని, సున్నితత్వాన్ని, అసాధారణతలను, మేధను పట్టించుకోకుండా అందరికి పనికి వచ్చే ఒక విద్యా “ ప్యాకేజి”ని తయారు చేశారు. దానితో ప్రతి ఒక్కరిని మూసలో వేసి నొక్కేసి, విస్తృత ఆర్థిక యంత్రంలో ఇమిడే ఉత్పత్తిగా మార్చే మూకుమ్మడి విధానం తయారయింది.


 


నేను పాఠశాలలో చదివే రోజుల్లో, అందరూ ఒకచోట కూర్చుని ఒక వ్యక్తి పుస్తకం నుండి చదువుతుంటే ఎందుకు వింటారా? అని అనుకుంటూ ఉండే వాణ్ణి. నేను చాలా అరుదుగా అక్కడకు వెళ్ళే వాడిని. నాకు అందులో అర్థం కనిపించేది కాదు, అందుచేత బయట తోటలో కూర్చునే వాడిని. ప్రజలను విద్యావంతులను చెయ్యటానికి మనం ఎంతెంత విశాలమైన భవంతులను నిర్మించాం! ఒకానొక సమయంలో - విద్య అయినా, పరిశ్రమ అయినా - ప్రతిదీ అలా పెద్ద ఎత్తున ఉత్పత్తి చెయ్యటం అవసరమని భావించాము. కాని ఇవాళ - పరిజ్ఞానం, జ్ఞానం - రెండూ విరివిగా ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతున్నాయి. తమ తమ జీవన సాఫల్యాలను కనుగొనటానికి, మానవాళికి స్ఫూర్తిని ఇచ్చేవారు, ఇవాళ మనకు కావాలి.

విద్య అంటే బుర్రనిండా వివిధ విషయాల పరిజ్ఞానం కుక్కుకోవటం కాదు. విద్య అంటే మానవుని సమగ్ర అభివృద్ధి. ప్రస్తుతం మానవుడు వ్యక్తిగా తాను విస్తరించటం కానీ, తన పరిధులను విస్తరించుకోవటం కాని జరగటం లేదు. సాధారణంగా విద్య అంటే పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరించి, పరీక్షలు పాసై ఉద్యోగం సంపాదించటం. కొన్ని దశాబ్దాల క్రితం ఉద్యోగం సంపాదించటమే విద్యకు లక్ష్యం. ఇప్పుడు ఆర్థిక ప్రగతి సాధించాక మన ధోరణి మారవలసి ఉంది. విద్య అనేది కేవలం ధన సంపాదనకు మాత్రమేకాదు, వ్యక్తిగా విస్తరించి వృద్ధి చెందాలి.

ఓ పదిశాతం ఎక్కువ చేతనగల ప్రపంచం.

మనం ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నామో చూద్దాం. ప్రతిరోజూ 8000 మంది పిల్లలు పోషకాహార లోపంతో మరణిస్తున్నారు. వీరందరికి ఆకలి లేకుండా కడుపు నింపాలంటే, నెలకు 970 నుండి 980 కోట్ల డాలర్లు అవసరం అవుతాయి. ఈ మొత్తం ఎంత అంటే, ఈ ప్రపంచం వీడియో గేములకు నెలకు పెడుతున్న ఖర్చు ఎంతో అంత! ఈ ప్రపంచం మద్యం, పొగాకు, మాదక ద్రవ్యాలమీద పెడుతున్న ఖర్చు, ఆహారం మీద పెడుతున్న ఖర్చుతో సమానం. ఈ ప్రపంచంలో మానవులు అకలితో ఉండటం ఆహారం లేక కాదు, మానవుల బుద్ధి వక్రించటం వల్ల. మనకు వనరులు ఇదివరకటి కంటే ఇప్పుడు సమృద్ధిగా ఉన్నాయి. మన వద్ద ఇదివరకటి కంటే ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. 

ఇవాళ ఈ భూగ్రహం మీద ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తగినంత శాస్త్ర పరిజ్ఞానం, వనరులు, సమర్థత మనకు ఉన్నాయి. గతంలో ఎన్నడూ మానవజాతి ఇప్పుడున్నంత సామర్థ్యంతో లేదు. ఇప్పుదు మానవాళిలో లోపించినదల్లా మానవ చేతన. మనం చైతన్య వంతులైన మానవాళిని, చైతన్య పూరితమైన భూగోళాన్ని సృజించ వలసి ఉంది. ఇప్పటికంటే ఒక పదిశాతం ఎక్కువ చైతన్య వంతంగా ఉన్నా కోవిడ్ 19 తరువాత ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. అలా చేసే అవకాశం ఉన్న తరం మనది. మనం దీన్ని ఆచరణలోకి తెస్తామా లేదా అనేది పెద్ద ప్రశ్న

 

ప్రేమాశీస్సులతో,

సద్గురు

Editor's Note: : Make the most of challenging times with Inner Engineering Online. Available free of cost for COVID Warriors and at 50% off for everyone else.