లాక్డౌన్ అనంతరం భారత ఆర్ధికవ్యవస్థ

సద్గురు: ఈ కష్టకాలంలో, వ్యక్తులు, సంస్థలు, చిన్న- పెద్ద వ్యాపారాలు అన్నీ కొంతైనా దెబ్బతింటాయి అనడంలో సందేహం లేదు. కానీ దీనితో ప్రపంచమేమీ అంతమైపోదు! ఎన్నోఏళ్ళ తరబడి నిర్మింపబడిన వ్యాపారాలు, కొన్ని వారాల కాలంలో కుప్పకూలి దివాళా తీయవు.

మీ శరీరం, మనసులపై మీరు ఎంతబాగా పట్టుసాధించారనే విషయమే, ప్రపంచంలో మీ విజయాన్ని నిర్ణయిస్తుంది.

ఖచ్చితంగా ఆర్ధికపరమైన మూల్యం మనం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇది భయాందోళనలకు లోనయ్యే సమయం కాదు. మీరు మీలో ఒక విధమైన ఆహ్లాదాన్ని పొందినప్పుడు మీ శరీరం మరియు మనస్సులు వాటి అత్యుత్తమ సామర్ధ్యం మేరకు పనిచేస్తాయి అనడానికి శాస్త్రీయంగా, వైద్యపరంగా ఖచ్చితమైన ఋజువులు ఉన్నాయి. మీరు భయాందోళనల్లో ఉన్నప్పుడు, మీ పనితీరు అంత మెరుగ్గా ఉండదు. మీరు స్తంభించిపోతారు. ప్రత్యేకించి సంక్షోభ సమయంలో, మీరు మరింత ఆనందంతో ఉండాలి. అందుకు సహాయపడే పలు సాధనాలను మేము మీకు అందిస్తున్నాము. మీరు వాటిని ఆన్‌లైన్ లో పొందవచ్చు. దయచేసి వీటిని సద్వినియాగం చేసుకోండి. ఎందుకంటే, మీరు మీ శరీరం ఇంకా మనసుపై ఎంతబాగా పట్టుసాధించారనే విషయం, ప్రపంచంలో మీ విజయాన్ని నిర్ణయిస్తుంది.

భారత ఆర్ధిక పురోగతికి వినూత్న పరిష్కారాలు

 

#1 వ్యాపారాలను భారతదేశం వైపు ఆకర్షించడం

సద్గురు: దేశీయ మార్కెట్లను, పరిశ్రమలను మనం తిరిగి గాడిలో పెట్టాలంటే, దేశం బయటినుండి పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం అవసరం. మన పక్కన ఉన్న దేశాలపట్ల ఇంతకు ముందు చూపిన ఆర్ధిక విశ్వసనీయత తీవ్రస్థాయిలో కొరవడినందువల్ల, ఎందరో ప్రస్తుతం అక్కడ నుండి వ్యాపారాలను తరలించేందుకు చూస్తున్నఈ తరుణం, మనకు ఒక మంచి అవకాశం. తమ సంస్థలను అక్కడనుంచి తరలించేందుకు జపాన్ ఇప్పటికే వందలకోట్ల డాలర్లను కేటాయించింది. ఇంకా అమెరికా కూడా మరింత గట్టిదేదో చేస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను.

ప్రపంచంలో 300 కు పైగా పెద్ద పెద్ద సంస్థలు, పూర్తిగా కాకపోయినా, పాక్షికంగానైనా కొత్త గూటి కోసం చూస్తున్నాయి. ఇది ఒక గొప్ప అవకాశం. దీనివల్ల ప్రయోజనం పొందేందుకు భారతదేశానికి మంచి అవకాశం ఉంది. పరిశ్రమల వారు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వం కూడా దీనికి ఎంతో కృషి చేయవలసి ఉంది. అయితే, ఎంత సమర్ధతతో, ఎంత ఆతృతతో మనం వీటిని పొందగలం అనేదే, మన విజయాన్ని నిర్దేశిస్తుంది. ఈ 300 సంస్థలు పాక్షిక ఉత్పత్తి కోసమైనా భారదేశానికి వచ్చి, అదే సమయంలో ఏదోవిధంగా వీటిని మనం 28 రాష్ట్రాలకూ విస్తరించగలిగితే, మన ఆర్ధికవ్యవస్థను పరుగెత్తించగలం.

#2 సరికొత్త ఆవిష్కరణల విషయంలోమనం మన మూలాల్లోకి వెళ్ళాలి

సద్గురు: భారతదేశం సరికొత్త ఆవిష్కరణలకు ఆలవాలమైన సమాజం అని మనం ఎప్పుడూ జబ్బలు చరుచుకుంటూ ఉంటాం. మన సరికొత్త ఆవిష్కరణల సామర్థ్యం ఎంతటిదో, మనం నిజంగా చూపించాల్సిన సమయం ఇది. ఈ మహమ్మారి, మనతరం ఎదుర్కొన్న సవాళ్లలో అతిపెద్ద సవాలు. అయినా మనం దీన్ని సమర్ధవంతంగా అధిగమించగలం. ఒక దేశంగా, మనకు నిర్దిష్టమైన అనుకూలతలున్నాయి. ఇంకా రాజకీయ పరంగా, స్థాన పరంగా మనకు కొన్ని అనుకూలతలు ఉన్నాయి.

ఆసియా, ఇంకా ప్రపంచ ఆర్ధికాభివృద్ధిని పోలిస్తే, దురదృష్టవశాత్తూ, గతకొన్ని దశాబ్దాలుగా మనం వెనుకబడి ఉన్నాం. చాలా ఆసియా దేశాలు మనకంటే కనీసం ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలు ముందున్నాయి. మనం దీన్ని సమం చేయడానికి రాబోయే మూడు నుండి ఐదేళ్ళ సమయం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది.

మనం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి మన దగ్గర మంత్రదండం ఏదీ లేదు. మనమందరం ఏమిచేస్తున్నామనే ప్రాధమిక అంశాలను పునరాలోచించాలి. మనం అపారమైన ఆవిష్కరణలు చేసేందుకు సిద్ధంకావాలి. ప్రస్తుతం ఉన్న మనం ఉంటున్న సౌఖ్యాలనుండి దిగి వచ్చి, అనేక విషయాలలో పునరావిష్కరణ చేయాలి.

#3 గ్రామీణ భారత పునరుద్దరణ

సద్గురు: గణాంకాల ప్రకారం, ప్రపంచపు మొత్తం పెట్టుబడులలో 72% కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30 నగరాలకే పరిమితమైంది. మరి అటువంటప్పుడు ఇతర ప్రాంతాలనుండి ప్రజలు అక్కడకి వలస వెళ్ళడం సహజం. భారతదేశంలో, 22 కోట్లమంది ప్రజలు గ్రామాలనుండి పట్టణాలకు వలస వెళతారు అని అంచనా. ఇదే గనుక జరిగితే, నగరాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఊహించవచ్చు.

దేశంలోని ఏడువందలకు పైచిలుకు జిల్లాలకు పరిశ్రమలను విస్తరించడంపై మనం దృష్టి పెట్టకపోతే, వలసలను ఆపడం మరింత కష్టతరం అవుతుంది.

మనం దీన్ని అరికట్టాలంటే, పెట్టుబడులు అంతటా వచ్చేలా చూడాలి. మాంచెస్టర్ లోలాగా, పరిశ్రమలన్నింటినీ ఒకేచోట నిర్మించే శైలి మారాలి. ఇక్కడే పెద్ద స్థాయిలో ఉత్పత్తి జరగడం ప్రారంభమైంది. దీని శైలి ఏమిటంటే, అంతా ఒకే చోట జరగాలి. ప్రతిఒక్కరూ ఒకే చోటకి వచ్చి పనిచేయాలి అని. కానీ పరిశ్రమలన్నీ కొన్ని నగరాలకే పరిమితం కావాల్సిన అవసరం లేదు. అది విస్తరించాలి. దేశంలోని ఏడువందల పైచిలుకు జిల్లాలకు పరిశ్రమలను విస్తరించడంపై మనం దృష్టి పెట్టకపోతే, వలసలను ఆపడం మరింత కష్టతరం అవుతుంది.

ప్రస్తుతం, భారత ఆర్ధిక వ్యవస్థ, చాలా ఇరుకుగా, ఒకేచోట కేంద్రీకృతమై ఉంది. అది సురక్షితమైన ఆర్ధిక నిర్మాణ విధానం కాదు. దానిని విస్తరింపజేయాలి. అందుకున్న ఏకైక మార్గం ఏంటంటే, వాటిని ఏదోవిధంగా గ్రామీణ భారతానికి వ్యాపింపజేయడం. అది చాలా కష్టం అని నేను అర్థంచేసుకోగలను. ఎందుకంటే, గ్రామీణ ప్రాంతాలలో, ప్రతిభను వెలికితీసి, ప్రజలకు శిక్షణ ఇవ్వడం చాలా ప్రయాసతో కూడుకున్నది. కానీ, మీరు గనుక ఇప్పుడిది చేస్తే, అది మరింత సుస్థిరమవుతుంది. ఒకవేళ, పది సంవత్సరాల తరువాత, వైరసో లేదా మరొకటో మన పైకి వస్తే, మనం మరింత మెరుగ్గా ఆ పరిస్థితులనుండి నెగ్గుకురాగలం.

వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు ఒక పెద్ద అవకాశం. సంప్రదాయ పంటలతో పాటు, వృక్ష వ్యవసాయం ద్వారా చెట్లు పెంచబడితే, గ్రామీణ ఆర్ధికవ్యవస్థ దిశ-దశ లను అది మార్చేయగలదు. మేము 69,760 రైతులను వృక్షవ్యవసాయానికి మారేందుకు చేయూతనిచ్చాం. దానిద్వారా వాళ్ళ ఆదాయం 5-7 ఏళ్ళలో 300-800% పెరిగింది. ఆర్ధిక అవకాశాలు మొత్తం భూభాగమంతా విస్తరించాలి. వృక్ష వ్యవసాయం ఈ దిశగా వేసే ఒక ప్రధానమైన అడుగు.

4. వ్యవసాయంలో వ్యాపార అవకాశాలు

సద్గురు: ప్రస్తుత ప్రపంచంలో, 60% జనాభాకు మట్టిని ఆహారంలా మార్చే ఇంద్రజాలం తెలిసిన ఏకైక దేశం భారతదేశం. మనకు సంవత్సరంలో పన్నెండు నెలలూ ఆహారాన్ని పండించే సామర్ధ్యం ఉంది. ప్రపంచంలో ఏ పంటనైనా పండించడానికి అనువైన నేల, వాతావరణ పరిస్థితులు మనకు ఉన్నాయి. రాబోయే ఐదు నుండి పదేళ్ళలో, మనం సరైన చర్యలు తీసుకుంటే, మనం భారతదేశాన్ని ప్రపంచానికి అన్నదాతగా మార్చవచ్చు. మనం దీనిపై శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ప్రజలు, భూమి, భారతదేశపు సిరి సంపదలు అక్కడే ఉన్నాయి.

5. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయడం

సద్గురు: విద్యావ్యవస్థలో చాలకాలంగా భారీమార్పులు తీసుకురావలసి ఉంది. వైరస్ కు, కృత్తిమ మేథ (artificial intelligence) కు ధన్యవాదాలు. మనకు తెలిసిన విధంగా పాఠశాలలు ఇక ఉండబోవు.

ప్రస్తుతం, పాఠశాల వ్యవస్థ, విద్యార్ధులకు కేవలం సమాచారాన్ని అందిస్తుంది. ఇది నిరర్ధకంగా మారింది, ఎందుకంటే, ఈ సమాచార యుగంలో సమాచారం ప్రతిచోటా అందుబాటులో ఉంటుంది. అది తెలుసుకోవడానికి మీకు ఒక టెక్స్ట్ బుక్ అవసరం లేదు. ఉపాధ్యాయులు సమాచారాన్ని అందిచాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్ఫూర్తిని , శ్రద్ధను, ప్రయోగాత్మకత ఇంకా వివిధ ఇతర అంశాలను అందించాలి.

మనం ఎలాంటి నిర్మాణాన్ని ఏర్పాటుచెయ్యాలంటే, మీకు పద్దెనిమిదేళ్ళు వచ్చేసరికి, మీరు విశ్వవిద్యాలయానికైనా వెళ్ళాలి లేదా జీవనోపాధికి కావలసిన కొన్ని నైపుణ్యాలను మీరు కలిగి ఉండాలి.

ప్రస్తుతం నెలకొన్నఅతిపెద్ద ప్రమాదం ఏంటంటే, చదువుకున్న వారి ధోరణి కలిగిన యువత కోకొల్లలుగా ఉన్నారు. కానీ, వారికి రెండుకి రెండు కూడడం కూడా తెలియదు. ఉదాహరణకు, తమిళనాడులో ఉన్న చట్టం ఏంటంటే, ఉత్తీర్ణతతో నిమిత్తం లేకుండా ప్రతివిద్యార్థి పదవ తరగతి వరకూ ఫ్రతి సంవత్సరం ఉన్నతి పొందుతాడు. ఇది వల్లమాలిన కరుణ. దీనివల్ల, పొలంపని లేదా వాళ్ళ నాన్నగారు చేస్తున్న వ్యాపారమో చేయలేని పిల్లలు చాలామందే తయారయ్యారు. ఎందుకంటే, వాళ్ళకు శరీర దారుడ్యం కానీ, లేదా పనికి వెళ్ళాలన్న ఆలోచన కానీ లేదు. కాని వాళ్ళు విద్యావంతులం అని అనుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి యువత దేశంలో లక్షలాది మంది ఉన్నారు. ఇది నేరాలకు, ఉగ్రవాదానికి, తీవ్రవాదానికి ఇంకా అన్నిటికీ ఆలవాలం. ఎందుకంటే, ఏవిధమైన నైపుణ్యతలూ లేకుండా యువత రోడ్ల మీద తిరుగుతున్నారు.

మనం ఎలాంటి వ్యవస్థతను ఏర్పాటుచెయ్యాలంటే, మీకు పద్దెనిమిదేళ్ళు వచ్చేసరికి, మీరు విశ్వవిద్యాలయానికైనా వెళ్ళాలి లేదా కొన్ని జీవనోపాధి నైపుణ్యాలను మీరు నేర్చుకుని ఉండాలి. మీకు ఈ రెండూ లేకపోతే, మిమ్మల్ని మిలటరీలో లేదా పారామిలటరీలో లేదా ఒక సంవత్సరం పాటు నైపుణ్యాలపై శిక్షణనిచ్చే సంస్థకో పంపాలి. భౌతికంగా, మానసికంగా దృఢత్వాన్ని సంతరించుకునే శిక్షణను వారికి అందించాలి. ఇంకా ఒకదానిపై నైపుణ్యతను పెంపొందించుకుని, దాన్ని అమలుచేసే క్రమశిక్షణ వారు అలవరచుకోవాలి.

దీనివల్ల దేశంలో అపారమైన నైపుణ్యం అభివృద్ధి అవుతుంది. ప్రతి ఒక్కరికీ విద్యా మనస్తత్వం లేదు. వారు విశ్వవిద్యాలయానికి వెళ్ళవలసిన అవసరం లేదు. వారు ఇతర నైపుణ్యాలు, ఆవిష్కరణలు మరియు అనేక రకాల విషయాలను నేర్చుకోవాలి.

పరిశ్రమలకు నైపుణ్యతలు అవసరం. తమ పరిశ్రమ అవసరాల నిమిత్తం పదవ తరగతి విద్యార్ధులకు దీర్ఘకాలిక పెట్టుబడితో కొంత శిక్షణ వారు అందించవచ్చు. కొన్ని అంతరాయాలు కలగవచ్చు. కానీ మనం వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధతతో ఉండాలి. అప్పుడు మాత్రమే, ఈ యువతకు గల సామర్ధ్యాన్ని మనం వెలికితీయగలం.

6. వ్యర్ధాలనుండి సంపద సృష్టించడం

సద్గురు: భారతదేశంలో, ఏవో కొన్ని మినహా, చాలా నగరాలకు సరైన ప్రణాళిక లేదు. వందల సంవత్సరాలుగా అవి అడ్డదిడ్డంగా విస్తరిస్తూ వచ్చాయి. దీనివల్ల, పారిశుధ్యం ఒక పెద్ద సవాలుగా మారింది. మనం దీన్ని సరిచేయాలంటే, చేయాల్సిన అతి ముఖ్యమైనపని ఏంటంటే, పారిశ్రామిక వ్యర్ధాలను, గృహ సంబంధిత వ్యర్ధాలను స్పష్టంగా విభజించాలి.

ఈరోజు, వ్యర్ధాలను సంపదలా మారేందుకు చాలా సాంకేతికతలు ఉన్నాయి. అది ఆర్ధికంగా విలువైనదే అయితే, ప్రజలు దాన్ని వృధాగా పోనివ్వరు. ప్రస్తుతం, కాలుష్య పరిశ్రమలకు దేశంలో ఉన్న చట్టం ఏంటంటే, వారంతట వారే స్వయంగా పారిశుధ్య ప్లాంటును ఏర్పాటు చేసుకోవాలి. మనం చేసిన అతి పెద్ద తప్పు ఇదే. ఎందుకంటే అటువంటి ప్లాంట్లు కేవలం తనిఖీలు చేసే రోజున మాత్రమే పనిచేస్తాయి! మీ వ్యర్ధాలు మా సంపద, మా ముడిసరుకు, అనే విధంగా పారిశుధ్య నిర్వహణ ప్లాంట్ల పరిశ్రమ ఎదగడం అతి ముఖ్యమైన అంశం. అప్పుడు ముడిసరుకు సక్రమంగా అందేలా, నా వ్యాపారం దాన్ని నిర్వహించేలా నేను చూసుకుంటాను. మీరు పారిశుద్ధ్య పరిశ్రమని మరింత లాభసాటిగా మలచవచ్చు.

గృహసంబంధిత వ్యర్ధాల విషయానికొస్తే, ఎలాగైతే వినియోగించిన నీటికి, విద్యుత్తుకి డబ్బుచెల్లించవలసి ఉంటుందో, అలాగే మీరు ఎంత మోతాదులో వ్యర్ధాలను వదులుతున్నారు అనే దానికి కూడా తగినంత డబ్బుచెల్లించే పధ్ధతి రావాలి. ఇది జరగాలి. లేకపోతే, దాని నిర్వహణకు సరిపడా నిధులు సమకూరవు. ఈరోజు, వ్యర్ధాలను సంపదలా మార్చేందుకు చాలా సాంకేతికతలు ఉన్నాయి. అది ఆర్ధికంగా విలువైనదే అయితే, ప్రజలు దాన్ని వృధాగా పోనివ్వరు. ఇది వ్యర్ధాల నుండి సంపదకు సాగించే ప్రయాణం కాగలదు

ప్రేమాశీస్సులతో,

సద్గురు