ఒక్కొక్కసారి కోపం మీ వశం తప్పుతుందా, తరువాత ఫలితాలకు బాధపడవలసి వస్తుందా? మనమీద కోపానికి ఉన్న పట్టును గురించి, ఆ విషయంలో మనమేం చేయగలమో అన్నదాన్ని గురించి ఒక ప్రశ్నకు సద్గురు సమాధానం చెప్తున్నారు.

ప్రశ్న  :  కొన్ని సన్నివేశాల్లో మనం సంయమనం కోల్పోతాం, కాని, తర్వాత అది మన మూర్ఖత్వమని తెలుసుకుంటాం. అప్పటికి ఆలస్యమైపోతుంది. మన కోపాన్ని నియంత్రించుకోవడమెలా?

 కోపాన్ని నియంత్రించుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కోపంగా ఉన్నారా? లేదు. లేని దాన్ని నియంత్రించుకొనే అవసరమేముంటుంది? అసలు లేనిదాన్ని మీరెట్లా నిగ్రహిస్తారు?

కోపం అనేది ఒక స్థాయి అసంతృప్తి, మీలోనూ మీ చుట్టూ ఉన్న వారిలోనూ ఉంటుంది. చాలాసార్లు మీ కోపానికి గురయిన వ్యక్తికంటే మీరే ఎక్కువ బాధపడతారు. మీకు కోపం వచ్చినప్పుడు మీ జీవితంలో ఎప్పుడూ చేయనంత మూర్ఖమైన పనులు చేస్తారు. ఆ విధంగా జీవించడం అంత తెలివైన పద్ధతేమీ కాదు.

దేనిపట్లనైనా కోపం రావడమన్నది మనకుండే గాఢమైన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. మీ ఉద్దేశంలో మీది  అత్యంత ఉత్తమమైన జీవన పద్ధతి అని. ఒక విధమైన ఆలోచనా విధానం నుండి, అనుభవం నుండి ఏర్పడే దృఢమైన గుర్తింపే దీనికి కారణం. ఎవరైనా ఈ పద్ధతికి భిన్నంగా ప్రవర్తిస్తే మీకు వాళ్లమీద కోపం వస్తుంది. దేని  విషయంలో అయిన మీ ఇష్టాలు, మీ అయిష్టాలు, మీ గుర్తింపులు బలపడితే, మీరు సృష్టి నుండి దాన్ని వేరుచేస్తున్నారన్నమాటే. ‘నాకిదంటే చాలా ఇష్టం’ అని మీరన్నారంటే అది కానిదాన్నంతా పెద్ద ఎత్తున తిరస్కరిస్తున్నారన్నమాట. మీ ఇష్టాయిష్టాలు ఎంత దృఢపడితే మీరు అన్నిటి నుండి విడిగా ఉన్నట్లు వ్యవహరించడం  కూడా అంత దృఢపడుతుంది. దేన్నో, ఎవరినో మీలో భాగంగా మీరు స్వీకరించనందువల్లే క్రోధం పొంగిపొరలుతుంది. ముక్తి అంటేనే అన్నిటితో మమేక మవ్వడం. వేరుచేయడం కాదు. అన్నిటినీ కలుపుకోవడంలోనే మీకు ముక్తి లభిస్తుంది. ఏ రోజున ప్రతి దాన్నీ, మొత్తం సృష్టిని మీలో కలుపుకుంటారో ఆరోజు మీరు విముక్తులవుతారు. వేరు చేయడం లేదా తిరస్కరించడం అంటే  మీరు వలలో పడినట్లే.

కోపం మీరు సృష్టించుకున్నదే

మీకు కోపం రావాలని మీరు కోరుకోరు. అదలా వస్తుంది, ఎందుకంటే మీ లోపల ఏం జరుగుతుందో దానికి వెలుపల నుండి అవకాశాన్ని మీరు సృష్టించుకుంటున్నారు - అయితే అది వాస్తవం కాదు. దాన్ని మీరే సృష్టిస్తున్నారని తెలుసుకోండి. మీకు అవసరం లేనిదాన్ని, మీరు వద్దనుకున్న దాన్ని మీరెందుకు సృష్టించుకుంటున్నారు? దీనికి ప్రాథమికమైన కారణం ఒక్కటే - మీకు మీ గురించి తెలియదు.

మీ వ్యవస్థ ఎలా పని చేస్తుందో, దాన్ని ఎలా నిర్వహించాలో మీకు తెలిసినట్లయితే మీరు కోపాన్ని ఎందుకు సృష్టిస్తారు? కోపం బాహ్య పరిస్థితినే కాదు, అంతః పరిస్థితిని కూడా చెడగొడుతుంది. ప్రజలు వారిలో విపరీతమైన కోపాన్ని కల్పించుకొని, వారంతట వారే ఆరోగ్య సమస్యలు సృష్టించుకుంటున్నారు. అదే విధంగా బయటి పరిస్థితులకు కూడా ఇటువంటి ఫలితాలే కలుగుతాయి.

మీరు చేసిన ప్రతిపనికీ ఒక ఫలితం ఉంటుంది. దాన్ని మీరు పరిహరించలేరు. మీరు ఫలితాన్ని పరిహరించలేనప్పుడు, మీరు చేసే పనినే నియంత్రించుకోవలసి ఉంటుంది. ఒక వ్యక్తి తన అంతరంగంలో నియంత్రణ కలిగి ఉన్నప్పుడు మాత్రమే తన చర్యలను నియంత్రించుకోగలుగుతాడు. తనకి సంపూర్ణ సమతుల్యత కలిగి ఉన్నప్పుడే అనుగుణమైన చర్య నిర్వహించగలుగుతాడు. అయినా దానికీ ఫలితాలుంటాయి. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఉన్నదున్నట్లుగానే జీవితంలో కావలసినన్ని పరిణామాలుండనే ఉన్నాయి. మీకోసం మీరు కష్టపడి మరిన్ని పరిణామాలను సృష్టించుకోవలసిన అవసరం లేదు.

అందువల్ల ముఖ్యంగా మీ చుట్టూ చెత్త నిండుకొని ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు సాధ్యమైనంత సంతోషకరమైన పద్ధతిలో ఉంచుకోవడంకాని, ఆ సంతోషాన్ని మీ చుట్టూ వ్యాపించేటట్లు చేయడంకాని చాలా ముఖ్యం కాదా? మీ చర్యలు మీరు వివేకంతో చేస్తే అవి ఈ పద్ధతిలోనే ఉంటాయి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, మీరు మిమ్మల్ని సాధ్యమైనంత ఆనందంగా ఉంచుకోవడమూ, అది సంభావ్యమయ్యేట్లు చూడడమూ కదా కావలసింది. మీరెలా ఉంటే మీ చుట్టూ అలా ఉంచగలుగుతారు. మీరు కోపంగా ఉంటే, కోపాన్నే వ్యాపింపజేస్తారు. కోపం వల్ల మీ చుట్టూ సంతోషకరంగా లేని పరిస్థితులు ఏర్పడతాయి.

తీవ్రతను కోరుకోవడం

కోపానికి చాలా తీవ్రత ఉంటుంది. మనిషి కోరుకునేది తీవ్రతనే. థ్రిల్లర్‌లు, యాక్షన్ ప్రధానమైన సినిమాలు, క్రీడోత్సవాలు ఎందుకింత జనాదరణ పొందుతున్నాయి? ఎందుకంటే జనం ఎక్కడో తీవ్రతను కోరుకుంటున్నారన్నమాట. అటువంటి గాఢత, తీవ్రత వాళ్లకెక్కడ లభిస్తుంది? అది భౌతికమైన చర్యలోనో, కోపంలోనో, బాధలోనో లభిస్తుంది. ప్రపంచంలో సెక్సు, మాదక ద్రవ్యాలకు ఇంత ప్రాముఖ్యం ఎందుకు వచ్చింది? ప్రజలు  కొన్ని క్షణాలకోసమైనా ఒక గాఢమైన అనుభవాన్ని కోరుకుంటున్నారు కాబట్టి. గాఢత మిమ్మల్ని చాలా వాటినుండి విముక్తి చేస్తుంది. సమస్య ఏమిటంటే కోపం కూడా అట్లాగే ఉండే స్వచ్ఛమైన గాఢత కాదు; అది చుట్టూ ఉన్న పరిస్థితులతో ముడిపడి ఉంటుంది.

మీ కోపమొక్కటే మిమ్మల్ని చర్యకు పురికొల్పవలసిన అవసరం లేదు. మీ జీవితంలో మీరు పొందిన అత్యంత గాఢమైన అనుభవం బహుశా కోపమే కావచ్చు. బహుశా అందుకే మీరు దాన్ని పవిత్రీకరిస్తూ ఉండవచ్చు, అది మిమ్మల్ని చర్యకు పురికొల్పుతుంది. కదా! దురదృష్టవశాత్తు ఆనందం లేదా ప్రేమ కలిగించే గాఢత మీరెన్నడూ అనుభవించి ఉండకపోవచ్చు. కాని ప్రేమ, ఆనందం కూడా మిమ్మల్ని చర్యకు పురికొల్పగలవు  - చాలా మెల్లగా. అయితే చాలా అద్భుతంగా, ప్రభావవంతంగా.

మీ ఇంటివద్దకాని, మీ పని చేసేచోట కానీ,  కోపిష్ఠులతో కలిసి జీవించడం మీకిష్టమా? లేకపోతే శాంతంగా, సంతోషంగా ఉండే వాళ్లతో కలిసి జీవించడం మీకిష్టమా? కచ్చితంగా మీకు శాంతంగా, సంతోషంగా ఉండే వాళ్లతో ఉండడమే ఇష్టంగా ఉంటుంది. దయచేసి గుర్తు పెట్టుకోండి. మీలాగే మీచుట్టూ ఉన్న వాళ్లు కూడా శాంతంగా, సంతోషంగా ఉండే వాళ్లతో కలిసి జీవించడమే ఇష్టపడతారు. ప్రతిమనిషీ ఇదే కోరుకుంటారు. తాను పనిచేసేచోట, జీవించేచోట అందరూ ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని.

ప్రేమాశిస్సులతో,
సద్గురు