ధ్యానం అంటే మీరు చేసేది కాదు అని, అది మీరు అనుభూతి చెందే పరిమళం అని. చాలా మంది ధ్యానం చేయడానికి ప్రయత్నించడం వల్లనే కష్టమనిపిస్తుందని, మీ వ్యవస్థని ఒక స్థాయికి తీసుకువస్తే ధ్యానపరులు అవ్వడం సులభమని సద్గురు చెబుతున్నారు.

సద్గురు: ‘ధ్యానం’ అనగానే దాని గురించి లోకంలో రకరకాల తప్పుడు అభిప్రాయాలున్నాయి. మెడిటేషన్ అనే ఇంగ్లీషు మాటకు పెద్ద అర్థమేమీ లేదు. మీరు కళ్లు మూసుకొని కూర్చుంటే చాలు అది మెడిటేషన్ అయిపోతుంది. మీరు కళ్లు మూసుకొని  కూర్చొని కూడా చాలా పనులు చేయవచ్చు. దానికి ఎన్నో కోణాలున్నాయి. మీరు జపం చేయవచ్చు, తపం చేయవచ్చు. ధారణ చేయవచ్చు, ధ్యానం, సమాధి, శూన్యం ఏదైనా చేయవచ్చు. లేదా అలా కూర్చొని నిద్రించే విద్యలో ప్రావీణ్యం సాధించవచ్చు.అంటే మెడిటేషన్ అనే మాటకు అర్థమేమిటి?

ధ్యానం మీరు చేయగలిగింది కాదు. ఎవరూ ధ్యానం చేయలేరు. ధ్యానం చేయడానికి ప్రయత్నించిన వాళ్లలో ఎక్కువమంది అది కష్టమనీ, అసాధ్యమనీ అనుకోవడానికి కారణం వాళ్లు అది చేయడానికి ప్రయత్నించడమే. మీరు ధ్యానం చేయలేరు కాని మీరు ధ్యానపరులు కావచ్చు. ధ్యానం అన్నది ఒక గుణం. అదొక చర్య కాదు. మీరు మీ శరీరాన్ని, మనస్సును, భావోద్వేగాలను, శక్తులను ఒక పరిపక్వ స్థాయికి తీసికొని వెళితే ధ్యానం అదే జరుగుతుంది. అది నేలను సారవంతం చేయడం వంటిది. అవసరమైన ఎరువులు, నీళ్లు ఇవ్వండి, మంచి విత్తనం నాటండి. అది చెట్టు అవుతుంది. పూలూ, పండ్లూ కాస్తుంది. మీరు కోరుకుంటున్నారు కాబట్టి పూలూ, పళ్లూ రాలేదు. అవి రావడానికి కారణం మీరు అవసరమైన, అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం. అదే విధంగా మీరు మీలో అనువైన  వాతావరణాన్ని కల్పించుకుంటే మీరెవరన్నది,  నాలుగు కోణాలలోనూ(శరీరం, మనస్సు, భావోద్వేగం, శక్తి), మీలో ధ్యానం సహజంగా వికసిస్తుంది. తన లోపల తాను ఆస్వాదించి ఆనందించే ఒక పరిమళం, ధ్యానం.

ఒక నిర్దిష్ట దర్శనానికి గాని, సిద్ధాంతానికి గాని కట్టుబడని మతాతీత ఆధ్యాత్మిక ప్రక్రియ చాలా అవసరం.

కొన్నేళ్ల కిందట నేను కేవలం కూర్చుని ఉన్నానంతే, ఏమీ చేయకుండానే ఆనంద తన్మయత్వంలో మునిగిపోయాను, దీనికి కారణం కూడా ఏమీ లేదు. ఇందులో ‘విశేష’ మేమిటి?  అనుకున్నాను. కేవలం ఇక్కడ కూర్చుని ఆనంద పారవశ్యంలో మునిగిపోయాను కదా. అయితే అందులో అంత విశేషమేమిటి? నేనీ మొత్తం ప్రపంచాన్ని ఆనంద పారవశ్యంలో ముంచేయాలి అనుకున్నాను. ఇది జరిగి ముప్ఫై ఏళ్లయింది, నేనిలా అయ్యాను (తన తెల్లటి గడ్డాన్ని చూపిస్తూ) కాని జనం తమ దుస్థితిని వదలుకోలేదు.

కొన్ని లక్షల మందిని చేరుకోగలిగాం, కాని అది మొత్తం ప్రపంచం కాదు కదా. ప్రపంచమంటే ఏడు బిలియన్ల ప్రజలని నా భావన. ఇప్పుడు సమాజాలు రోజు రోజుకూ విచిత్రంగా తయారవుతున్నాయి. ఎందుకంటే భౌతికంగా మనం సాధించగలిగినవన్నీ సాధించాం. ఇప్పుడిక ఏం చేయాలో వాళ్లకు తెలియదు. మీరు చేయగలిగిందల్లా మీ జుట్టు కత్తిరించుకోవడమో, ఆపాద మస్తకం టాటూ చేయించుకోవడమో మాత్రమే. మరో కొత్తపని మీరేం చేయగలరు? ఏదో ఒకటి కొత్తది చేయాలి కాబట్టి జీవితానికి వ్యతిరేకమైన పనులు చేస్తారు. అందువల్ల  ఇప్పుడు సమాజం ఆధ్యాత్మిక ప్రక్రియకు సన్నద్ధంగా ఉంది; సరైన మార్గ దర్శన లేకపోతే అది వీగి పోతుంది. ఒక నిర్దిష్ట దర్శనానికి గాని, సిద్ధాంతానికి గాని కట్టుబడని మతాతీత ఆధ్యాత్మిక ప్రక్రియ చాలా అవసరం. అది చాలా సాదాగా ఉండాలి, వారిని అంతరంగం వైపు మరల్చేదిగా ఉండాలి.

ఇప్పటి దాకా అక్కడా ఇక్కడా కొంతమందిని చేరుకోగలిగాం, కానీ భారీ ఎత్తున జరగలేదు. ఇవ్వాళ మనకు లభిస్తున్న సాంకేతికతతో మనం దీన్ని పెద్ద ఎత్తున సాధించగలం. ఒక తరం ప్రజలుగా మనం చేయగలిగిన అతి ముఖ్యమైన విషయం ఇది. మానవ చైతన్యం కోసం మనం పెద్ద స్థాయిలో చేయగలిగే అవకాశం మనకు కలగడం మన భాగ్యం. మీరు బాహ్యపరమైన ఇంజినీరింగ్ అతిగా చేసినట్లయితే మనకీ భూగ్రహం మిగలదు. మానవుని శక్తులు అంతరంగంలోకి తిరిగి తమను తాము సరి చేసుకోవాలి. బాహ్యానికి నష్టం కలిగించకూడదు. లోపల చేయవలసినపని చాలా ఉంది. ఈ భూమండలం మీద, అత్యుత్సాహంతో చాలా శ్రమ చేసే స్వభావం కలిగిన సమాజాలకు మనం పెద్ద ఎత్తున ఈ కోణాన్ని అందించకపోతే వాళ్ల శ్రమ ఈ భూమండలాన్ని నాశనం చేస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు