వాయువు మనకి కల్పించే అనేక అవకాశాల గురించీ, మానవ శరీర నిర్మాణ వ్యవస్థలో ఎలా పనిచేస్తుందో, దానివలన చేకూరగలిగిన లాభాన్ని మనం ఎలా ఉత్తేజపరచవచ్చునో ఇక్కడ సద్గురు వివరిస్తారు. "యోగసాధనకి ఎక్కువ సమయం కేటాయించలేని వాళ్ళు సులువుగా పనిచేయగల పరిమాణం వాయువు లేదా గాలి.  పంచభూతాలలో వేరేవాటిని నియంత్రించడానికి చెయ్యవలసిన పరిశ్రమతో పోల్చినపుడు వాయువును ఉద్దేశించిన సాధన చాలా సులభం," అంటారు.

"యోగ" సంప్రదాయంలో  గాలిని "వాయువు"గా ప్రస్తావిస్తారు. అయితే, ఈ వాయువు కేవలం నైట్రోజను, ఆక్సిజను, కార్బన్ డై అక్సైడు ఇతర వాయువుల మిశ్రమం మాత్రమే కాదు, అది ప్రగతి దిశలో ఒక పరిమాణము. ప్రకృతి ఉనికికి కారణమైన పృధ్వి, అగ్ని, నీరు, వాయువు, శూన్యం... అనే మౌలికమైన పంచభూతాలలో, అన్నిటికంటే ఎక్కువ అందుబాటులో ఉండేదీ, దానిని స్వాధీనపరచుకునెందుకు సులువైనదీ వాయువే. కనుకనే, శరీరవ్యవస్థలో అది ఆక్రమించే భాగం అతి తక్కువశాతం అయినప్పటికీ, యోగసాధనకు ఉద్దేశించిన అభ్యాసాలలో ఎక్కువ భాగం వాయువు లేదా గాలి చుట్టూ అల్లుకోబడ్డాయి.

ఈ ప్రపంచంలో 99 శాతం జనాభా ఈ రోజు జీవితాన్ని సాధ్యమైనంతవరకు సుఖంగా, హాయిగా విజయవంతంగా గడపడానికే ప్రయత్నిస్తారని నేను చెప్పగలను. జీవితానికి మరొక పరిమాణాన్ని దర్శించడానికి ప్రయత్నంచేసేవారు అతి తక్కువ. ఈ సందర్భంలో, వాయువు, ప్రాణవాయువు అన్న పదాలు ప్రత్యేకత సంతరించుకుంటాయి. కారణం "ప్రాణ" వాయువు మీద ఒక మోస్తరు నియంత్రణ సాధించగలిగినా మన మేధస్సు మరింత పదునెక్కుతుంది. అంటే, "శక్తిచలనక్రియ" మిమ్మల్ని మునపటికంటే ఎక్కువ చురుకుగా చేస్తుంది. మీ భావావేశాలలో స్థిరత్వం కనిపిస్తుంది, క్రమశిక్షణ (నియంత్రణ) ఉంటుంది,  మీరు పూర్వం కంటే ఎక్కువగా శారీరక శ్రమ చెయ్యగలుగుతారు. చాలామంది జీవితంలో కోరుకునేవి ఈ మూడే.  యోగాభ్యాసాలలో ఉఛ్ఛ్వాసనిశ్వాస (ఊపిరిపీల్చి వదలడమనే) ప్రక్రియలున్న అభ్యాసాలన్నీ  ఈ "వాయు" లేదా, "ప్రాణవాయువు"ని ఉద్దేశిస్తూ చేసేవే. వాయువు ఒక మూలకం.... ప్రాణవాయువు పంచప్రాణాలలో ఒకటి. మనందరం ఈ ప్రాణవాయువు గర్భంలో ఉన్నాము. అదే వాతావరణంగా మనల్ని ఆవరించిన బుడగ. ఈ అనంత ప్రాణవాయువు 84 ప్రాణాలుగా విభజించబడుతుంది.  అందులో 5 మానవుల దైనందిన జీవితావసరాలు తీరడానికి ఉపకరిస్తాయి. ఈ పంచప్రాణాలూ మన శరీరమూ, మనసూ ఆరోగ్యంగా ఉండడానికీ, ఆధ్యాత్మికంగా చైతన్యవంతులై ఉండడానికీ పనికొస్తాయి. మరొక 10 నిగూఢమైన సాధనలు చేసేవారికి ఉపకరిస్తాయి. మిగతా ప్రాణాలు శోధించడానికీ, సాధనచెయ్యడానికీ అతి సూక్ష్మమైనవి. ఈ ప్రాణవాయువు గొంతుక వద్ద ఉన్న గుంట నుండి నాభి  వరకు  లోపలకి ప్రవహించేది. మేము సాధకులకు బోధించే శక్తిచలనక్రియ అభ్యాసంలో కనీసం 60 శాతం ఈ ప్రాణవాయువును లక్ష్యంగా తీసుకుని చెప్పేవే. మేము దీనిమీది దృష్టి కేంద్రీకరించడానికి కారణం, వ్యక్తుల జీవితపు ఉపరితల అనుభవాన్ని చాలవరకు నిర్ణయించేది లేదా నిర్దేశించేది, వాళ్ళ శ్వాస ప్రక్రియా, వాళ్ళు శ్వాసించే వాయువు శ్రేష్ఠతా.

మీరు తీసుకునే ఆహారాన్ని నియంత్రించడంద్వారా దాని పచనక్రియని తక్కువ చెయ్యగలిగితే, మీరు ముక్కుతో కాకుండా, చర్మంతో శ్వాసిస్తే సరిపోతుంది

మనం పీల్చే గాలి తక్షణమే దాని ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు ఏ ఆహారమూ తీసుకోకుండా  8 నుండి 10 రోజులవరకు మీ శరీరవ్యవస్థకి ఏ రకమైన హానీ కలగజెయ్యకుండా జీవించొచ్చు. నీరు తీసుకోకుండా మూడున్నర రోజులవరకూ ఉండొచ్చు. కానీ ఊపిరి పీల్చుకోకుండా మనుషులు మూడున్నర నుండి అయిదు నిముషాలు దాటి ఉండలేరు.  కొంత సాధన చెయ్యడం ద్వారా  మీరు మరికొంచెం ఎక్కువసేపు గాలి పీల్చకుండా ఉండవచ్చు. దానికి కొంత మోసం చెయ్యవలసి వస్తుంది. మీరు తీసుకునే ఆహారాన్ని నియంత్రించడంద్వారా దాని పచనక్రియని తక్కువ చెయ్యగలిగితే, మీరు ముక్కుతో కాకుండా, చర్మంతో శ్వాసిస్తే సరిపోతుంది. చెమట ఎలా పడుతుందో అలగే శ్వాసక్రియ కూడ చర్మం ద్వారా జరుగుతుంది. మీరు మీ ప్రాణవాయువుని ఎక్కువ మోతాదులో ఉత్తేజపరచగలిగితే, మీరు మీ ముక్కుతో గాలి పీల్చనవసరం లేకుండా ఎక్కువకాలం బ్రతకగలరు.

మనం గాలితో ఏమి చెయ్యగలం? మనం మలినం చెయ్యగలం.  దాన్ని శుభ్రం చెయ్యగలం.

అన్నిటికన్నా మిన్నగా,  గాలిని మన జీవితాల్ని పరివర్తనచేయగల మహత్తర శక్తిగా వినియోగించగలం. వాయువు లేదా గాలి విషయంలో, తక్షణ అవసరం ఉంది. కారణం అది వెంటనే స్పందించి మన జీవితంలో మార్పుల్ని వెనువెంటనే తీసుకురాగల శక్తి దానికి ఉండడమే. పంచభూతాలలోనూ, ఎక్కువ వేగాన్ని సృష్టించగలిగినది వాయువే. అది బాహ్యప్రపంచంలోనూ సత్యమే, శరీర వ్యవస్థలోనూ సత్యమే.  మీకు దాన్ని మేల్కొలపగల శక్తి ఉంటే, మిమ్మల్ని చెప్పలేనంత బలవంతులుగా చెయ్యగలదు... అది కేవలం మీ కండరాల బలమే కానక్కరలేదు, మీ జీవితం విస్తృతార్థంలో.  ప్రాణవాయువుని మేల్కొల్పడానికి కొంత సాధన అవసరం. దానికి ప్రమాణం ఏమిటంటే, మీరు ఒక్కరోజుకూడా క్రమం తప్పకుండా 1008 రోజులు శక్తిచలనక్రియ చెయ్యగలిగితే,  ప్రాణవాయువు ఒక మేరకు చైతన్యవంతమవుతుంది.  దానివల్ల మీకు లభించే శక్తి మిమ్మల్ని అందరికంటే భిన్నంగా ఉంచుతుంది. ఈ విషయంలో శక్తి చలనక్రియ నిజంగా ఒక గొప్ప సాధన. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని లక్షలమందికి ఈ క్రియని ఉపదేశించడం జరిగింది. అది నేర్పిన వారందరూ క్రమం తప్పకుండా నిర్వహించి దానితోపాటే ఎదిగి ఉంటే, ప్రపంచం ఈపాటికి మారి ఉండవలసింది. దానితోపాటు ఎదగడమంటే, ముందుగా సాధనచెయ్యడం 40 నిముషాలతో ప్రారంభించి, క్రమక్రమంగా దాన్ని గంటన్నరనుండి రెండు గంటలకు పెంచగలగడం. కనీసం ఒక లక్షమంది అయినా ఈ శక్తిచలనక్రియని అది అనుష్ఠానం చెయ్యవలసిన రీతిలో చెయ్యగలిగి ఉంటే, ఈ పాటికి ప్రపంచ వాతావరణం మారి ఉండేది.

మీకు అవధిలేని శక్తి సంక్రమించినట్టు అనిపిస్తుంది. కానీ, నిజానికి పరిమితిలేని శక్తి అంటూ ఉండదు... ఇతరులదృష్టికి అలా కనిపిస్తుంది. అంతే!  మీ ప్రాణవాయువు నిజంగా చైతన్యవంతంగా ఉంటే, మీరు మీ సమయాన్ని ఖచ్చితంగా నిర్వహించగలుగుతారు. జీవితం  "కాలం - శక్తి" ల సమ్మేళనం. మీరు మీ ప్రాణవాయువు లేదా శక్తిని చాలా కఠోరమైన నియంత్రణలో ఉంచగలిగితే, మీకు సమయం ఎప్పుడూ మిగిలే ఉంటుంది.  అన్ని పనులూ మీరు కష్టపడి చేసే ప్రయత్నం వలన కాకుండా, పొంగిపొరలుతుండే మీ శక్తి వల్ల నెరవేరుతుంటాయి.  శక్తిచలనక్రియని మీరు చైతన్యవంతంగా ఉంచుతున్న కొద్దీ మీరు చురుకుగా ఉండగల శక్తి అంత అమితంగా పెరుగుతుంది.

ఈ రోజుల్లో రోజురోజుకీ చాలామంది విశ్రాంతి పేరుతోనో, మరో పేరుతోనో వాళ్ళు చేసే పనినుండి దూరంగా ఉండవలసి వస్తోంది. మన ప్రాణవాయువుని మనం జాగ్రత్తగా నిర్వహించలేకపోవడం వలన ఇటువంటి అవసరం ఏర్పడుతుంది.  దానికి కారణాలు అనేకం. అందులో ఒకటి... మీరు తీసుకునే ఆహారం ఎక్కువగా వాయువు ఉత్పత్తిచేసేదయితే, ముఖ్యంగా బొడ్డు దిగువన మణిపూరకానికి, అది బొడ్డునుండి గొంతువరకు ఉన్న నాళంలో గాలి ప్రసరణని చిందరవందర చేస్తుంది. బొడ్డునుండి గొంతు మధ్యవరకూ ఉన్న స్థలమే ప్రాణవాయువు చైతన్యవంతంగా ఉండే స్థలం.  మీరు సవ్యమైన ఆహారం తీసుకోకపోవడం, దాని వల్ల వాయువు ఉత్పత్తి అవడం జరిగితే, మీరు ఈ వ్యవస్థ బలహీనంగా ఉన్నట్టు అనుభూతి చెందుతారు. కారణం అక్కడ ప్రాణవాయువు సరిగా పనిచెయ్యలేకపోవడమే. మీరు తీసుకున్న ఆహారంవల్ల తప్పుడు ప్రదేశంలో వాయువు సృష్టించబడింది. గొంతుకీ, బొడ్డుకీ నడుమ స్థలంలో ప్రాణవాయువు స్వేఛ్ఛగా బలీయంగా పనిచేయగలిగేటట్టు ఉండాలి.

జీవితం అంతకంటే ఉన్నతమైన స్థితికి చేరుకోవాలంటే, ఈ పంచభూతాలపై నియంత్రణ కలిగి ఉండడం ముఖ్యం.

యోగాభ్యాసాలే కాదు, మిమ్మల్ని మీరు మలుచుకునే తీరు, మీరు గాలిపీల్చే విధానం, మీ నడక, నిలబడే, కూచునే తీరు... ఇవన్నీ మీరు మీ ప్రాణవాయువుమీద కొంత నియంత్రణ కలిగి ఉండేలా తోడ్పడతాయి. ప్రతి  మనిషికి ఈ అయిదు పంచభూతాల మీదా ఎంతో కొంతమేరకి నియంత్రణ చెయ్యగల శక్తి ఉంటుంది. లేకపోతే  జీవించి ఉండలేరు. జీవితం అంతకంటే ఉన్నతమైన స్థితికి చేరుకోవాలంటే, ఈ పంచభూతాలపై నియంత్రణ కలిగి ఉండడం ముఖ్యం. గాలి లేదా వాయువు ఎక్కువ సమయం కేటాయించలేని సాధకులకి పనిచెయ్యడానికి అనువైన పరిమాణం. దానిపై నియంత్రణ సులువుగా సాధించగలిగే అవకాశం ఉండడమే దానికి కారణం.  వాయువు మీద కేంద్రీకరించబడిన యోగాభ్యాసాలు తక్షణ ఫలితాలని అందిస్తాయి. .. ముఖ్యంగా మీ మనసు మీదా, భావాల స్థాయిలోనూ. ఈ ప్రాణవాయువుని అధికం చెయ్యడం ద్వారా, మీరు మీ మానసిక సమస్యలకు సమాధానం కనుక్కోగలుగుతారు. మనసు మరింత ఎక్కువ సుశిక్షితంగా ఉంటుంది. మీరు వాయువుపై నియంత్రణ సాధించినప్పటికీ, మీ కర్మ చక్రం పరిగెడుతూనే ఉంటుంది. సాధారణంగా, అది మునపటికంటే వేగంగా పరిగెడుతుంది, ఇప్పుడు దానికి ఎక్కడికి వెళ్ళాలో ఖచ్చితంగా తెలుసును గనుక. మీ కర్మ వేగంగా పరిగెడుతోంది గనుక, మీ జీవితం చాలా ప్రసిద్ధంగా గడిచిపోతుంది.

ప్రాణవాయువు ప్రసరణ బొడ్డుకిందకి గాని జరిగితే, మీ జీవితంలో ఉండవలసిన పొంగులువారే చైతన్యం హరించుకుపోతుంది. మీ శరీరం బంగాళాదుంపబస్తాలా అనుభూతి చెందుతుంది. అన్నట్టు మరోమాట చెప్పాలి: బంగాళాదుంప ప్రాణవాయువును క్రిందకి అణగదొక్కడం ద్వారా వ్యవస్థలో నిస్తేజం తీసుకువస్తుంది. ఆమాటకొస్తే, కుళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న ఏ ఆహారమైనా ఇదే ఫలితాన్ని కలిగిస్తుంది. అందులో మీరు సూపర్ మార్కెట్లలో కొనే ఆహారపదార్థాలున్నాయి, అవి చాలాకాలం నిల్వచేసి ఉండడం వల్ల వాటిలో "ప్రాణ" విలువ మృగ్యం అయిపోయుంది. దాని వినియోగానికి గడువు ఉన్నప్పటికీ, అది కుళ్ళిపోయేదిశవైపు ప్రయాణం చేస్తుంటుంది. యోగ సంప్రదాయంలో తినే వస్తువులలో "ప్రాణ" వాయువును నియంత్రించడానికి పాటించే ఒక నియమం వంట వండిన గంటన్నర నుండి నాలుగు గంటలలోపు దాన్ని భుజించడం. కొన్ని వస్తువులయితే ఇంకా తొందరగా తీసుకోవాలి. లేకపోతే అవి వ్యవస్థలో వాయువుని సృష్టిస్తాయి. ఒకసారి వ్యవస్థలోకి వాయువు చొరబడితే, "ప్రాణవాయువు"ని మీరు నియంత్రించలేరు.

గాలిని స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలోని పరమార్థం ఆరోగ్యం, తక్షణ శ్రేయస్సు అనుభూతి చెందడం. మీరు వాయువుని చైతన్యపరిచి, ఒక స్థాయికి తీసుకు వస్తే, సహజంగా అగ్ని, లేదా నిప్పు, దాన్ని అనుసరించి వస్తుంది.... సుమారు 25 నుండి 30 శాతం వరకు. మీకు వాయువు మీద నియంత్రణ ఉన్నపుడు, దానితో పాటే కొంతమేరకి అగ్నిమీద కూడా నియంత్రణ సమకూరుతుంది. చాలా మందిలో కావలసిన వేడి ఉండదు, అదే వాళ్ల జీవితాలలో పెద్ద సమస్య. వాళ్ళు ఎన్ని పనులైనా తలపెట్టవచ్చు. కానీ, దేనివల్లా ప్రయోజనం కలగదు. ఒక సారి నిప్పు రాజుకున్నపుడు,  మునుపటికంటే మీరు మెరుగ్గా ఉంటారు.  శరీరంలో అగ్ని అతి తక్కువశాతం అయినప్పటికీ, అదే సర్వస్వం. అది మిమ్మల్ని శూన్యం వైపుకి తీసుకుపోగల నేర్పరి.

మనుషులు ఉదయం లేచింది మొదలు ఆశించే అనేక వస్తువులపై వాయువు ప్రభావం అధికంగా ఉంటుంది. మనిషి ఎదుగుదలలో వాయువుని చైతన్యపరచడం ఒక ముఖ్యమైన అడుగు. వాయు- ఆధారిత అభ్యాసాలు  మనిషి మేధోశక్తినీ, అంతర్గత శక్తినీ,  ప్రభావశీలతనీ మరింత ఉన్నత స్థాయికి తీసుకుపోగలవు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు