#1: మేము మా అభిప్రాయాలు వ్యక్తపరచటానికి సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలి?

సద్గురు: ఇక్కడ ఫేస్బుక్, ట్విట్టర్లలో నకిలీ పేరుతో అకౌంట్ నడుపుతున్న వారు, నకిలీ పేరు తీసివేసి అక్కడ మీ పేరు ఉంచాలి. ‘ఇది నేను….నేను చెప్పదలచుకుంది ఇది’ అని మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి. మీరు అక్కడ మీ పేరే పెట్టదలచుకోక పోతే, మీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు మీకు లేదు. మీరు దేని వెనకాలో దాక్కొని, ఎవరి మీదనో, దేని గురించో, ఏదో అనకూడదు. అవునా? మీరు ఏమన్నా చెప్పదలచుకుంటే మీరు దానికి బాధ్యత తీసుకోవాలి.

#2: జీవితాన్ని సునాయాసంగా ఎలా జీవించాలి?

సద్గురు: ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు ఎవరినీ తక్కువగా చూడవద్దు, ఎవరిని గొప్పగా కూడా చూడవద్దు. దీని అర్ధం ఏమిటంటే ఏది మంచిది? ఏది గొప్పది? ఏది మంచి గుణం? ఏది చెడ్డ గుణం? అంటూ, మీరు మీ బుర్రలో ఏ విధమైన న్యాయనిర్ణయాలు చేయటంలేదని. ఇటువంటి నిర్ణయాలు చేసే హక్కు మీకు లేదు. మీరు మీ జీవితంలో అన్నింటి గురించీ, ఉన్నది ఉన్నట్లుగా చూసే ప్రయత్నం చేస్తున్నారు అని. మీరు జీవితాన్ని అలా చూస్తే మీరు జీవితాన్ని సునాయాసంగా జీవించగలరు.

 #3: నేను ఎవరికి ఓటు వేయాలి? 

సద్గురు: ‘నేను ఏ పార్టీకి ఓటు వేయాలి?’ అని నా కూతురు అడిగినా సరే, నేను చెప్పను. ‘నీకు ఏది మంచిదో, నీకు నీ చుట్టూ ఉన్న వారికి ఏది మంచిదో, మీరే చూసుకోవాలి. అంతేగానీ నేను చెప్పిన వారికి కాదు.’ అని చెబుతాను. 

ప్రతి వ్యక్తీ, ప్రతిసారీ, ఏదో ఫలానా పార్టీకి అని కాకుండా, తమ బాగు గురించి బాగా ఆలోచించి ఓటు వేస్తే, అప్పుడు ప్రజాస్వామ్యం నిలబడుతుంది.

ఈ కాలంలో ప్రజలు మతం, కులం, వర్గం ఇలాంటి విషయాలను బట్టి ఓటు వేస్తున్నారు. ఇది మారాలి. ప్రతి వ్యక్తీ, ఏదో ఫలానా పార్టీకి అని కాకుండా, తమ బాగు గురించి బాగా ఆలోచించి ప్రతిసారీ ఓటు వేస్తే, అప్పుడు ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అంతేకాని, ఎవరో చెప్పారని, అందరూ ఓటు వేస్తే, మీరు ప్రజాస్వామ్యాన్ని, పెత్తందారీ వ్యవస్థగా మార్చినట్లు.

ప్రజాస్వామ్యంలోని గొప్పతనం ఏమిటంటే, అధికారం ఏ విధమైన రక్తపాతం లేకుండా బదలీ అవుతుంది. మానవ చరిత్రలో ఇటువంటిది ఎప్పుడూ జరగలేదు. ఒక కుటుంబంలో అధికారం మారాలన్నా కూడా, ఎవరొ ఒకరు రక్తపాతానికి గురి అవుతారు. కానీ మొట్టమొదటిసారిగా గత వంద, నూట ఏభై సంవత్సరాలలో మనం అధికారాన్ని రక్తపాతం లేకుండా మారుస్తున్నాము. మీరు దానిని తక్కువగా అంచనా వేయొద్దు.

#4: సరైన విద్యా విధానం ఏది?

సద్గురు: ఈ దేశంలో మనం  మన విద్యా విధానాన్ని మరొకసారి చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతం అందరిని ఒకే రకమైన విద్యా విధానానికి గురిచేస్తున్నాము. అందరూ ఒకే రకమైన విద్యా విధానంలో చదువుకోలేరు. ఎవరికైనా విద్యార్జనే ముఖ్యమనుకుంటే వారు ఒకరకంగా చదువుకోవాలి, మరొకరు ఏదో బ్రతుకు తెరువు కోసం అయితే వారు మరొక విధంగా చదువుకోవాలి, మరొకరికి దేనిలోనో నైపుణ్యం ఉంటే, వారు మరొక విధంగా చదువుకోవాలి.

ఇప్పుడున్న అవసరం ఏమిటంటే, పిన్న వయసులోనే అంటే సుమారు 12 సంవత్సరాల కల్లా, ప్రతి ఒక్కరికి కనీసం రెండు భాషల్లో కొంత ప్రవేశం ఉండాలి. వారు ఇంగ్లీష్, వారి మాతృభాష నేర్చుకోవచ్చు. ఒక విద్యార్థిని మరీ ఎక్కువ విషయాలతో ముంచెత్త వద్దు. కావాల్సిందల్లా భాష అర్థం చేసుకోవడం. ‘నేను చదువుకున్నది నేను అర్థం చేసుకోగలను’ అనుకునేటంత వరకు వస్తే చాలు. ఆ తరువాత అంటే, 12 ఏళ్ల తర్వాత మీరు వారిని బాగా గమనించి, వారికి ఏ రకమైన నైపుణ్యం ఉందో, ఎవరు ఏరకమైన విద్యార్జన చేయాలో పసి గట్టి, ఆ రకమైన నైపుణ్యాన్ని నేర్పాలి.

#5: ఒక న్యాయవాదిగా తప్పు చేసిన వారిని నేను రక్షించవచ్చా?

సద్గురు: మీ వృత్తి చట్టపరమైనది. ఏది మంచిది అనే నిర్ణయించే హక్కు మీకు లేదు. మీ పని ఏమిటంటే చట్టపరంగా మీ దగ్గరకు వచ్చిన వ్యక్తి శ్రేయస్సుకై మీరు కృషి చేయాలి. మీ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఏదో నేరం చేసి ఉండవచ్చు. ఒక్కోసారి చేసిన నేరం ఘోరమైనది కావచ్చు. ఇటువంటి మనిషిని అసలు నేను రక్షించాలా? అన్న ప్రశ్న రావచ్చు. మీరు దీనిని నైతిక పరంగా చూడవద్దు. ‘ఇతను నా దగ్గరకు వచ్చాడు, నాకు ఇష్టంలేని పని చేశాడు, అతనిని చావనీ’  అనేటువంటి ఆలోచనలు చేయవద్దు. మీ పని ఏమిటంటే అందరికీ న్యాయం జరిగేటట్లు చట్టాన్ని వివరించడమే.

#6: జీవితంలో సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?

సద్గురు: మీరు మీ ఆందోళనలు, నిరాశ, నిస్పృహల ద్వారా మీ నిర్ణయాలు తీసుకోకూడదు. మీ జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం వస్తే, మీరు కనీసం మూడు నుంచి పది రోజులు సెలవు తీసుకోవాలి. కొందరికి మూడు రోజులు చాలు, మరికొందరికి ఇంకొంచెం సమయం కావాల్సి వస్తుంది. మీ అవసరాన్ని బట్టి మూడు నుంచి పది రోజులు సెలవు తీసుకోండి. అప్పుడు మీ మీద, మీ స్నేహితుల, మీ తల్లిదండ్రుల, ఇంకా సమాజం ప్రభావం ఉండకూడదు. మీ ఫోను కూడా స్విచ్ ఆఫ్ చేయండి. మీ అంతట మీరే కొంత సమయం గడిపి చూడండి.

మిమ్మల్ని నేనో ప్రశ్న అడుగుతాను. మీ జీవితం మీకు విలువైనదా? కాదా? విలువైనదైతే, మీరు విలువనిచ్చే దానిపైనే మీరు మీ జీవితాన్ని వెచ్చించాలి, అవునా? అంతేకాని వేరెవరో, ఏదో చేస్తున్నారని మీరదే చేసే ప్రయత్నం చేయకూడదు. జీవితం విలువైనదైతే, మీకు అతి ముఖ్యమైనదేదో, విలువైనదేదో దానినే చేయాలి.

ప్రేమాశిస్సులతో,

సద్గురు