ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం.

భారత దేశపు రెండవ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ పుట్టిన రోజును మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాము. ఆయన మొదట్లో ఒక ఉపాధ్యాయుడు. మన రాష్ట్రపతులలో ఒకరు, ఒక స్కూల్ టీచర్ కావడం అనేది మన దేశంలో ఉన్న టీచర్లందరకూ ఎంతో గర్వకారణం. మన జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్రను ఎంతో గొప్పదిగా మన సాంప్రదాయంలో మనం ఎప్పుడూ గుర్తించాము, ఎంతగా అంటే, 'ఆచార్య దేవో భవ’ అని మనం, గురువుని దేవుడితో సమానంగా చూస్తాము. ఎందుకంటే, సాధారణంగా పిల్లలు ఎదిగే సంవత్సరాలలో వారు తల్లిదండ్రుల దగ్గర కంటే కూడా, ఉపాధ్యాయుల దగ్గరే ఎక్కువ కాలాన్ని గడుపుతారు. తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపించడానికి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే, వారి కంటే కూడా పిల్లల మీద మంచి ప్రభావం చూపించగల వారు అక్కడ ఉంటారని.

ఉపాధ్యాయుల ప్రాముఖ్యత

ఒక మనిషిని తీర్చిదిద్దడంలో, ఒక సమాజాన్ని తయారు చేయడంలో, ఒక దేశాన్ని, మొత్తం ప్రపంచాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులకున్న పాత్ర ఎంతో ప్రముఖమైనది. ఒక అంశంపై ఆసక్తిని కల్పించడంలో, ఇంకా పిల్లల శక్తిసామర్థ్యాలను పెంపొందించడంలో, ఒక ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఎంతో పెద్ద పాత్రనే పోషిస్తాడు. చాలా మంది పిల్లలకు ఒక సబ్జెక్ట్ అంటే ఇష్టం లేదా అయిష్టం, ఆ సబ్జెక్టును ఏ టీచరు బోధించారు అన్న దాన్ని బట్టి కలుగుతుంది. అది చెప్పే వ్యక్తిని బట్టి ఉంటుంది. పిల్లలకు ఆ వ్యక్తి నచ్చితే, ఆ టీచరు వారిని ప్రభావితం చేయగలిగితే, ఉన్నట్టుండి ఆ సబ్జెక్టు వారికి ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది.

భావితరాలను ప్రభావితం చేయడం

ఈ రోజుల్లో టీచర్ కు పెద్ద ప్రాముఖ్యత లేదని ప్రజలు అనుకుంటున్నారు, ఎందుకంటే ఈ తరం వారికి ఒక టీచర్ చెప్పగలిగింది అంతా ఇంటర్నెట్ లో దొరుకుతుంది. కానీ నిజానికి టీచర్లకు ఉన్న ప్రాముఖ్యత మరింతగా పెరిగి పోయిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్లకి ఇక సమాచారాన్ని అందించవలసిన భారం తీరిపోయింది. వారు చేయవలసిన పని ముఖ్యంగా, స్ఫూర్తి కలిగించి, ఒక విద్యార్థిని ఒక మెరుగైన మానవుడిగా పెంపొందించడం. ఇది ఎప్పుడూ వారు చేయవలసిన ప్రాథమిక కర్తవ్యమే. ఇక టీచర్ అంటే మీకు ఏదో ఒక సమాచారాన్ని అలా చదివేసి వెళ్ళిపోయే టేప్ రికార్డర్ కాదు. ఆయన ప్రేరణ కలిగిస్తూ విద్యార్థుల జీవితాన్ని ఒక నిర్దిష్ట మార్గంలో తీర్చిదిద్దే వ్యక్తి.

మనం ఏ దేశాన్ని అయినా యోగ్యమైన రీతిలో నిర్మించాలి అనుకుంటే, అత్యుత్తమమైన సామర్థ్యం ఉన్న వారు స్కూల్ టీచర్లుగా ఉండాలి. ఒక పిల్లవాడు తన జీవితంలో మొదటి పదిహేను సంవత్సరాల్లో ఎటువంటి ప్రభావాలకు లోనవుతున్నాడు అన్నది అతని జీవితంలో ఎన్నో విషయాలను నిర్ణయిస్తుంది. కాబట్టి, ఉన్నత శ్రేణికి చెందిన మేధావులు, అత్యుత్తమమైన నిబద్ధత కలిగి, ఎంతో ఉల్లాసంగా, స్ఫూర్తి మంతంగా ఉండే వ్యక్తులు ఉపాధ్యాయులుగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనం సామాజిక, ఆర్థిక పరిస్థితులను ఎలా నిర్మించుకున్నామంటే, ఎక్కడా పని దొరకని వారు, స్కూలు టీచర్లుగా వస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఇది మారకపోతే మనం నాణ్యమైన సమాజాన్ని నిర్మించలేము. మనం తక్కువ స్థాయి మానవాళిని, తక్కువ స్థాయి సమాజాలను, తక్కువ స్థాయి దేశాలను నిర్మిస్తాము. ఇది ఇప్పటికే జరుగుతోంది. చాలా స్కూళ్లలో, ఉత్తేజితులైన టీచర్లు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటున్నారు. ఇది ఒక ఉద్యోగంగా మారిపోయింది. అవసరమైతే కాస్త ఎక్కువ శ్రమ పడడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఈ విషయంలో మనం తీవ్రంగా విఫలమయ్యాము. ఉత్సాహవంతులైన టీచర్లు చాలా తక్కువగా ఉన్నారు.

ఒక టీచర్ అంటే పది పి.హెచ్.డి లు నెత్తి మీద నుంచి వేలాడుతూ ఉండాలని కాదు. అతనికి తెలిసింది ఏదో కాస్త చెప్తాడని ఇంకెవరో ఎదురు చూడడం కాదు. ఒక టీచర్ అంటే, ఆ వ్యక్తి సమక్షంలో ప్రజలు ఎన్నో విషయాలను, ఆ టీచరుకు కూడా తెలియనివాటిని నేర్చుకోవాలి.

ప్రస్తుతం తయారీలో ఉన్న భవిష్యత్ సమాజమే పిల్లలు. వారు మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు వారిని ఎలా తీర్చిదిద్దుతారు అన్నది ప్రతి మనిషికి ఉన్న అతి గొప్ప బాధ్యత ఇంకా అదృష్టం. మనం చేసే ఏ పని అయినా సరే, మరొక జీవితాన్ని స్పృశించగలిగినప్పుడే అది అర్థవంతమవుతుంది. మరొక జీవితాన్ని తీర్చిదిద్దకలగడం ఎంతో గొప్ప అదృష్టం. మీ సొంత పిల్లలతో మీకు ఆ అవకాశం దొరకదు. కానీ మీరు ఒక టీచర్ అయితే, మీకు ఆ అదృష్టం తప్పక ఉంటుంది. అలాంటి గొప్ప అవకాశాన్ని మనము ఒకరి చేతుల్లో ఉంచుతున్నప్పుడు, వారు ఎంతో గొప్ప మేధావులు, ఎంతో చిత్తశుద్ధి కలిగిన వారు ఇంకా స్పూర్తినివ్వగల వారు అయ్యి ఉండటం అన్నది ఎంతో ముఖ్యం.

ప్రేమాశీస్సులతో,

సద్గురు