పంచభూతాల విన్యాసం
జీవితమనే ఈ ఆటకి పంచభూతాలనే ఈ పదార్ధాలెంతో అవసరం. మానవ శరీరమైనా తీసుకోండి, ఈ విశ్వాన్నైనా తీసుకోండి, సమస్త సృష్టి వీటితోనే తాయారు చేయబడింది – భూమి, నీరు, అగ్ని, వాయువు , ఆకాశం. నోరూరించే సాంబార్ చేయాలకున్నా దానికి పదిహేడు పదార్ధాలు అవసరం. కానీ కేవలం ఈ అయిదు పదార్ధాలతో ఎంత గొప్ప సృష్టి జరిగింది! మీకేదైనా అత్యంత సంక్లిష్టంగా అనిపిస్తే, అందులో లీనమైపోయి దాన్ని అర్ధం చేసుకున్నప్పుడు, "అరే ఇదో అయిదు పదార్ధాల ఆటేనా " అని గ్రహించినప్పుడు అదో జోక్ గా అనిపిస్తుంది. అందుకే ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు దీన్ని cosmic(సృష్టి ) joke అని అంటారు.
ఒకసారి అర్ధరాత్రి దాటాక,నేను ఓ కొండప్రాంతానికి పైకి ఎక్కాలని కార్లో బయలుదేరాను. నాకు కనిపించిన దృశ్యం ఏమిటంటే- పర్వతం కారుచిచ్చులో రగిలిపోతోంది. కానీ నేను ప్రమాదాల నుండి తప్పించుకుని పారిపోయే వాణ్ణి కాను కాబట్టి నా చుట్టూఉన్న పరిస్థితిని గమనిస్తూ జాగ్రత్తగా కారు నడుపుతున్నాను. ఏ క్షణాన్నైనా కారు లో ఉన్న పెట్రోల్ కి మంట అంటి భగ్గున మండొచ్చు, ఆ విషయం నాకు తెలుసు. అక్కడ మంచు కూడా ఉంది, నేను ఎంత దూరం వెళ్ళినా మంటలు ఇంకొంచం దూరంగా జరుగుతున్నట్టు అనిపించింది. అప్పుడు నాకు అర్ధం అయ్యింది ఏమిటంటే కింద నుంచి చూసినప్పుడు మంటల్లో ఉన్నట్లు కనిపిస్తున్న ప్రదేశం నేను అటువైపు వెళ్ళగానే మామూలుగా ఉంది , అసలు మంటలే లేవు!
ఆ విషయం గ్రహించిన నేను మెల్లిగా మంటలుమండుతున్న చోటికి చేరుకున్నాను, అక్కడ తీరా చూస్తే ఒక లారీ పాడై ఉంది. ఆ డ్రైవర్, తోడుగా ఉన్న మరో ఇద్దరు చలి కాచుకోవటానికి ఒక చిన్న మంట వేసుకున్నారు. ఆ మంచు బిందువులుగా మరేటప్పటికి గాలిలో ఉన్న ఈ లక్షల బిందువులు ఒక్కొక్కటి ఒక పట్టకంగా (prism) మారి ఇటువంటి అధ్బుతమైన భ్రమను సృష్టించాయి ! ఒక చిన్న మంటను ధావాజ్ఞిలాగా చిత్రించాయి. కింద నుంచి చూస్తె మొత్తం పర్వతమే మంటల్లో ఉన్నట్లు ఉంది! ఈ సంఘటన నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది.
ఈ సృష్టి కూడా ఇలాంటిదే, అన్నిటికీ భూతద్దం పట్టి ఎన్నో రెట్లు పెద్దదిగా చూపిస్తుంది. 'నేను' అని అనుకుంటున్న ఓ చిన్ని తునకలాంటి మిమ్మల్ని, మీరు జాగ్రత్తగా గమనిస్తే , ఈ సృష్టంతా ఇందులోనే ఉందన్న నిజం మీకర్ధమౌతుంది, ఆ తరవాత ఇంతటి బ్రహ్మాండాన్ని అర్ధంచేసుకునే ప్రయత్నమిక చేయక్కర్లేదు! మీలో జరిగే ఈ పంచభూతాల విన్యాసమే ఈ సృష్టిలో ఎన్నోరెట్లుగా చూపింప బడుతోందన్న విషయాన్ని మీరే గ్రహిస్తారు! – ఇదే పంచభూతాల ఆట.
మానవ యంత్రం పరిపూర్ణ సామర్ధ్యాన్ని తెలుసుకోవాలనీ, దాన్ని అధిగమించి ఈ బ్రహ్మాండమైన విశ్వ యంత్ర రచనతో విలీనం కావాలనీ, మీరనుకుంటే –ఈ పంచభూతాల మీద కొంత ప్రావీణ్యం మీకెంతో అవసరం. ఈ ప్రావీణ్యం లేనప్పుడు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు, ఈ విశాల విశ్వ రాశి లో ఓ జీవిగా ఉన్న పరమానందాన్నీ ఏమాత్రం చవి చూడలేరు. మీలో ఈ పంచభూతాలను సరైన రీతిలో ఎలా అమర్చుకోవాలో మీకు తెలిస్తే జీవితంలో మీకు దేని అవసరమూ ఉండదు. ఆరోగ్యం, శ్రేయస్సు, అవగాహన, జ్ఞానోదయం ఏదైనా సరే, అన్నీ వాటంతట అవే జరుగుతాయి!
యోగ వ్యవస్థలోని అతి ప్రాధమికమైన సాధనని భూతశుద్ధి అని అంటారు. ‘భూత’ అని పంచభూతాలను లేక అయిదు ధాతువులను సూచిస్తుంది. ‘శుద్ధి’ అంటే శుభ్రపరుచుకోవటం. ఈ పంచభూతాలను ఎలా శుద్ధి చేసుకోవాలో తెలిస్తే ఇక దానికి మించినదేదీ లేదు. మీ పంచభూతాల మీద పట్టు ఉన్నట్లయితే మీకు కేవలం మీ శరీరం, మనస్సు మీదే కాకుండా ఈ సమస్త సృష్టి మీదే ఓ పట్టుంటుంది .
మీరు చేసే ప్రతి సాధనలో ఎదో ఒక స్థాయిలో పంచభూతాలను క్రమబద్దీకరించి మీ జీవం నుంచీ , ఈ ప్రకృతి నుంచీ మీరు ఉత్తమమైన వాటిసారాన్ని గ్రహించేలా చేస్తుంది. మీ భౌతిక శరీరం మీ పురోగతికి ఒక మెట్టు అవుతుందా లేక మీ దారిలో ఒక అడ్డంకౌతుందా అనేది ప్రధానంగా మీరు ఈ పంచభూతలను ఎంత నేర్పుగా నిర్వహించగలుగుతున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. దేన్నైతే ‘మీరు’ అని అనుకుంటున్నారో అది కేవలం కొంత భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశమే. ఈ కాసిన్ని అంశాల కలయికే జీవముట్టిపడుతున్న మనిషి!