పాజిటివ్ థింకింగ్ ను సమర్ధిస్తున్నారా? అయితే మీరిది తప్పకుండా తెలుసుకోవాలి
ఈ కాలంలో సకారాత్మక ఆలోచన(positive thinking) చాలా లోక ప్రియమైనది. కానీ మీ జీవితాన్ని నడుపుకోవడానికి అది సరైన మార్గమా? ‘ప్రతికూలం అనిపించే నకారాత్మక ఆలోచనను మీరు నిర్లక్ష్యం చేయవచ్చు, కానీ అది మిమ్మల్ని వదిలిపెట్టదు’ అని సద్గురు ఎందుకు అంటున్నారో చదివి తెలుసుకోండి.

సద్గురు: ప్రపంచంలో ఎంతోమంది ఎప్పుడూ ఈ సకారాత్మక ఆలోచన (Positive Thinking) గురించి మాట్లాడుతున్నారు. మీరు సకారాత్మక ఆలోచన అన్నప్పుడు, మీరు వాస్తవాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అర్ధం. మీరు అసలు విషయాన్ని పక్కనబెట్టి చూసే ప్రయత్నం చేస్తున్నారు, అదే సమయంలో మీరు మరో కోణాన్ని విస్మరిస్తున్నారు. మీరు ఆ కోణాన్ని విస్మరించవచ్చు, కానీ మిమ్మల్ని అది విస్మరించదు, అలక్ష్యం చేయదు. మీరు ప్రపంచంలోని నకారాత్మక విషయాల్ని గురించి ఆలోచించకపోతే మీరు ఊహాలోకంలో నివసిస్తున్నారని. కాని జీవితం మిమ్మల్ని వదలదు. ఉదాహరణకు ఇప్పుడు ఆకాశంలో నల్లని మేఘాలు ఉన్నాయనుకోండి, మీరు వాటిని పట్టించుకోకపోవచ్చు, కానీ అవి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండవు. వాన పడ్డప్పుడు, పడుతుంది. తడిసి ముద్ద అవుతారు.
అంతా బాగానే ఉంటుందని మీరు దానిని ఉపేక్షించవచ్చు. దానికి కొంత మానసికమైన, సాంఘికపరమైన ఔచిత్యం ఉంది. కానీ అస్తిత్వపరంగా లేదు. అది కేవలం ఓదార్పు అవుతుంది. మిమ్మల్ని మీరు ఓదార్చుకోవడానికి, మీరు వాస్తవం నుంచి ఊహలోకి వెళ్ళవచ్చు, ఎందుకంటే మీరు వాస్తవాన్ని ఎదుర్కొనే స్థితిలో లేరు. అలా మీరు ఎదుర్కోలేను అనుకున్నప్పుడు, మీరు ఈ సకారాత్మక ఆలోచనకు తల ఒగ్గుతారు. మీరు నకారాత్మకతను పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తారు. మరో మాటలో చెప్పాలంటే మీరు చెడును తప్పించుకో చూస్తున్నారు.
మీరు దేన్నయితే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారో అదే మీ స్వభావం అవుతుంది. మీరు దేని వెనక వెళుతున్నారో, అది మీలో బలమైన విషయం కాదు. మీరు దేన్నైతే తప్పించుకుంటున్నారో అదే మీలో బలమైన విషయం అవుతుంది. ఎవరైనా సరే జీవితంలోని ఒక కోణాన్ని తీసివేసి, మిగతా వాటితో బ్రతుకుదాం అనుకుంటే, అది అతనికి కష్టాలు తెచ్చిపెడుతుంది.
ద్వంద్వ ప్రకృతి
సృష్టి అంతా ద్వంద్వాల మధ్య నడుస్తున్నది. మీరు అంటున్న పాజిటివ్, నెగిటివ్ అంటే అర్ధం, అక్కడ ఆడ - మగా, చీకటి-వెలుగు ఇంకా పగలూ-రాత్రి. ఇవి లేకుండా జీవితం ఎలా నడవగలదు? ఇదెలా ఉందంటే, మీరు మీకు కేవలం జీవం కావాలి, మరణం వద్దు అన్నట్టు. అలాంటిదేమీ ఉండదు. మరణం ఉంది కాబట్టే జీవం ఉన్నది. చీకటి ఉంది కాబట్టే వెలుతురు ఉంది. మీరు చేయవలసినది ఏమిటంటే, ఈ నకారాత్మకం మిమ్మల్ని మంచెత్తకుండా చూసుకోవడమే. రెండింటిని ఉపయోగించుకోండి రెండింటి నుంచీ లబ్ది పొందండి.
మీరు జీవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తే అందులో సకారాత్మకత, నకారాత్మకత రెండూ సమానంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఉన్నది ఉన్నట్లుగా చూస్తుంటే అప్పుడు సకారాత్మకత, నకారాత్మకత, రెండూ మిమ్మల్ని ముంచెత్తవు. ఎందుకంటే రెండూ సమానం కాబట్టి. అన్నీ జరుగుతున్న విధంగా జరుగుతున్నాయి, మీరు రెంటి నుంచీ మీకు కావాల్సింది రాబట్టుకోవచ్చు.
ఒక బల్బు వెలుగుతున్నది అంటే, అందులో పాజిటివ్ నెగటివ్ రెండు రకాల విద్యుత్ శక్తి ఉన్నది. అక్కడ అనుకూలమైన ఫలితమే వస్తుంది కాబట్టి మనం నెగటివ్ గురించి పట్టించుకోము. ఇప్పుడొక పురుషుడు, స్త్రీ ఇద్దరూ ఉంటే, వారి నుంచి ఆనందమే వస్తుంటే, మనం పురుషుని గాని, స్త్రీ గురించి గాని పట్టించుకోము. అలా కాక వారు ఏదో చెడు ఫలితాన్ని తెస్తుంటే, అప్పుడు మనం అక్కడేదో సమస్య ఉందనుకుంటాము.పాజిటివ్, నెగటివ్ అనేది సమస్య కాదు. చివరికి వచ్చే ఫలితాన్ని మీరు పట్టించుకునేది.
మీరు పాజిటివ్, నెగటివ్ లను దూరంగా పెట్టె ప్రయత్నం చేయనక్కర లేదు. కేవలం మీరు ఫలితం బాగా ఉండేట్లు చూసుకోండి. అది కేవలం మీ సామర్ధ్యాన్ని బట్టి ఉంటుంది. మీకు ఈ జీవం ముఖ్యం అనుకుంటే, మనం ఎక్కడున్నామో నిజాయితీగా చూసుకోవడం ముఖ్యం. అప్పుడే మనం ప్రయాణాన్ని చేయగలం. ఈ సకారాత్మక ఆలోచన అనేది మనుషులకు అనేక అవకాశాలను అందకుండా చేసింది. పాజిటివ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే కింద పద్యం చూడండి.
పైన ఎగురుతోంది, చిన్న పిట్టొక్కటి,
నా ముఖాన వేసింది దాని రెట్టొకటి,
నసగ లేను నేను, ఏడవ లేను నేను
నా సకారరాత్మక ఆలోచనే దానికి కారణం.
పెడతాను నీకెన్నో దండాలు దేవుడా,
చూడు చూడు నాసామి బఱ్ఱెలనెగర నీకుండా.
మీరు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడకపోతే, ఇక దాని గురించి మీరు ఏమీ చేయలేరు, ఏ రకమైన అడుగూ వేయలేరు. మీరు కేవలం మానసికంగా ఏదో ఆలోచనలోనే ఉండగలరు. అది మిమ్మల్ని కొంతవరకు హాయిగా ఉంచవచ్చు, కానీ అది మిమ్మల్ని ఎక్కడకు చేర్చలేదు.