#1 అసమర్థ వ్యవసాయం

సద్గురు: మనదేశంలో 50%కి పైగా భూమి వ్యవసాయ భూమి. అంటే మనం 50% భూమిని దున్నుతున్నాం. ఇంకా సాంకేతిక పద్ధతులను అవలంభించినట్లైతే కేవలం 30% భూమి మొత్తం జనాభాను పోషించగలదు.

ప్రస్తుతం మనం వ్యవసాయం చేసే పద్ధతులు గత వెయ్యి సంవత్సరాలుగా మారలేదు. ఇది చాలా అసమర్థవంతంగా చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మనదేశంలో ఒక కిలో బియ్యం పండించడానికి సుమారు 3500 లీటర్ల నీటిని ఉపయోగిస్తున్నారు. చైనాలో ఇందులో కేవలం సగం నీరు సరిపోతుంది, వారి ఉత్పాదకత మనకన్నా రెండు రెట్లు ఎక్కువ. మనం ఆధునిక శాస్త్రీయ విధానాలను వ్యవసాయంలోనికి తీసుకురావాలి. మన విశ్వవిద్యాలయాల్లో చాలా శాస్త్ర సాంకేతికతలు ఇంకా నైపుణ్యత ఉంది కానీ అది మన నేలలకు చేరడంలేదు.

నదుల రక్షణ (Rally for Rivers) సమయంలో మేము ముగ్గురు వియత్నాం నిపుణులను ఆహ్వానించాము ఎందుకంటే వియత్నాం ప్రపంచానికి ఎక్కువ మొత్తంలో పళ్ళను ఎగుమతి చేస్తుంది. మా సంభాషణ సమయంలో వారు మమ్మల్ని చూసి నవ్వారు. "ఇరవైరెండు ఏళ్ల క్రితం ఢిల్లీ యూనివర్సిటీలో మేము వ్యవసాయం గురించి చదువుకున్నాం, మేము ప్రతీదీ ఇక్కడి నుంచి తీసుకెళ్లి మా నేలపై ప్రయత్నించాము. మీకు మీ పరిజ్ఞానమంతా పేపర్లలో వ్రాయడానికి, ఫోరంలలో పాల్గొనడానికి ఉపయోగిస్తున్నారు కానీ మీ నేలలో పెట్టడం లేదు, మీ సమస్య అదే" అన్నారు.

అందుకే మేము తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంకా కోయంబత్తూర్ లోని ఫారెస్టు కాలేజీతో పని చేస్తున్నాం. విశ్వవిద్యాలయాల్లోని ఈ శాస్త్రన్ని మన నేలపైన పెట్టేందుకు పని చేస్తున్నాం.

#2 వృక్ష సంపద తరిగిపోవడం

నలభై ఏళ్ల క్రితం నేను వ్యవసాయం చేసేటప్పుడు ప్రతి రైతుకు తన పొలంలో కొన్ని చెట్లు తప్పనిసరిగా ఉండేవి. ఇది వారికి భీమా లాంటిది. కర్ణాటకలో ఇది ఒక సాంప్రదాయం, వారు చెట్లకు తమ కూతురు లేదా కొడుకు పేరు పెట్టుకునేవారు. కూతురు వివాహా సమయానికి ఒక చెట్టు కొట్టేవారు, అది ఆ పెళ్ళికి సరిపోయేది. కొడుకు చదువుకు వెళ్లాలంటే ఒక చెట్టు కొట్టేవారు అది ఆ పనికి సరిపోయేది.

చెట్లు వ్యవసాయ భూమిలో ఎప్పుడూ ఉండేవి. కానీ 40 ఏళ్ళ క్రితం రసాయన ఎరువుల కర్మాగారాలు మన గ్రామాలలో, మీ పొలంలో చెట్లు ఉంటే వాటి వేర్లు మొత్తం ఎరువుల్ని తినేస్తుందని ప్రచారం మొదలుపెట్టాయి, చెట్లు తీసేయమన్నారు. మనం లక్షల కొలది చెట్లు తీసేసాం, రసాయన ఎరువులు చెట్లపైన వ్యర్థం అనుకుని.

ఇపుడు మన భూగర్భ జలాలు - నదీ జలాల వనరులు తగ్గిపోయిన స్థితికి వచ్చాము. మన ఉపఖండంలో వర్షపాతం గత శతాబ్దకాలంగా ఇంచుమించు ఒకేలా ఉన్నప్పటికీ మనకు ఈ నీటిని భూమిలో ఒడిసి పట్టుకునే సామర్థ్యం తగ్గిపోయింది. వర్షాల సమయంలో వరదలు ఆ తరువాత కరువు.

మొత్తం నీరంతా నదిలోకి వెంటనే వెళ్ళిపోకుండా చూసుకోవాలి. దీనికి ఉపాయం భూమిపై పచ్చదనం పెంచడమే, దీనిలో రాకెట్ పరిజ్ఞానం ఏమీ అవసరం లేదు. ఇది నా ముఖ్యమైన లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా - ఐక్యరాజ్యసమితి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా. డ్యాంలు, చెక్ డ్యాంలు, బ్యారేజ్ లు వాడుకోవడానికి సరే, కానీ వీటితో నీటి మొత్తాన్ని పెంచలేం, కేవలం వృక్షాలతోనే నీటిని ఒడిసి పట్టడం సాధ్యం.

.embed-container { position: relative; padding-bottom: 56.25%; height: 0; overflow: hidden; max-width: 100%; } .embed-container iframe, .embed-container object, .embed-container embed{ position: absolute; top: 0; left: 0; width: 100%; height: 100%; }

దీనికోసమే మేము ‘కావేరి పిలుపు’కి(Cauvery Calling) శ్రీకారం చుట్టాం. దీని ద్వారా రైతులకు అండగా ఉంటూ 242 కోట్ల చెట్లను నాటి వారి పొలాల్లో వృక్షవ్యవసాయం చేయించే విధంగా పని చేయడం. ‘కావేరి పిలుపు’ తొలిదశ మాత్రమే, 12 సంవత్సరాలలో కావేరి పరీవాహక ప్రాంతంలో పచ్చదనం పెంచగలిగితే, ఇది మనదేశంలో ఇంకా ప్రపంచంలోని ఉష్ణమండలం ప్రదేశాల స్వరూపాన్నే మార్చగలదు.

#3 అధిక జనాభా

పర్యావరణమైనా, నీరైనా, మరింకేదైనా సమస్య కేవలం భాద్యతా రాహిత్యమైన అధిక జనాభా వల్లనే. మనది 130కోట్ల జనాభా గల దేశం. ఈ 130కోట్ల జనాభాకు సరిపడా మనకు భూమి, నదులు, పర్వతాలు కనీసం ఆకాశపు తునకైనా లేదు.

మనదేశంలో నీటి పరిస్థితిని చూస్తే మనకు తలసరి నీటి పరిణామం 1947 లో వున్నదాంట్లో 25% మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇది అభివృద్ధి కాదు. తమిళనాడులోని కొన్ని నగరాల్లో ఇప్పటికే మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు. మన సంస్కృతిలో ఏదేమైనా సరే భోజనం చేయకపోయినా, స్నానం చేయడం అలవాటు. మన వాతావరణం అటువంటిది. కానీ ఇప్పుడు ప్రజలు దీన్ని వదిలేస్తున్నారు. ఇది అభివృద్ధి కాదు, శ్రేయస్కరం కాదు. ఒక రోజున మనం రోజు వదలి రోజు నీరు త్రాగాల్సి రావచ్చు.

మనం మరణాన్ని మన చేతుల్లోకి తీసుకున్నాం,  కానీ పుట్టుకని కాదు. మనం ఉద్దేశ్యపూర్వకంగా జనాభా నియంత్రణ చేయనట్లైతే ప్రకృతే వికృతమైన ధోరణిలో చేస్తుంది - ఇది మనకున్న ఎన్నిక. మానవ జన్మ సారం ఇదే, మనం ఉద్దేశ్యపూర్వకంగా పనిచేయగలగడం.  మనం మానవ మాత్రులం కనుక జాగురూకతతో వ్యవహరించాలి అలా వికృతంగా జరగనివ్వద్దని నా ఉద్దేశ్యం.

ప్రేమాశీస్సులతో,

సద్గురు