ధ్యానలింగం - ప్రతీ రోజూ ఒక ప్రత్యేక లక్షణం!
ధ్యానలింగం యొక్క శక్తుల ప్రాధమిక లక్ష్యం ఒక వ్యక్తి యొక్క ఆధాత్మిక ఉన్నతినీ, వికాసాన్నీ పెంపొందించడమే. కానీ ధ్యానలింగం వారంలోని ప్రతి రోజూ ఒక్కో ప్రత్యేకమైన లక్షణాన్ని ప్రసరిస్తుంది. తద్వారా వివిధ ప్రయోజనాలను పొందవచ్చు. ఆ ప్రత్యేక లక్షణాలు, అవి కలిగించే ప్రయోజనాల గురించి ఈ వ్యాసం చదివి తెలుసుకోండి!
సద్గురు: ధ్యానలింగానికి ఇతర లింగాలకి ఉన్న ప్రాధమికమైన తేడా ఏమిటంటే, ధ్యానలింగానికి ఎటువంటి ప్రత్యేకమైన పూజలు , నైవేద్యాలు లేదా ప్రక్రియలు లేవు. “ధ్యానలింగం”- ఒక ధ్యానపరమైన శక్తి. మీరు చేయవలసిందల్లా ధ్యానశక్తులను గ్రహించి, అనుభూతి చెందేటందుకు అక్కడ నిశ్శబ్దంగా కూర్చుని ఉండటమే. ఒకసారి ఎవరైనా ధ్యానలింగం పరిధిలోకి వచ్చిన తరువాత, వారిలో ముక్తికి సంబంధించిన ఆధ్యాత్మిక బీజం నాటబడకుండా వారు తప్పించుకోలేరు.
మౌలికంగా చూస్తే, ధ్యానలింగ శక్తులు స్వభావపరంగా సృష్టికి కారణమైన ఆదిశక్తులే. ధ్యానలింగం ముఖ్యంగా ఒక అధ్యాత్మిక ప్రక్రియ, కానీ ప్రజలకు ప్రాపంచిక పరమైన సహాయం, ప్రయోజనాలు కావలసి ఉంటాయి కాబట్టి, ఏడు చక్రాల మహోజ్వల వక్తీకరణ ద్వారా అవి కూడా అందచేయ బడుతున్నాయి. శక్తి వ్యవస్ధలు కలుసుకునే చోటుని చక్రాలంటారు. ఒక శక్తి సుడిగుండాన్ని సృష్టించడానికి జీవ నాడులు ఈ చక్రాల వద్ద కలుస్తాయి. మన శరీరంలో చాలా చక్రాలు ఉంటాయి, కానీ మనం సాధారణంగా చక్రాలు అన్నప్పుడు ఏడు ముఖ్యమైన చక్రాల గురించి మాట్లాడతాము. అవి జీవితపు ఏడు పరిమాణాలను ప్రతిబింబిస్తాయి. అవి ఏడు ప్రధాన ట్రాఫిక్ కూడళ్ళ వంటివి. దీని అర్ధం ఒక్కో చక్రానికి స్వతహాగానే ఒక్కో ప్రత్యేకమైన లక్షణం ఉంటుందని కాదు. కొన్ని ప్రత్యేకమైన పనులకై ఒకే దిశలో వెళ్ళే రోడ్లన్నీ ఒక నిర్దష్టమైన చోట కలుస్తాయి, అందువల్ల అది ఒక శక్తివంతమైన చోటు అవుతుంది.
ధ్యానలింగం చక్రాలు ఒక్కక్కటీ వారంలోని ఒక్కొక్కరోజులో ప్రబలంగా ఉంటాయి. అన్ని చక్రాలు వారంలోని ప్రతి రోజూ అందుబాటులో ఉంటాయి, కానీ కొన్ని రోజులలో, కొన్ని చక్రాల ప్రబలంగా ఉంటాయి. ప్రజలు ఒక నిర్దిష్టమైన లాభం లేదా ప్రభావం పొందాలనుకుంటే, వారు ఆ సంభందిత రోజున ధ్యానలింగాన్ని దర్శించుకొని ఆ శక్తిని గ్రహించి, ఉపయోగించుకోవచ్చు.
ధ్యానలింగం యొక్క లక్షణాలు
సోమవారం: భూమితత్వం అయినందువలన, ఈ మూలకం ఆధ్యాత్మిక శక్తులను అంత్యంత ప్రాధమికమైన పద్ధతిలో ఉత్తేజపరుస్తుంది. తద్వారా ఒక వ్యక్తి ఆహారం, నిద్ర అనే పరిమితులకు అతీతంగా ఎదిగేటట్లు సహాయపడుతుంది. ఇది శరీరం, మనస్సులలోని దోషాలను తొలిగించడంలో సహాయపడుతుంది. ఇంకా మరణ భయాన్ని తొలగిస్తుంది. ఇది ఒక వ్యక్తిని శరీరికంగానూ, ఇంకా బయట ప్రపంచంలో కూడా చాలా దృఢంగా స్థిరపడేలా చేస్తుంది. ఆధ్యాత్మికత ప్రయాణం ప్రారంభంచాలనుకునే వారికి ఈ రోజు అత్యంత సహాయకారిగా ఉంటుంది. మొత్తం ఎదుగుదలకు మూలం ఇది. ఇది మనిషికి తనలోని దైవత్వం పట్ల ఎరుకను(awareness) కలిగిస్తుంది.
మంగళవారం: ఈ రోజు నీటి తత్వం అయినందువలన, ఒక వ్యక్తి తన జీవితాన్ని తనకు కావలసిన విధంగా సృష్టించుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఇది సంతానోత్పత్తి, ఊహాశక్తి, అంతర్దృష్టి, మానసిక స్థిరత్వం వంటి విషయాలలో సహాయపడుతుంది. ఇది ఒక వ్యక్తి యొక్క అంతర్గత రుగ్మతల ఉపశమనానికి చాలా మంచి రోజు.
బుధవారం: ఈ రోజు అగ్ని తత్వం అయినందువలన, ఇది జీవితం పట్ల ఉత్సాహాన్నీ కలిగిస్తుంది. ఇది భౌతిక సమతుల్యతను తీసుకువచ్చి శరీరం పట్ల గాఢ అవగాహన కలిగిస్తుంది. ఇది కర్మబంధనాల విచ్ఛిన్నాన్ని వేగిరపరుస్తుంది.
గురువారం: వాయు తత్వం అయినందువలన, స్వేచ్ఛకు దారితీస్తుంది. ఇది దివ్యత్వాన్ని ఆశించటానికి ఒక ముఖ్యమైన రోజు. ఇది కింది శక్తులు, పై శక్తులు కలసి సమతుల్యతను తీసుకవచ్చే రోజు. ప్రేమ, భక్తులు వ్యక్తి లక్షణాలుగా మారుతాయి. కర్మ బంధనాలను తొలిగించుకోవడానికి ఇది చాలా మంచి రోజు.
శుక్రవారం: ఆకాశ తత్వం అయినందువలన, అనంతత్వం, స్వేచ్ఛ ఈ దినపు ప్రాధమిక లక్షణాలు. ప్రతికూల శక్తులు, చేతబడి వంటి వాటితో బాధపడేవారు శుద్ధి కావడానికి చాలా అనువైన రోజు. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఓర్పు, ఆత్మవిశ్వాసాలను, ప్రకృతితో అనుసంధానాన్ని పెంపొదిస్తుంది. ఇది అన్నపానీయాల మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
శనివారం: మహాతత్వం అయినందువలన,ఇది అన్ని ప్రవృత్తులకు అతీతమయినది. ఇది తెలివి, జ్ఞానోదయాలకు దారితీస్తుంది. శాంతి దీని ప్రగాఢ లక్షణం. ఇది ఆత్మఙ్ఞానం పొందాలనుకునేవారికి చాలా ముఖ్యం. ఇది ఒక వ్యక్తి పంచభూతాలను అధిగమించి వివేకవంతుడవడానికి సహకరిస్తుంది. ఇది వ్యక్తిని జగన్నియమాలతో అనుసంధానం చేసి అన్నిటితో ఒకటి చేస్తుంది.
ఆదివారం:ఇది ఇంద్రియాతీతమైన జీవితపు వేడుకను సూచిస్తుంది. గురు కృప పొందేందుకు, తమ ప్రత్యేక అస్థిత్వ భ్రాంతిని విచ్ఛిన్నం చేసుకునేందుకు ఇది ఉత్తమమైన రోజు.
తరతరాలకు అందరికీ ధ్యానలింగం అందుబాటులో ఉండాలన్నదే సద్గురు ఆశయం. మీరు ధ్యానలింగ పవిత్ర స్థలం యొక్క నిర్మాణం పూర్తి చేయటానికి విరాళం అందజేయాలనుకుంటే, అలాగే భవిష్యత్తు తరాలకు ఆధ్యాత్మిక ప్రక్రియను అందించడం కోసం జరిగే కార్యక్రమాలాలో పాల్గొనాలనుకుంటే, మా ఆన్‌లైన్ నిధుల సేకరణ పేజి www.giveisha.com/temple ని దర్శించండి!
Photo Courtesy: Water Splashes from Wikimedia Commons