ప్రశ్న:

ఇప్పుడున్న సాంకేతికతతో ప్రజలకు ఫోటోలు దిగడం అనేది పెద్ద అలవాటై పోయింది. ఇంకా ఇంస్టాగ్రామ్ లాంటివి మామూలు అయిపోయాయి. కానీ చాలా సంస్కృతులలో, ఈ ఆధునిక సాంకేతికత అంతగా ప్రభావం చూపని చోట్ల, ఇలా ఫోటోలు దిగటం గురించి వారు చాలా భయపడతారు. ఎందుకంటే ఒక ఫోటో గ్రాఫ్ వారి ఆత్మను దోచేస్తుందని వారి అభిప్రాయం. మీ ఉద్దేశంలో ఈ ఫోటో తీసుకోవటం వల్ల వ్యవస్థపైన ఏమైనా ప్రభావం ఉంటుందా?

సద్గురు:

ఈ విషయం ఒక నిర్దిష్ట అవగాహన నుంచి వచ్చింది. ఎవరి ఫోటోనైనా మీరు తీసుకుని, దానితో మీరు వారికి ‘దీవించడం’ వంటి మంచి పనులు చేయవచ్చు, మీరు మంచి పనులు చేసే అవకాశం ఉంటే, దానితో మరొకరు చెడును కూడా చేయవచ్చు. భారతదేశంలో మీరు చేతబడి చేసే వారి దగ్గరికి వెళితే, అతను మిమ్మల్ని ఒక ఫోటో అడుగుతాడు. ఎందుకంటే ఫోటో అంటే, ఒక రకమైన జ్యామెట్రీ. మీరు ఒక వ్యక్తి ఫోటో నుంచి, అతని జ్యామెట్రీ అర్థం చేసుకోగలిగితే, మీరు వారిని వృద్ధి చేసే జ్యామెట్రీ సృష్టించవచ్చు, అలాగే ఒకరకంగా వారికి హాని కలిగించే జ్యామెట్రీని తయారు చేయవచ్చు. అందువల్లనే ఆ సంస్కృతులలో మనుషులు ఫోటోలు తీసుకొనివ్వరు.

ఫోటో యొక్క జ్యామెట్రీ

ఒక చిత్రానికి దానిదైన జ్యామెట్రీ ఒకటి ఉంటుంది. ఉదాహరణకి మీరు నా బొమ్మ తీసుకుంటే, మీ దగ్గర నా ఫోటో లేకపోయినా, పుస్తకం మీది ఏదైనా కవర్ పేజీ అయినా పరవాలేదు, కానీ అది పునర్ముద్రించిన ఫోటో కాకపోతే మంచిది, దానిమీద మీరు రుద్రాక్షమాల నుంచి చూడండి, అది ఎలా తిరుగుతుందో గమనించండి. అలాగే మీరు ఓ హంతకుని బొమ్మ తీసుకుని దానిపై రుద్రాక్షమాల ఎలా తిరుగుతుందో చూడండి. అది భిన్నంగా ఉంటుంది.

నేను ఒక భిన్న స్థితిలో ఉన్న ఫోటోలు కొన్ని ఉన్నాయి. ఆ చిత్రాన్ని ఒకటి కాగితం మీద తీసుకుని, అది మడత పెట్టినా పర్వాలేదు. ఎందుకంటే అందులో ఏముందో మీకు తెలియకూడదు. అలాగే మీరు కొన్ని మామూలు బొమ్మలు, ఒక తెల్ల కాగితం మీద, ఒక చెట్టు బొమ్మ, పిట్ట బొమ్మ, అటువంటి కొన్ని బొమ్మలు తీసుకుని, వాటని కూడా మడచి వేసి అన్నింటినీ కలిపి వేయండి. ఎందుకంటే అవి కాగితాలు కాబట్టి అన్ని కలిసిపోతాయి. ఒకవేళ మీరు కూడా ధ్యానం చేసే వారైతే, ఒక స్థాయికి చేరిన వారు అయితే, లేక నేను మీకు ఏదైనా దీక్ష ఇచ్చివుంటే, మీరు వెంటనే ఆ కాగితాల్లో నా బొమ్మ ఉన్న కాగితాన్ని మీరు గుర్తించగలరు.

"మీరు ఒక వ్యక్తి ఫోటో నుంచి, అతని జ్యామెట్రీ అర్థం చేసుకో గలిగితే, మీరు వారిని వృద్ధి చేసే జ్యామెట్రీ సృష్టించవచ్చు, అలాగే ఒకరకంగా వారికి హాని కలిగించే జ్యామెట్రీని తయారు చేయవచ్చు" 

వారు కేవలం దానిని ముట్టుకున్నా సరే, దానిని గ్రహించగలరు అది కేవలం కాగితం అయినా సరే, నున్నగా ఉన్న ఉపరితలం అయినా, సరే బొమ్మకున్న ప్రత్యేకమైన జ్యామెట్రీ వల్ల, అది బహిర్గతం చేసేదాన్ని మీరు గ్రహించగలరు. ఆ జ్యామెట్రీ తెలిసిన వారు ఎవరైనా ఉంటే, అతను దానిని ఉన్నతం చేయగలడు, లేక మీకు బాధ కలిగించగలడు.

అందువల్లనే అటువంటి సాంకేతికత ఉన్న చోట్ల, ప్రజలు ‘నా చిత్రాన్ని ఎక్కడికీ తీసుకు వెళ్ళవద్దు’ అంటారు. ఎందుకంటే ‘మరెవరి చేతిలోనో అది పడితే, నేను మరొకరికి ప్రభావానికి లోనౌతాను’ అంటారు. నా శత్రువు వచ్చి నా ఫోటో తీసుకోవాలనుకుంటే, నేను వారితో ఉండదలచుకోలేదు కాబట్టి, అతను దానిని ఎలా వాడుకుంటారో మనకు తెలియదు కాబట్టి, నేను ఒప్పుకోను. ఆ భయం వల్లనే ప్రజలు ఫోటోలు తీసుకోనివ్వరు.

దేవాలయాల ఫోటోలు

భారతదేశంలో ఉన్న మరో విషయం ఏమిటంటే, కొన్ని రకాల దేవాలయాలలో ఫోటోలు తీసుకోనివ్వరు. దానికి కారణం అక్కడి మూర్తులు ఒక రీతిలో ప్రతిష్టింపబడ్డాయి. ఉదాహరణకు రెండు విధాలుగా ఉన్న ఒకే దేవతా విగ్రహాలు. ఉదాహరణకు కాళీ, గౌరీ. కాళీ విగ్రహాన్ని ఫోటో తీసుకొనివ్వరు, ఎందుకంటే ఆమె నల్లని శక్తిని ప్రసరింపజేయడానికి ఎంతో కృషి చేయబడింది.

మీరు నలుపు అంటే ఏదో పాశ్చాత్య కోణంలో అర్థం చేసుకోవద్దు. అదేదో నష్టపరిచే శక్తి అని అర్థం చేసుకోవద్దు. చీకటి అంటే ఈ సృష్టికి మూలం. మీరు రాత్రి ఆకాశంలోకి చూస్తే, బహుశా నక్షత్రాలు మీ దృష్టిలోకి వస్తాయి. కానీ రాత్రి ఆకాశంలో అతిపెద్ద విషయం చీకటి. సృష్టి అంతా చీకటి నుంచే వచ్చింది. అందువల్ల కాళీ లేదా కాళ విగ్రహాలను ప్రతిష్ఠిస్తే, ఫోటో తీసుకోవడం అనేది దానిపై ప్రభావం ఏదో ఉండే అవకాశం ఉంది.

కానీ మీరు లింగ భైరవి ఫోటోలు తీసుకుంటే ఆమెది కాళీ రూపం అయినా, ఆమె మీద ఫొటోల ప్రభావం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆమెను ఒక రీతిలో ప్రతిష్టించాము. ఆమె చుట్టూ మీరు ఏమి చేసినా ఆమె మీద ఏ ప్రభావం ఉండదు. ఆమెను చూసుకోవలసిన ముఖ్య విషయాలు సరిగ్గా నిర్వహిస్తే, మిగతా విషయాలు ఆమె మీద ఈ ప్రభావమూ చూపవు.

మేము ధ్యానలింగంలో ఫోటోలు తీసుకోనివ్వము. దానికి కారణం ధ్యానలింగం మీద ఇది ప్రభావం చూపుతుందని కాదు. దానికి కారణం ఏమిటంటే, మేము ఆ దేవాలయాన్ని ఫోటోలు తీసుకునే టూరిస్ట్ కేంద్రంగా చేయదలచుకోలేదు.

సత్సంగాలు ఇప్పటికే పిక్ నిక్ లు అయిపోతున్నాయి, ఎందుకంటే సగం మంది ఫోటోలు తీసుకోవడంలోనే మునిగిపోతున్నారు. దేవాలయంలో అలా జరగటం మాకు ఇష్టం లేదు. ఈ కారణంగానే గాని, అదేదో ప్రభావం చూపుతుందని కాదు. ఫోటోలు తీసుకోవడం వల్ల ధ్యానలింగానికి ఏ ప్రభావమూ ఉండదు అలాగే ఫోటో ల వల్ల నేను కూడా ఏమీ కృశించి పోను.

ప్రేమాశిస్సులతో,
సద్గురు