ప్రశ్న: నమస్కారం, బ్రహ్మచర్య మార్గం అవలంబించటమంటే ఏమేమి చేయాలి? అదంతా మా వల్ల అయ్యే పనేనా, కాదా అని తెలుసుకోవటం ఎలా?

సద్గురు: బ్రహ్మచర్యమంటే గాలి తెమ్మెరలా ఉండటం. అంటే దేనికీ అంటకుండా ఉండటం. గాలి తెమ్మెర అన్ని చోట్లకూ వెళుతుంది. కానీ ఇప్పుడది ఎక్కడి నించి వస్తున్నదో మనకు తెలియదు. మహాసముద్రాలేవేవో దాటుకొంటూ వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నది. కానీ పోతూనే ఉన్నది. బ్రహ్మచర్యం అంటే కేవలం జీవ చైతన్యంగా ఉండిపోవటం. ఎలా పుట్టారో అలాగే మనుగడ సాగించటం. ఒంటరిగా ! మీ తల్లి మిమ్మల్ని కవల పి‌ల్లలుగా కని ఉన్నా సరే, మీరు మాత్రం ఒంటరిగా పుట్టిన వారే.. బ్రహ్మచర్యం అంటే దివ్యత్వంతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం. అలాగే జీవించటం.

దివ్యత్వం దిశగా పయానం

బ్రహ్మచర్యమంటే ఏదో ఘనకార్యం కాదు. ఎలా ఉన్నారో అలా ఉంటూ జీవించటమే. వివాహమంటే ఒక పెద్ద నిర్ణయం. మీరేదో గొప్ప పని చేయటానికి ప్రయత్నిస్తున్నారు. కనీసం లోకులు అలా అనుకొంటూ ఉంటారు. బ్రహ్మచర్యం అంటే మీరు ఏమీ చేయరు. జీవితాన్ని దొర్లనిస్తారు. సృష్టికర్త మిమ్మల్ని ఎలా సృష్టించాడో, ఆ సృష్టికి మీరు ఎలాంటి మార్పూ చేయరు. కనక బ్రహ్మచర్యంలో చేపట్టే చర్య అంటూ ఏమీ లేదు. ఏ చర్యా చేపట్టని వాడు బ్రహ్మచారి.

కానీ సాధన ఒకటుంది కదా? యమ నియమాలున్నాయి. వాటి సంగతేమిటి? అవి కూడా కేవలం, మీరు ఉన్నట్టే ఉండిపోవటానికి సహాయం చేసే ప్రక్రియలే. ఎందుకంటే, మీరు ఈ భూమి మీద పుట్టి ఇక్కడి పదార్థాలు ఏమైనా పుచ్చుకొన్నారంటే , ఈ భూగోళం లక్షణాలు మీలో ప్రవేశించి మిమ్మల్ని శాసించటం ఆరంభిస్తాయి. భూమి మీద పుట్టగానే మీరు అందిపుచ్చుకొనే ఒక ప్రధాన లక్షణం జడత్వం, స్తబ్ధత. పొద్దునే మేలుకోవాలన్నా ఒక స్తబ్ధత ఆవరించి అడ్డు వస్తుంది కదా? దివ్యత్వం చేరే మార్గంలో నిలవాలంటే భూగోళపు అలవాట్లకు లొంగగూడదు.

వాటిలో ఒకటేమో స్తబ్ధత. మరొకటి నిరంతర చలనం. ఎవరో తోసినట్టు కదులుతూనే ఉండటం. ఈ భూమి మీద మీరు ఏదయినా స్వీకరించారంటే, మీకు కూడా భూమికున్న లక్షణం అంటుకొంటుంది. అది మిమ్మల్ని కూడా చక్కర్లు కొట్టిస్తూనే ఉంటుంది. ఈ విశ్వంలో మనం 'భౌతికం' అని పరిగణించే పదార్థాలన్నిటికీ ఇలా వలయాలుగా చేసే చక్ర భ్రమణం మౌలికమైన లక్షణం.

మీరు ఒక వలయంలో తిరుగుతుంటే, అది ఎంత పెద్ద వలయమైనా కావచ్చు, మీరు బయలుదేరిన చోటికే మళ్ళీ వస్తారు. ఎవరూ ఆహ్వానించకపోయినా సరే! ఈ ప్రపంచం మీరు మళ్ళీ రావాలని కోరుకొంటున్నదో లేదో మనకు తెలియదు. కానీ మీరు మాత్రం వచ్చేస్తారు. ఎందుకంటే మీది చక్రభ్రమణం కనక. ఇక్కడ మనతో ఎవరికీ ఏ అవసరమూ లేదు అని గ్రహించినవాళ్లూ, లేదంటే ఈ చక్రభ్రమణ మార్గం వదిలేసి ఒక సరళ రేఖలా ముందుకు పోదల్చుకొన్న వాళ్ళూ ఉంటారు. వాళ్ళు మాత్రం ఈ చక్కర్ల మార్గం వదిలి దివ్యమార్గం పట్టుకొంటారు. ప్రాకృతికమైన చక్ర భ్రమణం వదిలేసి బ్రహ్మచర్యాన్ని తమ మార్గంగా నియమంగా ఎంచుకొంటారు. ప్రకృతి సిద్ధమైన మార్గానికి లోబడటం వారికి ఇష్టం ఉండదు.

బ్రహ్మచర్యమంటే ఏమేమి చేయాలి అంటారా? బ్రహ్మచర్యమంటే బాగా గ్రహింపు ఉంటే, నిజానికి ఏమీ చేయనక్కర్లేదు. బ్రహ్మచర్యం చాలా సరళమైన విషయం. ప్రతిరోజూ మీరు అప్పుడే పుట్టినట్టుగా నిద్ర లేస్తారు. రాత్రికి, ప్రాణాలు వదిలేసిన వారిలా నిద్రపోతారు. ఈ మధ్యలో అందరికీ పనికివచ్చేదేదయినా చేస్తారు. ఏదో ఒకటి చేయాలి కనక. ఏ పనీ లేకుండా జీవించగల స్థితికి మీరు చేరలేదు కదా!

ఆ చేసేదేదో మీకు సంబంధించింది మాత్రం కాకూడదు. మీకు సంబంధించిందయితే , అది మీకు ఎన్నోచిక్కుముడులు సృష్టించి పెడుతుంది. కనక మీకు సంబంధించని పనులేవో నిర్విరామంగా చేస్తూ పోతారు. ఎంత పని చేస్తారంటే, ఇక రాత్రికి నిద్రకు ఉపక్రమిస్తే నిద్ర పట్టేందుకు ఒక క్షణం కూడా పట్టదు. గాఢనిద్రలో మునిగిపోతారు. మళ్ళీ కోడి కూయక ముందే నిద్ర లేస్తారు. లేస్తూనే పనిలో మునిగిపోతారు. మిగిలిందంతా అనుగ్రహం వల్ల జరిగిపోతుంది.

 

నిజానికి మీరు ఎక్కువ పనేమీ చేయనక్కర్లేదు. ఎందుకంటే ఒక బ్రహ్మచారిని 'తయారు' చేసేందుకు మేము కొంత శక్తిని వినియోగం చేస్తాం. . వాస్తవానికి అది అవసరం లేదు. వాళ్ళు బొత్తిగా ఏమీ చేయకపోయినా అలాగే ఉంటారు. కానీ ఈ భూగోళం నియమాలు కొన్ని లోపలి నించి వర్తిస్తాయి. శరీరాన్ని అలా ఉంచేయటానికి వీలు లేదు. దానికో పెద్ద కర్మఫలాల రాశి ఉంటుంది. దాని వాసనలు దానివి.

ఈ వాసనలు మీ ఉనికికి సహజసిద్ధమైనవి కాదు. కానీ, ఈ ఉపాధి- ఈ శరీరం - ఇలాగే నడుస్తుంది. మీరు చక్రాల పొంతన (alignment) లో చిన్న తేడా ఉన్న కారును నడుపుతున్నారనుకోండి. ముందు ఆ సమస్య పరిష్కరించుకోవాలి. లేకపోతే అది కారును ఒక పక్కకు లాగేస్తుంది. మానవ శరీరానికి కూడా ఇలాంటి పొంతన(alignment) సమస్య ఉంటుంది. అది కూడా ఒక పక్కకు లాగేస్తూ ఉంటుంది. కారు ఒక వైపుకు మళ్ళినా, మలుపు తిరిగినా, ఇక అది మళ్ళీ తన చక్కర్లలో పడిపోతుంది.

ఇలా పడటానికి కొంత సమయం పడుతుంది. అలాగే మనం ఎరుక కూడా అంతంత మాత్రమే. అందుకనే చుట్టూ తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చినా ఆ చోటు మనకు కొత్తగా కనిపిస్తుంది. మీరు ఒక ప్రదేశంలో ఎక్కడో, మధ్యాహ్నం పూట కూర్చుని చూస్తే, అది ఒక రకంగా కనిపిస్తుంది. సూర్యాస్తమయ సమయంలో వచ్చి కూర్చొని చూస్తే మరోలా కనిపిస్తుంది. అర్ధ రాత్రి వేళ ఇంకో విధంగా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు మీరు కొత్త ప్రదేశానికి వచ్చాననుకొంటారు . కానీ జరిగింది అది కాదు. తేడా ప్రదేశంలో లేదు. సమయంలో, ఋతువులో తేడా. లేకపోతే మన పరిమితమైన జ్ఞాపక శక్తి వల్ల వచ్చిన తేడా.

మీ పిచ్చిని ఒప్పుకోవడం

మీ చేతిలో ఉన్న బండి, చక్రాల అమరికలో పొంతన లేని బండి. లేదంటే, గుండ్రంగా వలయాలలో తిరుగుతూ ఉండే బండి. మీరున్నది మూడు నెలల వలయమా, పన్నెండు సంవత్సరాల వలయమా అనేది మీకు ఎంత శాతం పిచ్చి అనే దాని మీద ఆధార పడి ఉంటుంది. మీరు తిరిగేవి మూడు నెలల చక్కర్లు అయితే, మీకేదో పిచ్చి పట్టిందని అందరికీ తెలుస్తుంది. మీవి పన్నెండు సంవత్సరాల చక్కర్లు అయితే, జనం కనుక్కోలేకపోవచ్చు కానీ, ఆత్మ వంచన లేకపోతే, మీకు మాత్రం మీ పిచ్చి తెలుస్తుంది! కాకపోతే, మీరు బాగానే ఉన్నారని మిగతా ప్రపంచాన్ని నమ్మించగలిగే శక్తి మాత్రం మీకుంటుంది.

మీరు చిత్త శుద్ధితో మీలో తొంగి చూసుకోవటం అవసరం.. లోకం ఏమనుకొంటున్నదన్న చింత వద్దు. మీరెవ్వరికీ చెప్పనూ అక్కర్లేదు. కానీ మీ అంతః కరణంలోకి చూసుకొంటే, మీకు పిచ్చి ఉన్నది కదా? మీరు పూర్తి నిజాయితీగా ఇది గమనించాలని నా కోరిక. మీరు చిత్తశుద్ధిగా మిమ్మల్ని పరీక్షించుకొంటే, మీరే తెలుసుకొంటారు. మీ పిచ్చి గురించి మీరే ఒప్పుకొంటారు.

మీరు సంఘజీవి కనక మీకు వాస్తవంగా మీరేలా ఉన్నారన్న దానికన్నా, సంఘానికి మీరెలా కనిపిస్తున్నారు అన్నదే ప్రధానం అయితే, ఇలాగే మీరు ఎన్నెన్నో జీవిత కాలాలు గడిపేయవచ్చు. అలా కాకుండా ఇతరులేమనుకొంటున్నారు అన్నదానికన్నా మీరు నిజంగా ఎలా ఉన్నారు అన్నదే మీకు ముఖ్యమైతే, మీ జీవితాన్ని తీర్చి దిద్దేది మరొక రెవరిదో అభిప్రాయం కాకుండా మీ మనుగడే అయితే,అప్పుడు మీరు సహజంగా దివ్యత్వం మార్గం పట్టుకొంటారు.