Sadhguruయోగా సంప్రదాయంలో శివుడిని ఒక దేవుడిగా చూడరు కానీ ఆయనను మొదటి యోగిగా అంటే ఆది యోగిగా చూస్తారు. కొన్ని వేల సంవత్సరాల తరువాత ఆదియోగి సృష్టించిన జ్ఞానమే ఈ భూమి మీద మనం ఆధ్యాత్మికతగా పిలిచే ప్రతీదానికి మూలంగా ఉంది. ఆయన మానవ జీవితానికి సంబంధించిన జ్ఞానాన్ని, మనం సప్త ఋషులుగా చెప్పుకునే, ఆయన ఏడుగురి శిష్యులకు ప్రసరణ చేసారు. వారిని ప్రపంచంలోని నలుమూలలకు పంపించారు.

అగస్త్యుడిని భారత ఉపఖండంలో సంచరించిన యోగులలో మొదటి వాడిగా పరిగణిస్తారు. ఈ దేశంలో మీరెక్కడికి వెళ్ళినా ఆయన గురించి కధలు ఉన్నాయి. ఆయన చేసినంత పనులు, కాలి నడకన ఆయన తిరిగిన దూరాలు చూస్తే ఆయన ఎంతో అసాధారణ కాలం పాటు జీవించి ఉంటారు. ఆయన చేసిన పనులు చేయటానికి ఆయనకు నాలుగు వేల సంవత్సరాల సమయం పట్టిందని అంటారు. అది నిజంగా నాలుగు వేల సంవత్సరాలా లేక నాలుగు వందల సంవత్సరాలా మనకు తెలియదు కానీ ఆయన కచ్చితంగా చెప్పుకోదగినంత కాలం జీవించారు.

ఆయన చేసిన పని యొక్క ఆనవాళ్ళు ఇంకా ఈ దేశంలోని కుటుంబాలలో కనిపిస్తాయి, వీళ్ళు ఎదో ఒక రకమైన యోగాను సజీవ రూపంలో వారికి తెలియకుండానే చేస్తున్నారు.

ఆయన కొన్ని వందల ఆశ్రమాలను దేశమంతటా స్థాపించారు, ఇవి ఆధ్యాత్మికతను దినచర్యలో భాగంగా చేయటాన్ని లక్ష్యంగా పెట్టుకుని స్థాపించినవే. వారు ప్రతిదానిని ఎటువంటి శక్తి, జ్ఞానంతో  నిర్వహించారంటే అవి మానవాతీతంగా అనిపిస్తాయి. ఆయన చేసిన పని యొక్క ఆనవాళ్ళు ఇంకా ఈ దేశంలోని కుటుంబాలలో కనిపిస్తాయి, వీళ్ళు ఎదో ఒక రకమైన యోగాను సజీవ రూపంలో వారికి తెలియకుండానే చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా చూస్తే కనుక వాళ్ళు కూర్చునే తీరు, వాళ్ళ భోజన విధానం, సంప్రదాయంగా ఏవైతే చేస్తున్నారో అవి అగస్త్యముని యొక్క అవశేషాలే.

అగస్త్యుడిని దక్షిణ భరతదేశపు మర్మజ్ఞ పితామహుడిగా పరిగణిస్తారు. ఈ భూమి మీద ఎన్నో మర్మజ్ఞ ప్రక్రియలు ఉన్నాయి కానీ దక్షిణ భారత దేశపు మర్మజ్ఞత ప్రత్యేక స్వభావం కలిగినది. ఇక్కడి వారు వచ్చిన మర్మజ్ఞులను బాధించలేదు. దాని ఫలితంగా వాళ్ళు వారు కోరుకున్న విధంగా అన్వేషించి, పరిశోధన చేయగలిగారు. దురదృష్టవశాత్తూ చాలా మంది మర్మజ్ఞులకు ఇటువంటి అనుకూలమైన వాతావరణం ప్రపంచంలోని ఇతర భాగాలలో దొరకలేదు. కనుక భూమి మీద మరెక్కడా చూడనట్లుగా దక్షిణ భారత మర్మజ్ఞత మరెంతో సూక్ష్మంగానూ, లోతుగా  అభివృద్ధి చెందింది.

ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ శక్తివంతమైన యోగా మార్గాన్ని స్థాపించారు.

అగస్త్యుని పద్ధతులకు, ఇతర వ్యవస్థలకు గల ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే ఇతర వ్యవస్థలు ఆధ్యాత్మికతను పెంపొందిచటానికి ఇతర వస్తువులను, ఆచారాలను ఉపయోగిస్తాయి. కానీ అగస్త్యుడు తన శరీరం, శ్వాస, శక్తిని తప్ప మరే ఇతర పదార్ధాన్ని ఉపయోగించలేదు. ఈ జీవం మీదే ఆయన పని చేసారు. ఇది చాలా ప్రత్యేకమైనది. అగస్త్యుడు క్రియా పద్ధతులలో ప్రావీణ్యం సాధించారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ శక్తివంతమైన యోగా మార్గాన్ని స్థాపించారు. క్రియ అంటే ఈ జీవితాన్ని పూర్తిగా నేలమట్టం చేసి మరలా పునఃసృష్టి చేయగల అంతర్గత చర్య అని అర్ధం. నేడు ఎవరైనా క్రియా సంప్రదాయానికి చెందిన వారైతే, వాళ్ళు అగస్త్యమునిని పరమోన్నత ప్రతినిధిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు.

ఆధ్యాత్మిక ప్రక్రియలను ఒక బోధనగా, ఒక సిద్ధాంతంగా, ఒక సాధనగా కాకుండా ఓ జీవన విధానంగా జీవితంలోకి తీసుకురావటంలో కొందరు యోగులు మాత్రమే సఫలీకృతులు అయ్యారు. అందులో అగస్త్యముని అగ్రగణ్యులు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు