ఈశాలో మంత్రాలను ప్రధానంగా ప్రజలని ఒక్కటిగా ఉంచడానికి, పరిసరాలలో ఒక విధమైన శక్తని సృజించడానికి వాడతాం. కాని ఇక్కడ మంత్ర సాధన ఉండదు. పూర్తిగా వేరే కారణాలకై, బ్రహ్మచారులు మాత్రమే కొన్ని పనులు చేస్తున్నారు. కాని ఆధ్యాత్మిక ప్రక్రియగా మంత్రాలను ఉపయోగించడంలేదు. అత్యంత సంక్లిష్టమైన ధ్యానలింగ ప్రతిష్ఠ సమయంలో కూడా మేము మంత్రం వాడలేదు. ప్రజలని ఒక్కటిగా ఉంచడానికి, నిమగ్నులుగా ఉండడానికి, చుట్టుపక్కల ఒక వాతావరణాన్ని సృష్టించడానికి మంత్రాన్ని కొద్దిగా ఉపయోగించడం జరిగింది. ప్రాథమిక ప్రక్రియలో మంత్రం లేదు – దాన్ని కేవలం ఒక శక్తి ప్రక్రియగా నిర్వహించడం జరిగింది.

మంత్రాల అందం మంత్రాలకుంది, అందులో సందేహమేమీ లేదు. కాని మౌనం కంటే ఏదీ గొప్పది కాదు.

ఇప్పుడు, మీరు అనుభూతి చెంది ఆనందించాల్సిన సమయం ఇదే. ఇది కూర్చుని మంత్రాలు చదివే సమయం కాదు. మీరెవరూ పనికివచ్చే ఏ కోణానికైనా సిద్ధంగా లేనప్పుడు, ఆ సమయంలో మంత్రాలు వస్తాయేమో. అవి చెడ్డవని కాదు, అవి కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే – ధ్వనులు ఉచ్చరించడం ద్వారా ప్రకంపనలు సృష్టించే ప్రయత్నం అది. ధ్వనిని ఉచ్ఛరించకుండా మేము ఏ విధమైన ప్రకంపనలనైనా సృష్టించగలం. నా అస్తిత్వంలో సారం అదే. మంత్రాలు నాకు కొంచెం చిరాకు కలిగిస్తాయి, ఎందుకంటే అది పెరటి గుమ్మం ద్వారా ప్రవేశం వంటిది. అదసలు పనిచేయదని కాదు, పనిచేస్తుంది, కాని మనం పెరటి గుమ్మం ద్వారా ప్రవేశం ఎందుకు ఎంచుకోవాలి? ముందు ద్వారం నుండి ప్రవేశం అసలే సాధ్యం కాకపోతే అప్పుడు కిటికీలోంచి ఎక్కాలి. కాని మీరు ముఖద్వారం తెరచుకొని లోపలికి వెళ్లగలిగితే అది అన్నిటికంటే మంచి పద్ధతి కదా!

మంత్రాల అందం మంత్రాలకుంది, అందులో సందేహమేమీ లేదు. కాని మౌనం కంటే ఏదీ గొప్పది కాదు. మన అంతరంగంలోని చైతన్యమనే ప్రాథమిక శక్తి కంటే పెద్దదేదీ లేదు. అదెలా చేయాలో మీకు తెలియనప్పుడు, మేము తగిన ధ్వనులను ఉపయోగిస్తాం, కాని మీ చైతన్యం చేయగలిగిన దానితో మరేదీ సమానం కాదు. మీ లోపల తీవ్రంగా ఉన్న సృష్టి మూలానికి ఏ ధ్వనీ, ఏ బాహ్య పద్ధతీ సాటిరాదు. ఇది వ్యక్తమయ్యేటట్లు చేయడమెలాగో మీకు తెలిసినప్పుడు మీరు కూర్చుని మంత్రాలు చదవడమెందుకు?

మేం సృజించాలనుకునే పరిస్థితి మరింత క్లిష్టమైనదైతే అప్పుడు రోజంతా మంత్ర పఠనం చేయవచ్చు. అయినా మంత్ర పఠనం ప్రాథమిక ప్రక్రియ కాదు. అది కేవలం మనల్ని సన్నద్ధం చేసే ఒక మెట్టు మాత్రమే. ఈశా యోగా కేంద్రంలో మంత్రమనేది ఎన్నటికీ ప్రధాన ప్రక్రియ కాకుండా ఉండడానికి మీలో కొంతమంది కంకణం కట్టుకోవాలి. భవిష్యత్తరాల బాధ్యత ఇది.

మంత్రాల వల్ల ఉపయోగమేమిటంటే మీరొక టేపు రికార్డరయిపోతే చాలు, అది పనిచేస్తుంది.

మీ చైతన్యాన్ని కోల్పోయి, ఇక్కడ రోజంతా మంత్రాలు చదువుతూ కూర్చోవాలనుకుంటారా? మంత్రం అన్నది చాలా అందమైన సృష్టి, కాని మీరు దాన్ని ఒక మార్గంగా ఉపయోగించదలచుకుంటే అదొక విస్తృతమైన ప్రక్రియ. మంత్రాల వల్ల ఉపయోగమేమిటంటే మీరొక టేపు రికార్డరయిపోతే చాలు, అది పనిచేస్తుంది. చైతన్యం కావడంలో విశిష్టతేమిటంటే మీరు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు – కాని మీరు ఏమీ చేయకపోతే అది జరగదు. ఇదొక ట్రిక్కు కాదు. మీరు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన పనిలేదు. మీరు ఏ పనిచేసినా, ఇదే చివరిపని అన్నట్లుగా, మీ జీవితంలో మీరు చేసే ఏకైక కార్యం అన్నట్లుగా, దాని మీదే  మీ జీవన్మరణాలు ఆధారపడ్డాయి అన్నట్లుగా చేయాలి. అప్పుడు మీరు ప్రత్యేకంగా మరేదీ చేయవలసిన పనిలేదు. మీకు జరిగిందంతా ఏమిటంటే మీ చుట్టూ ఎన్నో రక్షణ వలయాలు ఏర్పరచుకొని ఒక మలబద్ధక అస్తిత్వంగా మారడం.

జీవిత అస్తిత్వం అది ప్రతిస్పందించగలిగే సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుంది. ఎంత సంక్లిష్టమైన జీవితం? కాని అతి మామూలుగా కదిలే గాలి, కదకపొతే మీలో ప్రాణం పోతుంది. ఇలా ప్రతిస్పందించే సామర్థ్యం అతిసాధారణమైంది, కాని అత్యంత ప్రాథమికమైంది. ఇది శ్వాస గురించి మాత్రమే కాదు, మీరిప్పుడు లక్షల రీతుల్లో ప్రతిస్పందిస్తున్నారు. మీరు ఊహించలేనన్ని రకాలుగా మీరీ సమస్త విశ్వానికి ప్రతిస్పందిస్తున్నారు. ఈ స్పందన ఆగిపోతే, జీవితం ముగుస్తుంది.

మీరు మీలో ఎదీ పట్టనట్టు మమైకమైతే, మీరు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఏదో పిచ్చి పనులు చేయడంగా కాక, మీలో దేన్నీ నిరోధించుకోకుండా చూసుకోగలిగితే చాలు, అది జరిగిపోతుంది, దానికి కేవలం అనుకూలమైన వాతావరణం అవసరం. అనుకూలమైన వాతావరణం అంటే నిరోధాలు, అడ్డంకులు ఉన్నది కాదు. మీరు మీ చుట్టూ నిర్మించుకొనే భద్రతా వలయాలు, రక్షణ కవచాలు, మిమ్మల్ని మీరు బందీ చేసుకొనే కారాగారాలు కూడా. దురదృష్టవశాత్తు ఇది అర్థం చేసుకోవడానికి చాలామందికి ఒక జీవిత కాలం పడుతుంది. విశ్వంతో వ్యక్తికి ఉన్న లావాదేవీల స్వభావం, మిమ్మల్ని పరిణమింప జేయగలదని మీరు అర్థం చేసుకోవాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు