గత సంవత్సరకాలంలో ఈశా యోగ సంస్థ కార్యక్రమాలు విశేషంగా విస్తరించాయి. మన దేశంలో ఇంకా విదేశాల్లో కుడా ఈశా కొత్త పుంతలు తొక్కుతోంది. నేను నా ప్రయాణాలు తగ్గించడానికి, బ్రేకులు వేయడానికి ఎంతగా ప్రయత్నించినా, చూస్తుంటే ఉన్నవన్నీ ఏక్సిలేటర్లేగాని, బ్రేకులు లేవనిపిస్తోంది. రాబోయే వారాలు మునుపటికంటే ఎంతో బిజీగా ఉన్నాయి! సాధారణంగా నా వయసులో ఉన్నవారు పదవీ విరమణ చేసి ఇక తక్కిన కాలం హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. కానీ నాకు చూడబోతే ఇప్పుడే ఓ నూతన జీవనం మొదలైనట్లుంది! సోమరితనంతో, విసుగుతో చనిపోవడంకంటే అలసటతో మరణించడం నయం అని నామటుకు నాకు అనిపిస్తుంది!

సోమరితనంతో, విసుగుతో చనిపోవడంకంటే అలసటతో మరణించడం నయం!

ఈశ యోగా కార్యక్రమాల గొప్పతనాన్ని, తద్వారా వచ్చే శ్రేయస్సునీ ప్రపంచం ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లోనూ, వ్యాపార సంస్థలలోనూ, విద్యారంగంలోనూ ఈశాకి సాదరంగా ద్వారాలు తెరుచుకుంటున్నాయి. వ్యక్తిగతంగా నాకు ఆహ్వానాలందటం గురించి నేనంతగా పట్టించుకోను. అద్భుతమేమిటంటే  ఆధ్యాత్మిక ప్రక్రియకే ఈ ద్వారాలన్నీ తెరుచుకుంటున్నాయి! తద్వారా ఈ ప్రక్రియనందుకున్నవారికీ, యావత్ ప్రపంచానికీ ఇది శ్రేయదాయకం. కనీసం కొన్ని కోట్ల మందికైనా మనం దీన్ని చేర్చగలిగితే, రేపు మనం ఈ ప్రపంచం నుండి నిష్క్రమించినా వీరే ఈ బీజాన్నివ్యాపింప చేస్తారు. పరమ పూజ్యులైన మా గురువుగారి వద్దనుండి అందుకున్న ఈ పవిత్ర బీజం అత్యంత శక్తిమంతమైనది. ఈశా ఎక్కడ కాలిడినా ఆక్కడ నేల ఎంతో సారవంతమైనదిగా గోచరిస్తోంది, అతి త్వరలోనే గొప్ప పంట లభించబోతోంది!

ఎక్కువమందికి దీనిని అందించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం గొప్ప వేదిక. ఈ సంవత్సరం జనాభాలోని అతిముఖ్యమైన వర్గమైన- పిల్లలకు దీనిని తీసుకు వెళ్ళాలని, యోగా ప్రక్రియ వీరి జేవనశైలిలో భాగామవ్వాలన్నదే మా ఆకాంక్ష. భారతదేశంలో కనీసం ఓ పదివేల పాఠశాలలకైనా దీనిని అందిచాలన్నదే మా కోరిక. సుమారు ఒక్కో పాఠశాలలో ఎనిమిది, తొమ్మిది వందలమంది పిల్లలున్నట్లయితే, దేశంమొత్తం మీద ఎనభై, తొంభై లక్షలమంది పిల్లల్ని యోగమార్గంలోకి తీసుకుని రావచ్చునన్నమాట!

గత నలభై ఎనిమిది గంటల్లో ఐదు రాష్ట్రాల పర్యటన చేసి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి వారి నుంచి అందిన అనుకూలమైన స్పందనల ఆధారంగా, యోగాని పదివేలకు పైగా పాఠశాలల్లో ప్రవేశపెట్టవచ్చునని అనిపిస్తోంది, వారందరూ యోగ వల్ల కలిగే లాభాలను గుర్తించి వారి శాయశక్తులా ఈ  కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ముందుకొస్తున్నారు. మొట్టమొదటిగా ఈ ప్రాజెక్టుని తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటకలోని ఆరు జిల్లాల్లోనూ, మధ్య ప్రదేశ్, రాజస్తాన్ , మహారాష్ట్రా, గుజరాత్ లో కూడా చేపట్టబోతున్నాము. ఒకరకంగా చూసినప్పుడు పదివేల పాఠశాలల్లో చేయడం అసాధ్యమనిపిస్తుంది కానీ మేము అనుసరించే పద్ధతులతో ఇది ముమ్మాటికీ సాధ్యమే!

అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడే యునైటెడ్ నేషన్స్ లో నేను మాట్లాడబోతున్నాను.

గత కొన్నేళ్లుగా చిన్నపిల్లల్లో, ముఖ్యంగా విద్యార్ధుల్లో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లలు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారంటే మౌలికంగా మన సమాజంలో ఎదో తప్పుందనే అర్ధం. వీటిలో ఓ ముఖ్య కారణం విద్యా వ్యవస్థలోని వత్తిడికీ, పరీక్షా విధానానికి వారు తట్టుకోలేక పోతున్నారు. రాజస్తాన్ లోని కోటా జిల్లాలో విద్యార్ధుల ఆత్మహత్య సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఉత్తర భారతదేశంలో దాదాపు లక్షన్నర మంది విద్యార్ధులు ఇక్కడ కాంపిటీటివ్ పరీక్షలకి కోచింగ్  తీసుకుంటున్నారు

విపరీతమైన వత్తిడి తట్టుకోలేక ఈ పిల్లలు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఈ విద్యాసంస్థల అధికారులని సంప్రదించి, విద్యార్ధులకి ఉప-యోగ’, ‘ఈశా క్రియవంటి సరళ యోగ ప్రక్రియలను మొదలపెట్టాము, వారిజీవన విధానంలో ఒడుదుడుకులని తట్టుకునే శక్తిని యోగా ఇస్తుంది.  వచ్చే 1 ½ నెలల్లో ఈ లక్షన్నర మంది విద్యార్ధులకూ ఇవి అందుబాటులో ఉండేలా చేస్తాము.

అంటే, ఈ సంవత్సరం మా దృష్టి  భావిపౌరులైన మన పిల్లల మీదే! అవే కాకుండా మనదేశంలోనూ, విదేశాల్లోకూడా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. మిగతా అనేక సంస్ధల్లో, విదేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో, భారతదేశంలోని ఎన్నో ప్రభుత్వ శాఖల్లో యోగా కార్యక్రమాలను ప్రవేశపెట్టబోతున్నాము. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడే యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడబోతున్నాను. ఇవన్నీ కాక  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోయంబత్తూరు లోని ఈశా యోగ కేంద్రంలో ఇరవై ఒక్క రోజుల పాటు హఠ యోగ శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇది ప్రత్యేకంగా యోగమార్గంలో ముందుకెళ్లాలని కోరుకునే వారికి! హఠ యోగ నేర్చుకోవాలన్న ఉత్సుకత ఉండికూడా ఇరవై ఒక్క రోజుల సమయం కేటాయించలేని వారికి మే 26 నుండి  జూన్ 2 వరకు జరగనున్న యోగ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. మీ జీవన సరళిలో ఇమిడిపోయి మీకెంతో ఉపయోగపడే హఠ యోగ లోని వివిధ అంశాలను ఈ ఎనిమిది రోజుల కార్యక్రమంలో నేర్చుకుని లబ్ది పొందవచ్చు. నిత్యం యోగ సాధనలో ఉన్న వారి వయసు అంచనా వేయడం కష్టం! అటువంటివారిని వయసు మళ్ళిన తరువాత మీరు చూసి పశ్చాత్తాప పడకుండా ఉండేందుకు ఇప్పుడే ఆ సాధనలు నేర్చుకుని జీవితం సంతృప్తిగా, ఆనందంగా గడపండి! ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే ఇవి నేర్చుకుని యోగాతో మీ జీవితాన్ని అనేక సాధ్యకతలతో సుఖమయం చేసుకోండి.

ఈ ఎనిమిది రోజుల కార్యక్రమంలోని విశిష్టత ఏమిటంటే నేనే స్వయంగా ఇందులో ఓ సెషన్ ను నిర్వహించబోతున్నాను. ఇందులో పాల్గునేవారి ప్రశ్నలకి సమాధానాలు కూడా నేనే ఇస్తాను . 

మీరు మీ శరీరాన్ని బాగా అరగదీసి, సానపెడితేగానీ, మీరు ధ్యాన స్థితిని తాకలేరు. అలాగే మీ జేవితంలోని ఆధ్యాత్మిక కోణాలని, వివిధ మర్మజ్ఞ పార్శ్వాలని చవి చూడలేరు. నేను చెప్పేదేమిటంటే దాదాపు 95 శాతానికి పైగా ప్రజలు, హఠ యోగా చేస్తే తప్ప ధ్యాన స్థితుల్లో దీర్ఘకాలంపాటు కూర్చోలేరు. కేవలం 3 నుంచి 5 శాతం ప్రజలు ధ్యాన స్థితుల్లో ముందస్తు తయారీ లేకుండానే స్థిరంగా కూర్చోగలిగారంటే  అది వారి కర్మవలనే సాధ్యం.

శాస్త్రీయ హఠ యోగాని దాని శుద్ధ స్వరూపంలో మేము మీకందిస్తున్నాము, శక్తిమంతమైన ఈ వైజ్ఞానిక పధ్ధతి ద్వారా మీ వ్యవస్థ  పట్ల అవగాహనని పెంపొందించుకునేందుకు ఇదొక సువర్ణావకాశం. ఈ ఎనిమిది రోజుల కార్యక్రమంలోని విశిష్టత ఏమిటంటే నేనే స్వయంగా ఇందులో ఓ సెషన్ను నిర్వహించబోతున్నాను. ఇందులో పాల్గునేవారి ప్రశ్నలకి సమాధానాలు కూడా నేనే ఇస్తాను. అంతేకాదు ప్రతిష్టాపన చేయబడిన ఇటువంటి పవిత్ర స్థలాల్లో చేయవలసిన ప్రత్యేక సాధన కూడా మీకందిస్తాను, తద్వారా ఆ స్థల మహత్యానికి అనుగ్రహపాత్రులు కాగలుగుతారు. మీ శరీర వ్యవస్థను, అది పనిచేసే విధానాన్నీ క్షుణ్ణంగా అవగాహన చేసుకునేందుకు కొంత పరిజ్ఞానాన్ని కూడా అందిస్తాము. ఇటువంటి అవగాహన మీ జీవితాన్ని అర్ధవంతంగా, సంతృప్తితో జీవించడానికి దోహద పడుతుంది.

 

ప్రేమాశీస్సులతో,
సద్గురు