33 వసంతాల నా జ్ఞానోదయ జీవితం!
ఈ 23 సెప్టెంబర్ 2015 నాటికి నేను చాముండి కొండ ఎక్కి, మళ్ళీ అదే పాత మనిషిగా కిందికి దిగి రాని అద్భుతమైన సంఘటన సంభవించి ౩౩ సంవత్సరాలు పూర్తవుతుంది. తన సొంత తెలివిని తప్ప మరేదీ నమ్మని, అవసరమైతే తన తెలివితో ఈ ప్రపంచాన్నే జయించగలను అన్న హుషారు, నువ్వేమి చేయగలవు అని ఎవరైనా అడిగితే, “నాకు సరిపోయినంత డబ్బు, సమయం ఇస్తే ఆ చంద్రుడికే నిచ్చెన వేస్తాను” అని చెప్పగల ధైర్యం ఉన్న ఒక యువకుడిని నేను. అటువంటి యువకుడిని ఎప్పటిలాగే వచ్చిన ఆ మధ్యాహ్నం ఆశ్చర్యచకితున్ని చేసి, ఇక ఎప్పటికీ అతనని విడిచి వెళ్ళలేదు. చీకటి గానీ, వెలుతురూ గానీ కానిది, దివ్యత్వం గానీ, దుష్టత్వం గానీ కానిది, స్వర్గం గానీ, నరకం గానీ కానిది, మాటల్లో చెప్పలేని ఆనందపారవశ్యాన్నీ, అన్నిటినీ కలుపుకునే స్వభావాన్నీ కలిగినదీ, మన ఆలోచనలన్నిటికీ అతీతమైనదీ అయిన ఆ పార్శ్వం నన్ను ఆనందంలో ముంచేసి, నా జీవితాన్ని సార్ధకం చేసింది.
ఈ ప్రయాణంలో ఎంతో మంది నా వెంట నడిచి ఆ పరవశాన్ని పంచుకున్నారు. జీవితాన్ని మించిన ప్రేమను కూడా పంచుకున్నారు. ఈ రోజు ఈశా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్,USA లో ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో కృప వల్లనే సాధ్యపడింది. ప్రత్యక్షంగా నాలుగు వందల మంది అక్కడ పాల్గొన్నారు. మీరు అందరూ - మీలో ప్రతి ఒక్కరూ అక్కడ ఉండుంటే ఎంతో బావుండేది.
ఇదే నా ఆఖరి శ్వాస అన్నట్లుగానే నేను ఎప్పుడూ నా జీవితాన్ని గడిపాను. మీకు ఆది యోగి యొక్క కృప, జ్ఞానం, శక్తి, జ్ఞానోదయాలను అందించాలనే నేను ఇంకా నా శ్వాసను పట్టుకుని ఉంచాను.
మీ తుది శ్వాస మీరు పీల్చకముందే, మీరు దీన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. కానీ నేను నా తుది శ్వాస వదలకముందే మీరు దాన్ని తెలుసుకోవటానికి కృషి చేస్తే, అది మాటలకు అందని ఆనందాన్ని ఇస్తుంది.