సద్గురు: మానవుడు పొందే ప్రతీ అనుభూతి వెనుక ఒక రసాయనిక పరమైన మూలం ఉంటుంది. ప్రజలు వాళ్ళ అనుభూతిని ఆహ్లాదభరితం చేసుకోడానికి, మత్తుమందులు లేదా మత్తుపానీయాలు లేదా మరో రకంగా రసాయనాలను లోపలికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కోరుకునేదల్లా కొద్దిపాటి సుఖానుభూతి అయితే, నేను దానికి వ్యతిరేకం కాదు. కానీ మీరు ఆహ్లాదాన్ని కోరుకునేవారే అయితే, మరింత గొప్ప ఆనందానుభూతి పొందే అవకాశాన్ని మీకు అందిస్తే, మీకు ఆసక్తిగా అనిపిస్తుంది కదూ? మీరు ఎల్లప్పుడూ మత్తులో ఉంటూ కూడా, అప్రమత్తంగా ఉండడం ఎలాగో నేర్చుకోవడానికి మీకు ఆసక్తి కలగకుండా ఉంటుందా?

మత్తుపానీయాల్లో ఏదో దోషం ఉందని నేను అనుకోవడంలేదు. నేను దాన్ని పట్టించుకోకపోవడానికి కారణం, అందులో తగినంత కిక్ లేకపోవడమే. నేను నిరంతరం మరింకేదో మత్తులో ఉంటాను – నేను కేవలం జీవాన్ని తాగాను. కేవలం నా ఉఛ్వాస-నిశ్వాసాలతో నేను మత్తు తెచ్చుకోగలను. ప్రజలు ఆల్కహాల్ కోసం పరితపించడానికి కారణం, వాళ్ళు చూసిన వాటిలో, అన్నిటికంటే గొప్పది అదే. నేను వాళ్ళకి వేరే డ్రింక్ ను అందిస్తున్నాను. అది ఆల్కహాల్ కంటే మరింత ఎక్కువ మత్తుగా ఉంటుంది. నాతో దీనిని రుచి చూసిన వాళ్ళలో అధికశాతం మంది, ఆల్కహాల్ ను విడిచిపెట్టారు. అది చెడ్డది అనుకోవడంవల్ల కాదు. అది వాళ్ళకు LKG పిల్లలు చేసే పనిలా అనిపించింది. వాళ్ళు దానికి అతీతంగా ఎదిగారు.

ఇది తప్పొప్పుల గురించిన ప్రశ్న కాదు. ఇది ఒక నైతిక దృక్కోణం కాదు. కేవలం ఏంటంటే అది చాలా పరిమితమైనది. ఈ రాత్రికి కొంచెం తాగితే చాలు, రేప్పొద్దున కల్లా దాని తాలూకు దుష్ప్రభావాలు బాధపెట్టేస్తాయి. అదే నేను రోజులో ఇరవై నాలుగు గంటలూ మత్తులో ఉంటాను – ఎలాంటి దుష్ప్రభావం ఉండదు, దానికి అసలు ఖర్చే లేదు, పైగా అది ఆరోగ్యానికి మంచిది కూడా! తాగడానికి ఇది మంచి పధ్ధతి కదా! ఈ ఆల్కహాల్, డ్రగ్స్ ఇంకా ఇలాంటివాటన్నిటినీ మేము LKG పిల్లలు చేసే పనిగా చూస్తాము. ఎందుకంటే మేము కేవలం మా సచేతనత్వంతోనే వెయ్యి రెట్లు ఎక్కువ నిషాను పొందగలం. కేవలం వైన్ ఏం కర్మ? మీరు డి-వైన్ (దివ్యత్వం)నే తాగగలరు.

నేను “ఇన్నర్ ఇంజినీరింగ్” అని అన్నప్పుడు, మీరు ఎల్లవేళలా ఎఱుకతో ఉంటూ, పారవశ్యాన్నిచ్చే అంతర్గత రసాయనికతను సృష్టించుకోగల సాంకేతికత గురించి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం అది యాదృచ్చికంగా జరుగుతోంది, ఎవరి వల్లనో ప్రేరేపితమౌతోంది. మీరు ఎఱుక లేకుండా చేయగలగినది ఏదైనా సరే – సూర్యాస్తమయాన్ని చూడడం, లేదా మీ పియమైన వారిని చూడడం – వాటిని మీరు ఎఱుకతో కూడా చేయగలరు. ఇన్నర్ ఇంజినీరింగ్ కు మూలం అదే.

మీలో మీరు, శాంతి-సంఘర్షణ, ఆనందం ఇంకా దుఃఖం, పారవశ్యం మరియు విచారాలను, అనుభూతి పొందారు. కాబట్టి వీటన్నిటినీ పొందగలిగే సామర్ధ్యం మీ దగ్గర ఉంది. కానీ ప్రస్తుతం, మీరు ఈ అనుభూతులన్నిటినీ, ఎఱుక లేకుండా, యాంత్రికంగా నిర్వహిస్తున్నారు. మీరు దానిని ఎఱుకతో కూడా నిర్వహించగలరు. అన్ని ఆధ్యాత్మిక ప్రక్రియల కృషీ దీని గురించే – మీరు మీ జీవితంలో ఎఱుక లేమితో తప్పటడుగులు వేసే బదులు, ఎఱుకతో నిర్మించుకోగల మార్గాన్ని అన్వేషించడం.

ప్రేమాశీస్సులతో,

సద్గురు