112-అడుగుల ఆదియోగి గురించి బహుశా మీకు తెలియని 12 విషయాలు
2020 ఫిబ్రవరి 21, మహాశివరాత్రి కావడంతో, ఆదియోగి సమక్షంలో రాత్రంతా జరిగే ఉత్సాహభరితమైన వేడుక కోసం ఈశా యోగా కేంద్రం సన్నద్ధమౌతోంది. మీరు సందర్శించడానికి ముందుగా, 112-అడుగుల ఆదియోగి గురించి మీకు తెలియని 12 విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాము.

1. గిన్నిస్ ప్రపంచ రికార్డు
ఆదియోగిని, ప్రపంచంలోనే “అతిపెద్ద ముఖాకృతి నిర్మాణం” గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఇది 112 అడుగుల ఎత్తు ఉంటుంది. మొదటి యోగి యొక్క విశిష్ఠ ప్రతిమ 150 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు ఉండి, దాదాపు 500 టన్నుల ఉక్కుతో తయారు చేయబడింది.
2. ఆదియోగి దివ్య దర్శనం
ఆదియోగి, యోగ విజ్ఞానాన్ని మానవాళికి అందించిన తీరును, కమనీయంగా కళ్ళకుకట్టే 3D లేసర్ ప్రదర్శనలో, ఆదియోగి ధగధగలు అంబరాన్ని తాకుతాయి. ఈ ప్రదర్శనను వారాంతాలు, పౌర్ణమి, అమావాస్య ఇంకా ఇతర పర్వదినాల్లో రాత్రి 8 నుండి 8:15 వరకు వీక్షించవచ్చు.
3. ఆదియోగికి వస్త్ర సమర్పణ
ఆదియోగి చుట్టూ ఉన్న 621 త్రిశూలాలలో, ఏ ఒక్కదానికైనా నల్లటి గుడ్డను కట్టడం ద్వారా భక్తులు, ఆదియోగికి వస్త్ర సమర్పణ చేయవచ్చు.
4. ఆదియోగి ప్రదక్షిణ
ఆదియోగి ప్రదక్షిణ అనేది ఆదియోగి మరియు ధ్యానలింగాన్ని చుడుతూ చేసే రెండు కిలోమీటర్ల ప్రదక్షిణ. ప్రజలు, ఆదియోగి అనుగ్రహానికి పాత్రులు కావడం కోసం, సద్గురు దీనిని సృష్టించారు. తద్వారా అంతిమమైన విముక్తిని పొందే దిశగా మనం చేసే ప్రయత్నానికి ఇది ఆజ్యం పోస్తుంది. ఒక నిర్దిష్టమైన ముద్రను వేసి, నిర్దిష్ట మంత్రాన్ని స్తుతించడం ద్వారా ఈశా యోగా కేంద్రంలోని వివిధ ప్రతిష్ఠిత ప్రదేశాలలోని శక్తిని గ్రహించడానికి గల ఒక విధానమే ప్రదక్షిణ.
5. యోగేశ్వరలింగం సమర్పణలు
యోగేశ్వరలింగం యొక్క శక్తులను అందిపుచ్చుకునేందుకు గానూ, భక్తులు నీరు ఇంకా వేప ఆకులను లింగానికి సమర్పించగలరు.
6. పూర్ణిమ నాటి సంగీత కచేరి
ప్రతి పౌర్ణమి నాడు, అర్ధరాత్రి వరకూ ఆదియోగి సందర్శనకు ప్రవేశం ఉంటుంది. ఇంకా రాత్రి 10:30 నుండి 11:00 గంటల వరకూ “సౌండ్స్ ఆఫ్ ఈశా” ఆదియోగికి సంగీత ప్రదర్శనను సమర్పిస్తుంది.
7. అమావాస్య
ప్రతి అమావాస్యకు, శివారు గ్రామాల ప్రజలు, యోగేశ్వర లింగానికి సాంప్రదాయబద్ధమైన సమర్పణలు అందిస్తారు. సాంప్రదాయ సంగీత మరియు నృత్య సమర్పణ కూడా జరిగిన తరువాత, ప్రసాదం పంపిణీ ఉంటుంది. సకుటుంబ సమేతంగా దర్శించుకోవచ్చు!
8. సద్గురు మదిలో మెదిలే దృశ్యం
డజన్లకొద్దీ నమూనా ప్రతిపాదనల తర్వాత ఆదియోగి ముఖం ఈరోజు ఉన్న మాదిరిగా సృష్టించడానికి రెండున్నరేళ్ళు పట్టింది. ఆదియోగి ముఖం ఎలా అభివ్యక్తం కావాలనేదానికి సద్గురు మదిలో ఒక దృశ్యం ఉంది. ఆ దృశ్యం సాకారం అయితే తప్ప, మరి దేనితోనూ ఆయన కుదుటపడలేదు. ఫలితం ఎంత అద్భుతంగా ఉందో చూడండి!
9. అపురూపమైన ఆదియోగి ఆభరణాలు
యోగేశ్వర లింగం చుట్టూ ప్రదేశం ఇత్తడితో చేసిన ఫలకాల(టైల్స్)తో పేర్చబడి ఉంటుంది. వాటిపై కొన్ని అత్యంత అపురూపమైన ఆదియోగి ఆభరణాల ఆకృతులు సూక్ష్మమైన వివరాలతో సైతం పొదగబడ్డాయి. వాటిలో కర్ణకుండలాలు, జటాఝూటంపై ఉండే నాజూకైన నెలవంక, రుద్రాక్ష, వేప ఆకు, ఢమరుకం, ధనుస్సు, గొడ్డలి ఇంకా గంట ఉంటాయి.
10. బహుభాషా లిఖితమైన లింగం
మీరు యోగేశ్వర లింగాన్ని దగ్గరనుండి పరిశీలిస్తే, నాలుగు దక్షిణ భారతదేశపు భాషలైన తమిళం, తెలుగు, కన్నడం ఇంకా మలయాళంలో “శంభో” స్తుతి లిఖించబడి ఉంటుంది.
11. సప్త ఋషుల ప్రతిమలు
యోగేశ్వర లింగం ఉన్న ప్రదేశం యొక్క ప్రత్యేకత, సప్త ఋషుల ప్రతిమలతో చెక్కబడిన నల్లరాతి ఫలకం. అవి సద్గురుచే ప్రతిష్ఠించబడ్డాయి. ఈ పవిత్రమైన ఫలకాన్ని, దానిని శుభ్రం చేసే వారితో సహా ఎవ్వరూ నేరుగా చేతితో తాకరు.
12. రుద్రాక్ష సమర్పణ
ఆదియోగి మెడలో 1,00,008 రుద్రాక్షలతో చేయబడిన, ప్రపంచంలోనే అతిపెద్ద రుద్రాక్ష మాల ఉంటుంది. పన్నెండు నెలలపాటు దివ్య శక్తిలో పునీతమైన రుద్రాక్షలను ప్రతీ మహాశివరాత్రి పర్వదినపు విశిష్ఠమైన రాత్రిన భక్తులకు ప్రసాదంగా అందిస్తారు.
మహాశివరాత్రి వేళ, శ్రేయస్సు కోసం సద్గురు అందించే శక్తి మరియు సంభావ్యతలను గ్రహించగలగడం అనేది ఒక అరుదైన అవకాశం. మన ఆధ్యాతిక ఎదుగుదల ఇంకా శ్రేయస్సు కోసం ఈ సహజ శక్తులను ఉపయోగించుకునే విశిష్ఠ అవకాశాన్ని మహాశివరాత్రి కల్పిస్తుంది. ఈశా యోగా కేంద్రంలోని ఆదియోగి సమక్షంలో రాత్రి పొడవునా జరిగే ఉత్సాహభరితమైన వేడుక, ప్రగాఢమైన ఆధ్యాత్మిక అనుభూతిని
మీరు ఈ వేడుకలో పాల్గొంటారని మా అభిలాష!