మనం ఎలా తింటున్నామన్నది కూడా మనం ఏమి తింటున్నామన్నంత ముఖ్యమైన విషయమే.ఆరోగ్యకరమైన రీతిలో తినటానికి ఇక్కడ మీకు ఐదు సులువైన ఆహార సూత్రాలు ఇవ్వబడ్డాయి. ఒక వ్యక్తి తను తినే ఆహారం నుండి వీలైనంత ఎక్కువ ప్రయోజనాన్ని పొందేందుకు ఈ ఆహార సూత్రాలు ఉపయోగపడుతాయి.

1: ఎంత తినాలి?

కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మెదడు అత్యుత్తమంగా పనిచేస్తుందని పరిశోధనలు కనుగొన్నాయి

కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మెదడు అత్యుత్తమంగా పనిచేస్తుందని పరిశోధనలు కనుగొన్నాయి. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఘ్రెలిన్‌ అనే హర్మోన్నుఉత్పత్తి చేస్తుందని, అది కడుపుకు ఆకలిగా ఉందన్న సంగతిని మెదడుకు చేరవేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ హార్మోన్ ఇతర వ్యవహారాల్లో కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. నేర్చుకోవడానికి, జ్ఞాపక శక్తికి మరియు ప్రదేశ విశ్లేషణకి చెందిన పనులను చక్కబెట్టే మన మెదడులోని హిప్పోక్యాంపస్ అనే ప్రాంతాన్ని ఘ్రెలిన్ ఉత్తేజితం చేసి, దాని సామార్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల మనం చురుగ్గా, చలాకీగా, చేసే పని మీద ఎక్కువ ధ్యాసతో ఉంటాం. అయితే దీనర్థం మనం తినడం మానేయాలని కాదు, కానీ మనమెంత తింటున్నామన్న విషయంపట్ల జాగ్రత్తగ్గా ఉండాలన్న సంగతిని ఇది చెబుతోంది. మనం సరైన విధానంతో ఆహరం స్వీకరిస్తే మనం మన రోజుని ఎంత మెరుగు పరచుకోవచ్చన్న విషయంపై సద్గురు ఇలా విపులీకరిస్తారు.

“ మీరు రోజంతా తింటూ ఉండకూడదు. మీరు ముప్ఫై ఏళ్ళ లోపు వారైతే,రోజుకు మూడు పూటలా తినడం మీ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. అదే మీకు ముప్ఫై పైబడి ఉంటే, ఆహారాన్ని రోజుకు రెండు పూటలకే తగ్గించడం ఉత్తమం. కడుపు ఖాళీగా ఉన్నప్పుడే మన శరీరం, మనుసు అత్యుత్తమంగా పనిచేస్తాయి. తీసుకున్న రెండున్నర గంటల్లో కడుపులో నుంచీ వెళ్లిపోయేలా, 12-18 గంటల్లో మీ శరీరంలోంచి పూర్తిగా బయటికి వెళ్లిపోయేలా ఆహారాన్ని స్పృహతో తీసుకోండి. ఈ మాత్రం స్పృహను నిలుపుకుంటే, మీరు మరింత శక్తిని, చురుకుదనాన్ని, చలాకీతనాన్ని అనుభూతి చెందుతారు.” – సద్గురు

2: ఆహారాన్ని కాస్త నమలండి!

ఆహారాన్ని నమలడమనేది జీర్ణప్రక్రియలో ఎంతో ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. పిండి పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాలు లాలాజలం ద్వారానే 30 శాతం జీర్ణం అవుతాయి. ఆహారం తీసుకున్న తరువాత నిద్రకు ఉపక్రమించే ముందు, కనీసం రెండు గంటల వ్యవధి నివ్వండి. జీర్ణప్రక్రియ మీ జీవక్రియను ఉత్తేజితం చేస్తుంది. కాబట్టి, అలాంటి స్థితిలో మీరు నిద్రపోతే, అటు మీకు నిద్రా సరిగ్గా పట్టదు, ఇటు జీర్ణమూ సరిగ్గా కాదు! తిన్న వెంటనే మీరు నిద్రపోతే, మీరేది తిన్నారన్న దాన్ని బట్టి మీరు తీసుకున్న ఆహారంలో ఎక్కువ భాగం జీర్ణమవ్వకుండా పోయే అవకాశం ఉంది.

సద్గురు ఆహారాన్ని నమలడమనే విషయంపై యోగ ఏమంటుందనేది ఇలా వివరిస్తారు.

యోగాలో ‘మీరొక ముద్ద ఆహారాన్ని తీసుకుంటే, దాన్ని ఇరవై నాలుగు సార్లు నమలాలి' అని చెబుతాం. దీని వెనక ఎంతో సైన్స్ ఉంది -సద్గురు

“ యోగాలో ‘మీరొక ముద్ద ఆహారాన్ని తీసుకుంటే, దాన్ని ఇరవై నాలుగు సార్లు నమలాలి' అని చెబుతాం. దీని వెనక ఎంతో సైన్స్ ఉంది, కానీ ముఖ్యమైన విషయమేమిటంటే మీ ఆహారం మీ నోటిలో ముందే జీర్ణమైపొతే అది మీ వ్యవస్థలో ఎలాంటి మందకొండితనాన్ని సృష్టించదు. మరొక విషయమేమిటంటే, మీరు కనుక దాన్ని ఇరవై నాలుగు సార్లు నమిలితే, ఆ ఆహరం యొక్క సమాచారం మీ శారీరిక వ్యవస్థలో స్థాపితమవుతుంది. అప్పుడు మీ శరీరంలోని ప్రతీ కణం మీకు ఏది సరైనదో, ఏది సరైనది కాదో నిర్ణయించడం మొదలుపెడుతుంది – అంటే కేవలం నాలుక విషయంలోనే కాదు, మొత్తం వ్యవస్థ విషయంలో ఇలా జరుగుతుంది. మీరిది కొంత కాలం పాటూ చేస్తే, మీ శరీరంలోని ప్రతీ కణానికి దానికేది ఇష్టమో, అయిష్టమో అన్న విషయంపై అవాగాహన ఏర్పడుతుంది.” – సద్గురు

భోజనం చేసేటప్పుడు నీళ్ళను తీసుకోకపోవటం కూడా మంచిది. భోంచేయడానికి కొద్ది నిమిషాల ముందో లేదా భోంచేసిన 30 లేదా 40 నిమిషాల తరువాతో కొద్దిగా నీళ్ళు తీసుకోవడం మంచిది. రాత్రి వేళ రాగి పాత్రలో నీటిని ఉంచితే, అది క్రిములను నాశనం చేయడమే కాకుండా, ఆ నీటిని శక్తివంతం చేస్తుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్(ఐసీయు)లలో పరీక్షించిన రాగి ఉపరితలాలు ఆసుపత్రుల ద్వారా సోకే ఇన్ఫెక్షన్లను వ్యాపింపచేసే బ్యాక్టీరియాని 97 % నాశనం చేస్తాయని తేలింది.

రాత్రి వేళ రాగి పాత్రలో నీటిని ఉంచితే, అది క్రిములను నాశనం చేయడమే కాకుండా, ఆ నీటిని శక్తివంతం చేస్తుంది

3: సరైన సమయానికి సరైన ఆహారం

వివిధ కాలాల్లో వివిధ రకాల ఆహారాన్ని తీసుకునే సాంప్రదాయం గురించి, మారే వాతావరణానికి తగ్గట్టుగా మన శరీరం తట్టుకునే విధంగా సాయపడే ఈ పధ్ధతి గురించి సద్గురు మరింత విపులంగా చెబుతారు.

“ భారత దేశంలో, మరీ ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో వేసవి కాలంలో ఒకలా, వానాకాలంలో మరోలా, చలికాలంలో ఇంకోలా, ఆయా కాలాల్లో దొరికే కూరగాయలతో శరీరానికి సరిపడేట్లుగా వండుతారు. మనం ఈ వివేకంతో మన శరీర అవసరాలకు తగ్గట్టుగా, మారే వాతావరణానికి అనుగుణంగా తినడం మంచిది."

ఉదాహరణకి డిసెంబర్లో గోధుమ, నువ్వుల్లాంటి కొన్ని రకాల ఆహారాలు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. చలి కాలంలో వాతావరణం చల్లబడటం వల్ల చర్మం పగులుతుంది. అయితే సాంప్రదాయంగా ప్రజలు క్రీములు మొదలైనవాటిని వాడేవాళ్ళు కాదు. కాబట్టి, ప్రతీ ఒక్కరూ రోజువారీ నువ్వులని తీసుకునేవారు. అది ఒంటిని వేడిగా, చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. మీ శరీరంలో ఉష్ణం ఎక్కువ ఉండటం వల్ల, మీ చర్మం పగలదు. అదే ఎండాకాలంలో శరీరం వేడెక్కుతుంది. కాబట్టి, చల్లబరిచే ఆహారాలు తీసుకునేవాళ్ళు. ఉదాహరణకి తమిళనాడులో జొన్నలు తీసుకుంటారు. శరీరం తనను తాను ఆ ఋతువుకి అనుగుణంగా మలుచుకునేందుకు ఈ విషయాలను ఏర్పరిచారు.” – సద్గురు

4: సమతుల ఆహారం

సద్గురు తగినన్ని కూరగాయలని, పప్పు దినుసులని, వివిధ రకాలైన ధాన్యాలని ఆహారంలోకి తేవాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తారు.

“ ఈ రోజు డాక్టర్లు దాదాపు 8 కోట్ల మంది భారతీయులు మధుమేహ వ్యాధిగ్రస్తులు అవబోతున్నారని చెబుతున్నారు. దీనికి గల ఒక కారణం చాలా మంది భారతీయులు ఒక రకమైన ధాన్యపు గింజలతో చేసిన ఆహారాన్నే తీసుకోవడం. ప్రజలు కేవలం బియ్యాన్నో లేదా కేవలం గోధుమనో తింటున్నారు. దీనివల్ల తప్పకుండా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. అందుకని విభిన్న రకాల ధాన్యపు గింజలను మన ఆహారంలోకి తీసుకురావడం చాలా ముఖ్యం."

ప్రజలు కేవలం బియ్యాన్నో లేదా కేవలం గోధుమనో తింటున్నారు. దీనివల్ల తప్పకుండా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి -సద్గురు

సాంప్రదాయంగా ప్రజలు చాలా రకాల పప్పు దినుసులని, రకరకాల ధాన్యపు గింజలని తినేవారు. కానీ మెల్లగా ఇవి కనుమరుగైపోయాయి, ఇవ్వాళ దక్షిణభారత ఆహార పళ్లాన్ని చూస్తే, అందులో ఎక్కువగా అన్నం, కొద్దిగా కూరగాయలతో చేసినదేదైనా ఉంటుంది. ఇదొక తీవ్రమైన సమస్య. పూర్తిగా కార్బోహైడ్రేట్లు ఉండే ఇలాంటి ఆహారానికి మారడమనేది గత ఇరవై ఐదు, ముప్ఫై ఏళ్ళలో జరిగింది. దీన్నిప్పుడు వెనక్కి తిప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండి ఇతరాలు అతి తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే, ఒక వ్యక్తి దీర్ఘ కాలిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఇది ప్రజల మనస్సులో మారాల్సిన ఒక మౌలికమైన భావన. ఆహారంలో ఎక్కువ భాగం కేవలం అన్నమే ఉండకూడదు, ఇతరాలు కూడా ఉండాలి. అన్నమనేది మీ ఎంపిక మాత్రమే – అది తినాలా వద్దా అనే విషయాన్ని మీరు మీ ఆకలి స్థాయిని బట్టి నిర్ణయించుకోండి.”సద్గురు

5 : మంచి ఆహారపు అలవాట్లనేవి ఏమి లేవు!

ఆహారం శరీరానికి సంబంధించినదని, ఏమి తినాలనేది నిర్ణంయించుకోవడానికి శరీరాన్ని అడగటమే ఉత్తమమైన మార్గమని సద్గురు మనకు గుర్తు చేస్తారు. ఒక మూస పద్ధతిలో మనల్ని ప్రవర్తింపచేసే ఆహారపు అలవాట్లని పెంచుకోవడం కంటే, మన వివేకాన్ని ఉపయోగించి స్పృహతో మన ఆహారం గురించి నిర్ణయించుకోవడం మంచిదని ఆయన అంటారు.

ఎడిటర్ సూచన: ఈ సాధారణ సూచనలు చాలా మంది ప్రజలకి వర్తించినా, ప్రతీ ఒక్కరి శరీరం ప్రత్యేకమైనది. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలున్న వారు తమ ఆహరంలో మార్పులు చేసేముందు ఒక ఫిజీషియన్ని కలవడం మంచిది.