తూర్పు నుండి పడమరకు
In this week’s Spot, Sadhguru writes about his many travels and engagements from Andhra Pradesh to Palm Beach. Sadhguru also writes about the calamity in Nepal, and sends his hopes for its restoration.
ఈ రెండు వారాలూ, చెప్పనలవి కానన్ని చోట్లకు వెళ్ళాము. భోపాల్‌కు వెళ్ళే దారిలో, విజయవాడ దగ్గర ౩ గంటలు ఆగి, అక్కడ ఈశా లీడర్‌షిప్ అకాడమీ, లా స్కూల్‌లను కట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చూపించిన 4 స్థలాలు పరిశీలించాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరులు శాఖ మంత్రి, ఆ శాఖకు చెందిన అధికారులు ఆ స్థలాలను ఎంతో ఆదరంగా చూపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చురుకైన పరిపాలనా తీరు మిగతా వారందరికీ మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం కావాలి. ఇన్ని సంవత్సరాల ప్రజా జీవితంలో ఇలాంటిది నేను ఎన్నడూ నేను చూడలేదు. దురదృష్టవశాత్తూ, మీడియాలో కొన్ని వర్గాల వారు, కొందరు స్వార్ధపరులు రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ని ఒక సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలనీ, ఒక గొప్ప రాజధాని నగరాన్ని నిర్మించాలనీ ముఖ్యమంత్రికి ఉన్న స్వప్నాన్ని రాజకీయ లబ్ది కోసం తాపత్రయపడే ఎంతో మంది పంచుకోవడంలేదు. ఇది చాలా దురదృష్టకరం.
మధ్యప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా విధానం కూడా ఒక కనువిప్పు. ముఖ్యమంత్రి, ఆయన సహచరుల నిరాడంబరత, అంకితభావం ప్రశంశనీయం. ఆ ముఖ్యమంత్రి అణుకువ మిగతా రాజకీయ నాయకులందరికీ అనుసరణీయం. నర్మద నది తీరాన కూడా కొంత సేపు గడిపాము. మనస్సుకి హత్తుకునే విషయం ఏమిటంటే అక్కడి స్థానిక ప్రజలు నర్మదా నదిని సజీవ మాతృదేవతలా ఆదరిస్తున్నారు. నీటిని ఒక వస్తువుగా కాకుండా, మనకు జీవాన్నిచ్చే పవిత్రమైన దివ్యజలంగా భావిస్తున్నారు.
ఉజ్జయినిలో జరగబోయే మహా కుంభమేళ గురించి జరిగిన ప్రారంభ సమావేశంలో మాట్లాడాను. మహా కుంభమేళాను ఐహిక, ఆధ్యాత్మికాల రెండింటి పట్ల జ్ఞానాన్నీ పెంచి, పంచుకునే విధంగా జరపాలన్నది ముఖ్యమంత్రి స్వప్నం. మహా కుంభమేళం యొక్క శక్తివంతమైన అనుభూతిని అందరూ పొందాలి. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళాను అద్భుతంగా నిర్వహించడంలో భాగంగా దక్షిణ భారతీయులకు, విదేశీయులకు సదుపాయాలు కల్పించడంలో మధ్యప్రదేశ్ పాలకులతో ఈశా భాగస్వామి అవుతుంది. కుంభమేళా యొక్క ప్రాభవాన్ని తెలిపే శాస్త్ర విజ్ఞానాన్నీ, పురాణ గాథలను నేను వెలుగులోకి తీసుకువస్తాను. మహాకాలుని నిలయం ఉజ్జయిని. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి ఇది చాలా ప్రముఖమైనది.
ముంబైలో ఒక రోజు కొన్ని ముఖ్యమైన సమావేశాలకు హాజరైన తరువాత ఇప్పుడు అమెరికాలో ఉన్నాను. మొదటి రెండు రోజులూ ఆది యోగి ఆలయ నిర్మాణం జరుగుతున్న టెన్నిసీ రాష్ట్రంలోని ఈశా ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్‌లో ఉన్నాను. కొన్ని అవాంతరాలు ఎదురౌతున్నప్పటికీ, అనుకున్నట్లుగానే సెప్టెంబర్ 23న ఆది యోగి ఆలయ ప్రతిష్టీకరణానికి సమాయత్తమౌతున్నాము. ఈ ప్రతిష్టీకరణ ఇప్పటివరకూ అమెరికాలో చేసిన మార్మిక సంబంధమైన పనులన్నింటిలోకీ ముఖ్యమైనది. అమెరికాలో ఇంతకు ముందు కొన్ని ప్రతిష్టీకరణలు చేశాము, కాని ఈ ప్రతిష్టీకరణ చాలా ముఖ్యమైనది.
గడిచిన ఐదు రోజుల్లో, నాలుగు వేరు వేరు పట్టణాల్లో జిరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. టెక్సాస్ రాష్ట్రం, హూస్టన్ పట్టణంలోని రైస్ యూనివర్సిటీలో బేలర్ కాలేజీ అఫ్ మెడిసిన్‌కు చెందిన ‘డేవిడ్ ఈగల్ మ్యాన్‌తో సంభాషణ’ అనే సదస్సులో చాలామంది పాల్గొన్నారు. న్యూరో సైన్సులో అతను కొన్ని వినూత్న ప్రయోగాలు చేశాడు. అతను ఎంతో తెలివైన, ఆనందోత్సాలున్న వ్యక్తి. తనకున్న అనేక డాక్టరేట్ల వల్ల మొద్దుబారిపోకుండా, మామూలుగా అందరిలో కనిపించని చిన్న పిల్లలకుండే ఉత్సాహం, ఆశ్చర్యాలతో ఉన్న వ్యక్తి ఆయన. సరైన జోడీ దొరకటంతో, నేను మార్మిక విషయాలలోకి వెళ్ళకుండా, తేలికపాటి పోసుకోలు కబుర్లతో గడిపేశాను. అక్కడున్న రెండున్నర వేలమంది ప్రేక్షకులు దీనిని బాగా ఆనందించినట్లున్నారు.
ఆ తరువాత, రెండు రోజులు పామ్ బీచ్‌లో డగ్ స్పూనర్‌తో గోల్ఫ్ ఆట ఎంతో ఆసక్తికరంగా సాగింది. అతను ఇంగ్లాండ్‌లో ప్రముఖ గజిబిజి మాటలకు ప్రవక్త అయిన స్పూనర్ వారసుడు. నా చిన్నతనంలో ఈ గజిబిజి మాటల గురించి కొంత సన్నిహిత అవగాహన నాకు మా తాత వలన ఏర్పడింది. అతనికి ఇంగ్లీష్‌లో కొంత పాండిత్యం ఉంది. ఇంకా, కీ.శే. రాబర్ట్ కెన్నెడీ భార్య ఇథెల్ కెన్నెడీతో సాయంత్రం కొంత సేపు ఆనందంగా గడిపాము. ఆమెకు 87 సంవత్సరాలు. ఆమెలో ఉప్పొంగే ఉత్సహం చూసి, ఏదో ఒక విషయం పట్ల అంకిత భావం ఉంటే వయస్సు ఒక అడ్డంకి కాదు అనటానికి ఆమె ఒక ఉదాహరణ.
5 సంవత్సరాల తరువాత ఫ్లోరిడాలోని తంపలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య మధ్యాహ్నం కొన్ని గంటల పాటు బహిరంగ సభలో ఓ ఉపన్యాసకుడిగా పాల్గొన్నాను.
ఇప్పుడు ఈ చిన్ని పైపర్ మలిబు ప్లేన్‌లో 11 గంటల పాటు పశ్చిమ తీరానికి ప్రయాణిస్తున్నాను. ఎంతో దుర్బలంగా కనిపించే ఈ చిన్ని చరుకైన యంత్రం 50 నాటికల్ మైళ్ళతో వీచే ఎదురుగాలులను పట్టించుకోకుండా తన శక్తిని చూపించడానికి ఈ తీరం నుంచి ఇంకో తీరానికి ప్రయాణిస్తోంది. మనల్ని నియంత్రిస్తున్నాయనుకుంటున్న ప్రకృతి నియమాల్ని కూడా అధిగమించి, ఇంత దుర్బలమైన మానవుడిని తేలికైన విమానంలో పశ్చిమతీరానికి తీసుకు వెళ్ళడాన్ని సుసాధ్యం చేస్తున్నది మానవ మేధ.
గత 12 సంవత్సరాలుగా నేపాల్‌తో మన మనస్సుల్లో ఎంతో దగ్గర సంబంధం ఏర్పడింది. ఇప్పడు, అక్కడ జరిగిన విపత్తు ఎంతో హృదయ విదారకం. జరిగిన ప్రాణ నష్టం విపత్కరమైనది. అక్కడ ప్రజలు ధైర్యానికి, తిరిగి కోలుకొనే తత్వానికి ప్రతీకలు. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. భక్తాపూర్ ఓ నిరుపమాన ప్రాచీన నగరం. భూకంపం వలన భక్తాపూర్‌లో జరిగిన విద్వంసం భర్తీ చేయలేనిది. అద్భుతమైన నేపాలీ కళాసౌందర్యాన్నీ, ప్రతిభకూ నిదర్శనమైన ఈ నగరాన్నీ పునరుద్దరించటానికి అంతర్జాతీయ సంస్థలు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను. ప్రధానమంత్రి చురుకుగా స్పందించిన తీరు ప్రసంసనీయం. చైనా యంత్రాంగం కూడా స్పందించింది. నేపాలుకూ, ఆ దేశ ప్రజలకూ నా ప్రగాఢ సానుభూతి, ఆశీస్సులు.