కుణాల్ కోహ్లీ: మాదొక దిగువ మధ్యతరగతి కుటుంబం. మానాన్నకు పనిచేసే ఆసక్తి లేదు కాబట్టి, 1970 లలో స్త్రీలు బయటకు వెళ్లి పనిచేయడం చాలా అరుదైన కాలంలో మా అమ్మే మమ్మల్ని పోషించడం కోసం పనిచేసిది. నన్ను, నా సోదరిని పెంచింది. మమ్మల్ని దేశంలోనే అత్యుత్తమ పాఠశాలలకు పంపి చదివించింది. మా సోదరి పెళ్లి చేసింది. మానాన్న ఆర్థికంగానే కాదు, భావోద్వేగపరంగా కూడా మాకు ఉన్నా లేనట్లే. ఇటీవల ఆయన ఆస్పత్రిలో ఉన్నాడు. డాక్టర్లు ‘ఆశ వదులుకో’ మన్నారు. నాకేమీ అనిపించలేదు. నాకు మా నాన్నతో అటువంటి సంబంధం లేదు. నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలు పెట్టాను. నేను చెడ్డవాడినా? అని. నేను కూడా ఆయనలాగా తయారవుతున్నానా? ఆయనకు తగ్గింది. ఇంటికి వచ్చాడు. అయినా నాకేమీ అనిపించలేదు. అదే మా అమ్మకు కొంచెం జ్వరం వచ్చినా చాలు, పరుగెత్తుకుని వెళతాను. కాని ఈయన నా తండ్రి, అయినా నాకేమీ అనిపించడం లేదు. కారణమేమిటి? నాకు సంబంధించినంతవరకు ఆయన అక్కడ లేడా? చివరికి తల్లిదండ్రుల పట్ల మన భావనలు కూడా స్వార్థపూరితమై పోయాయా?

సద్గురు: స్వార్థరహితంగా ఉండడమంటూ ఏమీలేదు. ప్రతిదీ ‘స్వ’-అర్థమే. మరొకటి లేదు. మీ ఆలోచనలు, భావాలు మీ లోపలివే, అందువల్ల అవి స్వార్థపూరితంగానే ఉంటాయి. అయితే మీ స్వార్థం లోభంగా ఉందా, ఉదారంగా ఉందా అన్నదే ప్రశ్న. మీ స్వార్థంలో ఏదో విధంగా మీ శరీరానికి సంబంధించినవారు మీ భార్య లేదా భర్త, మీ సంతానం, మీ అమ్మ, లేదా మీనాన్న, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు మరోవిధంగా చెప్పాలంటే మీ కుటుంబం మాత్రమే చేరుతుందా? లేకపోతే మీ స్వార్థం విస్తృతమై మొత్తం మానవసమాజాన్ని లేదా సర్వప్రాణులనూ కలుపుకుంటుందా? ఇది స్వార్థానికి సంబంధించిన ప్రశ్నకాదు. లోభత్వానికి, పిసినారితనానికి సంబంధించిన ప్రశ్న.

హిందీలో కంజూస్ అంటాం. కం (తక్కువ) జూస్ (రసం). మీ చుట్టూ ఉన్న ప్రతి ప్రాణిపట్లా ప్రతిస్పందించడానికి కావలసినంత రసం మీలో లేదన్నమాట. మీ జీవితంలో కొద్దిమందికి మాత్రమే సరిపోయే రసం మీ వద్ద ఉందన్నమాట. భౌతిక లేదా ఆర్థిక విషయాలకు సంబంధించి మీరు కొంత మంది పట్ల మాత్రమే బాధ్యత తీసికోగలరు. కాని ఆలోచనలు, భావాల విషయానికి వస్తే అక్కడ కొరత ఏముంది? మీరీ విశ్వంలోని ప్రతి ప్రాణికీ ప్రతిస్పందించవచ్చు. సమస్య ఏమిటంటే మీలో తగినంత రసం లేదు, తగినంత జీవం లేదు. మీలో చాలినంత జీవం ఉంటే మీరు ప్రతి ప్రాణి పట్ల – క్రిమి, కీటకం, పక్షి, జంతువు, వృక్షం ఏదైనా కానీ, మీరు స్పందిస్తారు. మీ జీవితాన్ని సాఫల్యం చేసుకొనే మార్గం ఇది. జీవితం కొంత కాలం మాత్రమే ఉండేది. అల్పకాలికం.

కుణాల్ కోహ్లీ: ‘కమ్ జూస్’ అన్న మీ అభిప్రాయంతో నేను పూర్తిగా అంగీకరిస్తాను. ఎందుకంటే ఇవ్వడానికి నాలో ప్రేమ సమృద్ధిగానే ఉందని నేననుకుంటున్నాను. నిజానికి ఒక మాట అనిపిస్తుంది – అది ఇప్పుడు చెడ్డమాటగా అనిపించవచ్చు – ఒక భార్య, ఒక భర్త అన్న పద్ధతి అంతమంచిది కాదేమో, ప్రతివారిలోనూ ఎంతో ప్రేమ నిక్షిప్తమై ఉంది కదా...

సద్గురు: నేను మాట్లాడుతున్న రసం అదికాదు. అది హార్మోన్లకు సంబంధించింది. నేను మాట్లాడుతున్నది అత్యావశ్యకమైన జీవరసం. శరీర సంబంధమైన అంశాలకు వస్తే అవి పరిమితంగా ఉండడమే మేలు. శారీరకమైంది ఒక పర్యవసనం లేకుండా రాదు. కాని శారీరికం కాని దానికి అటువంటి కారణం అవసరం లేదు - దానికి ఖర్చయ్యేదేమీ ఉండదు. మీకు తెలియని ఒక వ్యక్తి పట్ల ప్రేమతో ఉండేందుకు మీకు ఖర్చయ్యేదేమిటి? ఆ వ్యక్తిని ప్రేమతో చూడడంలో సమస్య ఏమిటి? ఆ వ్యక్తి ఆ ప్రేమను స్వీకరిస్తాడా లేదా అన్నది వాడి సమస్య. మీరు ప్రేమిస్తారు, ఆ ప్రేమ మీ జీవితాన్ని సుందరం చేస్తుంది. మీ భావోద్వేగాల మాధుర్యం మరొకరి గురించి కాదు.

కుణాల్ కోహ్లీ: అవును, నేనొప్పుకుంటాను.

సద్గురు: దాన్ని ఎవరో ప్రేరేపించవలసిన అవసరం లేదు. ప్రస్తుతం – సమస్య మీ సంతోషం, మీ ప్రేమ, మీ ఇతర భావోద్వేగాలు. మీకు సంబంధించి సుందరమైన ప్రతిదీ –  ఒకరి ప్రేరణతోనే జరుగుతున్నాయి. ఆ బండిని ఎవరో తోయాలి, అప్పుడే అది కదులుతుంది. కాని స్వంతంగా కదిలించే మార్గం కూడా ఉంది. మీకు స్వంతంగా కదిలే స్వభావముందంటే మీరు ఉదయం లేవడమే సంతోషంతో, ప్రేమతో, ఉత్సాహంతో లేస్తారు. లేకపోతే మీలో ఉత్సాహం కలిగించడానికి, మీలో సంతోషం కలగడానికి ఎవరో ఏదో చేయాల్సి ఉంటుంది. భౌతికమైన, శారీరకమైన ఏ విషయంలోనైనా మీరు చేయగలిగినదానికీ, చేయలేనిదానికీ ఎప్పుడూ పరిమితులుంటాయి. ఇది మీరు ఎంచుకునేది కాదు. ఇది సృష్టి స్వభావం. శరీరపరమైన వాటన్నిటికీ పరిమితులుంటాయి. కాని శరీరపరం కాని వాటికి పరిమితులెందుకు ఉండాలి? మీరు మీ శరీరంతో గుర్తింపును ఏర్పరచుకుంటున్నారు, అందుకే తక్కిన వాటన్నిటినీ పరిమితం చేసుకుంటున్నారు. లోకంలో జరిగేదదే. అందుకే ఈ కుటుంబ వ్యవహారమంతా. నేను కుటుంబానికి వ్యతిరేకం కాను. ఆ కుటుంబాన్ని విస్తృతపరచుకోమనే నేను చెప్పేది.

కుణాల్ కోహ్లీ: ఇప్పుడున్న ఇంత కుటుంబంతోనే మనకు ఇన్ని సమస్యలుంటే, దీన్ని విస్తరిస్తే మరెన్నో సమస్యలు తలెత్తుతాయి కదా.

సద్గురు: రెండు పెళ్లిల్లో, మరెన్నో పెళ్లిళ్లో చేసుకొని కుటుంబాన్ని విస్తరించుకొమ్మని నేను చెప్పడం లేదు. మీ భావోద్వేగాలకు పరిమితి లేదని నేను చెప్తున్నాను. ఈ గాలిరీలో కూర్చున్న వాళ్లందర్నీ నేను స్పష్టంగా చూడలేను, కాని ఈ అస్పష్టమైన ముఖాన్ని ప్రేమతో ఎందుకు చూడకూడదు? నాకు దానివల్ల నష్టమేమీ లేదు కదా. కాని అది నా జీవితాన్ని సుందరం చేస్తుంది. నేను వాళ్ల ముఖాల్ని ద్వేషంతో చూస్తే నా జీవితం అనిశ్చితమవుతుంది. నేను వాళ్ల ముఖాల్ని ద్వేషంతో చూస్తే నా జీవితం వికారమవుతుంది. వాళ్లకేమీ కాదు, వాళ్లు (గాలరీ)బాల్కనీలోనే ఉంటారు.

కుణాల్ కోహ్లీ: మన జీవితంలో మనం ఆలోచించే, అనుభూతి చెందే విషయాల్లో, మనం ఇతరులకు వాటిమీద ఎక్కువ నియంత్రణ నిస్తున్నామని మీరు చెప్తున్నారా? నిజానికి మనం ఆలోచించేదీ, అనుభూతి చెందేదీ మనలోనే ఉండాలి కదా?

సద్గురు: మీరు ‘జీవితం’ అని దేన్ని అంటున్నారో దానిమీద ఆధారపడి ఉంటుంది. అది మీ పని, మీ సంబంధాలు, మీ కుటుంబం, సమాజం, మీ ఆస్తి, సంపద, మీ ఆలోచనలు, భావోద్వేగాలు అయితే – ఇవన్నీ మీ అసలు ప్రాథమిక జీవిత సాధనాలు మాత్రమే. మీరు జీవించి ఉన్నారు కాబట్టి మీరీ సాధనాలన్నీ సంపాదించుకుంటున్నారు. అసలు జీవితం మీలోనే ఉంది, మీరు నిద్రిస్తున్నా, మేలుకున్నా అది కొట్టుకుంటూనే ఉంటుంది.