కాబట్టి ఆధ్యాత్మికత అంటే స్వర్గం గురించో లేదా మరి దేనిగురించో ఉపయోగం లేని మాటలు మాట్లాడటం కాదు. ఆధ్యాత్మికత అంటే మీ అనుభవంలో చోటు చేసుకొనే ఏకత్వం. యోగ అనే పదానికి అర్ధం కలయిక. కలయిక అంటే మీ అనుభవంలో అన్నీ ఒకటైపోవటం. మీరిప్పుడు ఇక్కడ కూర్చుని మీ చుట్టూ ఉన్న అందరినీ మీలో ఒక భాగమే అనే అనుభవాన్ని పొందారనుకోండి, అప్పుడు వీరికి ఆకలిగా ఉంది అన్నం పెట్టట్టండి, ఆకలితో వారిని వదలకండని మీకు చెప్పాలా? మీరు ఎలాగైనా వారిని చూసుకుంటారు, వారి ఆకలి తీరుస్తారు. మీలో ఒకటైన భాగాన్ని మీరు ఎప్పుడైనా విస్మరిస్తారా? పట్టించుకోరా?. మీరలా చెయ్యరు. ఆధ్యాత్మికత అంటే అదే. అన్నిట్నీ అందరినీ మీలో భాగంగా మీరు అనుభూతి చెందటమే. మీరొక ప్రత్యేకమైన వ్యక్తులు కారు. మీరు ఏకత్వంలో భాగం అయిపోయారు.

ఎలా బాధ పడుతున్నాం ఆ బాధకి కారణాలు ఏమిటి? ఎవరు?అనేది ముఖ్యం కాదు. నాకు తెలిసినంత వరకూ మనుషులు పడే బాధ, ఒకటే.

ఆధ్యాత్మికత అనేది డబ్బున్న వారికో  పేదలకో మాత్రమే సొంతం కాదు. మనుషుల్లో, బాధ ఎవరికైనా బాధే. అది ఆకలిబాధ కావచ్చు లేదా అజీర్తి బాధ కావచ్చు.రెండూ వేరు కాదు. బాధ పడుతున్నప్పుడు బాధ ఎవరికైనా బాధే. మీరు ప్రపంచంలో చూస్తే, సంపన్న సమాజాలకు చెందిన వారి బాధ యొక్క తీవ్రత చాలా లోతుగా ఉంటుంది. పేదవారు శారీరికంగా బాధపడుతుంటే, అది కనిపిస్తుంది. కానీ ధనిక సమాజాల బాధ చాలా గాఢoగా ఉంటుంది. మీరు గనుక యూరప్ లో చూస్తే, అక్కడ  ఒకరి ముఖంలో చిరునవ్వు తెప్పించటం అన్నది చాల కష్టమైనా పని.  బాధ వాళ్లలోకి చొచ్చుకొనివెళ్లి అలా నిలిచిపోయింది. ఎందుకంటే శతాబ్దాల తరబడి వారికి సంక్షేమం కలిగింది, ఆర్ధికమైన ఉన్నతి జరిగింది, అక్కడ సగటుమనిషి కూడా ధనికుడే. భారతదేశంలో చూడండి...ధనమనేది ఇంకా కొందరి దగ్గరే కేంద్రీకృతమై ఉంది. పాశ్చాత్య దేశాల్లో ధనం సగటు మనిషిని తాకింది. అమెరికాలో లేదా యూరప్ లో ధనం అందరినీ తాకింది. దాంతో అందరూ ధనం వల్ల వచ్చే ఉపయోగాల్ని అనుభవిస్తున్నారు. అందుకే వారి జీవితం నిరాసక్తంగా మారింది. వారికి బయటపడే మార్గం లేదు. కాబట్టీ బాధ బాధే. ఎలా బాధ పడుతున్నాం ఆ బాధకి కారణాలు ఏమిటి? ఎవరు?అనేది ముఖ్యం కాదు.

నాకు తెలిసినంత వరకూ మనుషులు పడే బాధ, ఒకటే. అందుకని, మేము చేసే ఈ పని పేదప్రజలను చేరుతుందా? అంటే ఖచ్చితంగా. కానీ మరో విధంగా. ఒక ఆకలిగా ఉన్న వ్యక్తి దగ్గరకి వెళ్లి జ్ఞానోదయం గురించి మాట్లాడేంత సభ్యత లేని వ్యక్తిని కాదు నేను. ఒక వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు నేను శారీరికంగా అతని జీవితాన్ని ఎలా మెరుగు పరుచుకోవాలో మాత్రమే మాట్లాడతాను. మేము చేస్తున్న ఒక బృహత్ కార్యక్రమం ఉంది దానిపేరు Action for rural rejuvenation. కాబట్టి మీకు గనుక నిజంగా శ్రద్ధ ఉంటే మీరు ఇందుకై ఏమి చెయ్యగలరో చూడాలి. ఇది ఒక సమగ్రమైన కార్యక్రమం. ఇందులో ఆరోగ్యం, వాతావరణం తదితర అంశాలెన్నో ఇమిడి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఎన్నో అంశాలు ఉన్నాయి, యోగా తదితర మార్గాల ద్వారా గ్రామీణ ప్రజానీకానికి ఆరోగ్యానికి దగ్గర చెయ్యటం లాంటివనమాట.

Inner Engineering అనేది మీరు జీవితాన్ని అనుభూతి చెందే విధానాన్ని మార్చివేస్తుంది.
మరో కార్యక్రమం, దీన్ని Inner Engineering అంటాం. మనం బాహ్యంగా బావుండటానికి ఒక శాస్త్రం, సాంకేతికతా ఉంది. అందువల్ల మనం మన బయటి ప్రపంచాన్ని మన సౌఖ్యాలకి అనువుగా మలచుకుని మరమ్మత్తు చేసుకున్నాం. కొన్ని తరాలకి ఏ మాత్రం తెలీని, ఊహకు కూడా అందని సౌఖ్యాలనూ సౌలభ్యాలనూ సంపాదించుకున్నాం. కాని మునుపటితో పోలిస్తే మనుషులిప్పుడు ఏ మాత్రం సంతోషంగా లేరు. ఇది కేవలం మనలోని అంతర్గత పార్శ్వాలను అశ్రద్ధ చేయటంవల్లే జరుగుతోంది. బాహ్యమైన పరిసరాలనూ వస్తువులనూ మీరు మీకు అనువుగా ఇంజనీర్ చేసుకున్నట్టే మీ అంతర్ముఖాన్ని కూడా ఇంజనీర్ చేసుకుని మీరు కావాల్సిన విధంగా ఉండటం ఇది.

మీ బయటి ప్రపంచాన్ని మార్చాలన్నా, మరమ్మత్తు చెయ్యాలన్న దానికి ఎన్నో వస్తువులూ, పరికరాలూ కావాలి. కానీ మీ లోపలి ప్రపంచానికొస్తే మాత్రం మీకు మీరు చాలు. కాబట్టీ ఇది ఎవరికి వారు చేసుకొనే మరమ్మత్తు. ఒకసారి ఎవరికి వారు తనని తాను తనకు నచ్చినట్టుగా ఇంజనీర్ చేసుకొంటారో వారు శాంతి, సంతోషం, ఆత్మానందం కలిగిన వ్యక్తులౌతారు. అప్పుడు శరీరం, మనస్సు, మేధస్సు అత్యున్నతంగా పనిచేస్తాయి. ఇవన్నీ మీరు ప్రశాంత చిత్తులై ఆనందంగా ఉన్నపుడే జరుగుతాయి. అందువల్ల Inner Engineering అనేది మీరు జీవితాన్ని అనుభూతి చెందే విధానాన్ని మార్చివేస్తుంది. మీ జీవిత సందర్భాలని ఆనందాన్ని వెతుకుతూ చేసే ప్రయాణం నించి మరల్చి, మీరే ఆ ఆనంద అభివ్యక్తికరణగా మలచి మీలోని కార్య దక్షతల్ని అత్యున్నత స్టాయిలో పనిచేసేలా చేస్తుంది. ఈ మార్పుల్ని మేము ఎన్నో కార్పోరేట్ సంస్థల్లో చూశాం. మరింత ప్రశాంతతతో ఆనందంగా ఉండడం వల్ల మీ కార్యదక్షత ఎంతగానో పెరుగుతుంది. మీ శరీరం మనస్సు మరింత ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. అందువల్ల, ఇదొక శాస్త్రం ...ఇది ఒక బోధన కాదు, ఇది ఒక తత్వమో, నమ్మక వ్యవస్తో కాదు. ఇది అంతర్ముఖ శాస్త్రం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు