గురుకులాల్లో నేర్పించే విద్య గురించి, ఇంకా పిల్లవాడి జీవితంలో ఆధ్యాత్మికత తీసుకురావడం గురించి సద్గురు ఈ వ్యాసంలో చెబుతున్నారు.

పురాతన గురుకులాలు, గురువులు పనిచేసే తీరూ అంతా కూడా - మీరు ఎదైతే నిజం అని ఊహించుకున్నారో, దాన్నంతా కూడా కూలదోసెయ్యడమే. ఆ కాలంలో గురువులు, మీకు ఈ సమాజంలో జీవించడం కోసం ఏమి అవసరమో అవి నేర్పించడానికి ప్రయత్నించేవారు కాదు. ఒకవేళ మీ నాన్నగారు చెప్పులు కుట్టేవాళ్లయితే, మీరు కూడా చెప్పులు కుట్టేవారు. మీ నాన్నగారు రాజైతే, మీరూ రాజయ్యేవారు. మీ నాన్నగారు మరొకటైతే, మీరు కూడా అదే అయ్యేవారు. మీరు జీవించడానికి పాత కాలంలో మరొక విధానం లేదు. అందుకని గురువు కేవలం వారికి ఆత్మసాక్షాత్కారం దిశగా విద్యను బోధించేవారు. అందుకని, అప్పట్లో ఈ పని మరింత తేలికగా ఉండేది. కానీ అది ఒక దిశగానే ఉండేది.

అప్పట్లో తల్లిదండ్రులు పిల్లల్ని గురువు దగ్గర ఆయన పూర్తి అధికారంలో వదిలేసేవారు.

కానీ ఇప్పుడు రెండు విషయాలూ జరగాలి. మనం పిల్లవాడిని ఆధునిక ప్రపంచంలో జీవించడానికీ, కొత్తదనం పేరుతో తన చుట్టూతా జరుగుతున్న చెత్త అతన్ని పాడు చెయ్యకుండా ఉండేలాగా చూడాలి. అందుకని ఇప్పుడు మన ముందర ఉన్న సవాలు అప్పటి సవాలు కంటే ఎంతో పెద్దది. అప్పట్లో తల్లిదండ్రులు పిల్లల్ని గురువు దగ్గర ఆయన పూర్తి అధికారంలో వదిలేసేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు అన్నిటిలో తల దూరుస్తారు. వారి పిల్లల్ని పూర్తిగా వదిలి పెట్టరు. ఎప్పుడు ఏమి జరుగుతోందో తెలుసుకోవాలనుకుంటారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. అందుకని, ఈ రోజున అప్పటి గురుకులం కంటే ఇంకా సంక్లిష్టమైన పరిస్థితి ఉంది.

గురుకులాల్లో గురువు వారికి ఎలా జీవించాలి, మరొకరితో ఎలా ఉండాలి, తనలోతాను ఎలా ఉండాలని నేర్పించేవారు. ఆయన వారిని ఒక మోడ్రన్ యూనివర్సిటీ కోసం తయారు చెయ్యవలసిన పని లేదు. ఎవరికైతే బాగా పాండిత్యం పైన మక్కువ ఉందో, వారు మాత్రమే, అటువంటి విషయాల్లో  శిక్షణ పొందేవారు. మిగతా పిల్లలు అందరూ కూడా సహజంగానే వారి నాన్నగారి వృత్తి ఎదైతే అదే స్వీకరించేవారు. ఇప్పుడు ఇది అలా లేదు. తండ్రి చెప్పులు కుట్టేవారైనా సరే, అతని కొడుకు ప్రొఫెసర్ అవుతారు. ఇప్పటి సమాజంలో పరిస్థితి వేరు.

ఆధ్యాత్మికత అనేది సహజంగా జరగాలి

చాలామంది వారి సహజమైన మేధస్సుతో జీవించడం లేదు, వారికి బలవంతంగా రుద్దబడ్డ విద్యతో జీవిస్తున్నారు కాబట్టే ఆధ్యాత్మికత అనేది, ప్రజల జీవితాల్లో  ఎంతో సుదూరమైన విషయం అయిపోయింది. లేకపోతే  ప్రజలందరూ కూడా వారి సహజమైన మేధస్సుతో జీవిస్తే సహజంగానే ఆధ్యాత్మిక ప్రక్రియ అన్నది జరుగుతుంది. ఏవో కొన్ని కారణాల వల్ల మాత్రం ఆ దిశగా వెళ్లకపోవచ్చు.

ఇక్కడి విద్యావిధానం ఎలా ఉంటుందంటే, పిల్లవాడి మీద ఎటువంటి ప్రభావం, ఎటువంటి మతం, ఎటువంటి బలవంతం, ఎటువంటి ఆలోచనలు గానీ, నమ్మకాలు గానీ ఏవీ రుద్దబడవు.  పిల్లవాడు ఇవన్నీ తనకు తానే తెలుసుకోవాలి. మీరు కనుక మీ అంతట మీరే తెలుసుకోవాలీ అంటే, మీకు అంతర్ముఖులవ్వటం తప్ప మరొక మార్గం లేదు. మీరు కేవలం బైబిలో, గీతానో, మరొకరో, ఇంకొకరో చెప్పింది విన్నప్పుడు మాత్రమే అంతర్ముఖులవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే, అక్కడ అప్పటికే రాసిపెట్టి ఉంది. మీరు ఇలాంటివన్నీ ఏమీ చదవలేదు అనుకోండి, మీరు జీవితం గురించి ఆలోచించినప్పుడు, మీరు జీవితాన్ని చూసినప్పుడు మీరు చూడగల ఒకే ఓక చోటు మీ అంతర్ముఖం.

ఒక రోజున యూనివర్సిటీలో పనిచేసే ఒక పెద్ద ప్రొఫెసర్ ఇంట్లో వాడుకోవడానికి సంక్లిష్టమైన పరికరాన్ని తీసుకొచ్చింది. ఆవిడ దానికి ఉన్న సూచనలు చదివి వాటన్నింటినీ బిగించాలని చూసింది. చాలా కష్టపడింది, అయినా బిగించలేకపోయింది. లాభం లేదని వాటిని అలా వదిలేసి, ఆవిడ ఉద్యోగానికి వెళ్లింది. ఇంటికి వచ్చేసరికే, ఆవిడకి ఎంతో ఆశ్చర్యం..!! ఆ పరికరం బిగించడమే కాదు, వాడబడి కూడా ఉంది.

అక్కడ పని చేసే అమ్మాయిని, “ఇదెవరు బిగించారు..?”  అని ఆవిడ అడిగింది. ఆ అమ్మాయి, ”నేనే” అని చెప్పింది. ఆవిడ ఈ విషయం నమ్మలేకపోయింది. “నువ్వెలా చెయ్యగలిగావు “ అని అడిగింది. అప్పుడు ఆ పనమ్మాయి, “ చదవడం, రాయడం తెలియానప్పుడు కొంచం బుర్ర ఉపయోగించాల్సిందే కదమ్మా.? “ అని అంది.

అందుకని మేము ఇక్కడ పిల్లలకి వారి బుర్ర ఉపయోగించడం నేర్పిస్తాం. కేవలం, రాయడం, చదవడం కాదు. రాయడం, చదవడం ముఖ్యమే..! కానీ బుర్ర ఉపయోగించడం అన్నది ఇంకా ముఖ్యమైనది. విద్యా విధానం అన్నది మీ మేధస్సుని పెంపొందించెదిలా ఉండాలి. మేధస్సు కోల్పోయేలా కాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు