వృత్తి ముఖ్యమా..? ఆత్మజ్ఞానం ముఖ్యమా..?

yoga

మనం జీవనవృత్తిని కొనసాగించాలా లేదా ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలా…? మీ గురించి మీకు ఎక్కువగా తెలుస్తున్నకొద్దీ, మీ వృత్తి ఏదైనా కావచ్చుగాక, మీ సాఫల్యం కూడా మెరుగవుతుందని సద్గురు గుర్తు చేస్తున్నారు.

ప్రశ్న: మనం వృత్తిలో నిర్దిష్టమైన లక్ష్యాలను సాధించాలంటే మన ఆత్మవిశ్వాసాన్ని, మన విలువను పెంపొందించుకోవాలంటే, విరామం లేకుండా నిరంతరం శ్రమించాలి. మరి ఆత్మజ్ఞాన సముపార్జనకు సమయమెక్కడ ఉంటుంది?

ఆత్మజ్ఞానమంటే ఏంటో ముందు మనం స్పష్టం చేసుకుందాం. మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? మీరు కెమెరా వాడతారా? అది ఏ పరికరమైనా కానీయండి, దాన్ని మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే ఆ పరికరాన్ని అంత మెరుగ్గా ఉపయోగించగలుగుతారు.  కెమెరా ఎలా వాడాలో తెలియని వ్యక్తికి మీరు కెమెరా ఇస్తే అతను దాన్ని ఆన్ కూడా చేయలేడు. కెమెరా గురించి తెలిసిన వ్యక్తికి మీరు కెమెరా ఇస్తే అతను దానితో చేసే అద్భుతాన్ని జనం చీకట్లో కూర్చుని గంటల తరబడి చూడడానికి ఇష్డపడతారు.

మీరు నాతోపాటు కారులో వస్తే, మీరు ఆ కారుతో ఏమేం చేయగలరో నేను మీకు చూపించగలను. దేని గురించైనా మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే దాన్ని మీరు ఉపయోగించే సామర్థ్యం కూడా అంత ఎక్కువగా పెరుగుతుంది. మనం ఉపయోగించే ప్రతి వస్తువు విషయంలోనూ ఇది నిజమైనప్పుడు, మిమ్మల్ని మీరు ఉపయోగించుకొనేటప్పుడు మాత్రం ఆ సామర్థ్యం ఎందుకు పెరగదు? మీ గురించి మీరు ఎంత బాగా తెలుసుకుంటే మిమ్మల్ని మీరు అంత బాగా ఉపయోగించుకుంటారు. ఆత్మజ్ఞానమంటే అదేదో హిమాలయ గుహలో జరిగే విషయం అనుకోకండి. అది అక్కడ కూడా జరిగిందనుకోండి. కాని నేను దాన్ని మీకు అన్వయించుకునేలా అవగాహన చేసుకొమ్మంటున్నాను.

స్పష్టతలేని ఆత్మవిశ్వాసం విధ్వంసానికే దారితీస్తుంది.

ఆత్మజ్ఞానం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. అది మీ వృత్తికి ఆటంకం ఎలా అవుతుంది? మీ జీవితంలో మీరు చేయదలచుకున్నదానికి అది వ్యతిరేకమెలా అవుతుంది? మీ గురించి మీరు తెలుసుకోకుండా సమర్థవంతమైన జీవితం ఎలా గడపగలుగుతారు? జీవన ప్రక్రియ గురించి ఏమాత్రం తెలియకుండానే ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలో జనం పరస్పరం బోధించుకుంటున్నారు. స్పష్టతలేని ఆత్మవిశ్వాసం విధ్వంసానికే దారితీస్తుంది.

దురదృష్టవశాత్తు ఆత్మవిశ్వాసానికి, స్పష్టతకు వ్యత్యాసం లేదని భావిస్తున్నాం. ఉదాహరణకు మీ కళ్లకు గంతలు కట్టి అటూ ఇటూ నడవమన్నామనుకోండి, మీరు తెలివిగలవారయితే మీరు నడుస్తున్న నేలను గమనిస్తారు, ఇక్కడా, అక్కడా స్పృశిస్తారు. మెల్లగా అటూ ఇటూ నడుస్తారు. గోడలను తాకుతారు. మీ కాళ్లతోనూ, చేతులతోనూ స్పర్శానుభవాన్ని పొందుతారు. కాని మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటే జాగ్రత్తగా పరిశీలించకుండానే నడుస్తారు. రాళ్లు మీ మీద దయ చూపవు. స్పష్టతలేని ఆత్మవిశ్వాసంతొ మీరుంటే, జీవితం కూడా మీ పట్ల దయచూపించదు. మీరు ప్రపంచంలో మీ కార్యకలాపాన్ని నిర్వహించాలనుకుంటే, మీరుచేసే ఏ పనిలోనైనా సాఫల్యం పొందాలంటే, అసలు మీ జీవితంలో ఏ పనైనా చక్కగా చేయాలనుకుంటే మీకు కావలసింది స్పష్టత; ఆత్మవిశ్వాసం కాదు.

మీ గురించి మీరు ఎక్కువగా తెలుసుకున్నకొద్దీ,  మీరు చాలా పనులు చేయగలరు. తక్కిన వస్తువుల విషయంలో అవి మీకు బాహ్యంగా మాత్రమే  తెలుస్తాయి. మరి మీ విషయంలో, అంతర్ముఖంగా, పూర్తిగా మిమ్మల్ని మీరు తెలుసుకోగలరు. మీరు అంతర్ముఖులై చూడగలరు. మీ గురించి మీరు అంతా తెలుసుకున్నట్లయితే ఇంకేముంది, అది అద్భుతమైపోతుంది. మీరు ఏం చేసినా అది అద్భుతమే. మీరు కూర్చునే ఉన్నా పనులు చేయగలరు, మీరు కళ్లు మూసుకొని ఉన్నా పనులు చేయగలరు, మీరు నిద్రలో కూడా పనులు చేయగలరు. మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకోగలిగితే మీరు మేలుకొని ఉన్నా, నిద్రపోతున్నా ఈ వ్యవస్థతో అద్భుతాలు చేయగలరు.

ప్రేమాశీస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *