మీరు బాధలో ఉన్నా, ఆనందంలో ఉన్నా, ఎలా ఉన్నా, ఇతరులు మిమ్మల్ని వాడుకోవచ్చు.

ఎవరైనా వారి సామర్ధ్యం వల్ల కానీ,  వారి సామాజిక పరిస్ధితి వల్ల కానీ లేదా వేరే దేని వల్లనైనా కానీ మిమ్మల్ని వాడుకునే స్ధితిలోకి వస్తే, వారు మిమ్మల్ని వాడుకునే అవకాశం ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన ఇలా అయ్యే అవకాశముంది. కానీ మీరు కనుక ఎలాగైనా ఆనందంగానే ఉంటే, ఆ దోపిడీ మీ మీద ఎటువంటి ప్రభావమూ చూపదు.

ఇప్పుడు, మేము వందల మందితో ఆశ్రమంలో వారికి ఏమీ చెల్లించకుండానే పని చేయిస్తున్నాం. ఇదీ నిజమైన దోపిడీ అంటే! అవునా, కాదా? ప్రజలు ఆనందంగా దోపిడి చేయించుకుంటున్నారు కాబట్టి, సమస్యే లేదు. ఒక వేళ వారు వారి ఇష్టానికి వ్యతిరేకంగా దోపిడీ చేయబడితే, అప్పుడది సమస్య అవుతుంది, అవునా, కాదా? ప్రజలు స్వచ్ఛందంగా దోపిడీ చేయించుకుంటూ ఉంటే, ఇతరులకు ఎవరికైనా సమస్య ఏముంటుంది? సమస్యే లేదు.

ఒక వ్యక్తి అసలు తన ఉనికి  మీద తనకంటూ ఏ స్వంత ఆసక్తి లేనప్పుడు మాత్రమే స్వచ్ఛందంగా దోపిడీ చేయించుకుంటాడు. అతనిని ఎలా వాడుకున్నా అతనికి అంగీకారమే. ఎందుకంటే అతను ఎంత ఆనందంగా ఉంటాడంటే అతనికి ఒక సొంత ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. మీ నుండి అతను పొందడానికి ఏమీ లేనపుడు, అతనికి మిమ్మల్ని వాడుకోవలసిన అవసరం ఏముంటుంది? కానీ సామాజికంగా చూసినప్పుడు, అతను వాడుకుంటున్నట్లు అనిపించే పని ఏదైనా చేస్తూ ఉంటే, దానికి ఎదో ఒక కారణముండి ఉంటుంది. లేకపోతే అతను అలా చేయడు.

మా ఆశ్రమంలో ఉన్నవారు స్వచ్ఛందంగానే దోపిడీకి సంసిద్దులవుతున్నారు. కానీ వారందరికీ ఈ విషయాలన్నీ అర్ధం కావు. అయినప్పటికీ వారు, తనకు ఏ ప్రత్యేక అవసరాలు లేని ఒక వ్యక్తి ఇతరుల కోసం ఇంత చేస్తున్నారని వారికి అనిపించడం వల్ల, భయంకరమైన స్వంత అవసరాలు ఉన్న వారి దగ్గర ఉండడం కన్నా, ఇతరుల కోసం చేయబడే ఈ పనిలో భాగస్వాములు అవడం వారికి మేలనిపిస్తుంది. అందువల్ల దోపిడీ పలురకాలుగా జరుగవచ్చు, కాని దైన్యం దానంతటి కదే  దోపిడీ.

మీరు స్వతహాగానే ఒక ఆనందమయ వ్యక్తి అయితే, మిమ్మల్ని నిజంగా ఎవరూ వాడుకోలేరు. ఎందుకంటే దోపిడీ లేదా వాడుకోవడం అంటే మీ శ్రేయస్సుకి వ్యతిరేకంగా ఏదో ఒకటి చేయడం. మీరు స్వతహాగానే ఆనందమయ వ్యక్తి అయితే, ఎవరైనా మీ శ్రేయస్సుకి వ్యతిరేకంగా ఏమి చేయగలరు? మిమ్మల్ని చంపితే మీరు ఆనందంగా మరణిస్తారు. నిజంగా ఆనందంగా ఉండేవారిని ఎవరూ దోపిడీ చేయలేరు. ఎందుకంటే, మీరు అతనికి ఏమి చేసినా, అది మీకే నష్టం, అతనికి కాదు. మీరు అతన్ని చంపితే మీరు ఒక ఆనందమయ వ్యక్తిని కోల్పోతారు. అతనేమి కోల్పోడు. అతను కేవలం తన శరీరాన్ని కోల్పోతాడు, కానీ అతనికి అది ఒక విషయమే కాదు. కనీసం అతని శరీరం పడే యాతనలు, బాధలు ముగిసిపోతాయి.

మీరు ఎలాగైనా సరే ఆనందంగానే ఉంటే,  దోపిడీ మీ మీద ఎటువంటి ప్రభావమూ చూపదు.

మీరు కనుక నిజంగా ఒక ఆనందమయ వ్యక్తి అయితే, ఏ దోపిడీ మీ దగ్గరకి రాలేదు. బాధపడే వ్యక్తి మాత్రమే తనని ఎవరు దోపిడీ చేస్తారా అని నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతి చిన్న విషయంలో, ఇంకేదో విషయం దాగి ఉందని అనుకుంటాడు. మీరు ఇలా జరగటం చూస్తున్నారా?

మనుషులకి బాధ ఎక్కువవుతున్న కోద్దీ, వారిని ఎవరో దోపిడీ చేస్తారని నిరంతరం భయపడుతూనే ఉంటారు. ఎప్పుడూ వారిని ఎవరో వాడుకుంటారని భయపడుతూనే ఉంటారు. చాలా మందిలో వాడుకోవటానికి అసలు ఏముందని? చాలా మంది తమను తాము ఎలాంటి ప్రతికూలతలా తయారు చేసుకున్నారంటే, వారు ఎలా ఉన్నా కూడా అది ప్రతికూలతే. మీరు బాధగా ఉంటే,  అది మీకు అనుకూలమా, ప్రతికూలమా? మిమ్మల్ని మీరే ప్రతికూలంగా మార్చుకుంటే అది దోపిడీ కాదా?

మీరు బాధలో ఉంటే, ఎవరూ మిమ్మల్ని దోపిడీ చేయక్కర లేదు,అంతా దోపిడీయే. కానీ, అదే మీరు ఆనందంగా ఉంటే, దోపిడీ మిమ్మల్ని ముట్టుకోలేదు, ఎవరు ఏమి చేసినా సరే. ఇతరులు ఏమి చేసినా, మీ పట్ల ఏ మూర్ఖపు పని చేసినా, వారు వారి జీవితాన్నే తక్కువ చేసుకుంటారు తప్ప, మీ జీవితాన్ని కాదు. నిజంగా ఆనందంగా ఉండే వ్యక్తి జీవితాన్ని వారు చిన్నబుచ్చలేరు. మీరు బాధపడుతున్న వ్యక్తి జీవితాన్ని అర్ధంలేని జీవితంగా చేయవచ్చు కానీ, నిజంగా ఆనందంగా ఉన్న వ్యక్తి జీవితాన్ని కాదు.

ఒక ఆనందంగా ఉన్న వ్యక్తి జీవితాన్ని అర్ధరహితం చేయలేరు. ఎందుకంటే అతను ఏ విధమైన అర్ధం కోసమూ చూడట్లేదు. అతని ఉనికే అతనికి అందంగా ఉంటుంది, అతను ఏ ఇతర అర్ధం కోసం చూడట్లేదు. మీరు అతని జీవితాన్ని ఎలా చిన్నబుచ్చగలరు? ఎలా దోచుకోగలరు? అది మీ వల్ల కాదు.

మీరు ఆనందాన్ని  దోచుకోలేరు, మీరు కేవలం బాధనే దోచుకోగలరు. బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టే, ఈ భూగోళం మీద  దోపిడీ సాధ్యమవుతోంది. లేకపోతే అసలు దోపిడే ఉండదు.

 

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.