ప్రశ్న: సద్గురూ, శివరాత్రి రోజున మనం తేనె, పాలు శివలింగానికి ఆర్పిస్తాము. మనం, ఇలా చేయడంలో ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా..
సద్గురు: పాలూ, తేనెని చాలా మటుకు రాతి లింగాలకే మీరు వీటిని అర్పిస్తుంటారు. ఒక రాతి లింగం ఆరాధన కోసం లేదా మరిదేనికోసమైనా సరే ఉంచినప్పుడు, మీరు కనుక దానిని ఏదైనా కొవ్వు పదార్థం లేదా తైల పదార్థం - అది నేయ్యి కానివ్వండి, పాలు కానివ్వండి లేదా ఇలాంటిదేదైనా అందించకపోతే, అది పెళుసుగా మారి, కొంత కాలంలో విరిగిపోయే అవకాశం ఉంది. అందుకని మీరు అప్పుడప్పుడూ నూనె, నెయ్యి లేదా పాలు ఇలాంటివి పూత పూస్తూ ఉండాలి. ఈ కొవ్వు పదార్ధాన్ని పీల్చుకున్న ఆ రాయిలో సమగ్రత ఉంటుంది. ఒకసారి మీరు దేనినైనా ఆరాధించడం మొదలు పెట్టిన తరువాత, అది పగిలిపోవడం మీకు ఇష్టం ఉండదు కదా..?!
ప్రశ్న: ఇది ఒక విధమైన మెయింటెనెన్స్ లాంటిదే, కదా..?
సద్గురు: ఇది ఒకరకమైన మెయింటెనెన్సే..! అంతేకాక, ఆ లింగం కనుక సరిగ్గా ప్రాణప్రతిష్ఠ చేయబడి ఉన్నట్లైతే.. అది తడిగా ఉన్నప్పుడు మరింత మెరుగ్గా ప్రకంపిస్తుంది. మీరు తైలంగానీ, నెయ్యిగానీ లేదా పాలు గానీ పూసినప్పుడు ఆ లింగం ఎప్పుడూ తడిగా ఉంటుంది కదా. నేనింతకు ముందు చెప్పినట్లుగా మీరు శక్తిని గ్రహించగలగాలంటే మీ శరీరాన్ని మీరు తడిగా ఉంచుకోవాలి. అదే విధంగా, లింగం కూడా ప్రసరణ చేయాలంటే అది తడిగా ఉండాలి. దానిని అలా ఉంచడానికి ఒక సరళమైన విధానం ఏమిటంటే దానిని తైలంలోనో, నేతిలోనో, తేనెలోనో, పాలల్లోనో మరేవైనా ఏవైతే ఎక్కువ సమయం లింగం తడిగా ఉండేలా చేస్తాయో వాటిల్లో ముంచడమే..! ఒకవేళ, నేను నీళ్ళను పోశాననుకోండి.. అవి పది నిముషాల్లో ఎండిపోతాయి. కానీ, నేను పాలు పోస్తే అది నెలల తరబడి అలా తడిగానే ఉంటుంది. ఎందుకంటే, ఆ రాతి రంధ్రాల్లోకి కొవ్వు పదార్థం చేరింది గనుక..!
ప్రశ్న: రుద్రాక్షలను నెయ్యిలో ముంచడానికి గల కారణం ఇదేనంటారా..?
సద్గురు: ఖచ్చితంగా..! లేదంటే, రుద్రాక్ష పెళుసుగా మారి విరిగిపోతుంది. మీరు రుద్రాక్షను మీ శరీరం మీద ధరించినపుడు, మీ శరీర ఉష్ణోగ్రత కారణం చేతనే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో అది విరిగిపోతుంది. అలా కాకుండా మీరు అప్పుడప్పుడు నెయ్యి ఇంకా పాలల్లో ఉంచితే.. అది ఒక జీవితకాలం కన్నా ఎక్కువే మన్నుతుంది.