భక్తి అంటే పూర్తిగా లయమైపోవడం. ఇందులో మీ సొంత ప్రయోజనాలేవి ఉండకూడదు. మీ గురించి మీకు అంచనాలు ఉండి, మీలో భక్తి లేనప్పుడు ఆ మార్గాన్ని ఎంచుకోవడం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే అని సద్గురు అంటున్నారు.

ప్రశ్న: సద్గురు, మీరు ఈ విషయాన్ని చెప్పారు కదా..? నిజమైన భక్తుడు అంటే.. ఎవరైతే, తనను తాను లయం చేసుకోగలుగుతాడో, తన ఇష్టాయిష్టాలనన్నింటినీ ప్రక్కన పెట్టగలుగుతాడో, అతడే అని. కార్పొరేట్ ప్రపంచంలో ఈ తత్వం ఎలా పని చేస్తుంది..?

సద్గురు: మీకు సొంత ప్రయోజనాలు ఉన్నప్పుడు ఇలా ఉండలేరు. మీ సమయాన్ని, భక్తి మీద వృధా చెయ్యకండి. మీరు, వేరే మార్గాలని ఎంచుకోండి. భక్తి అంటే  మీ భావాలను ఉన్నత స్థితికి చేర్చడం..అవునా..? కాదా..? మీకు,  ఎన్నో రకాల భావాలు ఉంటాయి. వీటన్నింటిలోకీ భక్తి అత్యుత్తమమైనది. ఎందుకంటే ఇది మిమ్మల్ని అసలు బంధించదు కాబట్టి..! ఇది, మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది. అందుకని  మీ భావాలని ఉన్నత స్థితికి చేర్చేది ఇదే..!

భక్తులు కొంత పిచ్చివారు..! కానీ వారిలో వారు, ఎంతో అందమైనవారు. సమాజానికి సంబంధించినంతవరకూ, సహజంగా వీళ్ళు పిచ్చివాళ్లు. మీరు దక్షిణభారత భక్తుల గురించి విన్నారో లేదో నాకు తెలియదు. అక్కమహాదేవి...  ఇలాంటివారంతా కూడా - ఎంతో పిచ్చివారు. మీరు, వారితో జీవించలేరు. వాళ్ళు ఈ భూమి మీదనుంచి వెళ్ళిపోయిన తర్వాత, వారిని మీరు ప్రార్థించగలరు. కానీ, వారు ఉన్నప్పుడు ఎవరూ కూడా వారిలో ‘ఏమి జరుగుతోంది..?’ అన్నది  అర్థం చేసుకోలేకపోయారు. 'మీరా'ని ఉత్తర భారతదేశంలో ఎంతగానో కొలుస్తారని నాకు తెలుసు. ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. “ కాకోల్డ్ “ అని. దీనిని కిరణ్ నాగర్కర్ వ్రాసారు. ఇది మీరాబాయి భర్త కోణం నుంచి వ్రాసిన పుస్తకం.

మీరు ముక్తిని పొందడానికి భక్తి ఎంతో వేగవంతమైన మార్గం. కానీ, అది ఈ సమాజ స్థితిగతులలో ఇమడదు.

ఉదాహరణకు మీకు భార్య ఉందనుకోండి. ఆమె తనను తాను మీ భార్య కాదు.. కృష్ణుడి భార్య అని నమ్ముతోంది. ఎప్పుడూ ఆవిడ కృష్ణుడితో ఎలాంటి స్థితిలో ఉంటుందంటే..కృష్ణుడు ఆవిడతో ఉంటాడు, ఆవిడ ఆయనతో నాట్యం చేస్తూ ఉంటుంది, ఆయనని ప్రేమిస్తూ ఉంటుంది, ఆవిడ ఆయనని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది, ఆవిడ అన్ని విధాలా ఆయనతోనే ఉంటుంది.. ఆయనతో, ఆవిడ పూర్తిగా నిమగ్నమై ఉంటుంది - సరేనా? కానీ, మీరు ఆవిడ భర్త. దీనిని మీరు ఆస్వాదించగలుగుతారా..?? ఆమెనీ, ఆమె భక్తినీ.. అభినందించగలుగుతారా..? లేదా మీ సమస్యలతో మీరు పిచ్చివారైపోతారా? ఈ పుస్తకం ఆవిడ భర్త కోణం నుంచి రాసింది. మీరా జీవితం, మీరాని ఆయన ఎలా అనుభూతి చెందారూ అన్న విషయమై వ్రాసినది. భక్తులు, ఇలానే ఉంటారు. వారు, మన తార్కిక కోణానికి అందరు. వారు, మరో విధమైన వారు.

మీరు ముక్తిని పొందడానికి భక్తి ఎంతో వేగవంతమైన మార్గం. కానీ, అది ఈ సమాజ స్థితిగతులలో ఇమడదు. అది కుదరదు. భక్తి మీలో అసలు లేదు అని నేను అనడం లేదు. మీలో ఒక భాగం ఉంది. సహజంగానే మీలో కొంత భక్తి కలుగుతుంది. కానీ, మీరు దీనిని ఒక మార్గంగా ఎంచుకున్నప్పటికీ, మీకు నచ్చిన విధంగా వేరే విషయాలు కూడా జరగాలి అని అనుకుంటే - ఇది మార్గం కాదు. మీకు నచ్చిన విధంగా మీ జీవితం జరగాలి అనుకున్నప్పుడు, మీరు కేవలం మీ శరీరాన్ని, మనస్సుని మీకు నచ్చిన విధంగా ఉపయోగించడం నేర్చుకోవాలి. అప్పుడే మిగతా విషయాలన్నీ కూడా మీకు నచ్చిన విధంగా జరుగుతాయి.

మీరు బాహ్య సత్యాలను కూడా అలాగే అట్టిపెట్టి, మీరు సహజంగానే పరిణామం చెందాలి – అనుకుంటే, మీరు కొంత రాజీ పడవలసిందే..!

ముక్తిని మీరు మీ మేధస్సు ద్వారా కూడా పొందవచ్చు, మీ కర్మల ద్వారా కూడా పొందవచ్చు, మీ శక్తిని పరిణామం చెందించి కూడా పొందవచ్చు. కానీ మీరు వీటిలో ఏదో ఒక్కటి మాత్రమే కాదు. మీరు వీటి అన్నిటి కలయిక. అందుకని మనం ఇవి అన్నీ కలసిన విధానాన్ని ఎంచుకుంటున్నాం. బాహ్య పరిస్థితులను చెల్లా చెదురు చేయకుండా, మీరు పరిణామం చెందేలాగా..! మీరు బాహ్య సత్యాలను కూడా అలాగే అట్టిపెట్టి, మీరు సహజంగానే పరిణామం చెందాలి – అనుకుంటే, మీరు కొంత రాజీ పడవలసిందే..! మీరు నిదానంగా వెళ్ళాలి. మీకు మీ కార్పొరేట్ ప్రపంచం ఏమైపోతోందో..  మీ భర్త, మీ భార్య, మీ పిల్లలూ, ఏమీ పట్టవనుకోండి.. కేవలం ఎదగాలనుకుంటున్నారు - అప్పుడు, ఇది(ఆధ్యాత్మిక ఉన్నతి) ఎంతో వేగంగా జరుగుతుంది. మీకు ఇవన్నీ కూడా ఇలాగే ఉంటూ, మరేదో జరగాలి అనుకుంటే.. అప్పుడు మనం నెమ్మదిగా వెళ్ళాలి.

మేము, వివిధ రకాల ప్రజలతో వివిధరకాలైన పనులు చేస్తున్నాము. కొంతమందికి ఇవన్నీ పట్టవు. వారితో, మేము మరో విధంగా పని చేస్తాము. కొంతమందికి ఇవన్నీ కావాలి, దానితోపాటు అంతర్ముఖ ఎదుగుదల కూడా కావాలి. వారితో మేము, వీటన్నిటి కలయికతో నిదానంగా సాగేలా చేస్తాం. దేనినీ కూడా ఉన్నత స్థితికి తీసుకువెళ్లము. అత్యున్నత స్థితికి తీసుకుని వెళ్లము. ప్రతిదీ కూడా ఇప్పుడున్న అనుభూతి స్థాయి కంటే మరో స్థాయి ఎక్కువ ఉండేలాగా చేస్తాము. అంతేకానీ, ఇది అత్యున్నతమైనది కాదు. మిమ్మల్ని ఇప్పుడున్న దానికంటే మరో స్థాయికి ఎలా పంపాలో ఆలోచిస్తాము.

భక్తి - కార్పొరేట్ ప్రపంచం ఈ రెండూ జతగా మనలేవు. భక్తి - కుటుంబం ఈ రెండూ కూడా జరగవు. భక్తి - మరొకటి  అస్సలు జరగదు. భక్తి అంటేనే లయమైపోవడం. అందుకే, భక్తి గురించి మాట్లాడవద్దు అంటున్నాను. అలా మాట్లాడితే అది కేవలం మోసపూరితమైనదే అవుతుంది. మీలో కొన్ని క్షణాలు, మీ అనుభూతి ఒక నిర్దిష్ట స్థాయి చేరుకున్నప్పుడు, మీకు భక్తి కలగవచ్చు..! ఆ క్షణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దానికోసం వేచి ఉండండి. అంతేకానీ, భక్తిని మీ నియమంగా ఎంచుకోవాలి - అని ప్రయత్నించకండి. అందులో మోసం మాత్రమే ఉంటుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు