logo
logo

శివుడిని విధ్వంసకుడు అని ఎందుకు అంటారు?

రక్షణ ఇంకా శ్రేయస్సు కోసం ప్రజలు సాధారణంగా దైవాన్ని ఆశ్రయిస్తారు. కానీ యోగ సంస్కృతిలో, శివుడిని విధ్వంసకుడిగా ఆరాధిస్తారు. వింతగా కనిపించే ఈ విధానం వెనుక ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోండి.

ప్రశ్న: యోగా లోని మొత్తం ఉద్దేశ్యం ముక్తి లేదా మోక్షం అని నేను అనుకున్నాను, అయితే ఆదియోగి అయిన శివుడిని విధ్వంసకుడు అని ఎందుకు పిలుస్తారు? ఆయన ఏమి నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు?

సద్గురు: ఎవరైనా మీకు వేరే గ్రహం నుండి మరొక రకమైన జీవి వస్తుందని చెప్పారని అనుకుందాం. అప్పుడు మీరు ఏమనుకుంటారు? "బహుశా అతనికి ఎనిమిది చేతులు ఉండవచ్చు, అతను కుక్క లేదా ఏనుగులా కనిపిస్తాడేమో? అని అనుకుంటారు. "మీ ఆలోచనా ప్రక్రియ అంతా, మీరు ఇప్పటి వరకు అనుభూతి చెందినదాని నుండి మాత్రమే పుడుతుంది. కాబట్టి మనం ముక్తి లేదా మోక్షం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే మనం ఇంకా అనుభూతి చెందని వాటిని మనం తెలుసుకోలేము.

విధ్వంశక శివుడి ఆవశ్యకత


ముందుగా బంధనం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. బంధనం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకుని, దాన్ని తొలగించడానికి కృషి చేస్తే, అదే విముక్తి. ఒక విధంగా చెప్పాలంటే, ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది ప్రతికూల ప్రక్రియ. అందుకే భారతదేశంలో, మేము ఎల్లప్పుడూ శివుడిని విధ్వంసకుడిగా ఆరాధిస్తాము. ఎందుకంటే అది, మిమ్మల్ని మీరు నిర్మూలించే మార్గం. ప్రస్తుతం మీరు దేన్నయితే “ఇది నేను” అని భావిస్తారో - మీ వ్యక్తి రూపంలో మీ కోసం మీరు సృష్టించిన ఒక పరిమితమైన భాగం ఏదైతే ఉందో, దానిని గనుక మీరు నిర్మూలించగలిగితే, అదే విముక్తి.

మీ వ్యక్తిత్వం అంతా కూడా, అలాగే మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో అదంతా కూడా, ఇంకా మిమ్మల్ని మీరు ఏమని నమ్ముతున్నారో అదంతా కూడా, మీకు శరీరం ఇంకా మనస్సుతో లోతైన గుర్తింపు ఉన్నందువల్లే వచ్చింది. ఈ గుర్తింపు ఇంత బలంగా ఎందుకు మారిందంటే, మీరు జీవితాన్ని అనుభవించే ఏకైక మార్గం పంచేంద్రియాల ద్వారా మాత్రమే. ఐదు జ్ఞానేంద్రియాలు నిద్రపోతే మీ అనుభవంలో, మీరు లేదా ప్రపంచం అసలు ఉండనే ఉండవు.

ప్రస్తుతం, మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకా మీలో ఉన్న దాన్ని కూడా మీరు అనుభవించగలిగే ఏకైక మార్గం ఇంద్రియ అవగాహనతో కూడిన పరిమిత అనుభవం. కాబట్టి మీరు చేయాల్సిన మొదటి పని భౌతిక శరీరం ఇంకా మనస్సుతో గుర్తింపు ఏర్పరచుకోకుండా ఉండటం. యోగా చేసేది అదే. యోగాలో మొదటి అడుగు ఎల్లప్పుడూ కూడా ఇంద్రియ దృష్టిని అధిగమించటం గురించే. ఒకసారి మీరు జీవితాన్ని ఇంద్రియ దృష్టికి అతీతంగా అనుభూతి చెందడం ప్రారంభించిన తర్వాత, సహజంగా శరీరం ఇంకా మనస్సుతో గల గుర్తింపు తగ్గిపోతూ నెమ్మదిగా అదృశ్యమవుతుంది.

శివుడు - గుర్తింపులను ధ్వంసం చేసేవాడు


యోగా మొదటి గురువు అయిన శివుడిని వినాశకుడిగా ఎందుకు వర్ణించారంటే, మీరు ఈ గుర్తింపును నాశనం చేయకపోతే, మీకు ఇప్పుడు అత్యంత విలువైన దానిని నాశనం చేయకపోతే, మీ ప్రస్తుత అనుభవానికి మించినది జరగదు; అది అతి పెద్ద అవరోధం. మీరు బయటకు రావడానికి ఇష్టపడని బుడగ ఇది. అది పగిలి పోతుందేమో అని మీ భయం. కానీ అదే సమయంలో, మీలో ఏదో అపరిమితాన్ని కోరుకుంటుంది.

ఆధ్యాత్మికత అని మనం దేనినైతే అంటున్నామో, అదంతా కూడా ఒక పరిమితులు లేని బుడగను కలిగి ఉండటం గురించే. వాస్తవానికి అపరిమితమైన బుడగ అంటూ ఏదీ లేదు. ఏకైక విషయం బుడగను పగలు కొట్టడమే. మొత్తం ఉనికి అంతటినీ కలిగి ఉండే విధంగా మీరు ఈ బుడగను పెద్దగా ఊదాల్సిన అవసరం లేదు. మీరు దానిని గుచ్చి, విచ్ఛిన్నం చేస్తే, మీరు అపరిమితులుగా అవుతారు. అన్ని హద్దులూ పోతాయి.

శరీరం ఇంకా మనస్సుతో గుర్తింపబడకపోవడం అంటే గోచీ గుడ్డ కట్టుకోవడం, స్నానం లేకుండా వాసన కొడుతూ, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ సమస్యలను సృష్టించడం అని ప్రజలు భావిస్తారు. కాదు. గుర్తింపు ఏర్పర్చుకోకుండా ఉండడం ఒక విషయం; దానిని జాగ్రత్తగా చూసుకోకపోవడం అనేది వేరే విషయం. మీరు దానితో గుర్తింపు ఏర్పరచుకోలేదు, కానీ అదే సమయంలో దానితో మీరు చేయవలసిన ప్రతిదాన్ని మీరు చేస్తున్నారు. మీరు ఇలా ఉంటే, శరీరం ఇంకా మనస్సుల ప్రక్రియ నుండి విముక్తి పొందుతారు. ఇవే మీ జీవితంలో మీకున్న రెండు పరిమితులు, లేదా బంధనాలు. మీరు ఈ రెంటినీ దాటితే, మీకు అవధులు ఉండవు. మిమ్మల్ని మీరు అపరిమితమైన జీవిగా అనుభూతి చెందితే, మిమ్మల్ని మీరు విముక్తి పొందినవారని అనరా ?

సంపాదకుడి సూచన: ఆదియోగి అయిన శివుని గురించి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Share

Related Tags

ఆదియోగి

Get latest blogs on Shiva

Related Content

విష్ణువు ఇంకా శివుని గురించి మూడు కథలు